ముస్లిములు ఉంటే “హిందూ దేశం” అనిపించుకోదా?

“అందరూ బాగుండి అందులో నేనూ ఉండాలనేది మత వాదం, నా వర్గం మాత్రమే బాగుండి మిగతావారు నాశనమైపోవాలనేది మతతత్వవాదం. తనతోపాటు అందరూ బాగుండాలని కోరుకునేవాడు మతవాది అందరూ పోయి నేను మాత్రమే ఉండాలనుకునేవాడు మతోన్మాది”

ఈ ఆర్టికల్ కి “ముస్లిములు ఉంటే “హిందూ దేశం” అనిపించుకోదా?” అని పేరు పెట్టటానికి కారణం- సోషల్ మీడియాలో కొందరు- “ముస్లిముల కంటూ ముస్లిం దేశాలు ఉండొచ్చు హిందువులకు హిందూ దేశం ఉండకూడదా?” అని, మరి కొందరైతే ఇంకో అడుగు ముందుకేసి “ముస్లిములైన మీరు ప్రత్యేకంగా పాకిస్తాన్ ను దేశంగా చేసుకున్నారు కదా అక్కడికే పొండి, మా హిందూ దేశంతో మీకేం పని” అంటూ పనికి మాలిని స్టేట్మెంట్లు ఇస్తూ హిందూ-ముస్లిముల మధ్య సోదర భావాన్ని బలహీన పరచటానికి ప్రయత్నించటమే! ఇలాంటి మతోన్మాదుల అమాయక ఆలోచన ఏమిటంటే “హిందూ దేశం నిర్మించుకోవాలంటే దేశం మొత్తం మీద ఒక్క హిందువులే ఉండాలి మిగతావారంతా దేశం విడిచి బయటకుపోవాలి అన్నది. ఇటువంటి దివాలాకోరు కోరు భావజాలం కలిగి ఉన్నోల్లు తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే-

1. ప్రపంచంలో ఉన్న దేశాల పేర్లు మత ప్రాతిపదికన పెట్టబడ్డాయా?

మతం ప్రాతిపదికన ఏ దేశం పేరు పెట్టబడలేదు. ప్రపంచంలో ఉన్న అనేక దేశాల పేర్లు నాలుగు అంశాల ప్రతిపదికన పెట్టబడ్డాయి. A. ప్రాంతం మరియు దాని దిశను బట్టి (a directional description of the country) B. భూభాగం యొక్క ప్రత్యేక విశిష్ఠ ప్రత్యేకతలను బట్టి C. తెగలు, రాజ్యాలు, జాతులను బట్టి D. ఓ ప్రత్యేక వ్యక్తిని బట్టి ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటి పేర్లు పెట్టబడి ఉన్నాయి. తప్పితే ఏ దేశామూ మతం ప్రాతిపదికన పేరు పెట్టబడలేదు. దీనిని బట్టి ప్రపంచంలో ఉన్న సకల దేశాల పేర్లు భౌగోళిక, ప్రాంతీయ విశిష్ఠతలను, తెగలు, రాజ్యాలు, జాతులను బట్టే పెట్టబడ్డాయి తప్పితే మతం ఆధారంగా పెట్టబడినవి కావు చివరకు ఇస్లామిక్ దేశాలతో సహా.

2. “హిందూ” అన్నపదం మతం (Religion) తాలూకు పదమా? భౌగోళిక (Geographical) పదమా?

ప్రాచీన ప్రాకృత భాష మరియు ద్రావిడ భాషల్లో- ఒకప్పటి “చిందు నేల” ఆ తరువాత సంస్కృతంలో “సింధూ నేల” గా పిలువబడింది. ఫార్సీ ముస్లిములు దానినే “హిందుస్థాన్”గా ఉచ్చరించటం మొదలెట్టారు. ఇక భరతుని పేరు మీద భారతదేశం అని పిలవబడింది. రోమన్స్ “ఇండస్ ల్యాండ్” గా పిలవటం జరిగేది. దీనిని బట్టి “హిందూస్థాన్” లేదా “హిందూ” అన్నవి “భౌగోళిక పదాలు” (Geographical terms) లేదా “జాతీయ పదాలు” (National terms) అవుతాయి తప్పితే అవి మతపరమైన పదాలు (Religious terms) కావు అని తేటతెల్లమైంది. కాబట్టి ఎంతమంది మతస్తులు ఉన్నా ఈ దేశం హిందుస్థాన్ గా మాత్రమే పిలువబడుతుంది.

3. భారతదేశంపై ముస్లిములకు ఎటువంటి హక్కూ లేదా?

ఈ దేశంపై నేడు మేము హిందువులని ప్రకటించుకునేవారికి ఎంత హక్కు ఉందో ముస్లిములకు కూడా అంతే హక్కు ఉంది. కారణం- ఎప్పటి నుండో హిందూ-ముస్లిములు సోదరుల్లా కలిసి మెలిసి జీవిస్తున్న ఈ దేశ స్వతంత్రాన్ని లాగేసుకున్న బ్రిటిష్ పాలకులపై పొరాడి స్వతంత్రాన్ని తిరిగి సంపాదించే క్రమంలో హిందూ-ముస్లిముల ప్రాణత్యాగాలు వేలల్లో ఉన్నాయి. కాబట్టి ఈ దేశ స్వతంత్రం హిందూ-ముస్లిముల ప్రాణత్యాగాల ఫలితం. అటువంటప్పుడు ఈ దేశంపై హిందూ-ముస్లిములకు సమానమైన హక్కే ఉంటుంది.

3. “జై హింద్” నినాదాన్ని ఉనికిలోనికి తెచ్చిందే ఒక ముస్లిం!

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముఖ్య అనుచరుడైన “అబిద్ హాసన్ అఫ్రానీ” మొట్టమొదటిసారి “జై హింద్” నినాదాన్ని ఉనికిలోనికి తేవటం జరిగింది. దీనిని బట్టి హింద్ లేదా హిందూ లేదా హిందూస్థాన్ అనే పదాలు భారత భూభాగానికి చెందిన భౌగోళిక పదాలే తప్ప మతపరమైన పదాలు కావని తెలుస్తుంది. “జై హింద్” అన్న పదానికి అర్థమే నా హిందూదేశానికి జయము కలుగును గాకా అని అర్థం.

4. “హిందువులు” అని ఓ ప్రత్యేక వర్గం వారే పిలువబడతారా?

వేదోపనిషత్తులు, భగవద్గీత శాస్త్రాల్లో ఎక్కాడా “హిందూ మతం” లేక “హిందూ ధర్మం” అన్న పదాలు వ్రాయబడి ఉన్నట్టు గానీ, హిందూ ధర్మాన్ని స్థాపించమని చెప్పినట్లు గానీ మనం ఎక్కడా చూడలేము. కాబట్టి వేదోపనిషత్తులు నమ్మే వారిని “వైదికులు” వారు అనుసరించేది “వైదిక ధర్మం” అని చెప్పాలి. తప్పితే వేదోపనిషత్తులు, భగవద్గీతను నమ్మే వారి ధర్మం “హిందూ ధర్మం” అవ్వదు, ఆ గ్రంథాలను కలిగి ఉన్న వారిని హిందువులు అనే పిలవాలని వేదాల్లో ఎక్కడా వ్రాసికూడా లేదు. “హిందూ” అన్నది కేవలం “భౌగోళిక పేరే” తప్ప మతపరమైన పేరు ఎంతమాత్రం కాదు అన్నది మనం గమనించి ఉన్నాం. కాబట్టి ఇండియా “హిందుస్తాన్”గా ఉచ్చరించబడింది మతపరంగా కాదు కానీ “భౌగోళికం” (Geographical)గా మాత్రమే. జపాన్ లో ఉన్న ప్రతీ ఒకరూ జపనీస్ లా, చైనాలో ఉన్న ప్రతి ఒక్కరూ చైనీస్ లా, అరేబియాలో ఉండే ప్రతి ఒక్కరూ అరేబియన్స్ లాగా హిందూస్థాన్లో ఉండే ప్రతి ఒక్కరూ ఏ మతానికి చెందినవారైనా నిజానికి హిందూస్థానీయులు అనే పిలవబడతారు. కాకపోతే, ఈ హిందూ అన్న భౌగోళిక పదానికి ఈ మధ్య కాలంలో మతపు రంగు పులమబడి, అది ఒక ప్రత్యేక మత వర్గానికి కట్టబెట్టటం జరిగింది. నిజానికి అరేబియాలో అరబ్ దేశాన్ని తీసుకుంటే అక్కడ అరబ్బీ మాట్లాడే చాలామంది క్రైస్తవులు, యూదులు ఉన్నారు వారంతా తమను తాము “అరబిక్ క్రిస్టియన్స్” అని, “అరబిక్ జ్యూ” అని చెప్పుకుంటారు. అలాగే ఇండోనేషియాలో నివసించే ఏ మతానికి చెందిన వారైనా ఇండోనేషియన్స్ లేదా ఇండోనేషియన్ ముస్లిమ్స్, ఇండోనేషియన్ క్రిస్టియన్స్ అని చెప్పుకుంటారు. దానికి కారణం అరేబియన్, చైనీస్, జపనీస్, ఇండోనేషియన్ అన్నవి భౌగోళిక (Geographical) లేదా ఆదేశ జాతీయ పదాలు కాబట్టి. అలాగే “హిందూ” అన్నది సైతం భౌగోళిక లేదా జాతీయ (Geographical or National) పదమే! దీనిని బట్టి ఈ దేశంలో నివసించేవారు “హిందుస్తానీ క్రిస్టియన్స్” “హిందుస్తానీ ముస్లిమ్స్” “హిందుస్తానీ బుద్ధిస్ట్స్” వగైరా అంటూ పిలవబడతారు. తప్పితే హిందూస్ అంటే వారు ప్రత్యేక మతానికి చెందిన వారు కాజాలరు సకల మతాల వారు నివసించే భారతీయులంతా హిందూస్థానీయులు గానే పరిగణించబడతారు.

5. భారతదేశంలో రాజ్యాంగం మతపరంగా తయారు చెయ్యబడిందా?

1947 స్వతంత్రం వచ్చాకే భారతదేశంలో మొట్టమొదటిసారి రాజ్యాంగం (Law) అనేది అంబేడ్కర్ ద్వారా తయారు చెయ్యబడింది. అది కూడా మతాధార (religious) చట్టం కాదు, లౌకిక (Secular) ఆధారిత చట్టం మాత్రమే. తప్పితే అది వేదోపనిషత్తుల ద్వారానో లేక మను ధర్మశాస్త్రం ఆధారంగానో తయారు చెయ్యబడిన మతపరమైన చట్టం కాదు.

6. ఇస్లామిక్ దేశాలు మరి ఏ ప్రతిపదిక మీద ఏర్పడ్డాయి?

ఇస్లామిక్ దేశాలు అన్నవి మొదటి నుండే అక్కడి ప్రజానీకం అంతా కలిసి ఇస్లామిక్ షరియా (Islamic Law) ని శాసనంగా చేసుకున్నాయి. దానికి కారణం ఇస్లాం స్వతహాగా “ఇస్లామిక్ చట్టం” కలిగి ఉండటం మరియు ఆ చట్టం పూర్తిగా లౌకిక (secular) చట్టాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈనాటి ఆధునిక సమాజానికి కూడా ఆమోదయోగ్యంగా ఉండటమే. దానికి గొప్ప ఉదాహరణ “యునైటెడ్ స్టేట్స్” (U.S) 1935 సం.లో ప్రపంచ చరిత్రలో ధర్మశాస్త్రాలు అందించిన గొప్పవ్యక్తుల్లో ఒకనిగా ప్రవక్త ముహమ్మద్ (స) ను గుర్తించటం! ఆ విధంగా ముస్లిములు అత్యధికంగా నివశిస్తున్న కొన్ని దేశాల్లో “ఇస్లామిక్ చట్టం” ఆధారంగా రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాయి. ఆ విధంగా ప్రపంచంలో ఇస్లామిక్ దేశాలు ఏర్పడ్డాయి. అంతేతప్ప ఇస్లామిక్ దేశాలు అంటే ముస్లిమేతరులను తన్ని తరిమేయగా ఏర్పడ్డ దేశాలని కాదు.

7. తమ దేశాల్లో ఉన్న ముస్లిమేతరులను తన్ని తరిమేసి, ఇస్లామిక్ దేశాలు ఏర్పర్చుకున్నారా?

ఇస్లామిక్ చట్టంగా ఆధారంగా నిర్మితమవ్వటం కారణంగా ఏర్పడ్డ ఇస్లామిక్ దేశాలు ఇతర మతస్తులను తమ దేశం నుండి తన్ని తరిమేసి ఆ తరువాత ఇస్లామిక్ దేశాలు నిర్మించుకోలేదు. కేవలం ఇస్లామిక్ చట్టాన్ని ఆమోదించుకోవటం వల్ల మాత్రమే ఇస్లామిక్ దేశాలుగా పిలువబడినప్పటికీ ఇస్లామిక్ దేశాల్లో ముస్లిములతో పాటు, యూదులు, క్రైస్తవులు, హిందువులు ఇంకా ఇతర మతస్థులు కూడా సఘటితంగా కలిసి జీవిస్తూ ఉన్నారు. ఇక ప్రపంచంలో క్రైస్తవ ఆధిక్యత ఉన్న అగ్రరాజ్యాలు సైతం క్రైస్తవ దేశాలుగా పిలవబడటానికి కారణం- అక్కడ అధిక జనాభా క్రైస్తవులు ఉండటం. ఇంకా క్రైస్తవులతో పాటు ఆయా దేశాల్లో హిందువులు, ముస్లిములు, సిక్కులు ఇంకా ఎందరో అక్కడి పౌరసత్వాన్ని పొంది జీవిస్తూ ఉన్నారు.


8. ఇస్లామిక్ దేశాల మాదిరి భారతదేశాన్ని హిందూ దేశంగా చెయ్యాల్సిన ఆవశ్యకత ఏదైనా ఉందా?

భారత దేశాన్ని హిందూ దేశంగా చెయ్యాలి అని ఈ మధ్య చాలా మంది నినాదాలు చేస్తున్నారు. నిజానికి భారతదేశం ఎప్పుడూ హిందూ దేశమే మళ్లా దాన్ని కొత్తగా హిందూ దేశం చెయ్యటం ఏమిటి? హిందూ దేశంగా మార్చటం అంటే ఇక్కడ ఉన్న ముస్లిములను, క్రైస్తవులను తన్ని తరిమేసి కేవలం హిందువులను మాత్రమే మిగల్చటమా? అలా తరిమేసి నిర్మించుకునే దాన్ని ఆటవిక దేశం అంటారు! ఇస్లామిక్ దేశాల మాదిరి హిందువులకు ఓ ప్రత్యేక దేశం ఉండకూడదా? అని వాదించేవారు గమనించాల్సింది- ఇస్లామిక్ దేశాలు ఏర్పడినవి అక్కడ ఉన్న ఇతర మతస్తులను తన్ని తరిమేయటం అన్న ప్రాతిపదికన కాదు కానీ, కేవలం ఇస్లామిక్ చట్టం ప్రతిపదిక మీద మాత్రమే! అలాగే హిందూ దేశం అంటే కాషాయ బట్టలు వేసుకుని విగ్రహారాధన చేసేవారు మాత్రమే ఉండే భూభాగం అని కాదు! వేదోపనిషత్తులు, భగవద్గీతను నమ్మే వైదికులతో పాటు, బైబిల్, ఖురాన్ నమ్మే వారు ఉన్నప్పటికీ ఇంకా ఎంతమంది ఇతర మతస్తులు ఉన్నప్పటికీ భారతదేశం హిందుస్థాన్ లేదా హిందూ దేశంగానే పిలవబడుతుంది. ఎందుకంటే హిందూ, హిందుస్థాన్ అన్న పదాలు ముందు మనం చెప్పుకున్నట్లు అవి మతం తాలూకు పదాలు కావు భౌగోళిక లేదా జాతీయ పదాలు మాత్రమే! ఇక ప్రపంచంలో ఎక్కడైనా ఇండియాను “హిందూదేశ్” అని “హిందుస్థాన్” అని మాత్రమే చెబుతారు. కాబట్టి హిందూస్థాన్ ను వేరేగా హిందూ దేశంగా చెయ్యాల్సిన ఆవశ్యకత లేదు, ఒకవేళ ముస్లిములు ఉంటే అది హిందూ దేశం అవ్వదు అనుకుంటే దానంత మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఈ దేశంలో ముస్లిములు ఉన్నా, క్రైస్తవులు ఉన్నా ఇంకా ఎంతమంది మతస్తులు ఉన్నా భారత దేశం ఎప్పటికీ హిందూ దేశమే!

9. ఆరోగ్యకరమైన హిందూ దేశాన్ని ఎలా నిర్మించాలి?

హిందూ ధర్మంగా పిలవబడుతున్న వైదిక ధర్మాన్ని కాపాడటం అంటే వేదోపనిషత్తులు, భగవద్గీతా శాస్త్రాలను పరిశీలనగా చదివి, వాటి ఆధారంగా సమాజ సంస్కరణ చేపట్టటం ప్రచారం చెయ్యటం తప్పితే “హిందూ ధర్మాన్ని రక్షించటం అంటే పర ధర్మాలను తన్ని తరిమేయాలని అనుకోవటమో వారిని అణగత్రొక్కటమో కాదు”. పైగా ఈ శాస్త్రాలు అలాంటి ఆదేశాలు కూడా ఇవ్వటం లేదు. అలాంటప్పుడు వేదోపనిషత్తులు, భగవద్గీతా శాస్త్రాల వంటి గొప్ప ఆధ్యాత్మిక సంపదను కలిగి ఉండి కూడా మేమే ఉండాలి మీరంతా బయటకు పోవాలి అన్న భావన కలిగి ఉండేవారిని సెక్యులరిస్టులు అయితే “బార్బరియన్స్” అంటారు, సామాన్యులైతే “ఆటవికులు” అంటారు, ఆధునీకులు అయితే “బ్రూటల్స్” అంటారు, ధార్మిక అవగాహన ఉన్నోల్లు “మతోన్మాదులు” అంటారు. స్వధర్మాన్ని రక్షించటం అంటే పరాధర్మాన్ని అణగ త్రొక్కటం కాదు”. హిందూ జాతిని రక్షించటం అంటే హిందూ దేశంలో నివస్తున్న సకల మతస్తుల ప్రజలపై దయాభావం కలిగి ఉండి మానవత్వంతో వ్యవహరించటం, నేనూ బాగుండటంతో పాటు నా తోటి వారు కూడా బాగుండాలని అభిలషించటం. కుల మతాలకు అతీతంగా అలాంటి అభిలాష కలిగి ఉండటాన్నే జాతీయత అవుతుంది. అలాంటి జాతీయతే నిజమైన హిందూత్వం అవుతుంది. దీనికి వ్యతిరేకంగా ఆలోచించటం మూర్ఖత్వం అవుతుంది. అదే మతోన్మాదం అని పిలవబడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *