హిందూ-ముస్లిముల ఐక్యత అనవసరమా? అవశ్యకమా?

ఒక ఇంటి కప్పు స్థిరంగా నిలబడాలి అంటే దానిని బలమైన స్థంబాలు తమపై మోస్తూ ఐక్యతతో నిలబడటం ఎంత అవసరమో భిన్న మతాలు కలిగిన సమాజం ప్రశాంతంగా మనగలగటానికి దానిలో వ్యక్తుల మధ్య పటిష్ట ఐక్యత కూడా అంతే అవసరం అన్నది నిర్వివాదాంశం. భారతదేశంలో హిందూ-ముస్లిములు ఒకే తల్లికి చెందిన ఇద్దరు బిడ్డల వంటి వారు అనటంలో సందేహంలేదు. వేద భూమి అయిన ఈ పవిత్ర దేశాన్ని ఎన్నో వేల సంవత్సరాలు ముస్లిములు పరిపాలించటమే కాక ఈ దేశాన్ని బ్రిటీషు పాలకులు అన్యాయంగా వశపరచుకున్నప్పుడు వారు చూస్తూ ఊరుకోలేదు ఈ దేశాన్ని కలిసి పంచుకుందామని ముస్లిం పాలకులకు బ్రిటిష్ వారు కుట్రపూరితంగా ఎర వేసినప్పుడు వారిచ్చిన అవకాశాన్ని వారి ముఖం పైనే విసిరికొట్టి ఈ దేశవాసుల రక్షణే ధ్యేయంగా పెట్టుకుని ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. కుల మతాలకు అతీతంగా అష్ఫాఖుల్లా, మౌల్వీ అబ్దుల్లాహ్ షా, బఖ్త్ ఖాన్, పీర్ ఆలీ ఖాన్ లాంటి ఎందరో ముస్లిం స్వతంత్ర యోధులు ఈ దేశ ప్రజల కోసం ఉరికంబాలు ఎక్కి ఉరితాళ్లాను ముద్దాడి తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారు. వేల మంది సామాన్య హిందూ-ముస్లిములు భుజం భుజం కలిపి ఈదేశం కోసం బ్రిటిష్ పాలకుల తుపాకీ గుళ్లకు ఆహుతి అయిపోయారు. “విభజించి పాలించు” అన్న సూత్రం ఆధారంగా ఈ దేశంలో హిందూ-ముస్లిములను విడదీసి ఈ దేశాన్ని లోబరుచుకోవాలన్న బ్రిటీషు కుట్రను ఆనాడు హిందూ-ముస్లిములు తమ బలమైన ఐక్యతతో తిప్పి కొట్టారు. ఈ దేశంలో హిందూ-ముస్లిముల బలమైన ఐక్యత ముందు, వారి కుట్రలన్ని నిర్వీర్యం అయిపోయాయి. చివరకు ఓటమిని అంగీకరించి ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చేసి వెళ్ళిపోయారు.

ఆనాడు హిందూ-ముస్లిములు కలిసి వేలకొద్దీ ప్రాణత్యాగాలు చేయగా వారు చిందించిన రక్తం ఇంకిన నేల పైనే ఈరోజు మనం స్వతంత్రంగా జీవనం సాగిస్తున్నది. ఈరోజు భారతావని అనుభవిస్తున్న స్వతంత్రం ఒకనాటి బలమైన హిందూ-ముస్లిముల ఐక్యత, ప్రాణత్యాగాల ఫలితమే! ఇప్పటి వరకూ నేను రాసింది కాస్త చరిత్ర అవగాహన ఉన్నోల్లకు ఎరుకే!

*****************

అయినప్పటికీ ఈ భారతావని ఇద్దరు ముద్దు బిడ్డల వంటి హిందూ-ముస్లిముల ఐక్యతను కాలానుగుణంగా రెండు విషయాలు బీటలు వార్చుతూ వచ్చాయి.

1. మతతత్వవాదం 2. ముస్లిములంతా ఉగ్రవాదులు అన్న భావజాలాన్న పెంచి పోషిస్తూ వస్తున్న మీడియా ప్రభావం!

1. మతతత్వవాదం: “ప్రజలందరినీ సమ దృష్టితో చూడాలని చెప్పేది మతం మా వర్గ ప్రజలు మాత్రమే బాగుండాలనేది మతతత్వవాదం”. నిజానికి మతతత్వవాదం అనేది ఒక రకమైన మత్తు లాంటిది అనటం అతిశయోక్తి కాదు. ఎందుకంటే మత్తులో మనిషి ఏది మాట్లాడతాడో, ఎలా ప్రవర్తిస్తాడో తెలీదు. అలాగే మతతత్వవాదం అన్న మత్తు తలకెక్కిన మనిషి ప్రవర్తన కూడా అంతే గమ్మత్తుగా ఉంటుంది. అయితే దురదృష్టవశాత్తు దేశ పాలకుల్లో అలాంటివారు చేరిపోవటంతో కాలానుగుణంగా మతతత్వవాద ప్రభావం సర్వసామాన్యమవుతూ పోయింది. చివరకు ఈ దేశం కేవలం హిందువులది మాత్రమే ఇది హిందూ దేశం అనబడాలంటే ఒక్క హిందువులే ఇక్కడ ఉండాలి ముస్లిములు మాకు అనవసరం వారు ఈ దేశం విడిచి వెళ్లిపోవాలి వంటి చిత్ర విచిత్రమైన వాదనలు బయలు దేరాయి. ఈ వాదనలు బలపరచుకోవటానికి ఈ దేశాన్ని పాలించిన ముస్లిం పాలకులను క్రూరులుగా చిత్రీకరిస్తూ వక్రీకరించబడిన చరిత్రలు ఉనికిలోనికి తేవటం జరిగింది. హిందూ-ముస్లిములు అన్నదామ్ములుగా మెలిగిన నేలపైనే హిందూ vs ముస్లిం విభజన రాజకీయాలు ప్రారంభమయ్యాయి.

నిజానికి ఈ దేశాన్ని హిందూ దేశంగా ఉంచటంలో ముస్లిం పాలకుల పాత్ర ఎంతో ఉంది. దాదాపు వెయ్యి సంవత్సరాలు పాలించిన ముస్లిం పాలకులు ఈ దేశానికి హిందూస్థాన్ కి బదులు ఏదైనా ఉర్దూ/అరబిక్ పేరు పెట్టాలన్నా దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చేయాలన్నా వారికి ఓ కప్పు టీ తాగినంత టైమ్ కంటే ఎక్కువ సమయం పట్టదు. కానీ వారు ఆ వారు ఆప్షన్ తీసుకోలేదు వారు హిందూ సంస్కృతిని కించిత్తు పాడవకుండా కాపాడారు. దానికి కాశ్మీర్ నుండి కన్యా కుమారి వరకు నిలబడి ఉన్న దేవాలయాలు, ఈనాటికీ కొనసాగుతున్న హిందూ ఆచారాలే సజీవ సాక్ష్యాలు. ఈ విధంగా హిందూ-ముస్లిముల మధ్య బీటలు వారటానికి మతతత్వవాదం మొదటి కారణంగా పనిచేసింది.

2. ముస్లిములంతా ఉగ్రవాదులు అన్న భావజాలాన్ని పెంచి పోషిస్తున్న మీడియా

హిందూ-ముస్లిముల మధ్య బీటలు వారటానికి కారణమైన రెండవ అంశం- ఉగ్రవాదులంతా ముస్లిములే! ముస్లిముల లక్ష్యమే ముస్లిమేతరులను చంపటం అలా చంపితే ముస్లిములకు అల్లాహ్ స్వర్గం ప్రసాదిస్తాడంటూ అసలు ఇస్లాంకు ఏ మాత్రం సంబంధం లేని విషపూరిత ఆలోచనలను ఇస్లామోఫోబియాను పెంచి పోషించే పెయిడ్ మీడియా సామాన్యుల మెదళ్లలో నింపేసింది. దాని కారణంగా అసలు ఖురాన్ అట్టను సైతం చూడని కొందరు ఇస్లామోఫోబిక్కులు గాసిప్పుల్లో ప్రచారం కాబడే ఇస్లాం ధ్వేషపూరిత సమాచారాన్ని పట్టుకుని ముస్లిములను ఉగ్రవాదులని, జిహాదీగాళ్లని విమర్శించటం దానికి ముస్లిములు ప్రతి విమర్శ చెయ్యటం కారణంగా రాను రాను హిందూ-ముస్లిముల మధ్య దూరాన్ని పెంచేసింది. నేటి కొందరు హిందూ మతతత్వ వాదులు ఊహించుకుంటున్నట్టు ముస్లిమేతరులను చంపటమే ఇస్లాం లక్ష్యమైతే, 1757 ఫ్లాసీలో బ్రిటీషర్లకు ఎదురు తిరిగి ప్రాణాలు అర్పించేసిన మొట్టమొదటి రెబలియన్ “సిరాజుద్దౌలా” నాలుగు సార్లు బ్రిటీషర్లతో యుద్ధానికి తలపడి ప్రాణాలు అర్పించేసిన టిప్పుసుల్తాన్ లాంటి ఎందరో ముస్లిం వీరులు బ్రిటిషర్లతో చేతులు కలిపేస్తే వారు వీరిని బ్రహ్మరధం పట్టటానికి సిద్ధపడ్డారు. కానీ అక్కడ కూడా వారు ఆ ఆప్షన్ తీసుకోలేదు. ఆనాటి ముస్లిం పాలకులు దేశం కోసం బ్రిటీషర్లతో ఇక్కడ నివసిస్తున్న హిందూ జాతిని రక్షించి వారికోసం ప్రాణాలు అర్పించేసే ఆప్షన్నే ఎంచుకున్నారు. ముస్లిమేతరుల పట్ల ముస్లిములకు ధ్వేషమే ఉండి ఉంటే దేశ స్వతంత్రం కోసం వేలకొద్ది ముస్లిములు ప్రాణాలు అర్పించెయ్యటానికి బదులు వారితో చేతులు కలిపేసి ఇరువురూ కలిసి ఇక్కడ ఉన్న హిందువులపై దౌర్జన్యం చెయ్యటానికి పెద్ద సమయం పట్టదు. కానీ, ఇక్కడ కూడా సామాన్య ముస్లిములు ఆ ఆప్షన్ను ఎంచుకోలేదు. ఈ దేశంలోనే పుట్టాం కాబట్టి ఈ దేశవాసుల స్వతంత్రమే శిరోధార్యంగా భావించి తమ ప్రాణాలను త్యాగం చేసే ఆప్షన్నే ఎంచుకున్నారు. అలా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించేసిన వారిలో దాదాపు 65 శాతం మంది ముస్లిములే ఉన్నారు. 1857 లో మొదలైన “ఇండియన్ రెబలియన్ మూవ్మెంట్” లో ఒక్క డిల్లీ నగరంలోనే అక్షరాలా 87000 మంది ముస్లిములు చంపబడ్డారు. అలాగే 1864 నుండి 67 మధ్యలో తమకు ఎదురు తిరిగారన్న నెపంతో బ్రిటీషర్లు అక్షరాలా 14000 మంది ముస్లిం ఉలామాలను (ఇస్లామియా పండితులను) ఉరికంబాలు సరిపోక చెట్ల కొమ్మలకు వ్రేలాడదీసి ఉరి తాళ్లు బిగించి మరీ చంపారు. ఈ వాస్తవాలు ఈనాటి ఎంత మందికి తెలుసు?

నేడు ఏ ఖురాన్ అయితే ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందని కొందరు విమర్శిస్తున్నారో మరి ఆ ఖురాన్ ను చదివిన ముస్లిములేగా ఆనాడు ఈ దేశం కోసం తమ ప్రాణాలను అర్పించేసింది. అంటే ఖురాన్ వాస్తవంగా అర్థం చేసుకుంది ఆనాటి ముస్లిములా? ముస్లిం పేర్లు తగిలించుకుని ఉగ్రవాదం చేస్తున్న నేటి అభినవ ఉగ్రవాదులకా? ఉర్దూ/ అరబిక్ పేర్లు తగిలించుకున్నవారు చేసే దౌర్జన్యం పేరే టెర్రరిజం అన్న దివాలాకోరు భావజాలాన్ని పెంచి పోషించిన మీడియా కారణంగా ప్రపంచంలో గాజా, పాలస్తీనా పై యూదులు బాంబులు విసిరి లక్షల మందిని చంపేసినా, రసాయన ఆయుధాలు ఉన్నాయన్న అనుమానంతో అమెరికా ఇరాఖ్ లాంటి దేశంపై టన్నుల కొద్దీ బాంబుల వర్షం కురిపించి లక్షల మందిని చంపేసినా, లేదా ఓ ముస్లిం సమాజంపై కొందరు మతతత్వ వాదులు సామూహిక హత్యాకాండ సాగించినా అవేవీ ఉగ్రవాదంలా ప్రజలకు కానలేదు. అదే ఓ ఉర్దు/అరబిక్ పేరు తగిలించుకుని ఎవడైనా ఏ చిన్న దౌర్జన్యం చేసినా దానిని ఇస్లామిక్ ఉగ్రవాదం అనే ఓ పనికి మాలిన పదాన్ని కనిపెట్టిన మీడియా ఓ వారం పాటు తిప్పి తిప్పి ప్రచారం చేసి సామాన్యుల్లో ఇస్లాం పట్ల ఎంత విషాన్ని నింపాలో అంత విషాన్నీ నింపుతుంది. ఆ వార్తలను పట్టుకుని తలా తోకా తెలియని కొందరు పోకిరీ గాళ్ళు మీడియాలో ఇస్లాం పట్ల తింగర మాటలు చెప్పటం చవకబారు తనంగా మాట్లాడటం అది ముస్లిములు సహించక పోవటం వెరసి హిందూ-ముస్లిం భాయ్ భాయ్ అని పిలుచుకున్న రోజులు పోయి హిందూ-ముస్లిం భౌ, భౌ మంటూ అరుచుకునే దౌర్భాగ్యపు రోజులు దాపురించాయి. ఎప్పటి నుండో ఇలాంటి అరుదైన సమయం కోసమే ఎదురు చూస్తున్న మతతత్వ రాజకీయనాయకులు ఈ ధ్వేషాగ్నికి ఆజ్యం పోయటానికి ఒకసారి బాబ్రీ మసీదు, ఇంకోసారి అయోధ్య రామ్ మందిర్, గోమాంసం, గొరక్షణ, లవ్ జిహాద్, ట్రిపుల్ తలాక్, మళ్లా రామ్ మందిర్ తీర్పు, ఇప్పుడు కొత్తగా NRC/CAA అంటూ ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి హిందూ vs ముస్లిం విభజన రాజకీయాలను చేయటం మొదలెట్టారు. ఇంకా ప్రజల భావోద్రేకాలాలను మత పరంగా రెచ్చగొట్టటమే కాక క్షీణ దశలో ఉన్న దేశ ఆర్థిక స్థితి, నిరుధ్యోగం, డీ మానిటైజేషన్, అత్యాచారాలు, ఆకలి చావులు, రైతు ఆత్మహత్యలు ధరల పెంపు, కేంద్రం పై పెరిగిపోయిన విపరీతమైన అప్పులు వంటి ఎన్నో అంశాల నుండి ప్రజల దృష్టిని మళ్లించటంలో భాగంగా ఇలాంటివన్నీ తెర పైకి తీసుకురావటం మొదలెట్టారు. ఈ అసలు వాస్తవికత తెలుసుకోలేని కొందరు వారి మాయలో పడి ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త కొత్త చట్టాల వల్ల, చర్యల వల్ల స్వయంగా తాముకూడా నష్టపోతున్నామన్న ఆలోచన కోల్పోయి వారిని సమర్ధిస్తూ మాట్లాడటం, ముస్లిముల పట్ల ధ్వేషాన్ని పనిగట్టుకుని పెంచుకుంటూ పోయి ఈ ముస్లిములు మన దేశానికి అనవసరం, మాకు వారితో ఏ అవసరం లేదు అని ప్రచారాలు చేసే స్థాయికి వచ్చారు.

కానీ, భారతదేశం ప్రత్యేకత ఏమిటంటే ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా ఒకప్పుడు హిందూ-ముస్లిముల ప్రాణత్యాగాల రక్తంతో తడిసి ముద్దైన ఈ నేల ఎప్పటికీ ఏదో రూపంలో హిందూ-ముస్లిముల దృఢమైన ఆత్మీయ బంధాన్ని కలిపే ఉంచుతుంది. దానికి తార్కాణం ఈ మధ్య ప్రవేశపెట్టన NRC/CAA కి వ్యతిరేకంగా దేశం మొత్తం కుల మతాలకు అతీతంగా హిందూ-ముస్లిములు మరలా భుజం భుజం కలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం సలపటమే. ఇది ఈ దేశంతో ఎన్నో వందల వేల సంవత్సరాలుగా పెనవేసుకుపోయిన ఆత్మీయ బంధాన్ని ముస్లిం సమాజం, హిందూ సమాజం ఎప్పటికీ వదులుకోదు అనటానికి నిదర్శనమే. హిందూ-ముస్లిములు విడిపోవటం అంటే భారతదేశం తన ఆత్మను కోల్పోవటంతోనే సమానం అవుతుంది. అటువంటి పరిణామం ఈ దేశ భావిష్యత్తునే నాశనం చేస్తుంది. తద్వారా అంతర్గత రాజకీయ కుట్రలకు అందరూ బలికావలసి ఉంటుంది. ఇక హిందూ-ముస్లిములు ఐకమత్యంగా కలిసి జీవించటం, ఒకరికొకరు పరస్పర సహాయ సహకారాలు అందించుకోవటం, పరస్పర వ్యవహారాలు నడుపుకోవటం అన్నది ఈ దేశంలో చిన్న చిన్న వీధుల్లో ప్రక్క ప్రక్కన ఇళ్లలో నివసించటం నుండి మొదలుకొని ఉధ్యోగాలు, వ్యాపారాలు, రాజకీయాలు, క్రికెట్, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు కొనసాగుతూ ఉంది. అలాంటి హిందూ-ముస్లిముల పటిష్ట ఐక్యతతో నిర్మితమై ఉన్న సమాజంలో వారి ఐక్యత మధ్య బీటలు రావటం అంటే అది సమాజ నిర్మాణాన్నే అతలా కుతలం చేసేస్తుంది. కాబట్టి హిందూ ముస్లిముల ఐక్యత అన్నది అనవసరం అని భావించేవారు అది ఎంత అవశ్యకమో తెలుసుకుని, కుల-మతాలకు అతీతంగా హిందూ-ముస్లిములు సోదరభావాన్ని పెంపొందించుకోకపోతే గనుక భవిష్యత్ తరాలకు ఓ సుందర సమాజాన్ని మనం బహూకరించటానికి బదులు అనైక్యతతో ప్రజలు నిత్యం కొట్టుకు చస్తూ ఉండే ఎందుకూ పనికి రాని ఓ శవాల దిబ్బలాంటి సమాజాన్ని వారికి ఇవ్వటమే అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *