ఈ నేపథ్యంలో ముస్లిములు చెయ్యాల్సింది ఏమిటి?

ఒక వ్యక్తిపై ఏదైనా సమస్య వచ్చిపడటం అన్నది వేరు, పూర్తి సమాజంపై ఏదైనా సమస్య వచ్చిపడటం అన్నది వేరు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజంపై జరుగుతున్న అనేక దాడులు, ప్రస్తుత ముస్లిం సమాజంపై ఆవహించి ఉన్న భయాందోళనల నేపథ్యంలో ముస్లిములుగా ఉన్న మేము చెయ్యాల్సింది ఏమిటి? అనే ప్రశ్న ఒకటి ముందుకు వస్తుంది. అసలు విశ్వాసులపై లేదా ముస్లిం సమాజంపై ఏదైనా సమస్య ఎందుకు వస్తుంది? అన్న అంశంపై మూలల్లోకి వెళ్లి ధార్మిక కోణంలో ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే దానికి రెండు కారణాలను మనం కనుగొనగలం అవి: 1. అశ్వాసులు విశ్వాసులపై మూకుమ్మడిగా దాడి చెయ్యటం లేదా 2. అల్లాహ్ తరఫున ఏదైనా శిక్ష అవతరించటం అన్న రెండు సందర్భాలలోనే మౌలికంగా సార్వత్రిక ముస్లిం సమాజం పై ఏదైనా సమస్య రావటం అన్నది జరుగుతుంది.

మొదటి నేపథ్యంలో ఒకవేళ విశ్వాసులు దేవుని ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నట్లైతే కచ్చితంగా దానికి సహాయం అన్నది దేవుని తరఫునే లభిస్తుంది. కానీ, ఆ జాతి మొత్తం గనుక దానికి ఇవబడిన బాధ్యతలను మరచి, తమను తాము సంస్కరించుకోవటం విస్మరిస్తే గనుక అలాంటి విశ్వాసులకు అవిశ్వాసుల ద్వారా సమస్యలను రప్పించటం స్వయంగా అల్లాహ్ తరఫు నుండే జరుగుతుంది. అప్పుడు మటుకు ఆ సమస్యల నుండి తప్పించేవాడు ఒక్క అల్లాహ్ తప్ప మరొకడు ఉండదు. ఇదే విషయం ఖురాన్ ఈ క్రింది విధంగా చెబుతుంది.

“యదార్థం ఏమిటంటే, ఒక జాతి స్వయంగా తన లక్షణాలను మార్చుకోనంతవరకు అల్లాహ్ దాని స్థితిని మార్చడు. అల్లాహ్ ఒక జాతిని తన శిక్షకు గురిచేసే నిర్ణయం తీసుకున్నప్పుడు దానిని ఎవరు తొలగించదలచుకున్నా అది తొలగదు” – 13:11

పై వాక్యాన్ని బట్టి ఒక పతనావస్థకు చేరుకున్న జాతి ఉన్నత స్థితికి రావాలన్నా ఆజాతిపై వచ్చిపడే శిక్షలు లేదా తీవ్రమైన సమస్యలు తొలగాలి అన్నా ఆ జాతి ప్రజలంతా సార్వత్రికంగా చెయ్యాల్సిన పని ఒక్కటే ఆ జాతి స్వయంగా తన లక్షణాలను మార్చుకోవటం మాత్రమే!

లక్షణాలు మార్చుకోవటం అంటే ఏమిటి?

ఒక జాతి మొత్తం తన లక్షణాలు మార్చుకోవటం అంటే ఆ జాతిలో ఉన్న ప్రతీ ఒక్కరూ 1. వ్యక్తిగత సంస్కరణ 2. సామాజిక సంస్కరణ అనే రెండు ప్రధాన బాధ్యతలను నిర్వర్తించటంపై మాత్రమే ఆధారపడి ఉంది.

వ్యక్తిగత సంస్కరణ అంటే:

A. విశ్వాసులు తమ ఆరాధనల పట్ల నిర్లక్ష్యం వహించకపోవటం B. తమ విశ్వాసాలను గ్రంథం ప్రకారం సంస్కరించుకుని, చెడు అలవాట్లను మానుకోవటం C. తలిదండ్రుల, పొరుగువారి హక్కులు చెల్లించటం. ఇవి సమాజంలో ప్రతీ ఒక్కరూ ఎవరికి వారే వ్యక్తిగతంగా సంస్కరించుకోవలసిన అంశాలు. ఈ విషయంలో ఖురాన్ హెచ్చరిక – “తన ఆత్మను పరిశుద్ధ పరచుకున్న వ్యక్తి సఫలుడయ్యాడు, దానిని అణచి వేసినవాడు విఫలుడయ్యాడు” – 91:10

2. సామాజిక సంస్కరణ అంటే:

A. విశ్వాసుల మధ్య ఐక్యత కొరకు పాటు పడటం B. మంచిని ఆజ్ఞాపించటం, చెడును నిరోధించటం మరియు ధర్మాన్ని ప్రజలలో సర్వసామాన్యం చెయ్యటం.

ఒక జాతి తన లక్షణాలను మార్చుకోవటం అన్నది పైన పేర్కొనబడిన అంశాలన్నిటి పై ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుత ముస్లిం సమాజం పై బాధ్యతలన్నిటినీ సంపూర్ణంగా నిర్వర్తిస్తుందా? అన్నదే ప్రశ్న. దీనికి సమాధానం కొందరు తప్ప సార్వత్రిక ముస్లిం సమాజంలో అధిక శాతం మంది వ్యక్తిగత, సామాజిక సంస్కరణ అన్న రెండు బాధ్యతల నుండి ఎప్పుడో దూరమై పోయారన్నది నిర్వివాదం. ఇది చదవటానికి కాస్త ఇబ్బంది కలిగించే అంశమైనా ఇక్కడ నిజాన్ని ఒప్పుకోక తప్పదు. ముస్లిములు కంటే ముందు సామాజిక సంస్కరణ బాధ్యతను దేవుడు యూదులకు అప్పజెప్పాడన్న విషయం ఖురాన్ చదివే ప్రతీ ముస్లింకూ ఎరుకే! వారిలో ఎందరినో ప్రవక్తలను, గ్రంధాలను పంపాడు. కానీ వారు సైతం ప్రపంచ ధ్యాసలో పడిపోయి తమకు ఇవ్వబడిన బాధ్యతను మరచిపోయినప్పుడు వారిని ఆ బాధ్యత నుండి తప్పించి, ప్రవక్త ముహమ్మద్ (స) అనుచరులకు సామాజిక సంస్కరణ బాధ్యతను అప్పగించాడు. వారికి సకల శుభాలు కల ఖురాన్ గ్రంధాన్ని ప్రసాదించాడు. ఇచ్చి ఏమంటున్నాడంటే…

“విశ్వాసులరా! మీలో ఎవరైనా ధర్మం నుండి వైదొలగిపోతేపోవచ్చు. అల్లాహ్ ఇంకా ఎంతో మందిని సృష్టిస్తాడు. అల్లాహ్ వారిని ప్రేమిస్తాడు. వారు అల్లాహ్ ను ప్రేమిస్తారు” – 5:54

ఒకవేళ మీరు విముఖులైతే, అల్లాహ్ మీ స్థానంలో మరో జాతిని దేన్నైనా తీసుకువస్తాడు. వారు మీవంటి వారై ఉండరు” – 47:38

ఒక వ్యక్తి తాను ముస్లింల ఇంట పుట్టినంత మాత్రానా అతనికి స్వర్గానికి టిక్కెట్టు కన్ఫమ్ అయిపోయినట్టు ఏ ముస్లిమూ గర్వపడాల్సిన పనిలేదు. ఎందుకంటే విశ్వాసులు ధర్మంలో ఉన్నంతవరకే అల్లాహ్ దృష్టిలో విలువకలిగి ఉంటారు. కాదని ధర్మం నుండి వైదొలగిపోయినా నష్టం ఏదీ ఉండదు. కావాలంటే వారిని తొలగించి వారి స్థానంలో వేరే జాతిని తీసుకువస్తానంటున్నాడు అల్లాహ్.

*********

కాబట్టి ముస్లిం సమాజం చెయ్యాల్సింది..!?

ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజంపై విరుచుకుపడుతున్న అనేక సమస్యలు, దౌర్జన్యాలు, ప్రస్తుతం దేశవ్యాప్తంగా NRC/CAB ల వంటి సమస్యలు ఒకవేళ దైవాగ్రహమే గనుక అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ముస్లిం సమాజం మేల్కొని, దైవానుగ్రహాన్ని పొందటానికి తక్షణం చెయ్యల్సింది ఏమిటి? అన్నది తెలుసుకోవటానికి ప్రయత్నించకపోతే పరిస్థితులు చేజారిపోయాక ఇక చేసేదేమీ ఉండదు.

1. ధర్మ ప్రచారం వేగవంతం చెయ్యాలి!

“ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికీ, వారి సంస్కరణకూ రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే (ముస్లిములే). మీరు మంచి చేయండి అని ఆజ్ఞాపిస్తారు. చెడు నుండి ఆపుతారు. ఆల్లాహ్ ను విశ్వసిస్తారు” – 3:110

ఈ వాక్యాన్ని బట్టి అసలు ముస్లిములను ఎన్నుకోవటంలో లక్ష్యమే సమాజ సంస్కరణ/ధర్మ ప్రచారానికి అని తెలుస్తుంది. అంటే పనులన్నీ మానేసి కేవలం ధర్మ ప్రచారం చేస్తూ కూర్చోమని కాదు. వారు భౌతిక జీవనంలో ఉధ్యోగాలు, చదువులు, వ్యాపారాలు చేస్తూనే తమ సమయాన్ని తమ పరిసరాల్లో నివసించే, తమ పొరుగున ఉండే ముస్లిమేతరులకు ఇస్లాం అంటే “ఏక దేవుని విధేయత ధర్మం” అని, అదేదో క్రొత్త ధర్మం కాదు అది పూర్వం నుండీ దేవుడు ఇస్తూ వస్తున్న ధర్మమే, అదే ధర్మం సకల ధార్మిక గ్రంధాల్లో ఇవ్వబడిందనే విషయం తెలియజేయాలి. ఒకవేళ క్రైస్తవులైతే వారి బైబిల్లో ఇస్లాం పురాతన ధర్మంగా పరిచయం కాబడిందని, దానినే యేసు కూడా బోధించారని, సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే ఆయనే “యాహ్వే”గా బైబిల్లో పరిచయమయ్యాడు ఆయనే అల్లాహ్ గా ఖురాన్లో పరిచయమయ్యాడన్న విషయం తెలియజేసి అసలు ధర్మం వైపునకు వారిని ఆహ్వానించాలి. అదే హిందువులైతే ఒకనాడు వేదోపనిషత్తుల్లో చెప్పబడిన “ఏక దేవుని విధేయత ధర్మమే ఇస్లాం” తప్ప “ఏకదేవుని విధేయతా ధర్మానికి అతీతమైనది ఇస్లాం కాదు” అన్న విషయాన్ని తెలియజేసి, సమాజంలో “మనందరి ధర్మం ఒక్కటే, మనమంతా ఒక్కటే, మనందరి దేవుడు ఒక్కడే” అన్న నినాదాన్ని సర్వసామాన్యం చెయ్యాలి. ఇది ప్రతీ ముస్లిం ప్రాథమిక బాధ్యత. ఈ పని చేస్తున్నంత కాలం ముస్లిం సమాజం పై ప్రమాదం ఎటునుండి వచ్చినా రక్షణ కవచంగా అల్లాహ్ కారుణ్యం ఉంటుంది.

2. ధర్మంలో మనకు అనుకూలంగా ఉన్నవాటిని అనుసరించటం మానెయ్యలి

ధర్మంలో మనకు అనుకూలంగా ఉన్న అంశాల్ని అనుసరిస్తూ మిగతావాటిని వదిలి పెట్టటం జాతి నాశనానికి కారకం అవుతుంది అన్నది ముందు గమనించాలి. ఉదాహరణకు: ఖురాన్ 5 పుట్లా నమాజ్ కచ్చితంగా చేస్తే సకల చెడులకు మనిషి దూరంగా ఉంటాడు అంటే- నా జాబ్ వల్ల లేక వ్యాపారం వల్ల 5 పుట్ల నమాజ్ సాధ్యం కాదని శుక్రవారం మాత్రమే వెళ్లటం, ఖురాన్ పరాయి స్త్రీలను పట్ల దృష్టి సారించవద్దు అంటే పని కట్టుకుని చూడటం, ఖురాన్ పురుషులకు మహార్ ఇచ్చి పెళ్లి చేసుకొమంటే మహార్ (కట్నం) ఎదురు తీసుకుని పెళ్లిచేసుకోవటం, ఖురాన్ లో అల్లాహ్ ఒక్క నన్ను తప్ప ఎవర్నీ వేడుకోవద్దు అని ఉంటే ఫలానా బాబా వారి వద్దకు వెళ్లి మ్రొక్కుకుంటే మీ వేడుకోళ్లు స్వీకరించబడతాయి అని ఎవరో చెబితే అల్లాహ్ ఆదేశాన్ని తుంగలో త్రొక్కటం వగైరా వన్నీ ధర్మంలో తనకు నచ్చిన వాటిని మాత్రమే చెయ్యటం అవుతుంది. ఇది అత్యంత ప్రమాదకరం

3. ముస్లిం సమాజంలో జమాత్ లన్నీ అనైక్యతను విడిచి ఐక్యమవ్వాలి

సమాజంలో మనకు నచ్చిన జమాత్ లను, మనకు నచ్చిన వ్యక్తులను సమర్థించటం మనకు నచ్చని తోటి జమాత్ వర్గానికి చెందిన ముస్లిములను హీనంగా చూడటం, శత్రువులుగా భావించి వారిని దూరం పెట్టటం, ముస్లిం సమాజంలో వ్యక్తులు జామాతులుగా విడిపోయి ఒకరికొకరు సహకరించుకోకపోవటం అన్నది సార్వత్రిక ముస్లిం సమాజానికే అది ఎంతో ప్రమాదకరం. ఇదే విషయాన్ని అల్లాహ్ ఈ క్రింది విధంగా తెలియజేస్తున్నాడు.

“సత్యతిరస్కారులు పరస్పరం సహాయం చేసుకుంటారు. ఒకవేళ మీరు పరస్పరం సహాయం చేసుకోకపోతే భూమిపై హింసా దౌర్జన్యాలూ, అల్లకల్లోలమూ చెలరేగుతాయి” – 8:73

అసలు ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజంపై విరుచుకుపడుతున్న అనేక సమస్యలకు, జరుగుతున్న దౌర్జన్యాలకు అసలు కారణం ముస్లిముల మధ్య ఐక్యత లేకపోవటం. ఐక్యత లేనప్పుడు ముస్లిం సమాజం ఎంతపెద్దదైనా శత్రువులకు దానిపై దౌర్జన్యం చెయ్యటం ఎంతో సులువవుతుంది. అదే విషయం అల్లాహ్ పై వాక్యంలో చెబుతున్నాడు. అల్లాహ్ చెప్పిందే నేడు ముస్లిం సమాజంలో జరుగుతుంది. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే ఐక్యమవ్వటం కాదు సమస్య రానప్పటికీ ముస్లిం సమాజంలో ఎన్ని జమాతులు ఉన్నా వారి విధానాలు వేరు వేరుగా ఉన్నా వారి జమాత్ ఐడెంటిటీలను చెరిపేసుకోనక్కర్లేదు. తబ్లిగ్ జమాత్ అయినా, అహ్లెహదీస్ అయినా, జమాతే ఇస్లామీ హింద్ అయినా ఎవరైనా వారి జమాత్ పేర్లను అలా ఉంచుతూనే వారి వారి విధానాలను అనుసరించుకుంటూనే అన్ని జమాత్ సభ్యులు కలిసి కట్టుగా “అల్-జమాత్”గా ఏర్పడి సహాయ సహకారాలు అందించుకోవాలి. తద్వారా వర్గం పటిష్టం అవుతుంది. సార్వత్రిక ముస్లిం సమాజంపై ఎవరైనా ఎటువంటి దౌర్జన్యానికి పాల్పడాలన్నా ధైర్యం సరిపోదు. ఇప్పటి వరకు చదివిన విషయాలను దృష్టిలో పెట్టుకుని ముస్లిం సమాజంపై అల్లాహ్ ఆగ్రహంలో భాగంగా విరుచుకుపడుతున్న సమస్యల నుండి తప్పించబడాలంటే ఆయన అనుగ్రహం పొందాలంటే తక్షణం ఎవరికి వారే వ్యక్తిగత సంస్కరణతో పాటు, సామాజిక సంస్కరణ పట్ల నడుం బిగించాలి. అలాంటి ముస్లిములు తప్ప అందరూ నష్టానికి గురై ఉన్నవారే. ఎగ్జాక్ట్ గా ఇదే విషయాన్ని ఖురాన్ ఈ క్రింది విధంగా హెచ్చరిస్తుంది.

“నిస్సందేహంగా మానవుడు పెద్ద నష్టానికి గురై ఉన్నాడు. విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉండేవారు, ఒకరికొకరు సత్యోపదేశం, సహాన బోధ చేసుకునేవారు తప్ప” – 103: 1-3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *