యూనిలాట్రలిజం & ఇస్లాం!

“యూనిలాట్రలిజం (Unilateralism)” తెలుగులో చెప్పాలంటే- “ఏక పక్ష సిద్ధాంతం” అంటారు. సంక్షిప్తంగా వివరించాలంటే- అవతలి వారు పరిచయస్థులు కానప్పటీ లేదా వారి మద్దతు సహకారం లేనప్పటికీ ఇవతలి వ్యక్తి తన తరఫున ఏకపక్షంగా ఇతరుల ప్రయోజనాల కొరకు సహాయాన్ని లేదా మద్దతును ఇవ్వటం అన్నమాట! దీనికి భిన్నమైన మరొక దృక్పథం ఉంది దానిని -“మల్టీలాట్రలిజం” (Multilateralism)” అంటారు. అంటే – అవతల వ్యక్తి సహాయపడితేనే నేనూ సహాయపడతాను, అవతలి వ్యక్తి మద్దతు ఇస్తేనే నేనూ అతనికి మద్దతు ఇస్తాను, అవతలి వ్యక్తి నాకు సహకరిస్తేనే నేనూ సహకరిస్తాను అన్నది. ఇక ఈ “యూనిలాట్రలిజం” దృక్పథం అంతర్జాతీయ స్థాయి నిపుణులు, రాజకీయ వేత్తలు ఇతర దేశాలతో ఆరోగ్యకరమైన సంబంధాలు కలుపుకోవటానికి ఆమోదించిన విధానం. అగ్రరాజ్యాల నుండి అనేక దేశాలు రాజకీయంగా ఇతర దేశాలతో సంబంధాలు బలపర్చుకోవటానికి ఈ “యూనిలాట్రలిజం (Unilateralism)” విధానన్నే అంతర్జాతీయ స్థాయిలో అవలంబిస్తూ ఉంటాయి.

అదే విధంగా ఈ “యూనిలాట్రలిజం” దృక్పథాన్ని ఒక వ్యక్తి అవలంబిస్తే దానిని “యూనిలాట్రల్ ఎథిక్స్” (Unilateral Ethics) అంటారు. సంక్షిప్తంగా దీని అర్థం- ఇతరులు నాపట్ల చెడుగా ఆలోచించినా వారి పట్ల మంచి ఆలోచన కలిగి ఉండటం అలాగే నాకు ఏ సహాయం చెయ్యకపోయినా వారికి సహాయపడటం చివరకు నా పట్ల శత్రు భావం కలిగి ఉన్నప్పటికీ అతని పట్ల దయా భావం కలిగి ఉండటం, స్నేహానికి చెయ్యి చాచటం అన్న మాట! ఈ “యూనిలాట్రల్ ఎథిక్స్” (Unilateral Ethics) ని కలిగి ఉండటం అన్నది అత్యుత్తమమైన వ్యక్తిత్వ విలువలు, నైతిక విలువలు, సహనం ఉన్న వారికే సాధ్యపడుతుంది.

పై విలువలకు పూర్తి భిన్నమైన వ్యక్తిత్వ విలువలు కొందరు కలిగి ఉంటారు. వాటినే- “బైలాట్రల్ ఎథిక్స్ (Bilateral ethics)” అంటారు. అంటే- “ద్వైపాక్షిక విలువలు” అన్న మాట!. అంటే- అవతలి వ్యక్తి నాకు మంచి చేస్తేనే నేను అతనికి మంచి చేస్తాను, నా పట్ల చెడుగా ఆలోచిస్తే నేను అతని పట్ల చెడుగా అలోచిస్తాను, నాకు హాని తలపడితే అతనికి హాని తలపెడతాను” అన్నది. నిజానికి ఇది ఒకరకంగా ఆటవిక లేక మృగతుల్యమైన వ్యక్తిత్వం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక సుందర శాంతియుత సమాజం, ఆరోగ్యకరమైన వ్యక్తిత్వ సంబంధాలు అనేవి ఒక్క “యూనిలాట్రల్ ఎథిక్స్” (Unilateral Ethics) ద్వారానే సాధ్యమౌతాయి తప్ప “బైలాట్రల్ (Bilateral ethics)” ద్వారా సుందర, శాంతియుత సమాజం అనేది అసాధ్యం కాబట్టి. నాకు చెడు తలపెట్టినప్పటికీ నేను మంచినే తలపెడతాను అన్న “యూనిలాట్రల్ ఎథిక్స్” (Unilateral Ethics) దేవుని ద్వారా ఒక్క మానవునికే ఇవ్వబడిన వరం. కానీ నాకు చెడు తలపెడితే నేనూ చెడు తలపెడతాను అన్నది జంతు లక్షణం.

ఇప్పటివరకూ నేను చెప్పినదంతా ఎంతో అనుభవజ్ఞులైన వ్యక్తిత్వ నిర్మాణ నిపుణులు, సామాజిక విశ్లేషకులు, అంతర్జాతీయ నిపుణులు, రాజకీయ వేత్తలు ఎన్నో పరిశోధనలు, విశ్లేషణలు చేసి తేల్చి చెప్పిన విషయాలు. కానీ, అసలు ఇస్లాం పూర్తిగా “యూనిలాట్రల్ ఎథిక్స్” (Unilateral Ethics) ఆధారంగానే వ్యక్తిత్వ నిర్మాణం చేస్తుందన్న విషయం ఈనాటి అతి కొద్ది మంది ఆధునిక వేత్తలకు మాత్రమే తెలిసిన విషయం అనటం అతిశయోక్తి కాదేమో!

నేటి గొప్ప విధ్యావేత్తలు, నిపుణులు ఎందరో ఈనాడు ఎన్నెన్నో విశ్లేషణలు చేసి చెబుతున్న “యూనిలాట్రల్ ఎథిక్స్” (Unilateral Ethics) గురించి ఓ పద్నాలు వందల ఏళ్ల క్రితం మక్కా అనే ఓ చిన్న గ్రామంలో, నిరక్ష్యరాశి అయిన ముహమ్మద్ అనే వ్యక్తి బోధించటమే కాక, ఆ విధమైన విలువలను ఆచరణాత్మకంగా ఎలా కలిగి ఉండవచ్చో, వాటి ప్రకారం ఒక సుందర శాంతియుత సమాజం ఎలా నిర్మించవచ్చో కూడా చూపటం జరిగిందన్న విషయం చాలా మందికి తెలియని విషయం. “యూనిలాట్రలిజం” లేదా “యూనిలాట్రల్ ఎథిక్స్ (Unilateral Ethics)” ఎంతో స్పష్టంగా ప్రవక్త ముహమ్మద్ (స) ద్వారా ఇవ్వబడిన ఖురాన్ లో 1400 సం. క్రితమే ఈ క్రింది విధంగా చెప్పటం జరిగింది.

“ప్రవక్తా! మంచీ, చెడు ఒకటి కావు. నీవు చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు. అప్పుడు నీ పట్ల శత్రుభావం కలవాడు నీకు ప్రాణ స్నేహితుడైపోవటాన్ని నీవు గమనిస్తావు. ఈ సుగుణ యోగం సహాన శీలురకు తప్ప మరెవరికీ లభ్యం కాదు. ఈ స్థానం మహా అదృష్టవంతులకు తప్ప మరెవరికీ లభ్యం కాదు. – 41:34-35

“చెడును చెడు ద్వారా తొలగించటం అన్నది కొందరు ఆధునిక భౌతిక వాదులు చెప్పే ప్రక్రియ అయితే ఇస్లాం దానికి పూర్తి భిన్నంగా చెడును మంచి ద్వారా తొలగించటం అన్న ప్రక్రియను నేర్పుతుంది. అంటే ఇతరులు మీ పట్ల చెడు చేయాలని చూస్తున్నప్పటికీ మీరు వారి పట్ల మంచినే చెయ్యమంటుంది. దీనినే ఖురాన్ “అత్యుత్తమ సుగుణయోగం” అంటుంది, దానినే నేటి ఆధునిక వేత్తలు “యూనిలాట్రల్ ఎథిక్స్ (Unilateral Ethics)” అంటున్నారు. ఈ అత్యుత్తమ విలువలు కలిగి ఉండటం వల్ల జరిగే పరిణామాలు (Results) ఏమిటో కూడా ఖురాన్ చెబుతుంది ఎలా అంటే- “నీ పట్ల శత్రుభావం కలవాడు నీకు ప్రాణ స్నేహితుడైపోవటాన్ని నీవు గమనిస్తావు” అని. అంతేకాదు ఈ విధమైన ప్రవృత్తి “సహాన శీలురకు తప్ప మరెవరికీ లభ్యం కాదు” అని ఖురాన్ చెబుతుంది.

ఇప్పుడు ఇది చదివే పాఠకులకు మనస్సులో మరి అలాంటప్పుడు ఖురాన్ అవిశ్వాసులను చంపమన్నది ఎందుకు? అని. దీనికి సంక్షిప్త సమాధానం- వాస్తవం ఏమిటంటే ఖురాన్లో కేవలం కొందరు దౌర్జన్య పరులు ధర్మాన్ని తుదముట్టించాలన్న కుట్రలు పన్ని, విశ్వాసులకు వ్యతిరేకంగా యుద్ధానికి కాలుదువ్విన సందర్భంలో మాత్రమే వారి ఆత్మ రక్షణ, ధర్మ రక్షణ నేపథ్యంలో మాత్రమే యుద్ధం చెయ్యమన్న ఆజ్ఞలు అవతరించాయి. నిజానికి “ధర్మాతులు అధర్మాతులను నాసమొనర్చుటలో వెనుదీయరాదు (అధర్వవేదం 12:5:62)” అన్నది ఏనాడో వేదాల్లో ఇవ్వబడిన పాత ఆజ్ఞే తప్ప ఖురాన్ లో ఇవ్వబడిన క్రొత్త ఆజ్ఞ ఎంతమాత్రం కాదు. కాబట్టి ఖురాన్ లో కేవలం విశ్వాసులకు వ్యతిరేకంగా యుద్ధానికి కాలుదువ్విన దౌర్జన్య పరులకు వ్యతిరేకంగా యుద్ధం చెయ్యమన్న ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి తప్ప నేడు కొందరు విమర్శిస్తున్నట్టు కనపడిన ప్రతీ అవిశ్వాసినీ లేదా కాఫీర్లను చంపమని ఖురాన్ చెప్పటం లేదు!

అంతేకాదు ధర్మం విషయంలో విశ్వాసులతో యుద్ధం చేయని అవిశ్వాసులు లేదా కాఫీర్లతో ఎంతో న్యాయంగా, మంచితనంతో వ్యవహరించాలని ఖురాన్ ఆదేశిస్తుంది (60:8). ఈ విషయాలు నిత్యం ఇస్లాంపై గుడ్డిగా విమర్శలు చేసే వారికి తెలియవు. చివరకు ప్రవక్త ముహమ్మద్ (స) వారు అవిశ్వాసులతో యుద్ధం చేసే ముందు సైతం చివరిసారిగా వారితో యుద్ధమైదానంలో సైతం ఎన్నో విధాలుగా సంధి కుదర్చటానికి, నచ్చచెప్పటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాక ఇక తప్పదన్నప్పుడు అవతలి వారు మొండిగా దౌర్జన్యానికి కాలు దువ్వినప్పుడు మాత్రమే యుద్ధానికి సన్నద్ధులైయ్యేవారు. ఒకవేళ దౌర్జన్య కారులు గనుక యుద్ధాన్ని మానుకుని సంధి కుదుర్చుకోవటానికి సిద్ధపడితే ఖురాన్ అలాంటి వారికి వ్యతిరేకంగా యుద్ధం చెయ్యటాన్ని నిషేధిస్తుంది. క్షమాభిక్ష పెట్టమంటుంది తప్పితే దౌర్జన్య పరుల మాదిరిగా మొండిగా యుద్ధం చేసి చంపమనటం లేదు. స్వయంగా ప్రవక్త ముహమ్మద్ (స) అసలు ఒక ముస్లిం అంటే ఎవరో ఈ క్రింది విధంగా చెబుతున్నారు.

“నిజమైన ముస్లిం అతడే ఎవని నాలుక ద్వారా మరియు చేతుల ద్వారా ప్రజలు సురక్షితంగా ఉంటారో” – (సునన్ అన్-నిసాయి 4995)

ఈ విధంగా ఏ “యూనిలాట్రల్ ఎథిక్స్ (Unilateral Ethics)” అయితే ఖురాన్లో చెప్పబడ్డాయో వాటినే అటు బైబిల్లోనూ గమనించగలం. యేసు – “మీ పరలోకపు తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి (మత్తయి 5:44)” అన్నారు. ఇంకా వివరంగా చెప్పాలంటే ధర్మం “యూనిలాట్రల్ ఎథిక్స్ (Unilateral Ethics)” ఆధారంగానే వ్యక్తిత్వ నిర్మాణం అన్నది చేపడుతుంది. దీనిని బట్టి అర్థమయ్యే విషయం- ఇస్లాం అన్నది 1400 సం.కు పూర్వం ప్రవక్త ముహమ్మద్ (స) ద్వారా ఉనికిలోనికి వచ్చిన క్రొత్త ధర్మం కాదు అంతకు పూర్వం యేసు, అంతకు పూర్మం మోషే సకల ప్రవక్తలూ, పరిశుద్ధులు, ఋషీశ్వరులు బోధించిన సనాతన లేదా పురాతన ధర్మం మాత్రమే! ఒక ముక్కలో చెప్పాలంటే “ఏక దేవుని విధాయతా దృక్పథం” అన్నదానికి సంక్షిప్త అరబ్బీ పదమే “ఇస్లాం”. దీనికి నిఘంటు అర్థం “శాంతి”. ఈ శాంతి ధర్మాన్నే (లేదా ఇస్లాంనే) యేసు కూడా బోధించారు కాబట్టే పూర్తి బైబిల్లో “యూనిలాట్రల్ ఎథిక్స్ (Unilateral Ethics)” నే యేసు సైతం బోధించినట్లు చూడగలం. ఈ అత్యుత్తమ విలువల ఆధారంగా ఒక అనాగరిక సమాజాన్ని ఒక శాంతియుత, సుందర సమాజంగా మరియు నైతిక విలువలకు పట్టుకొమ్మగా మార్చగలిగలగటం ఎలా సాధ్యపడుతుంది? అన్న సందేహం ఎవరికైనా వస్తే ప్రవక్త ముహమ్మద్ (స) జీవిత చరిత్ర చదివితే దానికి పూర్తి సమాధానం లభిస్తుంది.

కాబట్టి నిజంగా ఇస్లాం ఎటువంటి ఉన్నత వ్యక్తిత్వ నిర్మాణాన్ని చేస్తుంది, ఏ విధమైన నైతిక విలువలను నేర్పుతుంది, ఎంత గొప్ప శాంతియుత సమాజాన్ని నిర్మిస్తుంది అన్నది తెలుసుకోవాలంటే చెయ్యాల్సింది ఒక్కటే – ముస్లిం సమాజాన్ని చూడక, గాసిప్పుల్లో ఇస్లాంను వెదకకుండా ఒక్కసారి ప్రవక్త ముహమ్మద్ (స) జీవిత చరిత్రను, ఖురాన్ ను పరిశీలనగా చదవటం మాత్రమే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *