సమదృష్టి – ధార్మిక గ్రంథాల ఆదేశం

ఏదైనా ఒక వర్గ ప్రజలను జాతిపరంగా నీచ దృష్టితో చూడటం, వారి పట్ల ఏదో ఒక రూపంలో విధ్వేషాన్ని వెళ్లగక్కటం, వారిని నలుగురిలో తక్కువ చేసి చూపటం ఇవన్నీ జాత్యాహంకారం యొక్క వేరు వేరు రూపాలు అనటం అతిశయోక్తి కాదు.

నల్లవారిపై తెల్లవారి అఘాయిత్యాలు మొదలుకుని, మేము అగ్రకులస్తులం అన్న అహంకారంతో తమలాంటి కొందరు మనుషులను దళితులన్న ముద్రవేసి వారి పట్ల చిన్న చూపు చూడటం నుండి మైనారిటీ వర్గాల పట్ల, ముస్లిముల పట్ల కొందరు మతతత్వవాదులు ప్రదర్శిస్తున్న ధ్వేషం వరకూ సమాజంలో ఏదో చోట జాత్యాహంకారం అనేక రూపాల్లో ప్రదర్శించబడుతూనే ఉంది.

హిందువులైతే తాము ప్రేమించే భగవద్గీత, ముస్లిములైతే తాము ప్రేమించే ఖురాన్, క్రైస్తవులైతే తాము ప్రేమించే బైబిల్… తోటి మనుషుల పట్ల ఎలాంటి “దృష్టి”ని కలిగి ఉండమని చెబుతున్నాయి? అన్నది కాస్త గమనిస్తే…

భగవద్గీత:

సుహృన్మిత్రార్యుదాసీనమధ్యస్థద్వేష్యబంధుషు
సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే

“శ్రేయోభిలాషుల పట్ల, ప్రతిఫలంగోరి మేలు చేయువారి పట్ల, శత్రువుల పట్ల, తటస్థుల పట్ల, మధ్యవర్తుల పట్ల, విరోధుల పట్ల, బంధువుల పట్ల, సజ్జనుల పట్ల, పాపుల పట్ల సమదృష్టి కలిగి ఉండువాడే శ్రేష్ఠుడు” – భగవద్గీత 6.9

“విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే, గవి, హస్తిని,
శునిచైవ, శ్వపాకేచ పండితాః సమదర్శనః”

“విద్య, వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని బ్రాహ్మణునియందు, గోవుయందు, ఏనుగునందు, కుక్కయందు, ఆ కుక్క మాంసం వండుకు తిను ఛండాలుని యందు సమదృష్టి కలవారే జ్ఞానులు అని చెప్పబడుదురు” – భగవద్గీత 5.18

పై గీతా శ్లోకాలను బట్టి “సజ్జనుల పట్ల, పాపుల పట్ల, శత్రువుల పట్ల, బ్రాహ్మణుని పట్ల, చివరకు కుక్క మాంసం వండుకు తిను ఛండాలుని పట్ల సైతం “సమదృష్టి” కలవాడే ‘శ్రేష్టుడు’ ‘జ్ఞానులు’ అని అర్థమౌతుంది. తప్పితే కులాన్ని బట్టి, వర్గాన్ని బట్టి, వర్ణాన్ని బట్టి మనుషులను విడగొట్టి కొందరిని అధికులని, కొందరిని నీచులని అసమాన దృష్టితో చూసేవారు.. ఆజ్ఞానులు, దుర్మార్గులు అని తేటతెల్లమౌతుంది.

బైబిల్:

“నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించవలెను” – మార్కు 12:31

ఈ వాక్యాన్ని బట్టి ప్రతీ ఒక్కారూ తమను తాము ఎలా గౌరవించుకుంటారో అచ్చం అలాంటి గౌరవాన్నే తన తోటి మనుషుల పట్ల కూడా చూపగలగాలని తెలుస్తుంది. తప్పితే తమను తాము గొప్పగా ఊహించుకుంటూ ఇతరుల పట్ల తక్కువ దృష్టి లేక నీచ దృష్టి కలిగి ఉండకూడదని సుస్పష్టమౌతుంది

ఖురాన్:

“మానవులారా! మేము మిమ్మల్ని ఒకే స్త్రీ, పురుష జంట నుండి సృష్టించాము. తరువాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగానూ, తెగలుగానూ చేశాము. వాస్తవానికి మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవ పాత్రుడు” – 49:13

పై ఖురాన్ వాక్యం ప్రకారం..

1. పుట్టుకను బట్టి ఏ ఒక్కరూ గొప్పవారూ కారూ, ఏ ఒక్కరూ తక్కువా కాదు మానవులంతా ఒకే జంట సంతానం. అటువంటప్పుడు కులపరంగా గానో, జాతి పరంగా గానో, వర్గం పరంగానో, రంగు పరంగా గానో ఒకరు ఎక్కువా కాదు ఒకరు తక్కువా కాదు

2. సృష్టికర్త అయిన దేవుడు మానవులను వివిధ ప్రాంతాలు, భాషలు, అలవాట్లను బట్టి జాతులుగా, తెగలుగా సృష్టించింది కేవలం ఒకరికొకరు పరిచయం చేసుకోవటానికి మాత్రమే

3. దేవుని దృష్టిలో ఎవరైనా గొప్ప వానిగా ప్రాధాన్యత ఇవ్వబడేది అతని జాతిని బట్టో, రంగును బట్టో, వంశాన్ని బట్టో, కులాన్ని బట్టో, వర్గాన్ని బట్టో కాదు, అతని ప్రవర్తన (Attitude) ను బట్టి మాత్రమే

ఈ విధంగా ఖురాన్ “ప్రవర్తన ఆధారిత వర్గీకరణ (Attitude based classification)” మాత్రమే చేస్తుంది.


ప్రవక్త ముహమ్మద్ (స) ఒక వ్యక్తికి ‘ప్రాధాన్యత (Priority)’ అన్నది దేని ఆధారంగా వస్తుందని చెప్పారు?

“అరబ్బుకి అరబ్బేతరునిపై గానీ, అరబ్బేతరునికి అరబ్బుపై గానీ, తెల్లవానికి నల్లవానిపై గానీ, నల్లవానికి తెల్లవానిపై గానీ ఎలాంటి అధిక్యతా లేదు కేవలం సత్ప్రవర్తన, భయభక్తుల ద్వారా తప్ప” – ప్రవక్త ముహమ్మద్ (స)

“అరబ్బుకి అరబ్బేతరునిపై గానీ, అరబ్బేతరునికి అరబ్బుపై గానీ” అన్నమాట ప్రతీ దేశపు వర్గానికి, జాతికి, కులానికీ వర్తిస్తుంది. ఉదాహరణకు: హిందువుకు, ముస్లింపై గానీ, ముస్లింకు హిందువుపైగానీ ఎలాంటి అధిక్యతాలేదు… (లేదా) ముస్లింకు క్రైస్తవునిపై గానీ, క్రైస్తవునికి ముస్లింపై గానీ ఎలాంటి అధిక్యతాలేదు… ఇలా ఎన్ని వర్గాలనైనా అప్లై చేసుకోవచ్చు.

దీనిని బట్టి తామే గొప్ప, తమ మతమే గొప్ప అన్న “స్వాత్కర్ష వాదం” ఏదైతే ఉందో అది మత వర్గాలలో కొందరు హైందవ, క్రైస్తవ, ముస్లిం ఛాందసవాద పండితులదే తప్ప… ధార్మిక గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తికి ప్రాధాన్యత అన్నది కేవలం … ఒకని జాతిని బట్టో, రంగును బట్టో, వంశాన్ని బట్టో, కులాన్ని బట్టో, వర్గాన్ని బట్టో కాదు, అతని ప్రవర్తన (Attitude) ను బట్టి మాత్రమే ఇవ్వబడుతుంది అని తేటతెల్లమైంది. దీనిని బట్టి తోటి మానవుల పట్ల “సమదృష్టి” కలిగి ఉన్నవాడే జ్ఞాని, ఆ గుణం లేనివాడు పశువు కంటే హీనమైనవాడని తెలియటం లేదూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *