ఈ ఆర్టికల్ ప్రత్యేకంగా ముస్లిముల్లో కొందరు సోషల్ మీడియాలో ఎమోషనల్ గా ఫీలై పెట్టె ప్రతివిమర్శల నేపథ్యంలో వారి కొరకు రాసింది. ఒక హదీస్ ప్రకారం ఒక ముస్లిం మరొక ముస్లింకు అద్దం లాంటివాడని చెప్పబడింది. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఒకరికొకరు పరస్పరం కొన్ని సలహా, సూచనలు, సహన బోధలు, సంస్కరణలు అనేవి తప్పనిసరిగా చేసుకోవటంలో తప్పు లేదు.
***
“ముస్లిం సమాజాన్ని, ముహమ్మద్(స)ను, ఇస్లాంను, అల్లాహ్ ను వారు ఎన్ని విమర్శలైనా చెయ్యొచ్చు, ఎన్ని బూతులైనా తిట్టొచ్చు కానీ మేము మటుకు చేతులు కట్టుకుని, నోరుమూసుకుని ఎందుకు కూర్చోవాలి?” సోషల్ మీడియాలో కొందరు ఇస్లాం విమర్శకులు పనిగట్టుకుని ముస్లిములను రెచ్చగొట్టే సందర్భాలలో వారి విమర్శకు ప్రతివిమర్శలు చేసే కొందరు ముస్లిం మిత్రుల నుండి తరచూ వినపడే మాట ఇది.
ప్రతివిమర్శ చేయటంలో తప్పులేదు, చెయ్యాలి. కానీ ప్రతివిమర్శ చేస్తే ఎలా చెయ్యాలి? ఏ విధమైన ప్రతి విమర్శ చెయ్యకూడదు? ఒకవేళ చేస్తే అందులో ఒక విశ్వాసి నోటి నుండి వచ్చే మాటతీరు ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అన్నవి గమనించకుండా ముస్లింగా ఉంటూ ఎవరైనా ఇస్లాం విమర్శకులు హేళనతో కూడిన దిగజారుడు విమర్శలు చేస్తే అనవసరమైన ఉద్రేకానికి లోనైపోయి వారికి కౌంటర్ ఇవ్వాలన్న హడావిడిలో ఎలా పడితే అలా మాట్లాడేయటం ద్వారా ఇస్లాం విమర్శకుల నోరు మూయించటం దేవుడెరుగు! ముందుగా ఇస్లాం పట్ల గౌరవభావం ఉన్న ముస్లిమేతరుల దృష్టిలో ఇస్లాం గొప్పతనాన్ని చేతులారా దిగజార్చటమే అవుతుంది. ముందుగా ఈ క్రింది హదీసును జాగ్రత్తగా చదవగలరు.
“ఎవరైతే అల్లాహ్ పట్ల అంతిమ దినం పట్ల విశ్వాసం కలిగి ఉంటారో వారు మాట్లాడితే మర్యాదగా మాట్లాడాలి లేదా మౌనంగా ఉండటం ఉత్తమం”
-ప్రవక్త ముహమ్మద్ (స), సహీహ్ బుఖారీ | 6136
పై హదీసును బట్టి 1. ముస్లిం అనబడే వ్యక్తి ఇతరులతో మాట్లాడితే కచ్చితంగా హుందాతనంతో, మర్యాదపూర్వకంగానే మాట్లాడాలి 2. ఒకవేళ ఇతరులు రెచ్చగొట్టే విధంగా చవకబారు విమర్శలు చేస్తున్నప్పటికీ వాడి నోరు మూయించాలన్న హడావిడిలో పడిపోయి, అనాలోచితంగా అసభ్య పదజాలంతో కూడిన దిగజారుడు మాటలు మాట్లాడటం కంటే మౌనంగా ఉండటం చాలా ఉత్తమం అని తేటతెల్లమవుతుంది. ఇక్కడ ప్రతీ ముస్లిం గమనించాల్సిన అతి ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి.
A.ఏ ముస్లిమైనా తనకు తానుగా సమాజంలో అందరి లాంటి ఒక వ్యక్తిగానే భావించుకోవచ్చు కానీ ముస్లిమేతరులు మటుకు ముస్లిం అనబడేవానిని ఇస్లాంను రిప్రసెంట్ చేసే వ్యక్తిగా అంటే ఇస్లాంకు ప్రతినిధిగా చూస్తుంటారు. ఇస్లాంను గురించి తెలుసుకోవాలంటే వారు ఖురాన్, హదీసులను చదవటానికంటే ముందు ప్రాథమికంగా ముస్లిం సమాజాన్నే గమనిస్తారు.
B.కాబట్టి ముస్లిం అనబడే ఎవరైనా నలుగురిలో ఉన్నప్పుడైనా, సోషల్ మీడియాలో ఉన్నప్పుడైనా ఇస్లాం నేర్పుతున్న ఉత్తమ ప్రవర్తనను, మర్యాదతో కూడిన మాట తీరును ప్రదర్శించగలగాలి!
పని కట్టుకుని ముస్లిములపై, ఇస్లాంపై కొందరు విమర్శలు ఎందుకు చేస్తున్నారు?
ఒక ఉన్నత వ్యక్తిత్వం కల మనిషిని నష్టపరచాలంటే దానికి రెండే మార్గాలు ఉన్నాయి. 1. ఆ వ్యక్తిపై భౌతిక దాడికి దిగి నష్టపరచాలి (లేదా) 2. అతనిని రెచ్చగొట్టి అతని నోటి వెంట దిగజారుడు మాటలు మాట్లాడేలా చేసి ప్రజల దృష్టిలో అతని వ్యక్తిత్వాన్ని దిగజార్చాలి. నేటి అధికశాతం ఇస్లాం విమర్శకులు అవలంబిస్తున్నది మటుకు రెండవ పద్ధతినే!
ఇస్లాం గొప్పతనాన్ని నీరుగార్చటానికి కొందరు ఇస్లాం విమర్శకులు ఏమీ చెయ్యలేక ఒకటి మటుకు చెయ్యగలుగుతారు అదేమిటంటే- పని కట్టుకుని ముస్లిం సమాజంపై, ఇస్లాంపై దిగజారుడు విమర్శలు చేసి, ముస్లిముల్లో కృత్తిమ ఉద్రేకాన్ని, ఆవేశాన్ని రెచ్చగొట్టి వారి నోటి నుండే తిరిగి దిగజారుడు మాటలు, బూతులతో కూడిన ప్రతివిమర్శలు చేయించటం అన్న మాట! పైగా అలా పనికట్టుకుని ముస్లిములతో దిగజారుడు విమర్శలు చేయించి ప్రజల ముందు “చూశారుగా ముస్లిములు అంటే వారేదో పెద్ద శాంతి కాముకులు, ఇస్లాం అంటే ఏదో పెద్ద శాంతి, సంస్కారాలు నేర్పే ధర్మం అని ప్రచారాలు చేసుకుంటుంటారుగా చూడండి వారి చవకబారు మాటలు, వారి బూతులు, వారి స్టేట్మెంట్లు ఎలా ఉన్నాయో! మన హిందూ దేవుళ్లను, మన హిందూ మతాన్ని ఎలా విమర్శిస్తున్నాడో చూడండి ఇదేనా వారికి ఇస్లాం నేర్పే విధానం” అని చెబుతూ సామాన్యుల దృష్టిలో ఇస్లాం గొప్పతనాన్ని దిగజార్చటానికి ప్రత్యక్షంగా ముస్లిములనే పావులుగా వాడుకోవటం జరుగుతుంది, అది ప్రస్తుతం జరుగుతుంది కూడా! ఇంతకంటే ప్రమాదకరమైన విషయం ఏమిటంటే- ముస్లిములు దేశద్రోహులు, వారు హిందూ వ్యతిరేకులు అంటూ ఏదైతే నేడు కొందరు హిందుత్వ మతోన్మాదులు అసత్య ప్రచారాలు చేస్తున్నారో అది సామాన్య హిందువులు నిజమే అని భావించటానికి ముస్లిములు ఉద్రేకంలో చేసే ప్రతివిమర్శలే మరింత బలాన్ని అందిస్తాయి ఇంకా హిందూ మతోన్మాద పార్టీలను అసహ్యించుకునే న్యూట్రల్ హిందువులు కూడా కనీసం మన హిందుత్వం కాపాడబడాలంటే ఎంతోకొంత హిందుత్వ పార్టీలకే అంటిపెట్టుకుని ఉండటం లేక సపోర్ట్ చెయ్యాటమే మంచిదని భావించటానికి ముస్లిములే పరోక్ష కారకులుగా మారతారు.
ముందుగా మతోన్మాదులు పనికట్టుకుని ఇస్లాం పై చేసే విమర్శలు మటుకు వెలుగులోకి రావు, కానీ దానికి ప్రతిగా ఉద్రేకానికి లోనై గురై ముస్లిములు ఇతర వర్గాల మీదనో లేక వారు దైవంగా పూజించే వారిమీదనో చేసే ప్రతి విమర్శలను మటుకు వెలుగులోకి తెచ్చి ఇస్లాం గొప్పతనాన్ని నీరుగార్చే కుట్రలు పన్నుతుంటారు. ప్రస్తుతం అదే జరుగుతుంది కూడా.
కాబట్టి ఒకవేళ కొందరు ఇస్లాం విమర్శకులు పనికట్టుకుని ఇస్లాం ఉన్నతిని నీరుగార్చటానికి వారు ముస్లిం సమాజాన్నో, ఖురాన్ నో, ముహమ్మద్ (స) వారినో విమర్శిస్తే గనుక ‘వారన్నేసి మాటలంటుంటే నేను మటుకు నోరు మూసుకుని ఎందుకు కూర్చోవాలి?’ అన్న ఎమోషన్ కి లోనైపోయి వారి మతాలను, వారు దైవాలుగా భావించేవాటిని హేళనతో కూడిన పదజాలంతో, బూతులతో కూడిన ప్రతి విమర్శలు ముఖ్యంగా ఫెస్బుక్ లాంటి సోషల్ మీడియాలో చెయ్యటం వలన కలిగే నష్టాలు:
1. ఒక రకంగా పనికట్టుకుని ముస్లిములను రెచ్చగొట్టాలన్న ఉద్దేశంతో ఇస్లాం విమర్శకులు ప్రయత్నిస్తున్నప్పుడు అనవసరంగా రెచ్చిపోవటం, సహనం కోల్పోయి ఉద్రేకానికి లోనవటం ద్వారా అవతలి వ్యక్తుల లక్ష్యం పూర్తవటానికి పరోక్షంగా సహాయ పడటమే అవుతుంది.
2. ఫెస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో ఇస్లాం విమర్శకులు చేసే దిగజారుడు విమర్శలకు ముస్లింలు కూడా అదే రీతిలో ప్రతి విమర్శ చేస్తే అది ఆ వ్యక్తి వరకే ఆగిపోదుకదా? వాటిని ఎంతోమంది సామాన్య హిందూ, క్రైస్తవులు కూడా చదువుతారు. అది ఇస్లాం పట్ల వారికున్న గౌరవ భావం తగ్గుతుంది. పనిగట్టుకుని అలాంటివారిని ఇస్లాంకు దూరం చెయ్యటమే అవుతుంది. వివరంగా చెప్పాలంటే ఇస్లాం పట్ల విమర్శించేవారు ఎక్కడో నూటికి ఒక్కడు ఉండొచ్చు కానీ మిగతా 99 శాతం న్యూట్రల్ హైందూ, క్రైస్తవ ప్రజలు ముస్లిములతో కలిసి మెలసి ఒకే సమాజంలో జీవనం సాగిస్తూ ఉంటారు. ఆ ఒక్కడి విమర్శకు ప్రతివిమర్శ చెయ్యటం వల్ల మిగతా 99 శాతం న్యూట్రల్ హైందూ, క్రైస్తవ ప్రజానీకం పై ప్రభావం చూపుతుంది. ఇది ఎంతో ప్రమాదకరం కూడా.
మరి ముస్లిమేతరులతో వాదించే పద్ధతి ఏమిటి?
“నీ ప్రభువు మార్గం వైపునకు ఆహ్వానించు, వివేకంతో, చక్కని హితబోధతో, ప్రజలతో ఉత్తమోత్తమ రీతిలో వాదించు” – ఖుర్ఆన్ 16:125
పై వాక్యాన్ని బట్టి ధార్మిక సంబంధమైన ఏ విషయాన్ని గురించైనా ముస్లిమేతరులతో 1. వివేకంతో 2. చక్కని హితబోధతో 3. ఉత్తమోత్తమ రీతిలో వాదించాలి. అది చేతకానప్పుడు మౌనంగా ఉండటం చాలా ఉత్తమం.
మరి, ఈ నేపథ్యంలో ముస్లిములు చెయ్యల్సిందేమిటి?
“మనం హుందాగా వ్యవహరించటమే మన వ్యక్తిత్వాన్ని దిగజార్చాలని చూస్తున్న వారికి శిక్ష” అలాగే “మనల్ని రెచ్చగొట్టేలా ఎదుటివారు మాట్లాడుతున్నారంటే మనం సహనం వహించటానికి, హుందాగా వ్యవహరించటానికి వారో చక్కటి అవకాశం ఇస్తున్నట్లే లెక్క!
ముస్లిములకు ఆదర్శం– ప్రవక్త ముహమ్మద్(స) అన్నప్పుడు ఇస్లాం అవగాహనా రాహిత్యంతో విమర్శిస్తున్న వారికీ, ముస్లిములమని చెప్పుకునేవారికీ ప్రవృత్తి (Attitude) లో వ్యత్యాసం ఉండాలా? అవసరం లేదా? ఆ వ్యత్యాసం చూపుతూ వ్యవహరించాలా? అవసరం లేదా? అలాకాక, ఎవరో రెచ్చగొట్టే మాటలు మాట్లాడినంత మాత్రనా వారు అన్నేసి విమర్శలు చేస్తుంటే’ మేము మటుకు ఎందుకు నోరు మూసుకుని కూర్చోవాలి అన్న ధోరణిలో వారికి తగ్గకుండా ఛడామడా బూతులు మాట్లాడేయటం, ఏరా అంటే పోరా అనేసి, వారి మహనీయులను, వారు దైవాలని భావించేవాటిని హేళన చేయటం, చులకన చేసి మాట్లాడటం అన్నది ఒక రకంగా మనల్ని రెచ్చగొట్టి దిగజారుడు మాటలు మాట్లాడేలా పథకం పన్నుతున్న వారికి మరింత బలాన్ని చేకూర్చటమే అవుతుంది. ఇంకా చెప్పాలంటే అది ప్రవక్త ముహమ్మద్ (స) సున్నత్ (సాంప్రదాయానికే) పూర్తి వ్యతిరేకం ఎందుకంటే ఆయన తన పూర్తి జీవిత కాలంలో నేటి ముస్లిం సమాజం కంటే ఎంతో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు, దారుణమైన మాటలు పడ్డారు. అయినా ఆయన ఎక్కడా రెచ్చగొట్టే ధోరణిలో ఒక్క వివాదాస్పద ప్రసంగం ఇచ్చిన దాఖలాలు లేవు. ఇతరులు దైవాలుగా భావించేవాటిని హేళనగా ఒక్క మాట మాట్లాడలేదు. విమర్శకుల దిగజారుడు మాటలకు ధీటుగా ఘాటైన ప్రతివిమర్శలు ఎక్కడా చెయ్యలేదు. ఈ విషయంలో ఖురాన్ ఆదేశం ఏమిటంటే:
“విశ్వాసులరా అవిశ్వాసులు మాదిరిగా ప్రవర్తించకండి” – 3:156
వాస్తవం ఇదైనప్పుడు అవతలవ్యక్తి అలా విమర్శించటాన్ని కట్టే కదా నేను ఇలా అన్నది అందులో తప్పేముంది అని తమనుతాము సమర్ధించుకునేవారు పై విషయాలు దృష్టిలో పెట్టుకుని తమ విశ్వాసం విషయంలో ఆత్మావలోకనం చేసుకోవాల్సి ఉంది.
ముస్లిములు దురదృష్టవంతులుగా ఉండాలా? అదృష్టవంతులుగా ఉండాలా?
“నీవు చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు. అప్పుడు నీపట్ల శత్రు భావం కలవాడు నీకు ప్రాణ స్నేహితుడైపోవటాన్ని నీవు గమనిస్తావు. ఈ సుగుణయోగం సహాన శీలురకు తప్ప మరెవరికీ లభ్యం కాదు. ఈ సుగుణ యోగం సహాన శీలురకు తప్ప మరెవరికీ లభ్యం కాదు. ఈ స్థానం మహా అదృష్టవంతులకు తప్ప మరెవరికీ లభ్యం కాదు” – 41:34, 35
ఖురాన్ లో స్వయంగా సృష్టికర్త అయిన దేవుడే “చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు” అని చెబుతున్నాడు తప్ప “చెడును చెడుతో” తొలగించమనటం లేదు. దానివల్ల జరిగే లాభం- “నీపట్ల శత్రు భావం కలవాడు నీకు ప్రాణ స్నేహితుడైపోతాడు” ఒకవేళ అలాకాక అవతల వ్యక్తి మన పట్ల చెడుగా వ్యవహరిస్తున్నాడు, చెడుగా విమర్శిస్తున్నాడు కాబట్టి సహనం కోల్పోయి అవతల వ్యక్తితో పాటు సమానంగా దిగజారుడు విమర్శలు చేస్తూ కూర్చుంటే దాని వల్ల జరిగే నష్టం- నీపట్ల శత్రు భావం కలవాడు మరింత శతృవైపోతాడనే కదా!
కాబట్టి అవతల వ్యక్తి ఎంత రెచ్చగొట్టే విధంగా విమర్శలు చేసినా హుందాతనం, సహనం కోల్పోకుండా మాట్లాడగలగటం కూడా అందరు ముస్లిములకు సాధ్యం కాదు. “ఈ సుగుణయోగం సహాన శీలురకు తప్ప మరెవరికీ లభ్యం కాదు” అన్న దాన్ని బట్టి అది సహాన శీలురైనా ముస్లిములకే అది సాధ్యపడుతుందని తెలుస్తుంది. పైగా అలాంటి వ్యక్తిత్వం- “మహా అదృష్టవంతులకు తప్ప మరెవరికీ లభ్యం కాదు” అని స్వయంగా సృష్టికర్త అయిన దేవుడే చెప్పటాన్ని బట్టి సహనం కలిగి అదృష్టవంతులుగా ఉండాలా? సహనం కోల్పోయి దురదృష్టవంతులుగా ఉండాలా అన్నది ఎవరికి వారే ఆలోచించుకోవాలి.
వారన్నేసి మాటలంటుంటే నోరు మూసుకుని కూర్చోవాలా?
