మానవ ప్రశాంత మనుగడకు దేవుని ద్వారా ప్రకృతిలో ఏర్పరచబడిన “సమతూకం (Balance)” ఎంత ప్రాముఖ్యత కలిగిన విషయమో, సమాజంలో తోటి వ్యక్తులతో ఆరోగ్యకరమైన సంబంధ బాంధవ్యాలు కొనసాగించటానికి మనిషి ప్రవృత్తిలో ఉండే భావోద్వేగాల తాలూకు “సమతౌల్యత (Balance)” కోల్పోకుండా జాగ్రత్తపడుతూ ఉండటం కూడా అంతే ముఖ్యం. కొన్ని ఉద్రేకపూరిత సమయాల్లో భావోద్రేకాల తాలూకు “సమతౌల్యత (Balance)” కోల్పోవటం జరుగుతూ ఉంటుంది. అటువంటి సమయాల్లో మనిషి భావోద్రేకాల తాలూకు సమతౌల్యతను కాపాడుకోగలగటాన్నే సామాన్య పరిభాషలో “సహనం వహించటం” అని చెప్పటం జరుగుతుంది.
మతపరమైన విషయాల్లో అయితే భావోద్వేగాలను కాపాడుకోవటం, సహనం కోల్పోకుండా ఉండటం అనేది ఇంకా ముఖ్యం. అందుకే పరమత సహనానికి అటు రాజ్యాంగంలోనే కాక, సకల ధార్మిక గ్రంధాల్లోనూ పెద్ద పీట వెయ్యటం జరిగింది.
సహనం గురించి ఖాళీ సమయాల్లో చెప్పుకోటానికో, చదువుకోటానికో కాదు అది మనిషి ఉద్రేకానికి లోనైయ్యే పరిస్థితులు ఎదురైనప్పుడు పాటించాల్సిన గుణం! సహజంగా ఎదుటి వ్యక్తులు భావోద్రేకాలు రెచ్చగొట్టే ఉద్దేశంతో దిగజారుడు మాటలు మాట్లాడుతున్న నేపథ్యంలో చాలా మంది సహనం వహించటం అంటే అదేదో పౌరుషం చంపేసుకున్నట్టో, అహం దెబ్బతిన్నట్టో ఫిలైపోయి వారి కంటే ఎక్కువగానే దిగజారుడు మాటలు మాట్లాడుతూ, వారి కంటే ఓ నాలుగైదు బూతులు ఎక్కువగానే ప్రయోగిస్తూ ఉంటారు.
ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే మతపరమైన వాదోపవాదాలు జరుతుండే నేపథ్యంలో కొందరు ఇస్లాం ధ్వేషకులు సోషల్ మీడియాలో ఇస్లాంను విమర్శిస్తే గనుక దానికి ఇగో హార్ట్ అయిపోయినట్టు ఫీలై ప్రతి విమర్శగా ముస్లిం సోదరుల్లో చాలా మంది అవతలిప్రక్క విమర్శించేవారు ఒకవేళ క్రైస్తవులైతే క్రైస్తవ్యాన్ని లేక యేసును, విమర్శించేవారు హిందువులైతే హిందూత్వాన్ని లేక వారి మహనీయులను విమర్శిస్తూ, పైగా ఇస్లాంను విమర్శిస్తూ ఉంటే మమ్మల్ని చేతులు కట్టుకుని ఉండమంటారా? అంటూ కొందరు తమ అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు.
కానీ, ఖురాన్ ఇదే పద్ధతి అవలంబించమని చెబుతుందా?
విమర్శ గోడపై విసిరి కొట్టే బంతి లాంటిది! గోడ మీదకు ఎంతవేగంగా బంతిని విసిరితే అంతే వేగంగా అది మనపై దూసుకువస్తుంది. అది దాని గుణం. అచ్చం విమర్శ కూడా అంతే!
ఈ సందర్భంలో ముస్లిములు దృష్టి సారించవలసిన అతి ముఖ్యమైన విషయాలేమిటంటే…
1.ఒకరు ఇస్లాం కి వ్యతిరేకంగా విమర్శించినంతమాత్రానా ఇస్లాం కు వాటిల్లే నష్టం ఏదైనా ఉందా?
2.అల్లాహ్ నో, ప్రవక్త ముహమ్మద్ (స) వారినో ఎవరైనా కించపరుస్తూ మాట్లాడినప్పటికీ కూడా అదే రీతిలో ఆ వర్గం వారు దైవాలని పూజించేవారినో, లేక వారి మహనీయులనో దూషించే అనుమతి ఖురాన్ లో ఇస్తుందా?
3.ఒకవేళ విమర్శకు ప్రతివిమర్శ చేయాలనే సందర్భం వచ్చినప్పుడు ఏ విధమైన విమర్శ చెయ్యటం ఉత్తమం అవుతుంది? ఈ విషయంలో ఖురాన్ నిర్ధేశిస్తున్న మార్గం ఏమిటి? అన్నవి.
నేడు ఏ విమర్శలైతే ఇతర మతవర్గాల ద్వారా అల్లాహ్ కు, ప్రవక్త ముహమ్మద్ (స) వారికి లేదా ఖురాన్ కు వ్యతిరేకంగా చెయ్యబడుతున్నాయో ఆ విమర్శలు ప్రత్యక్షంగా ప్రవక్త ముహమ్మద్ (స) వారు ఉన్నప్పుడే ఆయన సమక్షంలో ఎన్నో సార్లు చెయ్యబడుతూ ఉండేవి. మరి అటువంటి సందర్భాల్లో ప్రవక్త ముహమ్మద్ (స) కూడా సహనం కోల్పోయి పరమత విమర్శలు చేసేవారా? దీనికి సంబంధించి అల్లాహ్ తరఫు నుండి ప్రవక్త ముహమ్మద్ (స) వారికి ఇవ్వబడిన ఆజ్ఞ ఏమిటో ఒకసారి గమనించగలరు.
“కనుక ప్రవక్తా! నీకు ఆజ్ఞాపించబడుతున్న విషయాన్ని బహిరంగంగా ఎలుగెత్తిచాటు. షిర్కు చేసేవారిని ఏమాత్రం లెక్కచేయ్యకు. నిన్ను ఎగతాళి చేసేవారికీ, అల్లాహ్ తో పాటు ఇతరులను కూడా దేవుళ్లుగా నిర్ణయించేవారికీ నీ తరఫున బుద్ధిచెప్పటానికి మేము చాలు. త్వరలోనే వారికి తెలిసిపోతుంది. వారు నిన్నుగురించి కల్పిస్తున్న మాటల వల్ల నీ మనస్సుకు మిక్కిలి కష్టం కలుగుతుందని మాకు తెలుసు. (దానికి చికిత్స ఏమిటంటే) నీ ప్రభువు స్తోత్రం చేస్తూ ఆయన పవిత్ర నామాన్ని స్మరించు. ఆయన సన్నిధానంలో సాష్టాంగపడు. – ఖురాన్ 15:94-99
పైవాక్యం లో గమనార్హమైన విషయం:- “వారు కల్పించే మాటల వల్ల మనస్సుకు మిక్కిలి బాధ కలిగినప్పుడు” కేవలం దైవ నామస్మరణ చేస్తూ సహనం వహించమని ఆజ్ఞాపించబడింది తప్పితే వారి విమర్శకులకు ఏ మాత్రం తగ్గకుండా మాటకు మాట ఎలా పడితే అలా మాట్లాడేసి ప్రతి విమర్శ చెయ్యమనటం లేదు అన్నది. పైగా ఎగతాళి చేసేవారికి తగిన గుణపాఠం స్వయంగా దేవుడే చేస్తానంటున్నాడు. ముఖ్యంగా ఒక ముస్లిం నడకలో నమ్రత, మాటలో మాధుర్యం కలిగి ఉండాలని స్వయంగా దేవుడే ఖురాన్ లో ఈ క్రింది విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు.
“మరియు నీ నడకలలో నమ్రత పాటించు. మరియు నీ స్వరాన్ని తగ్గించు. నిశ్చయంగా, స్వరాలలో అన్నిటికంటే వినసొంపుకానిది గాడిద స్వరమే!” – ఖురాన్ 31:19
పై వాక్యంలో ముస్లిముల నడకలో నమ్రత పాటించమనటమే కాక, వారు మాట్లాడేటప్పుడు స్వరాన్ని తగ్గించి, అంటే మెతక వైఖరితో మాట్లాడమని ఆదేశించటం జరుగుతుంది. అలా కాక, ఎలా పడితే అలా మాట్లాడేసేవారి స్వరాన్ని గాడిద స్వరంతో పోల్చటం జరిగింది.
ఇతర మతస్తులు తాము దైవాలని వేడుకుంటున్న వారిని దూషించే అనుమతి ఖురాన్ ఇస్తుందా? లేక ఖండిస్తుందా?
ఎట్టి పరిస్థితులోనూ ఇతర మతస్తులు దైవాలని భావించే వాటిని/వారిని దూషించే, విమర్శించే అనుమతి ఖురాన్ ఇవ్వటం లేదు. అలా విమర్శించటం రాజ్యాంగ పరమ్గా తప్పవటమే కాక ఖురాన్ ప్రకారం ఘోరమైన పాపం అవుతుంది. కారణం స్వయంగా దేవుడే అలా విమర్శించటాన్ని ఈ క్రింది విధంగా నిషేధించాడు కాబట్టి.
“(ముస్లిములారా!) వారు అల్లహ్ ను కాదని వేడుకునే ఇతరులను దూషించకండి. ఎందుకంటే, వారు షిర్కు కంటే ముందుకు పోయి అజ్ఞానం చేత అల్లాహ్ ను దూషిస్తారేమో. – 6:108
“అల్లహ్ ను కాదని వేడుకునే ఇతరులను దూషించకండి” అన్నది స్వయంగా అల్లాహ్ ఆజ్ఞ. ఇక స్వయంగా అల్లాహ్ చెప్పిన తరువాత కూడా ఒకవేళ ఎవరైతే ఇతర మతస్తులు దైవాలని భావించి వేడుకునే వారిని దూషిస్తారో వారు ప్రత్యక్షంగా అల్లాహ్ ఆజ్ఞను మీరినవారే అవుతారు. ఇది నిజ ముస్లిముల లక్షణం అనిపించుకోదు. పైగా అలా విమర్శించటం వల్ల జరిగే పరిణామ ఏమిటో కూడా పై వాక్యంలో వివరించటం జరిగింది. అదేమిటంటే- “వారు షిర్కు (బహుదైవోపాసన) కంటే ముందుకు పోయి అజ్ఞానం చేత అల్లాహ్ ను దూషిస్తారేమో” అన్నది. మరో ముఖ్య విషయం “ఇతరులు దైవాలని భావించే వాటిని దూషించకండి అన్నప్పుడు వారి మాతాచారాలను, వారి వర్గ ప్రజలను కూడా దూషించకూడదన్న ఆదేశం కూడా అంతర్లీనంగా ఇమిడి ఉంది.
ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది అదే! ఎవరో కొందరు ఇస్లాం మీద అక్కసుతో విమర్శ చేస్తే మా మనోభావాలు దెబ్బతిన్నాయన్న నెపంతో ఇటు ముస్లిములలో కొందరు ఆవేశపరులు అవతలిప్రక్క వారు క్రైస్తవులైతే యేసు మీద లేదా అవతలిప్రక్క వారు హైందవులైతే వారు దైవాలని భావించే వాటిని/వారిని చులకన చేసి మాట్లాడటం, హేళన చెయ్యటం వంటివి చేస్తున్నారు. చివరకు రాజకీయ పరమైన విమర్సా ప్రతిమర్శల నేపథ్యంలో మతాలు, వారి వారి ఇష్టదైవాల దూషణలు జరుగుతున్నాయి. ఇది ఎంతో దురదృష్టకరం. ఇది ఖురాన్ వెలుగులో దేవుని ఆజ్ఞ మీరటం మరియు ఘోరమైన పాపంగా పరిగణించబడుతుంది. ఆవేశంలో ముస్లిములు చేసే ప్రతివిమర్శలను అదనుగా తీసుకుని వారు తిరిగి ఇస్లాంను దూషించటం ఇలా ఈ విమర్శ, ప్రతివిమర్శల పరంపర సమాజంలో అశాంతిని రేకెత్తించి, మత ఘర్షణలు రేకెత్తించే వరకు తీసుకెళుతుంది.
అసలు ఇస్లాం పై కావాలని విమర్శలు లేక దూషణలు చేసి ముస్లిములను రెచ్చగొట్టటంలో కొందరి అసలు ఉద్దేశం ముస్లిములు ఉద్రేకానికి గురై తిరిగి తమ మత వర్గాలపై విమర్శ చేస్తారనే! అసలు ముందుగా వారు ఇస్లాం పై చేసిన విమర్శలు మటుకు వెలుగులోకి రావు, కానీ దానికి ప్రతిగా ఉద్రేకానికి లోనై గురై ముస్లిములు ఇతర వర్గాల మీదనో లేక వారు దైవంగా పూజించే వారిమీదనో చేసే ప్రతి విమర్శలే పైకి కనపడతాయి. వాటిని మటుకు వెలుగులోకి తెచ్చి, ఇస్లాం ఉన్నతిని ప్రజల దృష్టిలో నీరుగార్చటం జరుగుతుంది.
కాబట్టి ఇస్లాం విమర్శకులు ఇస్లాం పై పనికట్టుకుని విమర్శలు చేయటంలో ఉద్దేశం ముస్లిములు ఆవేశంతో ఊగిపోయి తిరిగి తమ మతావర్గాలపై విమర్శలకు దిగేలా చెయ్యటమే! కానీ, దురదృష్టవశాత్తు వారు ఆ విషయంలో విజయం సాధించటంలో ప్రత్యక్షంగా కొందరు ముస్లిములే తోడ్పడుతున్నారనటం అతిశయోక్తికాదు!
అసలే విమర్శించకూడదా? ఒకవేళ చేస్తే ఎటువంటి విమర్శ చెయ్యాలి?
ఇస్లాం కు వ్యతిరేకంగా చేయబడుతున్న విమర్శలకు ప్రతిగా అసలే ప్రతి విమర్శ చెయ్యకూడదా? చెయ్యొచ్చు. ఒకవేళ ప్రతి విమర్శ చేస్తే ఎటువంటి విమర్శ చెయ్యాలి? ఎలా చెయ్యాలి అన్నది గమనించే ముందు తెలుసుకోవలసింది- ప్రతీ విమర్శకూ సమాధానం చెప్పుకోవలసిన బాధ్యాత ఒక ముస్లింపై లేదు అలాగని ప్రతీ విమర్శనూ కొట్టిపారేయటానికి అవకాశమూ లేదు. ఎందుకంటే విమర్శలన్నీ ఒకలాంటివి కావు. ఉదాహరణకు 1. అక్కసు, ఈర్ష్యా-ద్వేషం తో చేయబడే విమర్శ 2. అర్ధరహిత విమర్శ (Meaningless criticism) 3. విచ్చినాత్మక విమర్శ (Destructive criticism) లను ఏ మాత్రం పట్టించుకోవలసిన అవసరం లేదు. కానీ 1. సద్విమర్శ (Positive criticism) 2. సమంజసమైన విమర్శ (Reasonable criticism) 3. నిర్మాణాత్మకమైన విమర్శలను (Constructive criticism) మటుకు నిర్లక్ష్యం చేయకూడదు.
సద్విమర్శ లేక సమంజసమైన విమర్శ కచ్చితంగా చెయ్యాలి!
ఒకవేళ ముస్లిమేతరుల్లో ఎవరైనా మూర్ఖులు ఒకవేళ ఇస్లాంనో, అల్లాహ్ నో, ఖురాన్ నో విమర్శిస్తే తిరిగి వారు దైవాలుగా భావించేవారిని విమర్శించటం వారి గ్రంథాలను చులకన చేసి హేళనగా మాట్లాడటం ప్రవక్త సున్నత్ (సాంప్రదాయం) కాదు! ప్రవక్త ముహమ్మద్ (స) వారిని విమర్శిస్తే వారి మహనీయులను దూషించటం ప్రవక్త సున్నత్ (సాంప్రదాయం) కాదు! కాబట్టి అల్లాహ్ పై లేదా ప్రవక్త ముహమ్మద్ (స) వారి పై లేక ఖురాన్ పై ఎవరైనా ఏదైనా విమర్శ చేస్తే దానికి ఇవ్వాల్సిన వివరణ ఉత్తమ పద్ధతిలో అవతలివారు అవగాహనపరచుకునే విధంగా ఉండాలే తప్ప, వారితో ధీటుగా హుందాతనం కోల్పోయి దిగజారుడు మాటలతో బూతులతో కూడిన విమర్శలు చేస్తే ఒకటి అది అల్లాహ్ ఆజ్ఞను మీరటం అవుతుంది రెండు ఇస్లాం ను పని కట్టుకుని విమర్శించి ముస్లిములను రెచ్చగొడుతున్న వారికి పరోక్షంగా సహాయపడటమే అవుతుంది. ఎందుకంటే వారి లక్ష్యమే ముస్లిములను రెచ్చగొట్టేలా చేసి దిగజారుడు మాటలు మాట్లాడేలా చెయ్యటం కాబట్టి.
అలాగే ఒకనిపై వ్యక్తిగత ధ్వేషం ఉంటే అతనిని ఏదైనా అనటం సమంజసం అవుతుంది కానీ అతని మతం, అతను దైవాలని భావించి ఆరాధించే వాటిని/వారిని చులకన చేసి మాట్లాడటం, దూషించటం ఘోరపాపమౌతుంది. అలాగే ఒకని పట్ల నిరసన తెలియజేసినా అతని విమర్శ పరిధి వరకే ఉండాలి తప్ప అతని మతం, అతని ఇష్ట దైవాలను దూషించే విధానం ఖురాన్ కు వ్యతిరేకం అవుతుంది.
కాబట్టి ఇస్లాంపై చెయ్యబడుతున్న విమర్శలకు ఆవేశంతో ఊగిపోయి వారి పై దూషణలకు దిగేకంటే… మూర్ఖులకు దూరంగా ఉంటూ, ఒకవేళ సమాధానం ఇవాల్సిన పరిస్థితి వస్తే సహనం వహించి ఉత్తమ పద్ధతిలో వివరణ ఇవ్వటాన్నే ఖురాన్ ఈ క్రింది విధంగా నేర్పుతుంది.
“ప్రవక్తా! మృదుత్వం, మన్నింపు వైఖరి అవలంబించు. మంచిని ప్రబోధించు. మూర్ఖులతో వాదానికి దిగకు” – 7:199
పరమత విమర్శలకు ఇస్లాం అనుమతిస్తుందా?
