ఖురాన్లో అల్లాహ్ ముస్లిములను- ‘విశ్వాసులారా! యూదులు-క్రైస్తవులనూ మీ మిత్రులుగా చేసుకోకండి’ -5:51 అని అంటుంది. అలాంటప్పుడు బైబిల్లో యెహోవా అల్లాహ్ ఎలా కాగలుగుతాడు? అన్నది నేటి అధికశాతం మంది అభినవ ఇస్లామోఫోబిక్కులైన క్రైస్తవ సువార్తీకుల వాదన. ఇలాంటి వాదన చేసేవారు ముందుగా తెలుసుకోవలసిండింది- ఖురానులో అల్లాహ్ సకల యూదులు-క్రైస్తవులందరినీ మిత్రులుగా చేసుకోవద్దని అంటున్నాడా? అన్నది. అంతకంటే ముందు తెలుసుకోవలసింది ఖురాన్లో సర్వసృష్టికర్త అయిన అల్లాహ్ యూదులు-క్రైస్తవుల గురించి చెబుతున్నదేమిటో జాగ్రత్తగా చదవగలరు.
“గ్రంథ ప్రజలు (యూదులు-క్రైస్తవులు) ఒకలాంటివారు కాదు. వారిలో సత్య మార్గంలో స్థిరంగా ఉన్నవారు కూడా కొందరు ఉన్నారు. వారు రాత్రి సమ యాలలో అల్లాహ్ ఆయతులను పఠిస్తారు. ఆయన ముందు సజ్దా చేస్తారు. అల్లాహ్‌ను అంతిమ దినాన్ని విశ్వసిస్తారు. మంచి చెయ్యండి అని ఆజ్ఞాపిస్తారు. చెడుల నుండి ఆపుతారు. సత్కార్యాలలో సైతం చురుకుగా ఉంటారు. వారు సజ్జనులు” – 3:113
“విశ్వాసుల పట్ల మైత్రి విషయంలో ”మేము క్రైస్తవులం” అని అన్న వారిని అత్యంత సన్నిహితులుగా చూస్తావు. దీనికి కారణం ఏమిటంటే- వారిలో దైవభక్తిగల విద్వాంసులూ, ప్రపంచాన్ని పరిత్యజించిన సన్యాసులూ ఉన్నారు. ఇంకా వారిలో అహంభావం లేదు” -5:83-86
పై వాక్యాలను బట్టి యూదులు-క్రైస్తవులందరూ ఒకలాంటి వారు కాదని తెలుస్తుంది. పైగా యూదులు మరియు క్రైస్తవులలో సత్య మార్గంలో స్థిరంగా ఉన్న సజ్జనులు, దైవభక్తి పరాయణులు కూడా ఉన్నారని స్వయంగా సృష్టికర్త అయిన అల్లాహ్‌యే ప్రకటిస్తున్నాడు.
అయితే 5:51 వ వాక్యంలో ‘యూదులు-క్రైస్తవులనూ మీ మిత్రులుగా చేసుకోకండి’ అని ఖురాన్ చెబుతుంది ఏ రకమైన యూదులు-క్రైస్తవుల గురించి? అన్నది తెలుసుకోవాలంటే కంగారుపడకుండా ఈ క్రింది వచనాన్ని జాగ్రత్తగా చదవాలి.
“విశ్వాసులారా! మీకు పూర్వపు గ్రంథ ప్రజలలో (యూదులు-క్రైస్తవులలో) మీ ధర్మాన్ని ఒక పరిహాసంగా, ఒక వినోద వస్తువుగా పరిగణించిన వారినీ, ఇతర అవిశ్వాసులనూ మీ మిత్రులుగా, సహచరులుగా చేసుకోకండి” -5:57
పై ఖురాన్ వాక్యం జాగ్రత్తగా చదివితే- ఖురాన్ మిత్రులుగా చేసుకోవద్దని చెబుతుంది – “ధర్మాన్ని ఒక పరిహాసంగా, ఒక వినోద వస్తువుగా పరిగణించిన యూదులు-క్రైస్తవులను” మాత్రమే!
పై వివరణను బట్టి మొత్తం యూదులు-క్రైస్తవుల్లో రెండు రకాల వ్యక్తులు ఉన్నారని తెలుస్తుంది.
1. సత్య మార్గంలో స్థిరంగా ఉన్నవారు, మంచి చెయ్యండి అని ఆజ్ఞాపిస్తూ, చెడుల నుండి ఆపుతూ, సత్కార్యాలలో సైతం చురుకుగా ఉండేవారు.
2. ధర్మాన్ని ఒక పరిహాసంగా, ఒక వినోద వస్తువుగా పరిగణించిన వారు.
అయితే ఖురాన్ 5:51 వాక్యంలో మీ మిత్రులుగా చేసుకోకండి అని చెబుతున్నది కేవలం ” ధర్మాన్ని ఒక పరిహాసంగా, ఒక వినోద వస్తువుగా పరిగణించిన పై రెండవ రకం యూదులు-క్రైస్తవులనే తప్ప సమస్త యూదులు-క్రైస్తవులను కానే కాదు.
అయితే ఎలాగోలా ఇస్లాం ను విమర్శించాలనే హడావిడిలో పడి ఉండే బోధకులకు కంగారు తప్ప పెద్దగా ఆలోచన ఉండదు. వారికి కంగారు కంగారుగా వాక్యాలను పై పైన చదివేయటం, వాక్యాల సందర్భం చూడకుండానే అది తప్పు, ఇది తప్పు అని స్వంత తీర్మానాలు చేసెయ్యటం వారికి ఉండే ఓ బేసిక్ ఫీచర్
ఖురాన్- యూదులను, క్రైస్తవులనుమిత్రులుగా చేసుకోవద్దని చెబుతుందా?
