నీచమైన ముఢాచారాలలో మునిగిపోయి, నైతకత-మానవత్వాలు వంటివి ఏ మాత్రం పరిచయం లేని, నాగరికత అంటే అసలు ఎలా ఉంటుందో కూడా తెలియని అజ్ఞానంధకారంలో కొట్టుమిట్టాడే జాతిని సంస్కరించటానికి ముహమ్మద్ (స) ప్రవక్తగా పంపబడ్డారు. పైగా చిన్న చిన్న విషయాలకే తగాదాలు పడి కొన్ని సంవత్సరాల తరబడి కత్తులు దూసుకుంటూ క్రూరంగా చంపుకునే మక్కా జాతి ప్రజలను సంస్కరించాల్సిందిగా “లే! లేచి హెచ్చరించు” అంటూ సృష్టికర్త అయిన దేవుడు ప్రవక్త ముహమ్మద్ (స) కు ఆదేశించటం జరిగింది.
ఈ విధంగా ప్రారంభమయిన ప్రవక్త ముహమ్మద్ (స) సందేశ ప్రచార ఉద్యమం బలవంతంగా సాగిందని, కత్తుల ద్వారా ప్రవక్త ముహమ్మద్ (స) ఇస్లామీయా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారని కొందరు ముస్లిమేతరులు ఊహించుకుంటూ ఉంటారు.
నిజానికి స్వల్ప విషయాలకే తగాదాలు పడి అలవోకగా చంపుకునే, మంచి- మానవత్వపు బోధలంటే ఏవగించుకునే జాతి ప్రజల వద్దకు ప్రవక్త ముహమ్మద్ (స) పంపబడ్డారు. తప్ప శాంతి, సహనాలు కలిగి, సున్నిత మనస్తత్వం ఉన్న జాతి ప్రజల వద్దకు పంపబడలేదు వారిని నయానో భయానో భయపెట్టి తన మాట ప్రకారం నడుచుకునేలా లొంగదీసుకోవటానికి.
శాంతి, సహాన బోధలంటే ఏ మాత్రం ఇష్టపడని జాతి వద్దకు దైవ సందేశం చేర వెయ్యటానికి పంపబడిన ప్రవక్త ముహమ్మద్(స)కు ఖురాన్ లో- “ప్రవక్తా! మృదుత్వం, మన్నింపుల వైఖరిని అవలంబించు. మంచిని ప్రబోధించు. మూర్ఖులతో వాదానికి దిగకు (7.199)” “సహనం వహించు, దృఢచిత్తులైన ప్రవక్తలు సహనం వహించినట్టు (46.35)” అనే ఆజ్ఞలు దైవం తరఫున ఇవ్వబడుతూ ఉండేవి.
మక్కా వాసులు ప్రవక్త ముహమ్మద్ (స) సందేశాన్ని తిరస్కరించి చివరకు చంపాలని ఎదురు చూస్తున్న నేపథ్యంలో సైతం- వారు ఎంత చెడు చెయ్యాలని చూచినప్పటికీ “చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు (41.34)”, నీ ప్రభువు మార్గం వైపునకు వివేకంతో, చక్కని హితబోధతో ఆహ్వానించు, ప్రజలతో ఉత్తమోత్తమమైన రీతిలో వాదించు (16.125)” అన్న శాంతియుత విధానమే నిర్దేశించబడుతూ ఉండేది
ఈ ఖురాన్ ఆదేశాల వెనుక ప్రధాన ఉద్దేశం- అవతల ప్రక్కవారు ఎంత మూర్ఖులైనప్పటికీ, వారు గొడవపడటానికి ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ, వారితో ఏ మాత్రం వాదనకు దిగకుండా పరిస్థితి అదుపు తప్పకుండా వ్యవహరించగలగాలన్నది.
ఎదుటి వ్యక్తులతో ఎలాంటి ఘర్షణ, వాదనకు దిగకుండా పరిస్థితులను అదుపు చేస్తూ ఎంతటి తీవ్ర పరిస్థితుల్లోనైనా సహనం కోల్పోయి ఎదుటి వ్యక్తులతో వాదానికి దిగకుండా మనం చెయ్యాలనుకున్న పనిని శాంతియుతంగా చేసే ఈ విధానాన్నే ఆధునిక పరిభాషలో “శాంతియుత కార్యాచరణ (Peaceful activism) అంటారు.
ఈ విధానమే భారతదేశంలో అహింసా మార్గం (non-violent activism)” గా అభివర్ణించబడింది. ఈ కార్యాచరణ ఆధారంగానే ప్రవక్త ముహమ్మద్(స) ఇస్లాంను ప్రపంచంలో మూలమూలలకూ చేర వెయ్యగలిగారు.
అందుకే ఖురాన్ లో ప్రవక్త ముహమ్మద్ (స) లో మీకు “ఒక మంచి ఆదర్శం” (ఉస్వ-యే-హాసన) ఉందని చెప్పటం జరిగింది. ఆ “మంచి ఆదర్శం”- ‘ఎదుటి వ్యక్తులు సహనం కోల్పోయినప్పటికీ, గొడవ పడాలని ఎదురు చూస్తున్నప్పటికీ, పరిస్థితులు అదుపు తప్పకుండా వ్యవహరిస్తూ మన పని చెయ్యటం అన్నమాట. ఈ కార్యాచరణ విధానాన్నే నేటి పర్సనాలిటీ డవలప్మెంట్ తరగతుల్లో “సిట్యూయేషనల్ హేండ్లింగ్” అని కూడా చెబుతుంటారు.
ప్రవక్త ముహమ్మద్ (స) పంపబడిందే నాగరికత ఎరుగని నిత్యం కొట్టుకుచచ్చే జాతి ప్రజల వద్దకు. ఏ మాత్రం అవకాశం చిక్కినా ఆయనతో నిత్యం తగాదా పడాలని ఎదురుచూసే ఆనాటి అనాగరిక మక్కా వాసులను అతి కొద్ది సంవత్సరాల కాలంలోనే నైతికతకు, మానవత్వానికి పట్టుకొమ్మలుగా శాంతి, సహనాలతో కూడిన ఉత్తమ వ్యక్తులుగా మార్చివెయ్యగలిగారు అంటే… ఆయన అప్పటి పరిస్థితులను ఏ విధంగా నియంత్రించగలిగి ఉంటారు, ఆనాటి వ్యక్తులు తగాదా పడాలని చూస్తున్నప్పటికీ గొడవ పడకుండా ఆపుతూ ఎంత సహనంతో వారితో వ్యవహరించి ఉంటారు? అన్నది ఊహించగలం
“ఎలాంటి తీవ్రమైన పరిస్థితులనైనా అదుపు చెయ్యగలుగుతూ ప్రవక్త ముహమ్మద్ (స) అవలంబించిన ఈ “శాంతియుత కార్యాచరణ (Peaceful activism)” విధానమే ఖురాన్ లో “ఉస్వ-యే-హాసన” అని చెప్పబడింది
ఏడవ శతాబ్దపు ప్రవక్త ముహమ్మద్ (స) జీవిత చరిత్ర చదివిన వారెవరైనా ఆయన ఏమాత్రం నాగరికత ఎరుగని నైతిక విలువలంటే ఎలా ఉంటాయో కూడా తెలియని ఒక జాతి ప్రజలను అతి కొద్ది కాలంలోనే ప్రపంచానికి నైతికత, మానవత్వం శాంతి సహనబోధలు నేర్పే గురువులుగా ఎలా మార్చగలిగారో తెలుసుకోగలరు. అయితే అంతటి శాంతియుత కార్యాచరణను అవలంబించిన వ్యక్తి మరి యుద్ధాలు ఎందుకు చేయవలసి వచ్చింది? అని ప్రశ్నిస్తే అది కేవలం కొందరు దౌర్జన్యపరులు ఆనాటి విశ్వాసుల వర్గంపై యుద్ధానికి కాలు దువ్వి ధర్మాన్ని తుదముట్టించటానికి ఎదురు తిరిగిన నేపథ్యంలో విశ్వాసుల ప్రాణ రక్షణ నిమిత్తం తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధం చెయ్యమనే ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఈ విధమైన ఆజ్ఞలు అటు హిందూ శాస్త్రాల్లో, బైబిల్లోనూ చూడగలం
ప్రవక్త ముహమ్మద్ (స) ద్వారా నిర్దేశించబడిన విధానం: అవతలి వ్యక్తులు యుద్దానికి లేక వాదానికి దిగటానికి ప్రయత్నిస్తున్నప్పటికీ పరిస్థితులను అదుపుచేసి శాంతియుతంగా పరిష్కరించగలగాలి. ఈ వ్యాహంతోనే అవిశ్వాసులు తమకు అనుకూలంగా ఎన్ని షరతులు రాసుకున్నప్పటికీ కేవలం యుద్ధం జరగకుండా ఆపాలన్న ఉద్దేశంతో హుదైబియా ఒప్పందానికి అంగీకరించటం జరిగింది
ఈ విషయాల పరిజ్ఞానం లేని కొందరు మటుకు గాసిప్పుల్లో దొరికిన సమాచారం పట్టుకుని ప్రవక్త ముహమ్మద్ (స) హింస ద్వారా ఇస్లాంను వ్యాపి చేశారని అవగాహనా రాహిత్యంతో అన్నీ తమకే తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటారు
శాంతియుత కార్యాచరణ’ – ప్రవక్త ముహమ్మద్ (స) విధానం
