జాత్యాహంకార భావన ఇస్లాం అంగీకరిస్తుందా?

అగ్రకులాలు-వెనుకబడిన కులాలు, అగ్ర వర్ణాలు-అధమ వర్ణాలు, నల్ల జాతీయులు-తెల్ల జాతీయులు అంటూ మానవుల మధ్య వర్గీకరణ చేసి, కొందరిని నీచులుగా అంతరానివారుగా అధములుగా లెక్కకట్టి జాత్యాహంకార (Racism) భావాలు ప్రదర్శించే ఆటవిక విధానం ఏనాటి నుండో మూర్ఖత్వం తలకెక్కిన దుర్మార్గుల ద్వారా పరంపరగా కొనసాగుతూనే వస్తుంది

దీనికి పూర్తి భిన్నంగా ధార్మిక గ్రంథాలు- ‘మంచివారు-చెడ్డవారు’, ‘శిష్టులు-దుష్టులు’ ‘విశ్వాసులు-అవిశ్వాసులు’ అంటూ వ్యక్తుల ప్రవర్తన (Attitude) ఆధారంగా మాత్రమే వ్యక్తులను వర్గీకరిస్తున్నాయి. ముఖ్యంగా ఇస్లాం- తమను తాము గొప్పగా భావించుకుని ఇతర వర్గాల వారిని (వారు ముస్లిములైనా ముస్లిమేతరులైనా) చులకనగా, నీచంగా చూసే జాత్యాహంకార భావనలను తీవ్రంగా ఖండిస్తుంది. ఎంత తీవ్రంగా ఖండిస్తుందీ అంటే…

“మానవులారా! మేము మిమ్మల్ని ఒకే స్త్రీ, పురుష జంట నుండి సృష్టించాము. తరువాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగానూ, తెగలుగానూ చేశాము. వాస్తవానికి మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవ పాత్రుడు” – 49:13

పై ఖురాన్ వాక్యం ప్రకారం…

1. మానవులంతా ఒకే జంట సంతానం. అటువంటప్పుడు కులపరంగా గానో, జాతి పరంగా గానో, వర్గం పరంగానో, రంగు పరంగా గానో ఒకరు ఎక్కువా కాదు ఒకరు తక్కువా కాదు

2. సృష్టికర్త అయిన దేవుడు మానవులను వివిధ ప్రాంతాలు, భాషలు, అలవాట్లను బట్టి జాతులుగా, తెగలుగా సృష్టించింది కేవలం ఒకరికొకరు పరిచయం చేసుకోవటానికి మాత్రమే

3. దేవుని దృష్టిలో ఎవరైనా గొప్ప వానిగా ఎంచబడేది అతని జాతిని బట్టో, రంగును బట్టో, వంశాన్ని బట్టో, కులాన్ని బట్టో, వర్గాన్ని బట్టో కాదు, అతని ప్రవర్తన (Attitude) ను బట్టి మాత్రమే

ఈ విధంగా ఖురాన్ “ప్రవర్తన ఆధారిత వర్గీకరణ (Attitude based classification)” మాత్రమే చేస్తుంది.

ప్రవక్త ముహమ్మద్ (స) జాత్యాహంకారపు జాఢ్యాన్ని ఏదో నోటి మాటగా ఖండించలేదు కానీ… నల్లవారిని అంటరాని వారిగా భావిస్తూ వారిని ఎంతో నీచంగా చూస్తున్న నేపథ్యంలో అప్పటి వరకు అరబ్బులలో అగ్రస్థాయి వంశీయులే నిర్వర్తిస్తూ ఉండే కాబా కప్పు పై నిలబడి అజాన్ (నమాజ్ కై పిలుపు) ఇచ్చే గొప్ప బాధ్యతను హజ్రత్ బిలాల్ (రజి) అనే ఓ నల్ల నీగ్రో బానిసకు అప్పగించి, జాత్యాహంకారపు జాఢ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించి పరేశారు . ఆ సంఘటన అప్పట్లో ఓ రకంగా దుమారం రేపింది. ఎందరో జాత్యాహంకారుల నోళ్లు మూయించింది.

ఇస్లాం ‘ఆధిక్యత (Superiority)’ దేని ఆధారంగా ఇస్తుంది?

“అరబ్బుకి అరబ్బేతరునిపై గానీ, అరబ్బేతరునికి అరబ్బుపై గానీ, తెల్లవానికి నల్లవానిపై గానీ, నల్లవానికి తెల్లవానిపై గానీ ఎలాంటి అధిక్యతా లేదు కేవలం సత్ప్రవర్తన, భయభక్తుల ద్వారా తప్ప” – ప్రవక్త ముహమ్మద్ (స)

ఈ సందర్భంలో ఎవరైనా మరి ఇస్లాం జాత్యాహంకారాన్ని అంతలా ఖండిస్తున్నప్పుడు ముస్లిముల్లో సున్నీలు, షియాలు, దూదేకులని శాఖలుగా ఎందుకు విడిపోయారు? జమాతుల పేరుమీద అనేక సంఘాలుగా ఎందుకు ఉన్నాయి? వాటి మధ్య అనైక్యత ఎందుకుంది? అని ప్రశ్నించవచ్చు

దీనికి సంక్షిప్త సమాధానం- ముస్లిం సమాజంలో వర్గపరమైన విభజనలతో వారి అనైక్యతతో ఇస్లాంకు సంబంధం లేదు! ప్రవక్త ముహమ్మద్ (స) పరమపదించిన తరువాత ఎన్నో సంవత్సరాల తరువాతే సిద్ధాంత పరమైన విభజనల ఆధారంగా ఈ శాఖలు ఉనికిలోకి తేబడ్డాయి.

నిజానికి ఖురాన్- “మానవుల పట్ల అల్లాహ్ కు ఎంతో కరుణ, వాత్సల్యం ఉన్నాయన్న విషయాన్ని నిశ్చయంగా నమ్మండి (2.143)” అని చెబుతుంది. తప్పితే మానవుల్లో ఫలానా మతం, వర్గం వారిపట్ల కరుణ, వాత్సల్యాలు ఉన్నాయని చెప్పటం లేదు. కాబట్టి ఫలానా వర్గం గొప్ప ఫలానా వర్గం తక్కువ అనటానికి అవకాశమే లేదిక్కడ.

ఒక్క ముస్లిం సమాజంలోనే కాదు ఏ మతవర్గంలో నైనా ప్రజలు శాఖలు, వర్గాలు ఏర్పడటం అన్నది కూడా పెద్ద సమస్య కాదు. కానీ, తమ వర్గమే గొప్ప ఇతర వర్గాల వారు అధములు, నీచులు అన్న జాత్యాహంకార భావన కలిగి ఉండటమే అసలు సమస్య.

ప్రకృతిలో భిన్న రంగులు, భిన్న రుచులు, భిన్న ఋతువులు సృష్టించి సమతుల్యత పెట్టిన దేవుడే, మానవులలో ప్రాంతాలను బట్టి భిన్న రంగులలో, భిన్న భాషలు మాట్లాడే వ్యక్తులను భిన్న జాతులు, తెగలగా సృష్టించి వారంతా ఒకరినొకరు గౌరవించుకుంటూ మానవ సంబంధాల మధ్య సమతుల్యత కాపాడుకుంటారా? లేక మేమే గొప్ప మీరు తక్కువ అన్న జాత్యాహంకార భావనలు బుర్రకెక్కించుకుని మానవ సంబంధాల మధ్య సమతుల్యతను భంగపరుస్తారా? అన్నదే మానవాళికి దేవుడు పెట్టిన పరీక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *