ముస్లిం సమాజంపై ఇన్నేసి ఉపద్రవాలు వచ్చి పడుతుంటే దేవుడు చూస్తూ ఎలా ఉరుకుంటున్నాడు? అల్లాహ్ ముస్లిములకు సహాయం చెయ్యడా? ఇది ఓ సోదరుడు నన్ను అడిగిన ప్రశ్న.
***
ముస్లిములు అల్లాహ్ ను వేడుకున్నప్పుడు ఆయన ఎన్నడూ ముస్లిములకు సహాయపడలేదా? అంటే కచ్చితంగా అల్లాహ్ సహాయ సహకారాలు ఎప్పుడూ ముస్లిములకు ఉంటాయి అందులో సందేహం లేదు. అయితే ఇంతకు అల్లాహ్ సహాయం పొందగలిగే అర్హత ఉన్న ముస్లిములు ఎవరు? అన్నదే ఇక్కడ అసలు గమనించాల్సిన అంశం.
అదేంటి అల్లాహ్ సహాయం చేసేది ముస్లిములకే కదా! మరలా అల్లాహ్ సహాయం పొందే ముస్లిములు వేరేగా ఉంటారా? అల్లాహ్ ను వేడుకునే ముస్లిములందరికి అల్లాహ్ సహాయం అందాలి కదా! అని ఎవరైనా భావిస్తే వారు ముద్ద పప్పులో కాలేసినట్టే. షేక్ ఇమామ్, జిలానీ, కరీముల్లా, అబ్దుల్లా వగైరా ఉర్దూ/అరబిక్ పేర్లు పెట్టుకుని శుక్రవారానికోసారి అదికూడా వీలైతేనే తలపై టోపీ పెట్టుకుని అప్పుడప్పుడూ మొక్కుబడిగా మసీదుకు వెళ్లేటోల్లాంతా తమను తాము ముస్లిములుగానే ఫీలవుతూ ఉంటారు. వారు మేము ముస్లిములై ఉండి అల్లాహ్ నే కదా వేడుకునేది అల్లాహ్ మాకు కాకపోతే సహాయం ఎవరికీ చేస్తాడు అన్న అపోహలోనే ఉంటారు.
ముస్లిం సమాజంపై ఏదైనా ఆపదలు, సమస్యలు వచ్చిపడిన సందర్భాల్లో మటుకు విశ్వాసులపై అవిశ్వాసులు దాడి చేసినప్పుడు అల్లాహ్ తన విశ్వాసులను ఆదుకుంటాడు, తన విశ్వాసులను కాపాడుకుంటాడు అని చెప్పబడినటువంటి కొన్ని ఖురాన్ వాక్యాలను ఉటంకిస్తూ కొందరు ఫెస్బుక్, వాట్స్ యాపుల్లో ఎమోషనల్ పోస్టులు పెట్టటం దానికి చాలా మంది అంతే ఎమోషన్ గా ఫీలవటం మనం చూస్తూ ఉంటాం. అలాంటి పోస్టులు పెట్టటం తప్పన్నది నా పాయింట్ కాదు! ఇంతకూ ఆయా ఖురాన్ వాక్యాల్లో పేర్కొనబడిన అల్లాహ్ సహాయం పొందిన ఒకప్పటి విశ్వాసులు లేక ముస్లిములు ఎలాంటి వారు? అన్నదే అసలు గమనించాల్సిన విషయం.
అంటే వారు కూడా మనలో అధిక శాతం ముస్లిముల మాదిరిగానే అప్పుడప్పుడు శుక్రవారాలకోసారి లేక సంవత్సరానికోసారి మసీదు ముఖం చూసి, రంజాన్ నెల్లో ఓ సారి మసీదును సందర్శించి, మల్లా సంవత్సరం వస్తే గానీ మసీదు ముఖం చూడక తమ వ్యాపారాల్లో బిజీగా మునిగిపోయి, పరిశీలనగా అర్థం చేసుకోవలసి ఉన్న ఇస్లాం ప్రస్తావన ప్రక్కన పెట్టేసి, పరిశీలించి చదివి అర్థం చేసుకోవలసిన ఖురాన్ ను ముక్మల్ గుడ్డలో చుట్టి అటకమీద పడేసి దాన్ని అప్పుడప్పుడు కళ్లకు అద్దుకుంటూ, అసలు ఏ బాధ్యత అయితే అల్లాహ్ ముస్లిములపై మోపాడో దాన్ని గాలికి వదిలేసి, ఏదైనా కష్టాలు వస్తే మెళ్లో తాయెత్తులు వేసుకోవటమో లేక షార్ట్ కట్ లో దర్గాలకు వెళ్ళిపోయి వసీల చేసేసుకుంటే సరిపోద్ది అని భావించేటువంటి నామ మాత్ర ముస్లిములా? అన్నదే అసలు పాయింట్.
నిజమే ఒకవేళ ఇలాంటి స్థితిలోనే నేటి అధిక శాతం ముస్లిములు పడి ఉన్నారు అని మీకు అనిపిస్తే అటువంటి స్థితి పేరే నిర్లక్ష్యం అంటారు. ఇక నిర్లక్ష్యానికి చెల్లించక తప్పదూ భారీ మూల్యం. ఆ భారీ మూల్యం స్వయంగా
అల్లాహ్ ఆగ్రహమే!
***
యూదులు అల్లాహ్ ఆగ్రహానికి ఎందుకు గురయ్యారు?
ముస్లిములు అంటే చాలమందికి తెలిసింది ప్రవక్త ముహమ్మద్ (స) అనుచరగణం అన్నది. ఆది నుండీ పంపబడిన దైవ ప్రవక్తల అనుచరులంతా ముస్లిములే! అలాగే ఒకప్పటి మోషే అనుచరులైన యూదులంతా ఒకప్పటి ముస్లిములే! అంటే ఇప్పుడున్న ముస్లిం సమాజాని కంటే ముందు ఉన్న ముస్లిములు యూదులన్నమాట! మానవాళిని సంస్కరించే ధర్మ ప్రచారం చేసే బృహత్తర బాధ్యతను అల్లాహ్ ఒకప్పుడు మోషే అనుచరులైన యూదులకే అప్పజెప్పాడు. కానీ, వారు ప్రపంచ ధ్యాసలో పడిపోయి, అల్లాహ్ వారికి ఇచ్చిన మౌలిక బాధ్యతను నిర్లక్ష్యం చేసినప్పుడు వారిని ఆ బాధ్యత నుండి తప్పించి దాన్ని ప్రవక్త ముహమ్మద్ (స) అనుచరులకు అంటే ఇప్పుడున్న ప్రస్తుత ముస్లిములకు అప్పజెప్పాడు.
తరువాత కొత్తగా ఎన్నుకోబడిన ప్రవక్త ముహమ్మద్ (స) అనుచరులకు తిరిగి మీరు గతంలో యూదుల్లా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని చెబుతూ ఖురాన్ లో అల్లాహ్ ఎక్కువగా యూదుల ప్రస్తావన మాటి మాటికి చెయ్యటం జరిగింది. ఇంకా ఖురాన్ లో అత్యధికంగా అల్లాహ్ సందేశాన్ని తిరస్కరించిన జాతుల పతనాలను, దైవ ధర్మాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన జాతుల నాశనం ఎలా జరిగిందో అనేకసార్లు చెబుతూ ముస్లిం సమాజానికి అనేక హెచ్చరికలు చెయ్యటం జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకుని, అల్లాహ్ ఆదేశాల ప్రకారం నాటి ప్రవక్త ముహమ్మద్ (స) అనుచరులైన ముస్లిములు 1. వ్యక్తిగత సంస్కరణ 2. సామాజిక సంస్కరణ పట్ల అత్యంత శ్రద్ధ వహించినంత కాలం అవిశ్వాసుల తరఫున ఎన్ని కష్టాలు వచ్చినా అల్లాహ్ వారిని కాపాడుకుంటూ వచ్చాడు.
ముస్లిములకు కష్టాలు రావా?
భౌతిక సూత్రాల ఆధారంగా నిర్మితమైన ఈ ప్రాపంచిక జీవనంలో మానవులనబడే ఎవరికైనా కష్ట-నష్టాలు, సుఖ-దుఃఖాలు రావటం సహజమే! అయితే ఒక వ్యక్తికి ఏదైనా సమస్య వ్యక్తిగతంగా రావటం వేరు, సార్వత్రిక ముస్లిం సమాజంపై కష్టాలు, తీవ్రమైన సమస్యలు ఒక్క సారిగా వచ్చిపడటం వేరు. జాగ్రత్తగా గమనిస్తే రెండు సందర్భాల్లో సార్వత్రిక ముస్లిం సమాజంపై ఒక్కసారిగా ఏదైనా సమస్య రావటం అన్నది జరుగుతూ ఉంటుంది. మొదటిది- అవిశ్వాసుల తరఫు నుండి! రెండవది- అల్లాహ్ తరఫు నుండి శిక్షగా రూపంలో!
మొదటి సందర్భంలో ఒకవేళ అవిశ్వాసుల తరఫు నుండి ఏదైనా సమస్య ముస్లిం సమాజంపై వచ్చిపడితే ఆ ముస్లిములు నిజమైన విశ్వాసులే అయితే అంటే- తమ భౌతిక జీవనం సాగిస్తూనే ఇస్లాంను అర్థం చేసుకోవలసిన విధంగా అర్థం చేసుకుని, వ్యక్తిగత-సామాజిక సంస్కరణల పట్ల శ్రద్ధ వహించే నిజ ధార్మికులే అయితే అలాంటి ముస్లిం సమాజాన్ని అల్లాహ్ తన సహాయ సహకారాలు అందించి, తప్పక కాపాడుకుంటాడు.
అలా కాకుండా పైకి ఉర్దూ/అరబిక్ పేర్లు పెట్టుకుని ఖురాన్ ను అర్థం చేసుకోవలసిన విధంగా అర్థం చేసుకోక, వ్యక్తిగత సంస్కరణను విడిచి పెట్టేసి, తమకు ఇవ్వబడిన ధర్మ ప్రచార మౌలిక బాధ్యతను గాలికి వదిలేసి, చివరకు వ్యక్తిగత ఆరాధనల పట్ల సైతం నిర్లక్ష్యం వహిస్తూ, ఏదో సంవత్సరానికోసారో శుక్రవారానికోసారో మొక్కుబడిగా మసీదు ముఖం చూస్తూ ప్రాపంచిక ధ్యాసలో పూర్తిగా మునిగిపోయిన నామ మాత్ర ముస్లిం సమాజంపై మటుకు కష్టాలు, సమస్యలు అల్లాహ్ తరఫు నుండే శిక్ష రూపంలో వచ్చి పడుతూ ఉంటాయి. ఇప్పుడు దాదాపు అధిక శాతం ముస్లిం సమాజం ఈ విధంగానే నిర్లక్ష్య ధోరణిలో మునిగి ఉంది. అంటే ఏ రకమైన నిర్లక్ష్యాన్ని బట్టి ఒకప్పటి ముస్లిములైన యూదులు అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యారో, అనేక ఉపద్రవాల, కష్ట-నష్టాల ఉపద్రవంలో చిక్కుకు పోయారో, తమకు ఇవ్వబడిన గొప్ప స్థానం నుండి తొలగించబడ్డారో ఈనాటి ముస్లిం సమాజం అదే నిర్లక్ష్యానికి అతి దగ్గర గాను నాటి యూదులపై అవతరించిన దైవాగ్రహానికి అతి చేరువగానూ ఉన్నారనటం అతిశయోక్తి కాదు.
ఈనాడు సార్వత్రిక ముస్లిం సమాజంపై తీవ్రమైన దాడులేకాక దేశం నుండే వెలివెయ్యటానికి కొత్త కొత్త చట్టాలు రూపొందించబడటం, వారు ఇళ్లలో ఉండగానే కొట్టబడుతున్నారు, చంపబడుతున్నారు అన్నది ఒకవేళ ముస్లిం సమాజ నిర్లక్ష్య ధోరణికి దైవం తరఫున వచ్చిపడుతున్న శిక్షే అయితే గనుక ఈ సమస్యకు తక్షణ విరుగుడు ఇస్లాంను ఈనాటి ముస్లిం సమాజం యాదార్థంగా అర్థం చేసుకుని, తమ విశ్వాసాలను ఖురాన్ ఆదేశాల ప్రకారం సంస్కరించుకోవటమే కాక ఇస్లాం పట్ల ప్రజల్లో ఏర్పడ్డ అనేక అపార్థాలను తొలగించి, తోటి హిందూ క్రైస్తవ సోదరులకు ఇస్లాం అంటే క్రొత్తధర్మం కాదు పూర్వ గ్రంధాలన్నిటిలో ఏక దేవుని విధేయత సిద్ధాంతం ఆధారంగా బోధించబడి ఉన్న ధర్మమే ఖురాన్లో ఇస్లాంగా బోధించబడింది అన్న విషయాన్ని సర్వసామాన్యం చేసి, సమాజంలో మనమంతా ఒక్కటే మనందరి దేవుడు ఒక్కడే మనందరి ధర్మం ఒక్కటే అన్న స్పృహను అందరిలో కలిగేలా ప్రయత్నం చెయ్యాలి. ఇది ఆలస్యం చేయకుండా ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా చేయటానికి ప్రయత్నించాలి.
***
తీవ్ర యాతనకు గురిచేసే ప్రజల అదుపులో ఉంచటం – అల్లాహ్ విధించే శిక్షల్లో ఒకటి!
“ప్రళయ దినం వచ్చే వరకు నేను తప్పకుండా ఇస్రాయేలు సంతతి వారిని తీవ్రయాతనకు గురిచేసే ప్రజల అదుపులో ఉండేలా చేస్తూ ఉంటాను” – 7:167
అల్లాహ్ ఇచ్చిన బాధ్యతను గాలికి వదిలేసి ప్రపంచానికి అతుక్కుపోయిన ముస్లిములపై అల్లాహ్ పంపే శిక్షల్లో ఒకటి- వారిని “తీవ్రయాతనకు గురిచేసే ప్రజల అదుపులో ఉంచటమే!”. అలాంటి శిక్షను అల్లాహ్ తమకు ఇవ్వబడిన బాధ్యతను నిర్లక్ష్యం చేసిన యూదులపై అవతరింపజేశాడు! దాని నెరవేర్పుగానే యూదులు తమకంటూ ఓ భూభాగం లేకుండా చెదరగొట్టబడ్డారు చివరకు జర్మన్ క్రూర నియంత అయిన హిట్లర్ ద్వారా డిటెన్షన్ క్యాంపుల్లో నెట్టబడి లక్షల మంది యూదులు కుక్క చావు చచ్చారు. ఇప్పుడు కూడా వారికంటూ స్వతంత్ర దేశమంటూ లేదు అమెరికా అదుపాజ్ఞలలో ఉంటూ పాలస్తీనా, గాజాలలో నరమేధం సాగించి, రక్తచరిత్ర కలిగిన యూదులు ప్రస్తుతంలో పైకి స్థిరపడినప్పటికీ ప్రళయం వరకూ వారు అల్లాహ్ ఆగ్రహంలోనే ఉంటారు.
మరి ఇప్పుడు ముస్లిముల ప్రస్తుత పరిస్థితి ఏంటి? వారు కూడా తీవ్రయాతనకు గురిచేసే ప్రజల అదుపులో లేరా? వారి ద్వారా తీవ్రయాతనలకు గురికావటం లేదా? ఒకసారి ఆలోచించండి. ఇప్పటికైనా నేడు ముస్లిం సమాజంపై వచ్చిపడుతున్న సమస్యలు అల్లాహ్ ఆగ్రహంలో భాగంగా వచ్చి పడుతున్నాయన్నది గుర్తించి, నాటి యూదుల విషయంలో జరిగినట్లే అచ్చం ఈనాటి ముస్లిముల విషయంలోనూ జరుగుతుంది అన్నది తెలుసుకుని, నేటి విశ్వాసులు అల్లాహ్ ఆగ్రహం నుండి తప్పించబడి ఆయన సహాయం పొందే స్థితికి ఏ రకంగా చేరుకోవాలి అన్నది తక్షణమే ఆలోచించుకోక నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుండిపోతే పూర్తి స్థాయిలో శిక్ష అవతరించి, సమస్యల తీవ్రత పెరిగిపోయిన తరువాత ఇక ఇంకొక్క రోజు లభించినా బాగుండును అని అప్పుడు బాధ పడినా ప్రయోజనం ఉండదు. కాబట్టి ముస్లిం కుటుంబాల్లో పుట్టి అల్లాహ్ సహాయం ముస్లిములకే కదా లభించేది అని ఊహించుకుంటూ కూర్చోవటం అమాయకత్వం అవుతుంది. ముస్లిములుగా ఉన్నప్పటికీ అల్లాహ్ కు నచ్చే ముస్లిములుగా ఉన్నామా? లేమా? అన్నదే ముఖ్యం. అల్లాహ్ కు నచ్చే ముస్లిములుగా ఉన్నప్పుడు ఒకవేళ తీవ్ర యాతనకు గురిచేసే ప్రజలు నాయకత్వం వహించినప్పటికి అల్లాహ్ అలాంటి ముస్లిములను కాపాడుకుంటాడు. ఈ చైతన్యం ప్రతి ముస్లిం కలిగి సార్వత్రిక ముస్లిం సమాజం తన నడవడిక మార్చుకున్నప్పుడే అల్లాహ్ దాని స్థితిని సైతం మార్చగలడు. తన సహాయాన్ని అందించగలడు. ఇదే విషయం ఖురాన్ చెబుతుంది.
యదార్థం ఏమిటంటే ఒక జాతి తన లక్షణాలను మార్చుకోనంత వరకు అల్లాహ్ దాని స్థితిని మార్చడు. – 13:11
దైవసహాయం పొందగలిగే ముస్లిములు ఎవరు?
