అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ వ్యాసాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిందిగా నేను ప్రత్యేకంగా ఈనాటి ప్రవక్త ముహమ్మద్ (స) పట్ల వ్యతిరేక భావన కలిగిన క్రైస్తవులను ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే అధిక శాతం క్రైస్తవ బోధకులు చేస్తున్న విమర్శ – “ముహమ్మద్ ప్రవక్త కానేకాదు! ఆయన మీదకు ఏ దైవవాణీ అవతరించలేదు! ఆయన మా బైబిల్ని కాపీ కొట్టేసి దానికి ఖురాన్ అని పేరుపెట్టి తనకుతానుగా ప్రవక్త పదవిని ప్రకటించేసుకున్నారు! అన్నది.
ముహమ్మద్ (స) ప్రవక్తా? కాదా? అన్న వాదన క్రొత్తదా? పాతదా? అన్న ప్రశ్నకు సమాధానం- కచ్చితంగా పాతదే! ముహమ్మద్ (స) ప్రవక్తా? కాదా? అన్న వాదన ముహమ్మద్ (స) “తాను ఎప్పుడైతే దేవుని ప్రవక్తగా నియమించబడ్డాను” అని ప్రకటించుకున్నారో ఆ క్షణమే మక్కా బహుదైవారాధకులు, యూదులు, క్రైస్తవులు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు! వివరంగా చెప్పాలంటే- ఈనాడు “ముహమ్మద్ దైవ ప్రవక్త కానేకాదు!ఆయన మీదకు ఏ దైవవాణీ అవతరించలేదు! అన్న విమర్శ ఈనాటి యూద-క్రైస్తవులు క్రొత్తగా లేవనెత్తినదా? లేక ముహమ్మద్ (స) జీవించి ఉన్నప్పటి నుండే ప్రారంభం అయిందా? ఆయన ఉన్నప్పుడు ఆయన సక్షంలోనే యూదులు, క్రైస్తవులు, మక్కా బహుదైవారాధకులు మరియు ముహమ్మద్ (స) అనుచరులైన విశ్వాసుల మధ్య ఆయన ప్రవక్తా? కాదా? చర్చ జరిగేది! కాబట్టి ముహమ్మద్ (స) ప్రవక్తా? కాదా? అన్న వాదన ఈనాటి క్రైస్తవులు లేవనెత్తుతున్న వాదన క్రొత్తదేమీ కాదు! పాతదే!
ఈ విషయాన్ని మనం కాస్త వివరంగా మనం తెలుసుకోవాలంటే ఒకసారి మనం పద్నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం ముహమ్మద్ (స) ఉన్నప్పటి కాలంలోకి వెళ్ళాలి. ఆనాటి పరిస్థితులు గమనిస్తే- అప్పటివరకూ తమ మధ్య ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ సామాన్య చదువు రాని యువకుడొకడు “సృష్టికర్త అయిన దేవుడు నన్ను ప్రవక్తగా నియమించి మీ వద్దకు పంపాడు! నాపై దైవవాణి అవతరిస్తుంది, మీరు నన్ను అనుసరించాలి” అన్న ప్రకటన చేయగానే ఆనాటి అరబ్బులందరూ ఆయనను ప్రవక్తగా అంగీకరించి, పల్లకి మీద ఏమీ ఊరేగించలేదు! గత ప్రవక్తల విషయంలో జరిగినట్టే కొందరు తప్ప మొత్తం మక్కా విగ్రహారాధకులందరూ ఆయన్ని తిరస్కరించారు. “నువ్వొక స్వయం ప్రకటిత ప్రవక్తవు, నీ మీద ఏ దైవవాణీ అవతరించలేద”ని ముఖం మీదే విమర్శించటం మొదలెట్టారు. సామాన్య ప్రజల మనసుల్లో ఆయన పట్ల సందేహాలు రేకెత్తించారు. అంతేకాదు అరేబియాలో అప్పటికే నివసిస్తున్న యూద-క్రైస్తవ పండితులు సైతం అచ్చం ఇదే విధంగా విమర్శించి ముహమ్మద్ (స) వారిని ఓ అబద్ధ ప్రవక్తగా ముద్ర వెయ్యటానికి ప్రయత్నాలు మొదలెట్టేశారు.
అయితే కాలం గడిచేకొద్ది ముహమ్మద్ (స) వారిపై అవతరిస్తున్న వాణి (ఖురాన్) మహత్తును తెలుసుకునే వారి సంఖ్య పెరుగుతూ పోవటం, అలాగే ముహమ్మద్ (స) వారి అతి కొద్ది విశ్వాసుల సమూహం వేలకొద్ది సైన్యాలను ఓడించటం, ఆయన నడవడికను చూసి ఆయన్ని ప్రవక్తగా విశ్వసించే వారి సంఖ్య ద్విగుణీకృతం అవుతూ ఇస్లాం పరిధి పెరగటం ప్రారంభం అయిపోయింది. ఇక అలా చూస్తూ ఊరుకుంటే మొత్తం అరేబియా ముహమ్మద్ (స) ఆధీనంలోనికి వచ్చేస్తే, అప్పటికే కల్పిత మత విశ్వాసాలను సృష్టించి, ప్రజలను తమ గుప్పిట్లో పెట్టుకుని, వారిని ద్వారా లాభం సంపాదించుకుంటున్న కొందరు మత పండితుల వేషాల్లో ఉన్న దుర్మార్గులకు తమ ఆగడాలు ఇక సాగవు అన్న స్పష్టత వచ్చేసింది.
*****************
ముహమ్మద్ (స) తమ సమక్షంలో ఉండగా ఆనాటి యూద, క్రైస్తవ పండితులు ఆయనను అబద్ధ ప్రవక్త అని నిరూపించటంలో ఎందుకు విఫలమయ్యారు?
ఆనాడు ముహమ్మద్ (స) ఉన్నప్పటి సందర్భం (context) ఎటువంటిదంటే- అటు మక్కా తిరస్కారులు, ఇటు అవిశ్వాసులైన యూద-క్రైస్తవ పండితులు ముహమ్మద్ (స) ను ఒక అబద్ధ ప్రవక్త అని నిరూపించటానికి ఓ రవ్వంత “ఆధారం” అయినా దొరుకుతుందేమో అని రాత్రింబవళ్లూ పెద్ద పెద్ద భూతద్దాలు పెట్టుకుని వెతుకుతున్న సమయం! వివరంగా చెప్పాలంటే- ఆయన ప్రవచిస్తున్న ఖురాన్ లో గానీ, ఆయన చెబుతున్న మాటలలో గానీ ఎక్కడైనా చిన్న పొరపాటు, లేదా అతి స్వల్పమైన అబద్ధం లేదా అసంబద్ధ విషయం దొర్లినా చాలు అమాంతంగా ఆయనను చుట్టుముట్టి బహిరంగంగా ఆయనను అవమానించి, ఆయన పై అబద్ధ ప్రవక్త అన్న ముద్ర వేసి, ఆయన ప్రచారం చేస్తున్న ధర్మాన్ని సమూలంగా నిర్మూలించి, ఆయనపై అవతరిస్తున్న ఖురాన్ కేవలం ఓ కట్టుకథ అని నిరూపించి, ఆయనను నామరూపాలు లేకుండా చేయాలని చూస్తున్న సమయం. సరిగ్గా ఆ సమయంలోనే ఈ క్రింది ఖురాన్ ఈ క్రింది ఛాలెంజ్ ను విసిరింది.
ఈ సందేసహరుణ్ణి, చదవనూ వ్రాయనూ రాని ఈ ప్రవక్తను అనుసరించేవారు (ఈనాడు ఈ కారుణ్యానికి అర్హులు) అతని ప్రస్తావన వారికి (యూదులు-క్రైస్తవులకు) తమ వద్ద ఉన్న తౌరాత్ (ధర్మశాస్త్రం), ఇంజీలు (సువార్త) గ్రంధాలలో వ్రాయబడి లభిస్తుంది. – 7:157
ఇక్కడ ముఖ్యంగా దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలు:
1.ఈ వాక్యం అవతరించేటప్పుడు ప్రత్యక్షంగా ముహమ్మద్ (స) వారు ఆనాటి మక్కా తిరస్కారులు, యూద-క్రైస్తవ పండితుల సమక్షంలో ఉన్నారు.
2.తౌరాత్ (ధర్మశాస్త్రం), ఇంజీలు (సువార్త) గ్రంధాలు ఆనాటి యూద-క్రైస్తవ పండితుల చేతుల్లో ఉన్నాయి. వారు వాటి యొక్క లోతైన జ్ఞానం కలిగి ఉన్నారు.
“అతని ప్రస్తావన వారికి (యూదులు-క్రైస్తవులకు) తమ వద్ద ఉన్న తౌరాత్ (ధర్మశాస్త్రం), ఇంజీలు (సువార్త) గ్రంధాలలో వ్రాయబడి లభిస్తుంది” అన్న ప్రకటన చెయ్యబడినప్పుడు ఇక ముహమ్మద్ (స) ను అబద్ధ ప్రవక్త అని నిరూపించటానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది? చెప్పండి!
ఎందుకంటే ఈ ఖురాన్ వాక్యం (7:157) ఎప్పుడు అవతరించింది? అంటే- ఓ ప్రక్క ముహమ్మద్ (స) తనను దైవ ప్రవక్త ను అని ప్రకటించుకున్న నేపథ్యంలో మరో ప్రక్క మక్కా అవిశ్వాసులు, యూదులు-క్రైస్తవులు తమ సమక్షంలో ఉన్న ముహమ్మద్ అసలు ప్రవక్తే కాదు ఆయన ప్రస్తావన మా గ్రంధాల్లో లేనే లేదు అని నిరూపించటానికి అవకాశాలు వెదుకుతున్న సందర్భంలో పై వాక్యం అవతరించింది.
నిజంగా ముహమ్మద్ (స) ప్రస్తావన బైబిల్లో లేకపోయి ఉంటే…
ఇక్కడ క్రైస్తవులు గమనించాల్సింది- నిజంగా ముహమ్మద్ (స) పేరు, ప్రస్తావనలు బైబిల్లో వ్రాయబడి లేకుంటే “అతని ప్రస్తావన వారికి (యూదులు-క్రైస్తవులకు) తమ వద్ద ఉన్న తౌరాత్ (ధర్మశాస్త్రం), ఇంజీలు (సువార్త) గ్రంధాలలో వ్రాయబడి లభిస్తుంది” అన్న వాక్యం అవతరించగానే అప్పుడే ముహమ్మద్ (స) కథ ముగిసిపోయి ఉండేది! ఇస్లాం ఆనాడే నామరూపాలు లేకుండా పోయేది. ఆనాడే యూదులు-క్రైస్తవులు ముహమ్మద్ (స) ను నమ్ముకున్న కొద్దిమంది విశ్వాసుల సమూహాన్ని పిలిచి వారి ముందు తౌరాత్, ఇంజీలు గ్రంధాలు పెట్టి “చూడండయ్య! మీరు ప్రవక్త అని నమ్ముకున్న వ్యక్తి పిచ్చి ఎంతగా ముదిరిపోయిందంటే ఆయన ప్రస్తావన తౌరాత్, ఇంజీలు గ్రంధాలలో ఉందని చెప్పుకునేంతగా ముదిరిపోయింది! ఆయన ప్రస్తావన తౌరాత్, ఇంజీలు గ్రంథాలలో ఎక్కడా లేదు! ఈయన అబద్ధ ప్రవక్త అని చెప్పటానికి ఇంతకంటే ఆధారం మీకు ఇంకేం కావాలి?” అని చెప్పి ఆయన నామరూపాలు ఆనాడే లేకుండా చేసేసి ఉండేవారు.
కానీ జరిగింది వేరు!
ఎప్పుడైతే “అతని ప్రస్తావన వారికి (యూదులు-క్రైస్తవులకు) తమ వద్ద ఉన్న తౌరాత్ (ధర్మశాస్త్రం), ఇంజీలు (సువార్త) గ్రంధాలలో వ్రాయబడి లభిస్తుంది” అన్న వాక్యం అవతరించిందో అప్పటి నుండే ఆనాటి మక్కా అవిశ్వాసులు, యూద-క్రైస్తవ పండితులు తమ వద్ద ఉన్న తౌరాత్ (ధర్మశాస్త్రం), ఇంజీలు (సువార్త) గ్రంధాలను తెరచి పరిశీలించటం మొదలెట్టారు. ముహమ్మద్ (స) ప్రస్తావన, ఆయన రానున్న ప్రదేశం, పేరుతో సహా వ్రాయబడి ఉండటం చూసి ఎందరో యూదులు, క్రైస్తవులు ఇస్లాంలోకి చేరిపోయారు. కొందరు సత్యం కళ్ల ఎదుట ఉన్నప్పటికీ తమ అహంకారం కారణంగా ఆయన్ని ప్రవక్తగా అంగీకరించలేక మౌనంగా ఉండిపోయారు.
*****************
ఖురాన్ విసిరిన రెండవ ఛాలెంజ్!
తమ అరబ్బీ పాండిత్యాన్నీ చూసుకుని విర్రవీగుతూ, “ముహమ్మద్ (స) పై వతారిస్తున్న ఖురాన్ అతని స్వంత రచన!” అన్న మరో విమర్శను ఆనాటి అవిశ్వాసులైన అరబ్బులు లేవనెత్తినత్తారు. సరిగ్గా ఆ నేపథ్యంలో ఖురాన్ వారికి మరో ఛాలెంజ్ విసిరింది.
“మేము మా దాసునిపై అవతరింపజేసిన గ్రంధం గురించి, అది మా గ్రంధం అవునో కాదో అని మీకు సందేహం ఉన్నట్లైతే దానివంటి ఒక్క ఆద్యాయం (సూరా) రచించి తీసుకురండి. మీ సహచరులందరినీ పిలుచుకోండి. – 2:23
ఖురాన్ ముహమ్మద్ స్వంత రచన అని చెప్పటానికి కూడా ఆనాటి అవిశ్వాసులకు పై వాక్యం మంచి అవకాశం లాంటిది అని చెప్పవచ్చు! ఎందుకంటే అప్పటికే అరబ్బీ సాహిత్యంపై మంచి పట్టు ఉన్న ఎందరో సాహిత్యపరులు, కవులూ ఉన్న కాలం అది. ఆ సమయంలో ఖురాన్ ” దానివంటి ఒక్క ఆద్యాయం (సూరా) రచించి తీసుకురండి” అన్న సవాలు విసిరినప్పుడు ఖురాన్లో కేవలం మూడు, నాలుగు లైన్లు ఉన్న ఏదైనా చిన్న ఆద్యాయం వంటి ఒక అధ్యాయాన్ని రచించి “ఇదిగోనయ్య మహమ్మద్ నీ ఖురాన్ ఛాలెంజ్ చేసినట్టే మేము దాని కంటే మెరుగైన భాషలో ఒక్క ఆద్యాయం రచించి తీసుకొచ్చాం! నీ ఛాలెంజ్ లో నువ్వు ఓడిపోయావ్” అని కూడా చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఖురాన్ చేస్తున్న పై చాలెంజులు అన్నీ ప్రవక్త ముహమ్మద్ (స) సమక్షంలో ఆయన ఉన్నప్పుడు చెయ్యబడినవే కదా!
కానీ, ఖురాన్ విసిరిన ఈ రెండవ ఛాలెంజ్ లో సైతం ఆనాటి మొత్తం అరబ్బు అవిశ్వాసులు, యూద-క్రైస్తవ పండితులు ఓడిపోయారు. ఖురాన్ భాషకు సరితూగగల ఒక చిన్న అధ్యాయం వంటి అధ్యాయాన్ని ఎన్ని తంటాలు పడినా ఎవరూ రచించలేకపోయారు. చివరకు ఆయన ప్రస్తావన తౌరాత్, ఇంజీల్ గ్రంధాలలో వ్రాయబడి లేదని కూడా నిరూపించలేకపోయారు. ఆ విధంగా ముహమ్మద్ (స) ను ప్రవక్త కాదని చేసిన సకల ప్రయత్నాలు నిట్ట నిలువునా కుప్ప కూలిపోయాయి. అంతేకాదు ఆనాటి నుండి ఈనాటివరకూ అరబ్బీ భాష వచ్చిన అరబ్బు దేశాలలో నివసిస్తున్న మిలియన్ల కొద్ది క్రైస్తవులలో లేదా యూదులలో ఏ ఒక్కరూ ఖురాన్ లోని అధ్యాయానికి సరితూగగల అధ్యాయాన్ని రచించలేకపోయారు.
ఆ విధంగా ముహమ్మద్ (స) సత్య ప్రవక్తా? కాదా? అన్న ప్రయోగం (Experiment) ఆయన సమక్షంలోనే జరిగిపోయింది. అన్ని విధాలుగా ఆయన దేవుని సత్య ప్రవక్త అన్న విషయం ఆయన ఉన్నప్పుడే తేలిపోయింది. దాని పరిణామం ఏంటంటే- ఆయన ప్రవక్తగా ఉన్న 23 సం.ల కాలంలోనే లక్షల మంది ఇస్లాం స్వీకరించేశారు దాని ఒరవడి గత 1400 వందల సం.లుగా అత్యంత వేగంగా సాగుతూనే ఉంది. ఆయన గత 14 శతాబ్దాలుగా ప్రపంచ మానవాళి పై ఎంతగా తన ప్రభావాన్ని వెయ్యగలిగారంటే ఈనాడు ప్రపంచ జనాభా మూడొంతుల్లో ఒక వంతు జనాభాను తన అనుచరులుగా మార్చుకోగలిగినంత. కానీ, ఈ వాస్తవాలను జీర్ణించుకోలేని యూదులు- క్రైస్తవులు మటుకు ఇంకా విమర్శిస్తూ మిగిలిపోయారు.
ముహమ్మద్ (స) ప్రవక్తా? కాదా? అన్న వాదన క్రొత్తదా? పాతదా?
