భారతదేశంలో ఇస్లాం బలవంతంగా వ్యాప్తి చెందిందా?

హింస ద్వారా ఏదైనా మతాన్ని, బల ప్రయోగం ద్వారా ఏదైనా దృక్పథాన్ని ఒప్పింపజేసి వ్యాప్తి చెయ్యటం కంటే సూది బెజ్జం గుండా ఒంటెను దాటించటం అన్నది చాలా తేలిక! ఈ విషయం ఇస్లాం కత్తి ద్వారా లేక బలవంతంగా వ్యాపించింది అని వాదించే అర్థ మెదడు మేధావులకు తెలీని వాస్తవం.

ముందుగా “ఇస్లాం కత్తి ద్వారా బలవంతంగా వ్యాప్తి చెందింది” అన్న కొందరి వాదన విషయంలో స్వయంగా జాతిపిత మహాత్మాగాంధీ ఏమంటున్నారో తెలుసుకుందాం.

“ఆ కాలంలో ఇస్లాంకు ఒక స్థానం కల్పించింది ఖడ్గం అనే ఆలోచన ఇంతకు పూర్వం ఉండేది. కానీ, ముహమ్మద్ జీవితం పరిశీలించిన తరువాత ముహమ్మద్ లోని కచ్చితమైన నిరాడంబరత, అనన్యమైనటువంటి నిస్వార్థము, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం పట్ల తనకు ఉన్న గట్టి పట్టింపు, తన సహచరుల పట్ల ప్రగాఢమైన ప్రేమ, దైవం పట్ల అచంచల భక్తి వల్లే ప్రవక్త ముహమ్మద్ విజయానికి మరియు ఇస్లాం జీవన రంగానికి పరిచయం అవ్వటానికి గల ముఖ్య కారణమని తెలుసుకున్నాను” – YONG INDIA, 1964, మహాత్మా గాంధీ

***

ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం ఏ విధంగా వ్యాప్తి చెందింది? ఇస్లాం అత్యంత వేగంగా వ్యాప్తి చెందటం వెనుక గల కారణాలు ఏమిటి? అన్నది తెలుసుకోనంతవరకూ ఇస్లాం బలవంతంగా వ్యాప్తి చెందింది లేక కత్తి ద్వారా వ్యాపించింది అన్న అపోహ చాలా మందిలో అపోహగానే మిగిలిపోతుంది.

రవాణా వ్యవస్థ, వేగవంతమైన సమాచార వ్యవస్థ వగైరా ఆధునిక ఆవిష్కరణలను కలలో సైతం ఊహించలేని 7 వ శతాబ్ద కాలంలో ఓ మారుమూల ఎడారి ప్రాంతంలో ఓ నిరక్ష్యరాసి అయిన ముహమ్మద్ (స) అనబడే వ్యక్తి నేను దైవ ప్రవక్తగా నియమితుడయ్యాను అని చెప్పినప్పుడు మక్కా వాసులంతా చాలా హేళనగా అతని మాటను కొట్టి పారేశారు. కానీ, రాను రానూ ఆయన బోధిస్తున్న దృక్పథాల్లోని లోతైన తాత్విక జ్ఞానాన్ని, అతని మాటలోని హేతుబద్ధతను, అతని వ్యక్తిత్వంలో నిజాయితీని అవగాహనపరచుకున్నవారు ఆయన బోధిస్తున్న “ధర్మం” కొత్తదేమీ కాదు గతంలో అబ్రాహాము, మోషే, యేసు వగైరా గత ప్రవక్తలూ/రుషులూ బోధించి వెళ్లిన “పాత ధర్మమే” లేక సనాతన ధర్మమే అన్న విషయాన్ని గ్రహించి దాని పట్ల ఆకర్షించటం మొదలెట్టారు

ఆ విధంగా మారుమూల ఎడారి ప్రాంతంలో ప్రవక్త ముహమ్మద్ (స) ప్రారంభించిన “వ్యక్తిత్వ ప్రక్షాళన” ఉధ్యమం ఓ చిన్న సమూహంగా మొదలయ్యి కేవలం 1400 వందల సంవత్సరాల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిపోయింది. ఆనాటి నిరక్ష్యరాసి అయిన ప్రవక్త ముహమ్మద్ (స) చెప్పిన బోధలకు ఆకర్షితులైనవారు… ఈనాడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.8 బిలియన్ల మంది ఉన్నారు. అంటే దాదాపు ప్రపంచజనాభాలో మూడువంతుల్లో ఒక వంతు ఉన్నారు

