ఇస్లాం పురుషులకు స్త్రీల పట్ల ఎలాంటి ప్రవర్తన నిర్దేశిస్తుంది?

ఇస్లాం పట్ల పరోక్షంగా తమ ధ్వేషాన్ని వెళ్లగక్కలనుకునే సోకాల్డ్ స్త్రీ జనోద్ధారకులు, సోకాల్డ్ అభ్యుదయవాదులు ఇస్లాంను విమర్శించాలి అనుకున్నప్పుడల్లా రెడీమేడ్ గా దొరికే టాపిక్ ఇస్లాం స్త్రీ స్వేచ్చను హరించివేస్తుంది, అణచివేస్తుంది అన్నదే.

ఇలా చెప్పటం ఒకరకంగా పరోక్షంగా ఇస్లాం పురుషులను స్త్రీ అణచివేతదారులుగా తయారు చేస్తుందని… స్త్రీలను హింసించే, అణచివేసే ప్రవర్తనను ముస్లిం పురుషులకు నిర్దేశిస్తుందని నిందించటమే! అసలు ఇస్లాం స్త్రీకి ఇచ్చిన గొప్ప స్థానం ఏమిటి? ఇస్లాం, పురుషులకు స్త్రీల పట్ల ఎలాంటి ప్రవర్తనను నిర్దేశిస్తుంది? అన్నది ఏ ఇస్లాం విమర్శకుడు పరిశీలించినా వారు విమర్శించాలనుకుంటే ఉద్దేశపూర్వకంగా గుడ్డి విమర్శలు చెయ్యాలే తప్ప మనస్ఫూర్తిగా అయితే విమర్శించే సాహసం చెయ్యలేరు

భార్యల పట్ల ఉత్తమ రీతిలో మెలగాలి:

“మీ భార్యలతో సద్భావంతో జీవితం గడపండి. ఒకవేళ మీకు వారు నచ్చకపోతే, బహుశా మీకు ఒక వస్తువు నచ్చకపోవచ్చు కానీ, అందులోనే దేవుడు ఎంతో మేలు పెట్టి ఉండవచ్చు” – ఖుర్ఆన్ 4:19

ఇదీ ఇస్లాం భార్యలతో వ్యవహరించమంటున్న ఉత్తమైన వైఖరి. స్వయంగా ప్రవక్త ముహమ్మద్ (స)…

“స్త్రీల పట్ల దయ కలిగి ఉండండి” – [అల్-బుఖారి 3153]

అని చెప్పటమే కాక… “మీ భార్యలు మీ భాగస్వాములు తప్పితే వారు మీ సేవకులు కారు” అంటూ తమ భార్యల విషయంలో ఏ కోశాన అయినా చిన్నచూపు చూసే అవకాశం లేకుండా మరోకచోట…

“నిశ్చయంగా స్త్రీలు పురుషులు సమాన భాగాలు” [తిర్మిజి 113] అని ప్రకటించారు.

ఇస్లాం స్త్రీ-పుషులకు సమాన హక్కులు, సమ న్యాయం నిర్దేశిస్తుంది:

మరీ ముఖ్యంగా ఖురాన్, స్త్రీ-పురుషులిరువురికీ సమాన హక్కులతో పాటు సమ న్యాయం నిర్దేశిస్తుంది. తప్పితే ఎక్కడా వారి విషయంలో ఎలాంటి వివక్షా చూపటం లేదు. ఈ విషయంలో ఖురాన్ చెబుతున్నదేమిటంటే-

“పురుషులకు మహిళలపై ఉన్నటువంటి హక్కులే ధర్మం ప్రకారం మహిళలకు కూడా పురుషులపై వున్నాయి. కానీ పురుషులకు స్త్రీలపై కొంచెం ఆధిక్యత ఉంది” – ఖుర్‌ఆన్‌ 2:228

“మీ కొరకు (స్త్రీ పురుషులిరువురికీ) సమ న్యాయం నిర్ణయించడం జరిగింది.” – ఖుర్‌ఆన్‌-2: 178

వారే ఉత్తములు:

“మీ స్త్రీల విషయంలో ఉత్తమంగా వ్యవహరించేవారే మీలో ఉత్తములు” – ప్రవక్త ముహమ్మద్ (స) [సునన్ ఇబ్నె మజ 1978]

***

ఈ విధంగా ఇస్లాం పురుషులకు ఎంతో ఉత్తమరీతిలో, సద్భావంతో మెలగమని చెప్పటంతో పాటు ఇతర స్త్రీల విషయంలో ఎంత ఉన్నతమైన మర్యాదతో మెలగమని నిర్దేశిస్తున్న వైనాన్ని గమనించగలం.

“ప్రవక్తా! విశ్వసించిన పురుషులకు తమ చూపులను కాపాడుకోండి అనీ తమ మర్మాంగాలను రక్షించుకోండీ అని చెప్పు. ఇది వారికి ఎంతో పరిశుద్ధమైన పద్ధతి” – 24:30

అలాగే స్త్రీలకు పరాయి పురుషుల విషయంలో తమ చూపులను కాపాడుకోండి అని చెప్పటంతో పాటు… స్త్రీలకు తమ దుప్పట్ల కొంగులను తమపై వ్రేలాడదీసుకోమని చెప్పమని ఆదేశించటం జరిగింది.

ఇక మనిషి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది అన్నది నిర్ణయించటానికి అతను స్త్రీలతో వ్యవహరించే వైఖరినే ఒక కొలమానం (Measure) గా ప్రవక్త ముహమ్మద్ (స) పేర్కొంటున్న వైనాన్ని ఈ క్రింది గమనించగలం

“మీలో గౌరవనీయుడైన వ్యక్తే స్త్రీల పట్ల గౌరవంతో నిజాయితీతో వ్యవహరిస్తాడు. మీలో నీచుడు, నీతీ నిజాయితీ లేనివాడే తమ స్త్రీల విషయంలో అవమానపరుస్తూ వారిని అగౌరవపరుస్తూ వ్యవహరిస్తాడు” – ప్రవక్త ముహమ్మద్ (స)

ఇదీ తమ స్వంత భార్యల విషయంలో, ఇతర స్త్రీల విషయంలో ఎలా వ్యవహరించాలి అన్న దానికి ఇస్లాం నిర్దేశిస్తున్న ఆదేశాలు. వాస్తవం ఇడైనప్పుడు ఫెస్బుక్ లో ఉద్యమాలు చేసే సోకాల్డ్ స్త్రీ జనోద్ధారకులు, సోకాల్డ్ అభ్యుదయవాదులు ఇస్లాంను విమర్శించాలన్న హడావిడిలో పడి అసలు ఇస్లాం పురుషులకు స్త్రీల పట్ల ఎలాంటి ప్రవర్తన నిర్దేశిస్తుంది? అన్నది పరిశీలించకుండా ఇస్లాం స్త్రీ స్వేచ్చను హరించివేస్తుంది, అణచివేస్తుంది అని చెప్పటం పరోక్షంగా ఇస్లాం పురుషులను స్త్రీ అణచివేతదారులుగా తయారు చేస్తుందని, స్త్రీల పట్ల నిర్దయతో, క్రూరత్వంగా వ్యవహరించమంటుందని నిందించటమే అవుతుంది. ఇది మరింత అమానుషం. అలాగని ముస్లిం సమాజంలో అందరూ ఇస్లాం నిర్దేశిస్తున్నట్లు నూటికి నూరుశాతం పర్ఫెక్ట్ గా ఉన్నారని చెప్పటం లేదు. ధార్మిక అవగాహన లేని కొందరు మూర్ఖులు ప్రతీ మతవర్గంలోనూ ఉంటారు. అలాగే ముస్లిం సమాజంలో కొందరు మూర్ఖుల ప్రవర్తనకు కారణం ఇస్లామే అని నిర్ధారించటం ఇంకా మూర్ఖత్వమవుతుంది. ఒకవేళ అలాంటి మూర్ఖులు తారసపడితే… వారిని వీలైతే సంస్కరించటానికి ప్రయత్నించాలి తప్ప తమ అభ్యుదవాదాన్ని నిరూపించుకోవటానికి వారికి అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేస్తూ ఇస్లాంను విమర్శిస్తూ టైమ్ పాస్ చెయ్యకూడదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *