ఏదైనా ఒక సమస్యకు దాని “మూలకారణం (Main reason)” దాని “పరిణామం (Result)” అనేవి వేర్వేరుగా ఉంటాయి. సమస్యను పూర్తిగా తొలగించాలనుకున్నప్పుడు దాని మూలకారణం ఏమిటో వదిలేసి ఆ సమస్య తాలూకు పరిణామాల గురించి ఏకరువు పెడుతూ కూర్చునే బదులు దాని మూల కారణం ఏమిటో పట్టగలిగితే సరైన పరిష్కారం దొరుకుంటుంది. ఈనాడు ముస్లిం సమాజం జాతీయత/పౌరసత్వం ప్రశ్నార్థకం కావటం అన్న అతి పెద్ద సమస్యకు గల అసలు మూల కారణాన్ని తెలుసుకుని దానికి సరైన పరిష్కారం కనుగొనే బదులు దాని పరిణామాల పట్ల ఎంత ఏకరువు పెట్టినా లాభం ఏమిటి? కాబట్టి ప్రస్తుత ముస్లిం సమాజంపై వచ్చిపడిన సామూహిక సమస్యకు ప్రతీ ముస్లిం భౌతిక పరమైన ప్రయత్నం చేస్తే సరిపోతుందా? అంతకు మించి చెయ్యాల్సిన మరేదైనా ప్రయత్నం ఉందా? అన్నది భౌతిక కోణంలోనే కాక, ధార్మిక కోణంలో సైతం ప్రస్తుత ముస్లిం సమాజానికి వివరించటమే ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం.
***
ఏదైనా సమస్యకు సరైన పరిష్కారం కనుగొనటం ఆ సమస్యకు గల అసలు మూల కారణం ఏమిటో పట్టగలిగినప్పుడు మాత్రమే సాధ్యం అన్నది నిర్వివాదాం. వైద్యానికి ముందు రోగ నిర్ధారణ అన్నది సరిగ్గా జరిగినప్పుడే దానికి సరైన శాస్త్ర చికిత్స చేసి ఆ రోగాన్ని తొలగించటం అన్నది సాధ్యమవుతుంది. ఒకవేళ రోగ నిర్ధారణ చెయ్యటంలోనే లోపం జరిగి దానికి తగ్గ శాస్త్ర చికిత్స అందించటానికి బదులు ఏవో కొన్ని పై పై లేపానాలు పూస్తూ అదే సరైన చికిత్స అన్న భ్రమలో ఉంటూ కాలం వెళ్లదీస్తూ కూర్చుంటే ఆ రోగానికి బదులు ముందు రోగే పోయే ప్రమాదం లేకపోలేదు.
ప్రతి మనిషికీ వ్యక్తిగత జీవనం, సామూహిక జీవనం అన్నవి రెండు ఉన్నట్లుగానే వ్యక్తిగత సమస్యలు, సామూహిక సమస్యలనేవీ కూడా వచ్చి పడుతుంటాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే- వ్యాపార, ఆర్ధిక, ఆరోగ్యపరమైన నష్టాలన్నీ కూడా వ్యక్తిగత సమస్యల కోవలోకి వస్తే… ఒక్కసారిగా ఏదైనా జాతి మొత్తంపై అంతుచిక్కని రోగాలు, ప్రకృతి విపత్తులు రావటం, లేదా ఒక వర్గం మరొక వర్గ ప్రజల ద్వారా పీడనకు, అణచివేతకు గురవ్వటం వగైరా అన్నవి సామూహిక సమస్యల కోవలోకి వస్తాయి.
ఏదైనా ఒక సమాజంపై సమస్యలు ఎందుకు వస్తుంటాయి?
వ్యక్తిగతంగా ప్రతీ మనిషి జీవితంలో ఏవో కొన్ని సమస్యలు ఉంటాయి. కానీ ఒక జాతి మొత్తం ఒక్కసారిగా ఏదైనా విపత్తులో చిక్కుకుపోవటమో, మరొక వర్గం ద్వారా చంపబడటమో, పీడనకు, అణచివేతకు గురికాబడటమో జరుగుతుందంటే ధార్మిక కోణంలో పరిశీలించినప్పుడు అది కచ్చితంగా దేవుని తరఫున శిక్ష మాత్రమే అయి ఉంటుంది. ఇది కాస్త దేవుడు, ధర్మం అంటే వెగటు కలిగి ఉండేవారికి పెద్దగా నచ్చని అంశమైనప్పటికీ ఒక జాతి మొత్తం సమస్యల్లో ఎందుకు చిక్కుకుపోతుందో సృష్టికర్త అయిన దేవుడే ఖురాన్ గ్రంథంలో ఈ క్రింది విధంగా తెలియజేస్తున్నాడు.
“వారి అవిధేయతల కారణంగా వారిని కఠిన శిక్షకు గురి చేశాము” – 7:165
ఏదైనా ఒక వర్గంపై సామూహిక శిక్ష ఎందుకు వచ్చిపడుతుంది అన్నదానికి సమాధానమే పై వాక్యం. “వారి అవిధేయతల కారణంగా” అన్న వాక్యభాగాన్ని జాగ్రత్తగా చదివితే ఒక పూర్తి వర్గం ఒకేసారి సామూహికంగా ఎందుకు సమస్యల్లో పడిపోతుందంటే అది పదే పదే చేస్తూ వచ్చే “అవిధేయతలు” అంటే నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని గాలికి వదిలేసి, చెయ్యవద్దన పనులు చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించటం. ప్రస్తుత ముస్లిం సమాజంలో అధిక శాతం మంది ఈ స్థితికి చాలా దగ్గరగా, దాని పర్యావసానంగా వచ్చిపడనున్న కఠిన శిక్షకు అతి చేరువలో ఉన్నారనటం అతిశయోక్తి కాదు! అదే ప్రస్తుతం వారి జాతీయత/పౌరసత్వం ప్రశ్నార్థకంగా మారటం అన్నది. ఈ సమస్యకు’ ఇప్పటికైనా మూల కారణం ఏమిటో కనిపెట్టి, చెయ్యాల్సిన భౌతిక, నైతిక ప్రయత్నాలను మొదలెట్టకపోతే సమస్య మరింత జఠిలం అయిపోతే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా లాభం లేని చందంగా తయారవు తుందనటంలో సందేహం లేదు. రోగం తాలూకు లక్షణాలు (Symptoms) కనపడినప్పుడే తక్షణం ట్రీట్మెంట్ మొదలెట్టాలి. నిర్లక్ష్యం వహిస్తూ కూర్చుంటే రోగం ముదిరి ఒక స్టేజ్ దాటిపోయిన తరువాత పరిణామాలు సరిదిద్దటానికి సైతం వీలులేనంత ప్రమాదకరంగా మారే ప్రమాదం లేకపోలేదు.
ముస్లిం సమాజ జాతీయత ప్రశ్నార్థకం కావటం పరీక్షా? శిక్షా?
ఏదైనా తీవ్రమైన సమస్య వచ్చిపడితే ముస్లిం సమాజంలో చాలా మంది అసలు ఇది దేవుని తరఫున పరీక్షా? లేక ఆయన తరఫున వచ్చిపడిన శిక్షా? అన్నది కనిపెట్టలేక సందిగ్దం పడిపోతుంటారు. అది తెలుసుకోవటానికి ఓ చక్కటి కొలమానం ఉంది. ఏ ముస్లిమైనా అటు దేవుని హక్కులు నెరవేరుస్తూ, ఇటు తోటిమానవుల హక్కులను నెరవేరుస్తూ, వ్యక్తిగత సంస్కరణతో పాటు దైవం అతని పై విధించిన అతి పెద్ద బాధ్యత అయిన సామాజిక సంస్కరణను సైతం నెరవేర్చుతున్నప్పటికీ అతని పై ఏదైనా ఒక సమస్య వచ్చిపడితే అది దైవం తరఫున “పరీక్ష”గా పరిగణించబడుతుంది. ఒకవేళ పైకి ఎంత అబ్దుల్లా/అబ్దుర్రహ్మాన్ వగైరా భారీ ఉర్దూ/అరబిక్ పేర్లు పెట్టుకున్నప్పటికీ పై బాధ్యతల నిర్వర్తన పట్ల నిర్లక్ష్యం వహిస్తే అప్పుడు వచ్చి పడే సమస్యలు, కష్టాలన్నీ దైవం తరఫున “శిక్ష”లే అవుతాయి.
ఈ ఒక్క కొలమానాన్ని దృష్టిలో పెట్టుకుంటే ప్రస్తుత సార్వత్రిక ముస్లిం సమాజంలో ఎంత శాతం ముస్లిములు దేవుని హక్కులు (హుఖూఖల్లాహ్), మానవుల హక్కులు (హుఖూఖుల్ ఇబాద్) సక్రమంగా నిర్వహిస్తున్నారు? ఎంత శాతం మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఈ బాధ్యతలను నిర్వర్తించేవారి శాతం ఎక్కువ ఉందా? నిర్లక్ష్యం వహించేవారి శాతం ఎక్కువగా ఉందా? అన్నది బేరీజు వేసుకుంటే ప్రస్తుత ముస్లిం సమాజం జాతీయత ప్రశ్నార్థకంగా మారిపోవటం అన్నది పరీక్ష? లేక శిక్షా? అన్న దానికి సమాధానం మీకే దొరుకుతుంది. నేడు ముస్లిం సమాజం ఎదుర్కుంటున్న జాతీయత ప్రశ్నార్థకంగా మారిపోవటం అన్న అతిపెద్ద ఆపదకు కారణం దేవుడు విధించిన బాధ్యతను నిర్వర్తించటంలో నిర్లక్ష్యం వహించటమే. ఇదే విషయాన్ని ముస్లిం సమాజానికి ఖురాన్ ఈ క్రింది విధంగా హెచ్చరిస్తుంది.
“మీపై ఏ ఆపదలు వచ్చినా అవి మీ చేజేతులారా చేసుకున్న చేష్టల స్వయం కృతాపరాథమే” – 42:30
ఈ నేపథ్యంలో ముస్లిం సమాజం తక్షణం గమనించాల్సిన విషయాలు:
1. భారతరాజ్యాంగ దృష్టిలో అధికులైనా, అల్ప సంఖ్యాకులైనా, దళితులైనా, ఆదివాసీలైనా అందరూ సమానమే. కులాలకు, మతాలకు, వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరికీ సమన్యాయం, సమాన అవకాశాలు, సమాన స్థాయి పొందటానికి అర్హులు. దీనిని రాజ్యాంగ నిపుణులు “రాజ్యాంగ ఆత్మగా” అభివర్ణించారు. రాజ్యాంగ ప్రవేశికను గమనించినా అది “భారత ప్రజలమైన మేము” అనే ప్రకటనతో ప్రారంభమై… “మాకు మేము ఇచ్చుకుంటున్నాం” అన్న ప్రకటనతో ముగుస్తుంది. ఈ రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షిస్తూ ప్రతీ ముస్లిం రాజ్యాంగ బద్ధమైన పోరాటం చెయ్యాలి. ఇది ప్రతీ ముస్లిం చెయ్యాల్సిన భౌతిక పరమైన ప్రయత్నంలో మొదటి అంశం.
2. ముస్లిం అన్నది ముస్లిముల ఇళ్లలో పుట్టి, ఏదో ఒక ఉర్దూ/అరబిక్ పేరు తగిలించుకోవటం కారణంగా బై ఛాన్స్ వచ్చిన స్థానమా? ముస్లిం సమాజం అన్నది కేవలం అనేక ఇతర సమాజాల వంటి ఒక సమాజమా? లేక దేవుని తరఫున ఒక బృహత్తర బాధ్యతా నిర్వహణకు నియమించబడిన వర్గం ముస్లిం సమాజమా? అన్న విషయాన్ని ముందు అవగాహనపరచుకోవాలి.
3. “ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికీ, వారి సంస్కరణకూ రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే (ముస్లిములే). మీరు మంచి చేయండి అని ఆజ్ఞాపిస్తారు. చెడు నుండి ఆపుతారు. ఆల్లాహ్ ను విశ్వసిస్తారు” – 3:110. ఈ ఖురాన్ వాక్యాన్ని బట్టి ముస్లిం సమాజం అంటే అదేదో ఇతర సామాజిక వర్గాల వంటి సామాన్య వర్గం కాదు. అది “మంచిని పెంచే, చెడును నిరోధించటానికి” స్వయంగా దేవుని చే నియమించబడిన ఒక గొప్ప వర్గం. ఈ విషయాన్ని ప్రతీ ముస్లిం బాగా అర్థం చేసుకోవాలి.
4. ముస్లిం సమాజంలో ప్రతీ ఒక్కరూ భౌతిక జీవనంలో ఉధ్యోగాలు, చదువులు, వ్యాపారాలు చేస్తూనే తమ సమయాన్ని తమ పరిసరాల్లో నివసించే, తమ పొరుగున ఉండే ముస్లిమేతరులకు ఇస్లాం అంటే “ఏక దేవుని విధేయత ధర్మం” అని, అదేదో క్రొత్త ధర్మం కాదు అది పూర్వం నుండీ దేవుడు ఇస్తూ వస్తున్న ధర్మమే, అదే ధర్మం సకల ధార్మిక గ్రంధాల్లో ఇవ్వబడిందనే విషయం తెలియజేయాలి. ఒకవేళ క్రైస్తవులైతే వారి బైబిల్లో ఇస్లాం పురాతన ధర్మంగా పరిచయం కాబడిందని, దానినే యేసు కూడా బోధించారని, సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే ఆయనే “యాహ్వే”గా బైబిల్లో పరిచయమయ్యాడు ఆయనే అల్లాహ్ గా ఖురాన్లో పరిచయమయ్యాడన్న విషయం తెలియజేసి అసలు ధర్మం వైపునకు వారిని ఆహ్వానించాలి. అదే హిందువులైతే ఒకనాడు వేదోపనిషత్తుల్లో చెప్పబడిన “ఏక దేవుని విధేయత ధర్మమే ఇస్లాం” తప్ప “ఏకదేవుని విధేయతా ధర్మానికి అతీతమైనది ఇస్లాం కాదు” అన్న విషయాన్ని తెలియజేసి, సమాజంలో “మనందరి ధర్మం ఒక్కటే, మనమంతా ఒక్కటే, మనందరి దేవుడు ఒక్కడే” అన్న నినాదాన్ని సర్వసామాన్యం చెయ్యాలి. ఇది ప్రతీ ముస్లిం ప్రాథమిక బాధ్యత. ఈ పని చేస్తున్నంత కాలం ముస్లిం సమాజం పై వచ్చిపడే తీవ్ర పరిస్థితుల నుండి రక్షణ కవచంగా అల్లాహ్ కారుణ్యం ఉంటుంది.
దైవ సహాయం పొందటానికి అత్యుత్తమ మార్గాన్ని నేటి ముస్లిం సమాజం అన్వేషించాలి.
సార్వత్రిక ముస్లిం సమాజంపై ఏదైనా సామూహిక ఆపద వచ్చిపడితే దాన్నుండి కాపాడగలిగేది ఎవరో రాజకీయ నాయకుడో, మత పెద్దో కాదు ఏ సమస్యనైనా రప్పించటం లేదా తొలగించటం అన్నది స్వయంగా అల్లాహ్ తరఫు నుండే జరుగుతుంది. అయితే ఒక జాతి మొత్తం ఏదైనా తీవ్ర సమస్యలో చిక్కుకుపోయినప్పుడు మసీదుల్లో కూర్చొని ఏవో కొన్ని ప్రార్ధనలు చేసినంత మాత్రానా ఆ ఆపద తొలగిపోదు. దానితో పాటు ఆ ఆపద తొలగిపోవటం మొత్తం జాతి తన లక్షణాలను మార్చుకోవటం, మార్చుకోకపోవటం అన్న భౌతిక ప్రయత్నం పైనే ఆధారపడి ఉంటుంది. ఇదే ఖురాన్ ఈ క్రింది విధంగా తెలుపుతుంది.
“యదార్థం ఏమిటంటే, ఒక జాతి స్వయంగా తన లక్షణాలను మార్చుకోనంతవరకు అల్లాహ్ దాని స్థితిని మార్చడు. అల్లాహ్ ఒక జాతిని తన శిక్షకు గురిచేసే నిర్ణయం తీసుకున్నప్పుడు దానిని ఎవరు తొలగించదలచుకున్నా అది తొలగదు” – 13:11
పై వాక్యాన్ని బట్టి ఒక పతనావస్థకు చేరుకున్న జాతి ఉన్నత స్థితికి రావాలన్నా ఆజాతిపై వచ్చిపడే శిక్షలు లేదా తీవ్రమైన సమస్యలు తొలగాలి అన్నా ఆ జాతి ప్రజలంతా సార్వత్రికంగా చెయ్యాల్సిన పని ఒక్కటే- కొన్ని పనికి మాలిన సిద్ధాంతాలు, ఛాందసవాదాలు, చాదస్తపు విలువల్ని ప్రక్కనపెట్టి ఎంతో నిజాయితీగా ఖురాన్-హదీసుల వెలుగులో ఆ జాతి స్వయంగా తన లక్షణాలను మార్చుకోవటం కోసం ప్రయత్నం చెయ్యాలి.
లక్షణాలు మార్చుకోవటం అంటే ఏమిటి?
ఒక జాతి మొత్తం తన లక్షణాలు మార్చుకోవటం అంటే ఆ జాతిలో ఉన్న ప్రతీ ఒక్కరూ 1. వ్యక్తిగత సంస్కరణ 2. సామాజిక సంస్కరణ అనే రెండు ప్రధాన బాధ్యతలను నిర్వర్తించటం.
వ్యక్తిగత సంస్కరణ అంటే:
A. విశ్వాసులు తమ ఆరాధనల పట్ల నిర్లక్ష్యం వహించకపోవటం B. తమ విశ్వాసాలను గ్రంథం ప్రకారం సంస్కరించుకుని, చెడు అలవాట్లను మానుకోవటం C. తలిదండ్రుల, పొరుగువారి హక్కులు చెల్లించటం. ఇవి సమాజంలో ప్రతీ ఒక్కరూ ఎవరికి వారే వ్యక్తిగతంగా సంస్కరించుకోవలసిన అంశాలు. ఈ విషయంలో ఖురాన్ హెచ్చరిక – “తన ఆత్మను పరిశుద్ధ పరచుకున్న వ్యక్తి సఫలుడయ్యాడు, దానిని అణచి వేసినవాడు విఫలుడయ్యాడు” – 91:10
2. సామాజిక సంస్కరణ అంటే:
A. విశ్వాసుల మధ్య ఐక్యత కొరకు పాటు పడటం B. మంచిని ఆజ్ఞాపించటం, చెడును నిరోధించటం మరియు ధర్మాన్ని ప్రజలలో సర్వసామాన్యం చెయ్యటం.
ఒక జాతి తన లక్షణాలను మార్చుకోవటం అన్నది పైన పేర్కొనబడిన అంశాలన్నిటి పై ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుత ముస్లిం సమాజం పై బాధ్యతలన్నిటినీ సంపూర్ణంగా నిర్వర్తిస్తుందా? అన్నదే అసలు ప్రశ్న. దీనికి సమాధానం కొందరు తప్ప సార్వత్రిక ముస్లిం సమాజంలో అధిక శాతం మంది వ్యక్తిగత, సామాజిక సంస్కరణ అన్న రెండు బాధ్యతల నుండి ఎప్పుడో దూరమై పోయారన్నది నిర్వివాదం. ఒక రకంగా దైవం తరఫున శిక్ష పొందటానికి పూర్తి అర్హత సాధించే స్థితికి చేరుకున్నట్లే!
కాబట్టి ముస్లిం సమాజంపై వచ్చిపడే ఉపద్రవం నుండి కాపాడుకునే బాధ్యత స్వయంగా ముస్లిం సమాజంపైనే ఉంది. అది వ్యక్తిగత సంస్కరణ నుండి మొదలై సామాజిక సంస్కరణ వైపుకు నడుం బిగించటమే! దీని కోసం ఓ ప్రక్క రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తూ వాటిని గౌరవిస్తూ, మరో ప్రక్క ఖురాన్ ముస్లిం సమాజంపై మోపిన మంచిని పెంచే, చెడును తొలగించే బాధ్యతను నిర్వర్తించాలి. మొత్తంగా దేవుని హక్కులతో పాటు మానవుల హక్కులను సక్రమంగా నిర్వర్తించాలి. ఇది ప్రస్తుత నేపథ్యంలో ప్రతీ ముస్లిం నిర్వర్తించాల్సిన తక్షణ కర్తవ్యం.
ఇదంతా చదివి “ఆ ఇప్పుడు నేను ఒక్కణ్ణి మారిపోయినంత మాత్రానా మొత్తం సమాజం బాగుపడిపోతుందా? నేను చెప్పినంత మాత్రానా సమాజం మారిపోతుందా?” అనుకుంటూ ఎవరికి వారే నిర్లక్ష్య ధోరణిలో కాలం వెళ్లదీస్తూ కూర్చుంటే దేవుని తరఫున ఉపద్రవం వచ్చిపడ్డాక చేసేది ఏమీ ఉండదు. మిగతా వారితో పాటు ఆ ఉపద్రవంలో కొట్టుకుపోవటమే మిగిలి ఉంటుంది. ఇదే విషయం ఖురాన్ క్రింది విధంగా హెచ్చరింస్తుంది.
“ఆ ఉపద్రవం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. దాని వల్ల కలిగే హాని ప్రత్యేకంగా మీలో పాపం చేసిన వారికే పరిమితమై ఉండదు” – 8:25
ముస్లిం సమాజ తక్షణ కర్తవ్యం