నిజంగా ఇస్లాం కత్తి ద్వారా వ్యాప్తి చెందింది అన్నదే నిజమైతే…
హింస ద్వారా ప్రజల సమూహాన్ని బలవంతంగా నోటితో నేను ఇస్లాం స్వీకరిస్తున్నాను అని చెప్పించవచ్చేమో గానీ వారి ద్వారా ఆచరణపరంగా ఇస్లాంను ఎలా ఆచరింపజేయగలరు? ఆచరణ (Practice) లో లేని ఏ మత విశ్వాసమైన ఎంతకాలం మనగలుగుతుంది? మహా లేదంటే ఒక తరం వ్యక్తులు భయప్రలోభాలకులోనై ఇస్లాం స్వీకరించారే అనుకుందాం. అలా హింస ద్వారా ఒక తరం స్వీకరించిన తరువాత వారి సంతానం… ఆ తరువాత వారి సంతానం అలా తరతరాలుగా ఆచరించబడుతూ కొనసాగటం అసలు ఎలా సాధ్యపడుతుంది?

పోనీ, ఈనాడు ఇస్లాంను ఎక్కడో కొందరు ఆటవిక జాతులు ఆచరించటం లేదు కదా? ప్రపంచంలో అనేక ఆధునిక శాస్త్రీయ ఆవిష్కరణలు చేసిన శాస్త్రజ్ఞులు, గొప్ప విధ్యావేత్తలు, శాస్త్రవేత్తలు, అనేక రంగాల్లో ఖ్యాతిగడించిన మహామహులు, ప్రముఖులు, తత్వ జ్ఞానులు, మేధావులు వగైరా ఎందరో కొన్ని కోట్ల మంది ఇస్లాంను పరిశీలించి అనుసరిస్తున్నారు.

మరీ ముఖ్యంగా భారతదేశంలో ఇస్లాంను మైనారిటీ ప్రజలు ఆచరిస్తూ ఉండవచ్చు కానీ… ఈనాడు అమెరికా, బ్రిటన్ వగైరా ఎన్నో క్రిస్టియానిటీ మెజారిటీగా ఉన్న దేశాల్లో క్రైస్తవం తరువాత ఆచరించబడుతున్న అతి పెద్ద ధర్మం ఇస్లాం. నిజంగా ఇస్లాం హింస ద్వారా కత్తితో భయప్రలోభాలకు గురిచేసి వ్యాప్తిచేసిన ధర్మమే అయితే… ప్రపంచవ్యాప్తంగా ఈనాడు ఇస్లాంను లోతైన పరిశీలన చేసి ఇస్లాంను స్వీకరిస్తున్న వారంతా చరిత్ర గురించి తెలియని పామరులో, చదువుకోని ఆజ్ఞానులో కాదుకదా?

కేవలం 1400 వందల సంవత్సరాల కాలంలో ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల కొద్దీ ప్రజలు ఇస్లాం పట్ల ఆకర్షితులవటానికి మౌలిక కారణాలు కత్తి ద్వారా భయపెట్టటం ద్వారానో లేక మహిమలు, అద్భుతాలు చేసి చూపటం వగైరా హేతు విరుద్ధమైన పద్ధతుల ద్వారా ఎంతమాత్రం కాదు… కానీ

1. ఖురాన్ పూర్తి హేతుబద్ధమైన దృక్పథాలు ప్రతిపాదించటం

2. ఖురాన్ ప్రతిపాదిస్తున్న ఖగోళ, పర్యావరణ, మానవ శరీర నిర్మాణ శాస్త్రాల (సైన్స్) తాలూకు ఎన్నో విషయాలు ఈనాటి ఆధునిక సైన్స్ చెబుతున్న దానితో సరితూగటం

3. ఖురాన్ ఏదో క్రొత్త ధర్మం వైపునకు కాకుండా మనిషి స్వభావిక సహజ ధర్మం వైపునకు ఆహ్వానించటం

4. ప్రపంచం ఎదుర్కుంటున్న జాత్యాహంకార/కులవ్యవస్థను ఇస్లాం కూకిటివేళ్లతో పెకిలించి పారేసి మానవులంతా సమానమే అన్న ఐక్యతా దృక్పథాన్ని ప్రతిపాదించటం

***

అరబ్బు వర్తకుల ద్వారా ఇస్లాం భారతదేశంలో ప్రవేశించింది!

ప్రవక్త ముహమ్మద్ (స) పుట్టుకకు పూర్వం నుండే అంటే దాదాపు 6 వ శతాబ్దానికి పూర్వం నుండే అరబ్బులకు భారతదేశంతో వ్యాపార లావాదేవీలు ఉండేవి. ఇక ప్రవక్త ముహమ్మద్ (స) అరేబియాలో ఇస్లాం సందేశం మొదలు పెట్టిన తరువాత ఆ సందేశాన్ని స్వీకరించిన అరబ్బులు భారతదేశానికి వచ్చినప్పుడు వారి మాటలోని నిజాయితీ, వారి నడవడికలోని సత్యసంధత కొట్టొచ్చినట్లు కనపడేది. ఆ విధంగా వారి ప్రవర్తనలో గొప్ప నైతిక మార్పును వారి వ్యక్తిత్వానికి, వారి ఇస్లామియా బోధల పట్ల భారతదేశంలోని వ్యక్తులు ఆకర్షితులవ్వటంతో చాలా మంది ఇస్లాం స్వీకరించటం మొదలెట్టారు. ఆ నేపధ్యం లో కేరళ మలబార్ ప్రాంతపు రాజు అయిన- ‘చెరమన్ పెరుమాల్ భాస్కర్ రవి వర్మ, ప్రవక్త వారి గురించి ఆ అరబ్బుల ద్వారా విని, మక్కా కు ప్రయాణించి ఇస్లాం స్వీకరించారు.

అతని పేరుమీదే “చెరమన్ జమా మస్జీద్” క్రీ.శ. 929 లో కేరళలో కట్టబడింది. అది ఈనాటికీ ఉంది. ఆ విధంగా అరబ్బుల రాక పోకడల వల్ల కోస్తా ప్రాంతాల ద్వారా భారతదేశంలో ఇస్లాం వ్యాప్తి చెందుతూ పోయింది. తప్పితే ఇక్కడి హిందువుల మెడల మీద కత్తులు పెట్టి ఇస్లాం ను ఎవరూ బలవంతంగా స్వీకరింపజేయ్యలేదు.

7, 8 వ శతాబ్దాల కాలంలో భారతదేశానికి వర్తకానికి వచ్చిపోయే అరబ్బులను ఉద్దేశిస్తూ జవహార్ లాల్ నెహ్రూ తన ప్రఖ్యాత పుస్తకమైన “ది డిస్కవరీ ఆఫ్ ఇండియా”లో ఈ క్రింది విధంగా చెబుతున్నారు

“ఎప్పుడైతే అరబ్బులు భారత దేశానికి వచ్చారో, వారు తమతో పాటు ఎంతో మెరుగైన సంస్కృతిని తీసుకుని వచ్చారు”
పోనీ, కాస్సేపు భారతదేశంలో ఇస్లాం కత్తి ద్వారా వ్యాపించింది అనుకుందాం…

అమెరికా, లండన్ దేశాల్లో క్రైస్తవం తరువాత ఆచరించబడే ‘రెండవ అతిపెద్ద ధర్మం (Second largest religion)’ ఇస్లామే! మరి ఆయా దేశాలపై ఏ ముస్లిం పాలకులు దండెత్తి ఇస్లాం వ్యాపింపజేశారు? ఇండోనేషియాలో 99% ప్రజలు ఆచరించే ధర్మం ఇస్లాం! ఇండోనేషియాపై ఏ ఏ ముస్లిం పాలకులు దండెత్తి ఇస్లాం వ్యాపింపజేశారు? ఇలా ఎన్నో నాన్-ఇస్లామిక్ దేశాలైన క్రైస్తవ మెజారిటీ ఉన్నదేశాల్లో ఇస్లాం ఇప్పుడు ‘రెండవ అతిపెద్ద ధర్మం’గా ఆచరించబడుతూ ఉంది. మరి ఆయా ఆయా దేశాలపై ఏ ముస్లిం పాలకులు దండెత్తి ఇస్లాం వ్యాపింపజేశారు?

***

బలవంతంగా స్వీకరింపబడేది ఇస్లాం అవుతుందా?

ఎంతమాత్రం అవ్వదు. కారణం స్వయంగా ఖురానే- “ధర్మం విషయంలో బలవంతం లేదు” -ఖురాన్ 2:256 అని చెబుతూ ఇస్లాంను స్వీకరించటం స్వీకరించకపోవటం వ్యక్తుల ఇష్టానికే వదిలిపెట్టింది. అటువంటప్పుడు ఎవరో ఇస్లాంను బలవంతంగా స్వీకరింపజేశారు అంటే అది అసలు ఇస్లాం అవ్వదు.

“ధర్మం విషయంలో బలవంతం లేదు” అని చెబుతున్న ఇస్లాంనే ప్రజల ద్వారా ఎవరో కత్తి పెట్టి బలవంతంగా స్వీకరింపజేశారు అంటే అలాంటి నిరాధారమైన విషయాలను చరిత్ర పరిశీలించకుండా అమాయకంగా నమ్మటానికి మించిన అజ్ఞానం మరొకటి ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *