ముస్లిములు దేశద్రోహులా?

స్వధర్మాన్ని ప్రేమించటంలో తప్పులేదు కానీ తమ మతం మీద ఉన్న గుడ్డి అభిమానంకొద్దీ చరిత్రను మరచిపోయి ఈ దేశం కోసం రక్తం చిందించి, దేశ స్వతంత్రం సంపాదించటంలో అతి పెద్ద పాత్ర వహించిన ముస్లిములను దేశద్రోహులు, ఉగ్రవాదులు అంటూ నిందించటాన్ని అజ్ఞానం అనాలో గుడ్డితనం అనాలో అర్థం కాని విషయం! సోషల్ మీడియాలో ప్రత్యేకంగా కొందరు కట్టర్ హిందూ పేర్లపై అక్కౌంట్లు తెరచి, ముస్లిములను “దేశద్రోహులు” “ముస్లిమేతరులను చంపటమే లక్ష్యం కలిగిన ఉగ్రవాదులు” అంటూ పోస్టులు చూస్తున్నప్పుడల్లా మతతత్వవాదం తాలూకు గుడ్డితనం అంటే మరీ ఇంత ఘోరంగా ఉంటుందా అనిపిస్తూ ఉంటుంది.

ముస్లిములు దేశద్రోహులు కారు, కానీ ఈ దేశాన్ని ఆక్రమించిన దేశద్రోహుల పట్ల ద్రోహులుగా మారి ఈ దేశం కోసం ప్రాణాలను అర్పించిన వీరుల తాలూకు చరిత్ర కలిగిన వారు! ఈ విషయం నేటి కట్టర్ హిందూ మత తత్వవాదం తలకెక్కిన కాషాయవాదులకు, ఇస్లాం విమర్శకులైన కొందరు క్రైస్తవులకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే వారికి వక్రీకరించబడిన చరిత్రల తాలూకు కల్పిత గాధలు తప్ప యథార్థ చరిత్రల తాలూకు వాస్తవాలు తెలియవుకదా పాపం. ఈ దేశాన్ని క్రైస్తవులైన ఆంగ్లేయులు ఆక్రమించి 200 సం.లు ఉగ్రవాదం చేస్తే వారికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధపడిన వారిలో అష్ఫుల్లా ఖాన్, ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్, టిప్పుసుల్తాన్ లాంటి కొందరు ముస్లిం వీరుల పేర్లే నేడు తెలుసు. కానీ, ఈరోజు ముస్లిములను దేశద్రోహులని, ఉగ్రవాదులని నిందిస్తున్న ఎంతమంది హిందూ, క్రైస్తవ సోదరులకు తెలుసు బెంగాల్ నవాబ్ “సిరాజుద్దౌలా” 1757 ఫ్లాసీలో బ్రిటీషర్లకు ఎదురు తిరిగి ప్రాణాలు అర్పించేసిన మొట్టమొదటి రెబలియన్ అన్న విషయం? టిప్పుసుల్తాన్ నాలుగు సార్లు బ్రిటీషర్లతో యుద్ధానికి తలపడి ప్రాణాలు అర్పించటం జరిగింది. ఆయన చేసిన యుద్ధాలు “ఆంగ్లో మైసూర్ వార్స్” అన్న పేరుతో వినుతికెక్కాయి. 1857 లో మొదలైన “ఇండియన్ రెబలియన్ మూవ్మెంట్” అది “గదర్” అన్న పేరుతో వినుతికెక్కింది. ఆనాటి పోరాటంలో అనేక రాష్ట్రాల్లో ఎంత మంది ముస్లిములు ఈ దేశం కోసం చనిపోయి ఉంటారు అన్న దానికి గొప్ప ఉదాహరణ చెప్పాలంటే ఒక్క డిల్లీ నగరంలోనే అక్షరాలా 87000 మంది ముస్లిములు చనిపోయారు. ఈ విషయం ఎంతమంది ఇస్లాం విమర్శకులైన కట్టర్ భక్తులకు తెలుసు? అలాగే బ్రిటీషర్లకు ఎదురు తిరిగిన మదర్సా ఉలామాలను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. 1864 నుండి 67 మధ్యలో ముస్లిం ఉలామాలు తమకు ఎదురు తిరిగారన్న నెపంతో అక్షరాలా 14000 మంది ముస్లిం ఉలామాలను ఉరికంబాలు సరిపోక చెట్ల కొమ్మలకు వ్రేలాడదీసి ఉరి తాళ్లు బిగించి చంపారు.

ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్ 1929 లో ప్రారంభించిన “ఖుదాయే ఖిత్మత్ గార్ మూవ్ మెంట్” ఎంతమంది ఇస్లాం విమర్శకులైన కట్టర్ భక్తులకు తెలుసు? ఈ ముస్లిం యోధుడు అక్షరాలా ఒక లక్షమంది ముస్లిములను ఏకం చేస్తే వారిపై పెషావర్ లో జరిపిన బహిరంగ కాల్పుల్లో 250 మంది ముస్లిములు చనిపోయారు.

***

“కట్టర్ ముస్లిం స్వతంత్ర యోధుల” ప్రాణ త్యాగాల తాలూకు ఫలమే స్వతంత్రం!

పైన చెప్పిన ముస్లిం త్యాగధనులే కాక, ఆనాడు బ్రిటీషర్లకు ఎదురుతిరిగి అష్ఫాఖుల్లా ఖాన్ ప్రాణాలు అర్పించి ఉండకపోతే, మౌల్వీ అబ్దుల్లాహ్ షా, బఖ్త్ ఖాన్, పీర్ ఆలీ ఖాన్ ఉరికంబాలు ఎక్కి ఉరితాళ్లాను ముద్దాడి తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసి ఉండకపోయి ఉంటే, ఎందరో ముస్లిములు బ్రిటీషర్ల తుపాకీ గుళ్లకు బలై ప్రాణాలు అర్పించకపోయి ఉంటే దేశ స్వతంత్రం పొందటం అన్నది కల్లోనే కాదు పీడ కల్లో సైతం ఊహించుకోవటానికి సాధ్యం కాకపోయి ఉండేదేమో! అలాగే “తుర్రే బాజ్ ఖాన్” బ్రిటీషర్లకు ఎదురు తిరిగిన మొట్టమొదటి హైదబాదీ రెబలియన్! ఈయన్ని కాలాపానీ జైల్లో బంధించినప్పుడు అక్కడ నుండి తుర్రే బాజ్ ఖాన్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా కాల్చి చంపటమే కాక ఆ శవాన్ని హైదరాబాద్ మోసుకొచ్చి ఆయన శవాన్ని ప్రజల ముందు ఉరి వేసి మరీ పైశాచిక ఆనందం పొందారు. మౌల్వీ ముహమ్మద్ బాకీర్ ను తోపు గొట్టం ముందు కట్టి పేల్చేసి ఆయన శరీరాన్ని ఛిద్రం చేశారు. ఇంకా వాక్కమ్ మజీద్, సైఫుద్దీన్ కిబ్లెవ్, మగ్బూల్ అహ్మద్ అజాజీ, ఆసఫ్ ఆలీ (ఈయన భగత్ సింగ్ తరఫున పోరాడిన లాయర్), అబ్బాస్ అలీ, అబ్దుర్రహ్మాన్, మహ్ముద్ అల్హాసన్, సయ్యద్ అల్లావుద్దీన్ హైదరీ (కాలాపానీ జైల్లో చంపబడిన మొట్టమొదటి ముస్లిం వీరుడు) లాంటి చరిత్రలో మరుగున పడిపోయిన ఇంకా ఎందరో వీరులు 200 సం.లు సాగిన బ్రిటీషు ఉగ్రవాదానికి ఎదురు తిరగకపోయి ఉంటే భారతదేశ స్వతంత్రం ఓ తీరని కలగానే మిగిలిపోయేదేమో అనటం అతిశయోక్తి కాదు!

ఈ విధంగా వేల మంది ముస్లిం స్వతంత్ర సమరయోధుల రక్తంతో తడిసిన భారత దేశ నేలపై నిలబడి, ఆనాడు హిందూ-ముస్లిములు చెయ్యి చెయ్యి కలిపి అర్పించిన వేల కొద్ది బలిదానాల ఫలితంగా లభించిన స్వతంత్రాన్ని అనుభవిస్తూ… ఈనాడు ముస్లిములను దేశద్రోహులు, ముస్లిమేతరరులను చంపటమే లక్ష్యం కలిగిన ఉగ్రవాదులు అని నిందించటం ఎంత ఘోరమైన అజ్ఞానం? నిజమే బహుశా ఆనాడు సావర్కర్, గాడ్స్ లాంటోల్లతో కలిసి పనిచేసేంత అతి తెలివి ఆనాటి ముస్లిములకు లేదు! భగత్ సింగ్, గాంధీ, సుభాష్ చంద్రబోస్ లాంటి వీరులతో భుజం భుజం కలిపి పని చేసి, ఈ దేశం కోసం ప్రాణాలర్పించేసేంత పిచ్చి ప్రేమ మాత్రమే ఉంది. అందుకే కాబోలు వారు ఉరితాళ్ళను ముద్దాడి, తుపాకీ గుళ్లకు తమ గుండెలను అడ్డు పెట్టి తృణ ప్రాయంగా తమ ప్రాణాలను విడిచిపెట్టి ఈ దేశాన్ని పువ్వుల్లో పెట్టి మరీ మనకు అప్పజెప్పి వెళ్లిపోయారు. కాబట్టి ముస్లిములు దేశ ద్రోహులే! కదూ? బహుశా ఆనాడు ముస్లిములు బ్రిటీషర్లకు ఎదురు తిరిగి దేశం కోసం ప్రాణాలు అర్పించెయ్యటానికి బదులు బ్రిటీషర్లతో కుట్రపూరితంగా చెయ్యి కలిపేసి ఉంటే ఈనాడు ముస్లిములను దేశద్రోహులని నిందిస్తున్నవారే వారిని “దేశభక్తులు” అన్న పేరు పెట్టి ఉండేవారేమో!

మీకు పాకిస్తాన్ ఇచ్చేశాము కదా మా దేశంలో మీకేం పని అంటూ చరిత్ర మరచిపోయి హేళనగా మాట్లాడుతున్న అభినవ కాషాయ కట్టర్ భక్తులు ఆనాడు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించేసిన వారిని ఈ ప్రశ్న అప్పుడే అడిగి ఉంటే వారు సమాధానం చెప్పి ఉండేవారు- మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం ఈ దేశం కోసం ఇక్కడే మా ప్రాణాలు అర్పిస్తాం తప్ప వేరే దేశంతో మాకు పనిలేదని!

వారి ప్రాణ త్యాగాలు మరుగు చేసి, చరిత్రను వక్రీకరించి, ఈనాడు ముస్లిములను దేశద్రోహులని, పాకిస్తాన్ వెళ్ళిపొమ్మని పిచ్చి కూతలు కూస్తున్నా నేటి ముస్లిములు సహనంతో భరిస్తున్నారు తప్ప ఈ దేశం కోసం మా పూర్వీకులు చిందించిన బలిదానాలను, వారు దేశం కోసం అర్పించిన రక్తాన్ని మాకు తిరిగి ఇచ్చేయండి మేం అప్పుడు వెళ్లిపోతాము అని అడగటం తెలియని పిచ్చోళ్లే ఇక్కడ ముస్లిములు! అంతతెలివి లేదు కాబట్టే దేశద్రోహులే! కదూ? మొత్తం ముస్లిం సమాజంలో ఎక్కడో ఒక శాతం ముస్లిం పేర్లు తగిలించుకుని ఉగ్రవాదం చేస్తుంటే దానిని మిగతా 99 శాతం ముస్లిం సమాజానికి ఆపాదించి మీరు టెర్రరిస్టులు అని వెక్కిస్తుంటే, ఇస్లామోఫోబియాను పెంచి పోషించే పేయిడ్ మీడియా ముస్లిం సమాజాన్ని టార్గెట్ చేసి “ఇస్లామిక్ టెర్రరిజం” అనే దిక్కుమాలిన పదాన్ని ఉనికిలోకి తెచ్చినప్పుడు ఆ పదానికి అర్థం సైతం పూర్తిగా తెలియక బిక్క మొహం వేసుకుని విమర్శలను భరిస్తున్న అమాయకులే నేటి ముస్లిం సమాజంలో అధిక శాతం మంది ఉన్నది! మీడియా, ప్రపంచంలో జరుగుతున్న హిందుత్వ ఉగ్రవాదాన్ని, యూద, క్రైస్తవ ఉగ్రవాదాలను బయటపెట్టకుండా ముస్లిం/అరబిక్ పేరు తగిలించుకున్న ఏ ఉన్మాది ఎక్కడ ఉగ్రవాదం చేసినా దానిని మొత్తం ముస్లిం సమాజానికి ఆపాదిస్తూ “ఇస్లామిక్ టెర్రరిజం” అన్న పేరుతో టెలికాస్ట్ చేస్తుంటే అప్పటివరకూ ఎదురింట్లో ప్రతీ సంవత్సరం తమకు సేమియా, పాయసాలు, బిర్యానీలు ఇచ్చే అబ్దుల్లా గారు టెర్రరిస్టులా కనపడుతుంటారు! పక్కింట్లో పెరటి గోడపై నుండి తమతో మాట్లాడే బేగం గారు సడన్ గా టెర్రరిస్టులా కనపడుతుంటారు. జేబులో టీ తాగటానికి పది రూపాయలు కూడా లేక పంచర్లు వేసుకుని బతికే జిలానీ గారు ఒసామాబీన్ లాడెన్ తమ్ముడిలా కనపడుతుంటాడు! చిన్న వ్యాపారం చేసుకునే ఏ అబ్దుర్రహ్మాన్ గారో, ఏ రహీమ్ గారో లేక ఏ ముస్లిమో వచ్చి అద్దెకు ఇల్లు అడిగితే అతను మసూద్ అజ్హర్ బామ్మర్దిలా కనపడుతుంటాడు. దానితో “మేము ముస్లిములకు ఇల్లు అద్దెకు ఇవ్వం” అనే ఓ బోర్డు ఇంటి ముందు సాక్షత్కరిస్తుంది.

ఉగ్రవాదానికి, వెధవ పనులు చేయటానికి ఏ ఒక్క మతవర్గమో ప్రత్యేక ఏజెన్సీలా పని చెయ్యదు, ఉగ్రవాదం చేసే ఉన్మాదులు, వెధవ పనులు, దారుణాలకు తెగబడే సన్నాసులు అన్ని మత వర్గాల్లోనూ ఉంటారు. వారు చేసే వెధవ పనులను, వారి పేర్లను బట్టి వారి మతానికి లింకులు పెట్టి విమర్శించేంత బుద్ధి తక్కువ పని ఇంకొకటి ఉండదనే విషయం మతతత్వవాదం తలకెక్కిన ఇస్లాం విమర్శకులైన కట్టర్లు అర్థం చేసుకుంటారన్నది కల్లో సైతం నెరవేరని విషయమే. వారికి కావలసింది ఈ దేశం కోసం వేలల్లో ప్రాణాలు అర్పించేసిన ముస్లిముల చరిత్రను మరుగుపర్చటం, బలవంతంగా ముస్లిములను దేశద్రోహులుగా చిత్రీకరించటం అంతే.

ఇస్లాం విమర్శకులు ఆలోచించాల్సిన అంశం:

“ఏ ఇస్లాం అయితే ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందని నేటి ఇస్లాం విమర్శకులు అంటున్నారో ఆ ఇస్లాంను అనుసరించిన ముస్లిములే కదా నాటి స్వతంత్ర ఉధ్యమంలో పాల్గొని, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించేసింది. అంటే ఇస్లాంను బాగా అర్థం చేసుకుంది నాటి ముస్లిం స్వతంత్ర సమర యోధులా? నేడు ముస్లిం పేర్లు పెట్టుకుని టెర్రరిజం చేస్తున్న అభినవ ఉగ్రవాదులా? ఈ విషయం కట్టర్ మతతత్వ భక్తులకు అర్థం కాదో లేక అర్థం చేసుకోవటం ఇష్టం లేదో ఎప్పటికీ అర్థం కానీ విషయమే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *