ధర్మము, అధర్మము & ఆపద్ధర్మము

ఇస్లాంను అనుసరించే చాలా మంది సామాన్య ముస్లిములకు ఏది ధర్మబద్ధం (హలాల్), ఏది అధర్మం (హరామ్) అనే అవగాహన ఉంటుంది… కానీ ఈ ధర్మానికి, అధర్మానికి మధ్యలో ఓ “ఆపద్ధర్మం” కూడా ఖురాన్ లో నిర్దేశించబడి ఉంది అనే అవగాహన చాలా తక్కువ మందిలో ఉంటుంది. అదేంటి?? అన్నది తెలుసుకునే ముందు అవగాహన పరచుకోవలన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే…

మనిషి ధర్మం కోసమా? లేక ధర్మం మనిషి కోసమా? అన్నది. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం తెలుసుకోగలిగితే చాలు ధర్మం (దీన్)లో చాలా అతి క్లిష్టమైన సమస్యలు కూడా అతి సులువైపోతాయనటం అతిశయోక్తి కాదు. చాలా మంది ధార్మికుల్లో ఉండే ఓ అతి పెద్ద అపోహ ఏమిటంటే- మనిషి ఉన్నదే ధర్మం (దీన్) అనుసరణ కోసం అన్నది. ఈ అపోహ ఉండటం బట్టే కొందరు ధర్మం విషయంలో మొండిగా వ్యవహరిస్తూ ధర్మం యొక్క ప్రాధాన్యతలు (Priorities) మార్చేస్తూ ఉంటారు.

కానీ ఖురాన్ ను లోతైన అవగాహనతో చదివితే… మనిషి ధర్మం కోసం కాదు కానీ, ధర్మం (దీన్) నిర్దేశించబడిందే మనిషి మేలు కోసం అన్న విషయం తేటతెల్లమౌతుంది. అదెలాగంటే ధర్మానికీ మనిషికీ మధ్య ఉన్న సంబంధం ఒక సిస్టమ్ కు, మాన్యువల్ (Manual) కు మధ్య ఉన్న సంబంధం లాంటిది.

ఉదాహరణకు: ఓ ఎలక్ట్రానిక్ పరికరమో లేక యంత్రమో వగైరా ఏ సిస్టమ్ అయినా అది తయారు చెయ్యబడిన తరువాత దానిని ఎలా వాడాలి? ఎలా వాడకూడదు (Do’s and Don’ts) తో కూడిన ఒక మ్యానువల్ తయారు చెయ్యటం జరుగుతుంది. తప్పితే ఎవడూ కూడా ముందు మ్యానువల్ తయారు చేసి తరువాత సిస్టం తయారు చెయ్యడు కదా!

అచ్చం అదే విధంగా మనిషిని సృష్టించిన దేవుడు అతను ఎలా నడుచుకోవాలి ఎలా నడుకోకూడదు వగైరా ధర్మా-అధర్మాలతో కూడిన ఆజ్ఞలను మనిషి మేలు కోసమే తెలియజేశాడు. దానికి అనుగుణంగానే దైవగ్రంథాలు అవతరింపజేస్తూ వచ్చాడు. కాబట్టి సంక్షిప్తంగా ఖురాన్ లో దేవుడు నిర్దేశించిన ధర్మం (దీన్) అన్నది మనిషి శాంతియుతంగా, సక్రమంగా జీవనం సాగించటానికి ఒక (Do’s and Don’ts) తో కూడిన ఒక మ్యానువల్ లాంటిది అనటంలో ఏమాత్రం సందేహం లేదు.

మనిషి మేలు కోసం ఆరోగ్యకరమైన శాంతియుత జీవితం గడపటానికే ధర్మా-అధర్మాలను (హలాల్-హరాం) కూడా నిర్దేశించాడు. కానీ, దేవుడు ఎదైతే నిషేధించాడో కొన్ని అసాధారణ పరిస్థితుల్లో వాటిని ధర్మబద్ధం కూడా చేశాడు. అలాగే వేటినైతే ధర్మబద్ధం చేశాడో కొన్ని అసాధారణ పరిస్థితుల్లో వాటిని నిషేధించాడు కూడా! చిత్రంగా ఉంది కదూ.

ఉదాహరణకు: ఖురాన్ లో సృష్టికర్త అయిన అల్లాహ్- “రక్తాన్ని, మరణించిన వాటిని, పంది మాంసాన్ని, ఇతరులకు సమర్పించిన దానిని తినకండి (2:172)” అని నిషేధిస్తునే – “గత్యంతరం లేని పరిస్థితుల్లో వాటిలో ఏ పదార్థాన్నైనా తింటే పాపం కాదు” అని అదే వాక్యంలో కూడా చెబుతున్నాడు.

అలాగే “రంజాన్ నెలను పొందే వ్యక్తి ఆ నెల అంతా ఉపవాసం విధి చెయ్యబడిందని (2:185)” చెప్పిన అల్లాహ్ యే … “ప్రయాణాల్లో ఉన్నవారు, వ్యాధిగ్రస్తులైన వారు ఉండవద్దు” అని నిషేధించిన సందర్భమూ ఉంది.

అలాగే ఓ సందర్భంలో స్వయంగా ప్రవక్త ముహమ్మద్ (స) సామూహిక నమాజ్ కోసం రాని వారి ఇళ్లను తగలేట్టెయాలనిపిస్తుంది అని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. అలా చెప్పిన వ్యక్తే మరో సందర్భంలో చలి ఎక్కువగా ఉన్నప్పుడు, వర్షం కురిసే సందర్భాలు ఏర్పడితే ‘అజాన్ ఇచ్చినప్పుడు జనులారా మీరు మీ మీ ఇళ్లలోనే నమాజ్ చేసుకోండి ఎవరూ సామూహిక నమాజ్ కోసం మసీదుకు రావోద్దని” కూడా ప్రకటించమని చెబుతారు.

మరీ ముఖ్యంగా ఏదైనా ప్రదేశంలో అంటువ్యాధులు ప్రబలినప్పుడు మీరు ఎక్కడకు వెళ్ళకండి ఒకవేళ మీరు ఉన్న ప్రదేశంలో అంటువ్యాధులు ప్రబలితే మీరు ఉన్న చోటు నుండి కదలకండి అని చెప్పిన సందర్భమూ ఉంది.

దీనిని బట్టి ధర్మంలో దేవుడు పూర్తి నిర్బంధాన్ని పెట్టలేదు… కానీ, మనిషి మేలు, సౌలభ్యం కోసం కొన్ని అసాధారణ పరిస్థితుల్లో అతనికి రాయితీలతో కూడిన ధర్మం ఇవ్వటం జరిగిందని అర్థమౌతుంది.

అలా ఎందుకు అంటే…

మనిషి ఎప్పుడూ రెండు రకాల స్థితుల్లో ఏదో ఒక స్థితిలో ఉంటాడు ఒకటి- “సాధారణ స్థితి (Normal condition)” అయితే రెండవది- “అసాధారణ స్థితి (Abnormal condition)” అటువంటప్పుడు ధర్మం కూడా రెండు స్థితుల్లో రూపొందించబడి ఉండాలా? అవసరం లేదా?

“రక్తాన్ని, మరణించిన వాటిని, పంది మాంసాన్ని, ఇతరులకు సమర్పించిన దానిని తినకండి” అని నిషేధించింది ఎప్పుడు? మనిషి “సాధారణ స్థితి (Normal condition)” ఉన్నప్పుడు. అలాగే వాటిని తినొచ్చు అని అనుమతించింది ఎప్పుడు? మనిషి “అసాధారణ స్థితి (Abnormal condition)” లో ఉన్నప్పుడు.

అలాగే “రంజాన్ నెలను పొందే వ్యక్తి ఆ నెల అంతా ఉపవాసం విధిగా ఉండాలని” చెప్పింది ఎప్పుడు? మనిషి “సాధారణ స్థితి (Normal condition)” ఉన్నప్పుడు. అలాగే ఉపవాసం నిషేధించింది ఎప్పుడు? మనిషి “అసాధారణ స్థితి (Abnormal condition)” లో ఉన్నప్పుడు.

