“బాబ్రీ మసీదు పడగొట్టటమే అన్యాయమైతే ఇన్నాళ్ల తరువాత సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అయితే మరింత అన్యాయం” అన్నది ఈనాటి భారతదేశంలో అధికశాతం ముస్లిముల ఆవేదన. ఇది విశ్వాసం తాలూకు ఆవేదనా? లేక కేవలం గెలుపోటముల తాలూకు ఆవేదనా? అన్నది గమనిస్తే రెండవదే! ఎందుకంటే నిజ విశ్వాసి ఆవేదన చెందాల్సిన విషయాల్లో భౌతిక కట్టడాలకు ఏ ప్రాముఖ్యతా లేదు ఉంటేగింటే నేను ఆ లాభనష్టాలకు కారకుడైన అల్లాహ్ ను బలంగా విశ్వసించి, క్రమం తప్పకుండా ఆయన కోసం ఎక్కడున్నా నేను నామాజ్ సక్రమంగా చేస్తున్నానా? లేదా? అన్నదే అసలు ఆవేదన చెందాల్సిన అంశం. కాబట్టి నిజవిశ్వాసి భౌతిక కట్టడం వెనుక వెంపర్లాడటాని కంటే తన వ్యక్తిగత నైతిక కట్టడానికే ప్రాధ్యన్యత ఇస్తాడు.
ఈ సందర్భంలో ఎప్పుడో మూత పడిపోయి ఉన్న మసీదును ఎవరో పడగొట్టేశారు కాబట్టి దానికి బాధపడటం కరెక్టా? లేక నేను అసలు ఐదు పూట్లా నమాజ్ చదవకపోతున్నందుకు బాధపడటం కరెక్టా? అన్న ఆలోచనే ఇక్కడ ప్రధానం. బాబ్రీ మసీదు పడగొట్టకపోయినా ఇంకొన్నాళ్లు ఆగితే దానంతట అది ఎలాగూ కూలిపోతుంది. ఇక్కడ ఆ మూతపడిన మసీదుకు అన్యాయం జరిగిందని బాధపడే కంటే ముందు నేను నా లాంటి కొందరు నా వీధి చివరన శుక్రవారం ఒకపూట తప్ప మిగతా రోజుల్లో నామాజ్ కు రానివారితో ఖాళీగా పడి ఉంటున్న మసీదుకు వారంలో ఎన్ని సార్లు నమాజ్ కు వెళ్లి దానికి న్యాయం చేస్తున్నాము? అన్నదే ప్రతీ ముస్లిం ఇక్కడ ముఖ్యంగా ఆలోచించాల్సిన అసలు పాయింట్.
ఇక బాబ్రీ మసీదు కూల్చివేత అంటారా, దానిపై సుప్రీం కోర్టు తీర్పు విషయంలో గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ- “మహాత్ముడి హత్యకు నాధూరాం గాడ్సేను సుప్రీంకోర్టు ఈరోజు విచారిస్తే, గాడ్సే హంతకుడే, అయితే దేశభక్తుడు కూడా అంటూ తీర్పు చెబుతుంది” అన్న ఒక్క వ్యాఖ్యతో అది ఏ రకమైన తీర్పో తేల్చిపారేశాడు. అసలు ఒకప్పుడు రామ మందిరం పడగొట్టి బాబ్రీ మసీదు నిర్మించారనటానికి ఏ ఆధారం లేకుండానే, ఒకప్పుడు అక్కడ మసీదులో ప్రార్ధనలు జరిగాయని సుప్రీం కోర్టు అంగీకరిస్తూనే వివాదాస్పద స్థలం రామ్ లల్లాకు చెందుతుందని తీర్పు ఏ పురావస్తు శాఖ ఆధారంగా ఇచ్చింది అనటానికి సమాధానం లేదు.
చాలామందికి తెలియని విషయం- 1992 లో బాబ్రీ మసీదు పడగొట్టిన కరసేవకుల్లో నుండే ఒకడిని దేవుడు ఎన్నుకున్నాడు అతని హృదయాన్న ఇస్లాం కొరకు తెరిచాడు. అతని పేరే “బల్బీల్ సింగ్!” అతను బాబ్రీ మసీదు పడగొట్టినందుకు గానూ ఎంతగానో పశ్చాత్తాపం చెందాడు. దానికి బదులు 100 క్రొత్త మసీదులు నిర్మిస్తానని సంకల్పం చేసుకున్నాడు! అంతే ఈ 25 ఏళ్లలో అప్పుడే 90 మసీదులు నిర్మించేశాడు. ఆ విధంగా బాబ్రీ మసీదు కూల్చివేత ఇస్లాంను నెగ్గించటమే అయింది. ఆ విధంగా ఒక మసీదును కూల్చేసినంతలో ఇస్లాంకు నష్టం చేకూర్చే మాట అలా ఉంచితే అది సైతం ఇస్లాంకు లాభమే తెచ్చిపెట్టింది. ఒకరకంగా చెప్పాలంటే- 100 బాబ్రీ మసీదులు, దానిని కూల్చేసిన రోజే కట్టబడ్డాయి అనటం అతిశయోక్తికాదు! ఎందుకంటే ఇలాంటిదో అన్యాయమైన తీర్పు భవిష్యత్తులో రానుందని దేవునికి తెలియదా ఏంటి?
అసలు గమనించాల్సిన విషయం- బాబ్రీ మసీదు పడగొట్టటం అన్నది ముస్లిముల మనసుల్లో కావాలని భావావేశాన్ని రగిల్చి వారిని బలవంతంగా ఆ గొడవలోకి లాక్కురావటానికి పన్నిన కుట్ర అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. సంక్షిప్తంగా చెప్పాలంటే 1980 కి ముందు అసలు భారతదేశంలో దాదాపు 90 శాతం సామాన్య ముస్లిం ప్రజానీకానికి బాబ్రీ మసీదు, రామజన్మ భూమి గొడవే తెలీదు! కానీ, ఓటుబ్యాంకు రాజకీయ కుట్రలో భాగంగా బాబ్రీ మసీదును కొందరు అడ్డాగా మార్చుకున్నారు ఇది జగమెరిగిన సత్యం. ఆ కుట్రకు ప్రారంభం 1949 డిసెంబర్ 22, 23 తేదీల్లో రామ్‌లల్లా విగ్రహాలను గోప్యంగా మసీదు లోపలకు చేరవేసినపుడు పారంభమై, 1992 డిసెంబర్ 6 తారీకున బహిరంగ కూల్చివేతకు ముహూర్తం పెట్టటంతో పూర్తయింది. ఈ క్రమంలో ముస్లిముల భావోద్రేకాలను రెచ్చగొట్టటం అన్న ప్రక్రియ ద్వారా ముస్లిములు బాబ్రీ మసీదు గొడవలోకి బలవంతంగా నెట్టబడ్డారు. నిజానికి అది వారి సమస్య కానేకాదు.
కొన్ని పచ్చి నిజాలు మాట్లాడుకోవాలంటే అసలు అక్కడ రామమందిరం కావాలని గొడవ చేస్తున్నోల్లలో సంవత్సరానికోసారి కూడా గుడి ముఖం చూడనోల్లే ఎక్కువ! అక్కడ మసీదు కావాలని పరితపించేవారిలో సైతం అధికశాతం వారానికి ఓసారి కూడా సరిగ్గా మసీదు ముఖం చూడనోల్లే ఎక్కువ! నిజానికి ఇస్లాంలో మసీదు అన్నది కేవలం సామూహిక ఆరాధన కొరకు తప్ప దాని భౌతిక కట్టడానికి ఏ ప్రాముఖ్యతా లేదు. అల్లాహ్ ఆరాధనకు ఫలానా మసీదు అవసరం అన్న సెంటిమెంటు కూడా ఇస్లాంలో లేదు! నమాజ్ చదవాలన్న సంకల్పం ఉన్న విశ్వాసికి సమస్త భూమిని మసీదుగా మార్చి వెయ్యటం జరిగింది. దీనికి సంబంధించి ప్రవక్త ముహమ్మద్ (స) వారు ఒక హదీసులో ఏమంటున్నారంటే-
“సమస్త భూమి మసీదుగా చెయ్యబడింది. శ్మశానవాటిక మరియు కాలకృత్యాలు తీర్చుకునే స్థలాలు తప్ప” – (జామియత్ తిర్మిదీ 317, సహీహ్).
పై హదీసును దృష్టిలో పెట్టుకుంటే అల్లాహ్ కు 2.77 ఎకరల స్థలమో, ప్రత్యేక మసీదో అవసరం లేదు. ఒక్క శ్మశాన వాటిక మరియు కాలకృత్యాలు తీర్చుకునే స్థలాల్లో తప్ప నమాజ్ ఎక్కడైనా చదవొచ్చు. ఈ భూమిపై ఫలానా చోటే మసీదు కట్టడానికి “ఫలానా జన్మభూమి” అంటూ అల్లాహ్ కు ఏదీ లేదు! ఎందుకంటే జన్మం, జన్మస్థలాలు ఉన్నోల్లు ఎవరూ దేవుళ్లు కాలేరు మరియు సృష్టికర్త అయిన అల్లాహ్ ఆజన్మరహితుడు కనుక! ఆయన విశ్వంలో ఎక్కడ నుండి అయినా ఆరాధించబడతాడు. ఆయనను ఆరాధించటానికి ఫలానా స్థలం ఉండాలి అన్న సెంటిమెంటు అస్సలు లేదు. ఇక నిజంగా ఒక ముస్లిం ప్రేమించదగ్గ మసీదు ఏదైనా ఉందంటే అది మక్కాలో ఉన్న కాబా మసీదే కాగలదు”. అది కూడా ఎందుకు అంటే- ప్రప్రథమంగా దైవారాధన కొరకు నిర్మించబడిన ఆరాధనగృహం మక్కాలో ఉన్నదే. దానికి సకల శుభాలు ప్రసాదించబడ్డాయి. విశ్వప్రజలందరికీ అది మార్గదర్శక కేంద్రంగా రూపొందించబడింది” – 3:96 అని ఖురాన్ లో అల్లాహ్ చెబుతున్నాడు కనుక. కాబట్టి ఒక ముస్లిం విశ్వాసంతో ముడిపడి ఉన్న భౌతిక కట్టడం ఇస్లాంలో ఏదైనా ఉందీ అంటే మక్కాలో ఉన్న కాబా మసీదే అవుతుంది. అక్కడకు వెళ్లి హజ్ చెయ్యటం ఇస్లాం మూలస్థంబాల్లో ఒకటిగా చెయ్యబడింది కాబట్టి.
ఈ సందర్భంలో బాబ్రీ మసీదు పడగొట్టి పైశాచిక ఆనందం పొందేవారైనా దానిని పడగొట్టటం అన్యాయం అని ఆవేదన చెందేవారైనా గమనించాల్సింది – ఒక్క బాబ్రీ మసీదే కాదు దేశంలో ఉన్న అన్నీ మసీదులు పడగొట్టేసినా, చివరకు అన్ని ఖురాన్ లను కాల్చేసినా ఇస్లాంకు ఇసుమంతైనా అన్యాయం, నష్టం వాటిల్లదు. ఖురాన్ కంఠత పట్టినోల్లు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఉన్నారు, నమాజ్ కోసం మొత్తం భూమినే అల్లాహ్ మసీదుగా మార్చేశాడు. దేవుడు ఫలానా ఆలయంలోనే ఉంటాడన్న అజ్ఞాన దృక్పథం ఇస్లాంలోనే లేదు అలాగే ఇస్లాం భౌతిక కట్టడాలకో, పుస్తకాలకో పరిమితమై లేదు. ఖురాన్ ప్రతీ సెకను ఈ భూమిపై పఠించబడుతూనే అందరి హృదయాల్లో ప్రతిష్టింపబడి ఉంది.
బాధాకరమైన విషయం ఏమిటంటే- ఇస్లాం తాలూకు ఈ విశాల దృక్పథం అధికశాతం ముస్లిముల్లో కొరవడటం ఒకరకంగా బాబ్రీ మసీదు విధ్వాంసకారులకు ఒక అడ్వాంటేజ్ గా మారిందనటం కూడా అతిశయోక్తి కాదు. అదే దాదాపు కొన్ని వేలమంది అమాయక ముస్లిముల భావోద్రేకాలను రెచ్చగొట్టటానికి అనువుగా మారింది, అన్యాయంగా వారి ప్రాణాలను బలిగొంది. ఇలాంటి దారుణ సంఘటనలు భవిష్యత్తులో ఎప్పుడు జరిగినా వాటి నుండి మనల్ని మనం, తోటి ముస్లిం సమాజాన్ని కాపాడుకునే ఏకైక మార్గం- ఇస్లాం పట్ల సరైన అవగాహన పెంపొంధించుకోవటం, సృష్టికర్త అయిన దేవుని పట్ల బలమైన విశ్వాసం కలిగి ఉండటం ఒక్కటే. సరిగ్గా ఇదే విషయం ఖురాన్ ఈ క్రింది విధంగా చెబుతుంది.
“క్రుంగిపోకండి, దుఖపడకండి. మీరే ప్రాబల్యంవహిస్తారు. మీరు విశ్వాసులే అయితే” – 3:139
ఆరాధనకు ఫలానా మసీదు అవసరమా?
