అత్యంత అపార్థానికి గురికాబడ్డ పదం కాఫిర్! ముస్లిమేతరులంతా కాఫీర్లుగా పరిగణించబడతారు అన్న అపార్థం అటు ముస్లిమేతరుల్లోనే కాక, ఇటు చాలా మంది ముస్లిముల్లోనూ నాటుకుపోయి ఉంది. వివాదాస్పదమైన ఈ అంశంలోనికి వెళ్లే ముందు అసలు ముస్లిములు, ముస్లిమేతరులు అంటే ఎవరు అన్నది సంక్షిప్తంగా గమనిస్తే- ప్రభుత్వ/సామాజిక లెక్కల ప్రకారం ముస్లిం ఇళ్ళల్లో పుట్టినోళ్లు, ఉర్దు/అరబిక్ పేర్లు పెట్టుకున్నోళ్లంతా ముస్లిములన్నది. ఖురాన్ చేసే విభజన అయితే దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. “ముస్లిం” అన్న పదానికి- “ఏక దేవుని విధేయత కలిగిన వాడు” అని అర్థం. అంటే ఎవరైతే తమ వద్ద ఉన్న గ్రంథాలు చదివో లేక సృష్టిని పరిశీలించో ఈ సృష్టికి అతీతంగా ఒక దేవుడు ఉన్నాడు అని అవగాహన పరచుకుని, ఆయన పట్ల విధేయత కలిగి ఉంటారో అలాంటివారు ఏ కులానికి, ఏ మతానికి, ఏ వర్గానికి చెందినవారైనా అలాంటి వారంతా ముస్లిములుగానే పరిగణించబడతారు. ముస్లిముల ఇళ్ళల్లో పుట్టినప్పటికీ, ఎంత ఉర్దూ/అరబిక్ పేర్లు పెట్టుకునప్పటికీ దైవ విధేయత ఎవరైతే కలిగి ఉండరో అటువంటి వ్యక్తులు కేవలం నామమాత్ర ముస్లిములు’గానే పరిగణించబడతారు. కాబట్టి “ముస్లిం” అన్నది “కమ్యునిటీ (Community)” తాలూకు పదం కాదు కానీ, అది “దృక్పథం (Concept)” లేక “ప్రవృత్తిని (Attitude)” ను సూచించే పదం మాత్రమే! ఇది ముస్లిం, ముస్లిమేతరురులు అన్న విషయంలో ఖురాన్ చేసే అత్యుత్తమ విభజన! అటువంటప్పుడు టోపీ, గెడ్డాలు పెట్టుకుని, ఉర్దు/అరబిక్ పేర్లు పెట్టుకున్నోల్లు ముస్లిములు, ముస్లిమేతరులంతా కాఫీర్లు అనటం పూర్తి అర్థరహితం అవుతుంది! అలాగే అల్లాహ్ అంటే ముస్లిముల దేవుడని కాదు ఈ అరబిక్ పదానికి అర్థం- “ఆరాధనీయుడు”! హెబ్రూలో “యాహ్వే”గా పిలవబడితే తెలుగులో “సర్వేశ్వరుడు” అన్న మాట!
*************
వ్యక్తులను ఖురాన్ ఎన్ని రకాలుగా విభజిస్తుంది?
సాధారణంగా అటు హిందూ, క్రైస్తవుల్లోనే కాక ఇటు ముస్లిముల్లో చాలా మందికి సైతం ఉన్న అపోహ ఏమిటంటే- ఖురాన్ ను విశ్వసించే వారంతా ముస్లిములు, నమ్మనోల్లంతా కాఫీర్లు అన్నది. ఈ రకమైన విభజన ఖురాన్ కు పూర్తి వ్యతిరేకం! ఎందుకంటే ఖురాన్ వ్యక్తులను మౌలికంగా 4 రకాలుగా విభజిస్తుంది.
1.ముస్లిములు(విశ్వాసులు): అంటే ఖురాన్ సందేశాన్ని విశ్వసించి, పూర్వ ప్రవక్తలతో పాటు చివరిగా పంపబడిన ముహమ్మద్ (స) ను దైవ ప్రవక్తగా నమ్ముతూ ఏక దైవారాధన చేసేవారు.
2.ముష్రిక్కులు (దైవేతర ఆరారాధకులు): అంటే స్వంత నమ్మకాలను బట్టో, వంశ పారంపర్యంగానో, తెలియకో దైవేతర ఆరారాధన చేసేవారు.
3.గాఫిల్ (ఏమరుపాటులో ఉన్నవారు): అంటే దైవసందేశం ఇవ్వబడక/తెలియని కరణంగా దేవుని పట్ల ఏమరుపాటులో ఉన్న సామాన్య వ్యక్తులు.
4.కాఫిర్ (తిరస్కారులు): దైవసందేశం అర్థం చేసుకునీ, దేవుడు ఎవరన్నది అవగాహన చేసుకున్న తరువాత కూడా సత్యాన్ని తిరస్కరించే వ్యక్తులు.
“కాఫిర్” అన్న పదం చాలా విస్తృతంగా ఖురాన్లో వాడబడింది!
అసలు “కాఫిర్” (Denier) అన్న అరబీ పదం ముస్లిమేతర సమాజానికి (Non-Muslim community) ఉద్దేశించబడిన ప్రత్యేక పదం ఎంతమాత్రం కాదు. ఈ పదం చాలా విస్తృతంగా ఖురాన్లో వాడబడింది. “కాఫిర్” అన్న పదానికి ధాతువు క.ఫ.ర అనగా “దాచుట (To cover) దాని నుండే “కుఫ్ర్” అన్న పదం ఏర్పడింది. అనగా “తిరస్కరించుట (Rejection or Denial)”. ఎవరైతే తిరస్కార వైఖరి అవలంబిస్తాడో అతన్ని “కాఫిర్ (One who rejects)” అని అనటం జరుగుతుంది. ఇక “కాఫిర్” అన్న పదానికి శబ్దార్థం- దాయటం లేక కప్పిపుచ్చటం, కృతఘ్నత చూపటం, తిరస్కరించటం వగైరా అర్థాలు ఉన్నాయి.
ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవలసింది “కుఫ్ర్” లేక “కాఫిర్” అన్నవి ప్రతికూల (Negative) పదాలు కావు! వ్యాకరణ నియమాలను (Grammatical rules) బట్టి ఏదైనా ఒక పదం వర్తింపజేసే సందర్భాన్ని బట్టి అనుకూలం (Positive) గా లేక ప్రతికూలం (Negative) గా మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకు కాఫిర్ అన్న పదం ఏ యే సందర్భాల్లో ఎంతమందికి వాడబడిందో ఈ క్రింది ఖురాన్ వాక్యాల్లో గమనిద్దాం.
1. “రైతు” కూడా కాఫీరే!
ఆశ్చర్యంగా ఉంది కదూ! నిజమే “కాఫిర్” అన్న పదానికి ఒక అర్థం- “దాచి పెట్టేవాడు” అని కూడా ఉంది. ఖురాన్లో 57:20 వాక్యాన్ని గమనిస్తే అక్కడ పంట పండించే “రైతు” గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు అరబిక్ మూలంలో “అల్-కుఫ్ఫారు (దాచేవాడు)” అన్న పదం వాడబడింది. ఎందుకంటే రైతు భూమిని దున్ని, అందులో విత్తనాలను దాచుతాడు. కాబట్టి రైతుకు కూడా “కాఫిర్” అన్న పదం వాడటం జరిగింది. అలాగే ఒక వ్యక్తి పాపపరిహారం, పాపక్షమాపణ (3:193, 5:45) పొందటానికి కూడా అరబీ మూలంలో “కాఫ్ఫిరా” లేక “కఫ్ఫారా” అన్న పదాలు వాడబడ్డాయి. ఎందుకంటే ఒకవ్యక్తి క్షమించబడటం అన్నది అతని పాపాలు కప్పిపుచ్చబడటంతో సమానం అవుతుంది కాబట్టి.
2. దేవుని అనుగ్రహాలను దాచేవారంతా కాఫీర్లే!
“సృష్టికర్త అయిన దేవుడు తన అనుగ్రహం నుండి తమకు ప్రసాదించినదానిని దాచిపెట్టేవారిని ప్రేమించడు. అటువంటి సత్య తిరస్కారుల కొరకు మేము అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము” – 4:37
అంటే పై వాక్యంలో దేవుడు తమకు ఇచ్చిన అనుగ్రహాలను లేక సత్యాన్ని లేదా దేవుని బోధనలను దాచి పెట్టేవారు ఎవరైనా వారంతా సత్య తిరస్కారులుగా అనగా కాఫీర్లుగానే పరిగణించబడతారని తెలుస్తుంది. వివరంగా చెప్పాలంటే ఖురాన్ అన్నది ముస్లిం సమాజానికి దేవుని తరఫున ఇవ్వబడిన అత్యంత గొప్ప అనుగ్రహం అయితే తమ నిర్లక్ష్యం కారణంగా దాని సందేశాన్ని ప్రజల వద్దకు చేరవెయ్యకపోతే చివరకు వారు సైతం సత్య తిరస్కారులు అనగా కాఫీర్ల కోవలోకే చేరిపోతారని తెలుస్తుంది.
3. కృతజ్ఞతాభావం లేని వ్యక్తులు కూడా కాఫీర్లే!
“వారు దేవుని ఉపకారాన్ని గుర్తించిన తరువాత దీనిని నిరాకరిస్తున్నారు మరియు వారిలో చాలా మంది సత్య తిరస్కారులే” – 16:83
పై వాక్యాన్ని బట్టి దేవుని ఉపకారాన్ని గుర్తించిన తరువాత కూడా ఎవరైతే దేవుని పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉండరో అటువంటి వారంతా సత్య తిరస్కారులు కాఫీర్లుగానే పరిగణించబడతారు అని అర్థమౌతుంది. చివరకు వారు ముస్లిం ఇళ్లల్లో పుట్టి ఉన్నప్పటికి కూడా!
4. సత్యాన్ని తిరస్కరించే వ్యక్తులు కాఫీర్లు!
ఇలా అను: “ఓ గ్రంథ ప్రజలారా మీరు దేవుని సందేశాలను ఎందుకు తిరస్కరిస్తున్నారు?” – 3:96
స్పష్టంగా దైవ సందేశాన్ని విని అర్థం చేసుకున్న తరువాత కూడా ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో అటువంటి వారంతా పై వాక్యాన్ని బట్టి సత్య తిరస్కారులు అనగా కాఫీర్ల కోవలో చేరిపోతారని తెలుస్తుంది. ఈ విధంగా ఖురాన్ లో వివిధ సందర్భాలలో అనేక మంది విషయంలో “కాఫిర్” అన్న పదం వాడబడినట్లు చూడగలం. తప్ప అది కేవలం ఒక్క ముస్లిమేతర సమాజాన్ని (Non-Muslim community) ఉద్దేశిస్తూ వాడబడినట్లు చూడలేము.
*************
ఏ వ్యక్తి అయినా ముందు కాఫిర్ గా మారితేనే ముస్లిం అవ్వగలడు!
ఇది వినటానికి ఇంకా ఆశ్చర్యంగా ఉంది కదు! అదెలాగో ఈ క్రింది ఖురాన్ వాక్యం చదివితే తెలుస్తుంది.
“కల్పిత దైవాన్ని (తాగూత్) ను “తిరస్కరించి” అల్లాహ్ (సృష్టికర్త అయిన దేవుడు) ను విశ్వసించినవాడు సుస్థిరమైన ఎన్నటికీ విడిపోని ఆధారాన్ని పట్టుకున్నట్లే” – 2:256
పై వాక్యం జాగ్రత్తగా గమనిస్తే- ఒక వ్యక్తి విశ్వాసి లేక ముస్లింగా మారాలి అన్నా కూడా రెండు పనులు చెయ్యాలి.
1. “కల్పిత దైవాన్ని (తాగూత్) ను “తిరస్కరించటం”
2. అల్లాహ్ ను విశ్వసించటం.
అరబీ మూలంలో “కల్పిత దైవాన్ని (తాగూత్) ను “తిరస్కరించి” అన్నది “ఫమై యక్ఫురు బి త్తాగూతీ” అని చూడగలం. ఇందులో కల్పిత దైవాన్ని (తాగూత్) ను తిరస్కరించటాన్ని కూడా “కుఫ్ర్” అని చెప్పబడినట్లు చూడగలం. అంటే ఒక వ్యక్తి మిధ్యా దైవాలను లేక కల్పిత దైవాలను తిరస్కరించటం కూడా “కుఫ్ర్” అవుతుందన్న మాట! మరింత లోతుగా గమనిస్తే- ఒక వ్యక్తి “కల్పిత దైవాల తిరస్కారిగా (కాఫిర్)” గా మారిన తరువాతనే కదా నిజదేవుని విధేయత వైపు మరలటం అన్న ప్రక్రియ ప్రారంభం అవుతుంది! ఈ విధంగా కల్పిత దైవాన్ని తిరస్కరించటాన్ని కూడా ఖురాన్ “కుఫ్ర్” అని చెబుతుంది అంటే మిధ్యా దైవాలా తిరస్కారి కూడా “కాఫిర్” అవుతాడనే కదా అర్థం! అంటే ఒక ముస్లిం జీవితాంతం ముస్లింగా ఉండాలంటే అతను జీవితాంతం “కాఫిర్”గా (కల్పిత దైవాల తిరస్కారిగా) ఉండాలన్నమాట! ఈ విషయం జీర్ణించుకోవటానికి కొద్దిగా కష్టంగా అనిపించినా వాస్తవం అదే! ఈ విధంగా ఇంత సున్నితమైన విషయాల్లో సైతం ఏదేనినైనా తిరస్కరించే సందర్భం ప్రస్తావించబడినపుడు సైతం అక్కడ “కుఫ్ర్” అన్న పదాన్ని వాడటం అతి సాధారణంగా జరిగింది.
దీనిని బట్టి “కుఫ్ర్” లేదా “కాఫిర్” అన్న పదం ప్రతికూల (Negative) పదం ఎంతమాత్రం కాదు ఇంకా ఒక ప్రత్యేక వర్గాన్ని (Community) ని సూచించే పదం కూడా ఎంతమాత్రం కాదు కానీ, ఒక వ్యక్తి “వైఖరి” లేక “ప్రవృత్తి” (Attitude)ని సూచించే పదం మాత్రమే. ఖురాన్ లో ఈ పదం చాలా విస్తృతంగా అనేక సందర్భాల్లో అనేకమంది విషయంలో వాడబడింది అన్నది తెలుసుకున్నాము.
*************
కాఫిర్ అన్న పదం విషయంలో కొందరు ముస్లిముల వాదన!
కొందరు ముస్లిముల్లో సైతం ముస్లిమేతరులంతా కాఫీర్లుగా పరిగణించబడతారన్న అపోహ ఉంది. దానికి వారు చెప్పేది ఏమిటంటే- ఈ సృష్టిని పరిశీలించి దేవుడు ఉన్నాడు అని గ్రహించి, ఆ దేవుణ్ణి తిరస్కరించిన తరువాతనే కదా బహుదైవారాధన చేసేది కాబట్టి ముస్లిమేతరులంతా కాఫీర్లుగానే పరిగణించబడతారు అన్నది.
ఈ వాదన ఖురాన్ వెలుగులో కొట్టి వేయబడుతుంది!
ఖురాన్ ముస్లిమేతరులందరినీ కాఫీర్లుగా జమ కట్టటం లేదన్నది ఇప్పటివరకు ఇప్పటివరకు సాగిన వివరణలో మనం గమనించి ఉన్నాం. ఇంకాస్త లోతుగా వెళ్ళి ఖురాన్ పరిశీలిస్తే ముస్లిమేతరులంతా కాఫీర్లు అన్న వాదన పూర్తిగా వీగిపోతుంది. ఈ క్రింది ఖురాన్ వాక్యంలో స్వయంగా సృష్టికర్త అయిన దేవుడు చెబుతుందేమిటో గమనించగలరు.
“గ్రంథ ప్రజలలో బహుదైవారాధకులలో (ముష్రిక్ లలో) తిరస్కార వైఖరి ఎవరైతే అవలంబించారో (కాఫిర్ లు) తమ వద్దకు స్పష్టమైన ప్రమాణం వచ్చేవరకు (తమ అవిశ్వాస వైఖరి నుండి) మరలరు” – 98:1
పై వాక్యం జాగ్రత్తగా గమనిస్తే ముస్లిమేతరులైన గ్రంథ ప్రజలందరినీ (యూదులు, క్రైస్తవులను) ఖురాన్ “కాఫీర్లు” అనటం లేదు. గమనించండి- “గ్రంథ ప్రజలలో బహుదైవారాధకులలో (ముష్రిక్ లలో) తిరస్కార వైఖరి ఎవరైతే అవలంబించారో (కాఫిర్ లు)”! ఈ వాక్య భాగాన్ని బట్టి ముస్లిమేతరుల్లో బహుదైవారాధన (షిర్క్) చేసేవారంతా (ముష్రిక్కులంతా) కాఫీర్లు కారు! కానీ, ఆ బహుదైవారాధకుల్లో “తిరస్కార (కుఫ్ర్) వైఖరి” అవలంబించేవారు మాత్రమే “తిరస్కారుల (కాఫీర్ల) కోవలోకి వస్తారు అని తెలుస్తుంది. దీనిని బట్టి బహుదైవారాధన చేసేవారంతా సత్యం తెలియకో, గ్రంథాలు చదవకో, కుటుంబ వారసత్వంగానో దైవేతరుల ఆరాధన చేస్తూ ఉండవచ్చు. అంతమాత్రానా వారంతా “కాఫీర్లు”గా పరిగణించబడరు. కానీ, బహుదైవారాధన చేసే వ్యక్తి ముందు శాస్త్రోక్తమైన జ్ఞానం పెట్టబడిన తరువాత, అతను దేవుడు ఎవరో అవగాహన చేసుకున్న తరువాత కూడా బలవంతంగా ఆ సత్యాన్ని తిరస్కరిస్తే అప్పుడు మాత్రమే అతను “సత్య తిరస్కారి (కాఫిర్) కాగలడు. అంతవరకూ అతను కేవలం “ముష్రిక్” గానే ఉంటాడు. మరొక వాక్యం ఈ క్రింది గమనించండి.
“గ్రంథ ప్రజలు (యూదులు, క్రైస్తవులు) విశ్వసించి ఉన్నట్లైతే వారికే మేలు కలిగి ఉండేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు” – 3:110
పై వాక్యంలో స్వయంగా సృష్టికర్త అయిన దేవుడు- ముస్లిమేతరులైన యూదులు, క్రైస్తవులందరినీ కాఫీర్ల కోవలో జమకట్టటం లేదు. వారిలో కొందరు విశ్వాసులు (మోమిన్లు లేదా ముస్లిములు) కూడా ఉన్నారు అని చెప్పటం జరుగుతుంది. ఒకవేళ ముస్లిమేతరులంతా కాఫీర్లు అన్న భావనే స్వయంగా సర్వేశ్వరుడైన దేవునికి ఉండి ఉంటే ముస్లిమేతరుల్లో విశ్వాసులు (మోమిన్లు) కూడా ఉన్నారని చెప్పటం ఎలా సాధ్యపడుతుంది? ఇది ఆలోచించాల్సిన విషయం.
కాఫిర్ అన్న పదానికి తిరస్కరించేవాడు (Denier) అయితే ముస్లిం అన్న పదానికి “సమ్మతించేవాడు (Acceptor)” అని అర్థం వస్తుంది. కాబట్టి కాఫిర్ vs ముస్లిం పదాలను తీసుకుంటే “తిరస్కరించేవాడు vs సమ్మతించేవాడు” అవుతుంది. అటువంటప్పుడు “కుఫ్ర్ (తిరస్కరించటం)” “కాఫిర్ (తిరస్కరించేవాడు)” అన్న పదాలు “ప్రవృత్తి (Attitude)” సూచించే పదాలే అవుతాయి తప్ప ఒక ప్రత్యేక వర్గాన్ని (Community) ని సూచించే పదాలు ఎంతమాత్రం కాజాలవు. ఈ స్పష్టమైన ఖురాన్ వివరణ తెలియని చాలా మంది ముస్లిమేతర సమాజం (Non-Muslim community) అంతా కాఫీర్లనే అపోహకు గురైపోయారు.
ఇప్పటివరకు మనం కాఫిర్ అన్నది మనిషి “ప్రవృత్తి (Attitude)” ను సూచించే పదమే తప్ప అది వర్గాన్ని (Community) సూచించే పదం ఎనమాత్రం కాదని తెలుసుకున్నాం. ఇక “ముస్లిమేతరుల పట్ల ఖురాన్ వైఖరి ఏమిటి?” అన్న ప్రశ్న ఒకటి మిగిలిపోయి ఉంది దానిని మరొక అంశంలో వివరించటం
జరుగుతుంది.
ముస్లిమేతరులంతా కాఫీర్లా?