అలాగే సామూహిక నమాజ్ కోసం తప్పని సరిగా మసీదుకే రావాలని చెప్పింది ఎప్పుడు? మనిషి “సాధారణ స్థితి (Normal condition)” ఉన్నప్పుడు. సామూహిక నమాజ్ కోసం మసీదు రావోద్దని చెప్పింది ఎప్పుడు? మనిషి “అసాధారణ స్థితి (Abnormal condition)” లో ఉన్నప్పుడు.

ఈ విధంగా ధర్మాన్ని, అధర్మాన్ని నిర్దేశించిన దేవుడే మనిషి కొన్ని అసాధారణ పరిస్థితుల్లో (Normal conditions లో)” చిక్కుకున్నప్పుడు అతని మేలు కోసం కొన్ని సడలింపులు కూడా చేస్తూ అనుమతులు కూడా ఇచ్చాడు. దానినే సాధారణ పరిభాషలో “అపద్ధర్మము” అంటారు. అంటే- “ఆపదలో అవలంబించాల్సిన ధర్మము” అన్న మాట.

ఇప్పుడు పై అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇన్నాళ్లూ సహరీ విందులు సామూహికంగా చేస్తూ వచ్చాం… ఇన్నాళ్లూ ఇఫ్తార్ విందులు సామూహికంగా చేస్తూ వచ్చాం… ఇన్నాళ్లూ తారావీ నమాజులు సామూహికంగా చదువుతూ వచ్చాం అంటూ బాధ పడుతూ నిర్లిప్తతతో ఉండనవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనమంతా “అసాధారణ స్థితి (Abnormal condition)” లో ఉన్నాం కాబట్టి. కనుక మసీదుకు వెళ్లకపోయినంత మాత్రానా వచ్చే పుణ్యమూ తగ్గిపోదు… ఉపవాసానికి ఎటువంటి భంగమూ వాటిల్లదు.

అయినప్పటికీ ఎవరైనా రంజాన్ అంటే వరాల వసంతం సుభాల మాసం కాబట్టి కరోనా ఏం చెయ్యగలదు అన్న భావనతో… మసీదుకు ఎలాగూ వెళ్లలేకపోతున్నాం కదా అని అనవసర భక్తి పారవశ్యంలో మునిగి తారావీ నమాజుల కోసం కాలనీల్లో ఎదురింటి వారు పక్కింటి వారు కలిసి ఇళ్ళల్లో జమాతులు కట్టటం, రామజాన్ శుభాలు ఎక్కువగా ఉంటాయని శుక్రవారం నమాజులను ఇళ్ళల్లో ఏర్పాటు చెయ్యటం…. సహరీ-ఇఫ్తార్ విందుల కోసం ఎదురింట్లో పక్కింట్లో ఉన్న అందరూ సరరదాగా గుంపుగా ఏర్పడి ఒకవేళ కరోనా బారిన పడితే… ఆ తరువాత అలాంటి అమాయక భక్తులను అల్లాహ్ కూడా కాపాడడు.

కాబట్టి ముస్లిం సమాజం పూర్తిగా ఎంతో పటిష్టంగా “క్వారంటైన్” ను పాటిస్తూ ఇళ్ళల్లోనే నమాజులు చేసుకుంటున్నారు. మంచిదే… అయినప్పటికీ మసీదుల్లోనే కాక ఇళ్ల దగ్గర కూడా సమూహాలు గా ఏర్పడకుండా… ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా… సామాజిక దూరం అన్నది మన పక్కింటి, ఎదురింటి వారి నుండి, మన దగ్గరి స్నేహితుల నుండి కూడా పాటిస్తూ… ప్రస్తుత సున్నిత పరిస్థితుల్లో ముస్లిం విమర్శకులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా మీరంతా సహరీ, ఇఫ్తార్, తారావీ లతో సహా ఇళ్ళల్లోనే నిర్వర్తిస్తూ ఆనందంగా రంజాన్ మాసాన్ని ఆయురారోగ్యాలతో గడపాలని ఆశిస్తూ…

మీ అందరికీ నా రంజాన్ శుభాకాంక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *