ఇస్లాం “మహార్ (కట్నం)” తీసుకోమంటుందా? ఇమ్మంటుందా?

సమాజంలో అక్రమ సంబంధాలను, వ్యభిచారాన్ని సమూలంగా నిర్మూలించటానికి పెళ్లి అనే ప్రక్రియను అతి సులభతరం చేసిన ధర్మం ఇస్లాం మాత్రమే! ఇప్పుడు నేను వరకట్నం తీసుకోవటం తప్పు, నేరం అనే నీతి సుద్దులు వల్లించటానికి ఈ టాపిక్ రాయటం లేదు! ఎందుకంటే అది తప్పని తెలిసీ తీసుకునే వారిలో అధికశాతం మంది ముస్లిములే అధికంగా ఉన్నారు కాబట్టి! ఇక ముస్లిం సమాజంలో అదృష్టవశాత్తు పుట్టినప్పటికీ అడిగినంత కట్నాలు ఇవ్వటం ప్రక్కనపెట్టండి లక్షాధికారిని సైతం భికారిగా మార్చేసే విధంగా నేటి పెళ్లి తంతులు, అబ్బాయి తరఫు నుండి వచ్చిన బంధువులకు వచ్చి, వెళ్లేంత వరకూ బిర్యానీలు, వంటకాలు, విపరీతమైన ఖర్చుతో కూడుకున్న పెళ్లిల్లే నేడు జరుగుతున్నాయి!

“ఏ నిఖా అయితే అత్యంత సాదాసీదాగా జరపబడుతుందో అది ఉత్తమ నికాహ్ (అబూ దావూద్ 2117)”

అని ప్రవక్త ముహమ్మద్ (స) చెప్పి ఉన్నప్పటికీ అలాంటి ప్రవక్త అనుచరులుగా చెప్పుకుంటున్న ముస్లిం సమాజంలో పెళ్లి చేసి తమ ఆడపిల్లలను ఎలా గడపదాటించాలా అని ఆవేదన చెందే తలిదండ్రులు, తమ అక్క చెల్లెళ్లను లక్షల్లో కట్నాలు ఇచ్చి పెళ్లిల్లు చెయ్యటంకోసం ఒళ్ళు హూనం అయ్యేలా కష్టపడి పని చేసే ఎందరో యువకులు నాకు తారసపడినప్పుడల్లా ఇస్లాం అన్నది ఓ సువిశాలమైన అందమైన ప్రపంచం అయితే చాలా మంది ఆ అందమైన ప్రపంచానికి దూరంగా కారడవిలో చీకట్లలో జీవనం సాగిస్తున్నారా అన్న సందేహం కలుగుతూ ఉంటుంది. అలాగని నూటికి నూరుశాతం ముస్లిం సమాజం పూర్తిగా ఈ వరకట్న జాఢ్యంలో మునిగి ఉందన్నది నా ఉద్దేశం కాదు! ధార్మిక అగాహనను ఆచరణ రూపంలో పెట్టగలిగే సాహసం ఉన్నోల్లు సమాజంలో కొందరు ఉన్నప్పటికీ, అధిక శాతం ముస్లిములు సైతం (కొందరు ధర్మావగాహన ఉన్నోల్ల నుండి లేనోల్ల వరకూ) ఈ వరకట్న జాఢ్యానికి బానిసై ఉన్నారన్నది ఒప్పుకు తీరాల్సిన విషయమే! కాబట్టి సంస్కరణ నేపథ్యంలో కొన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడుకోక తప్పదు! కాబట్టి ఈ ఆర్టికల్ లో కట్నం విషయంలో ముస్లిం సమాజం సైతం కూరుకుపోయి ఉంది కాబట్టి నేను ముస్లిములను ఉద్దేశిస్తూ రాయటాన్ని బట్టి ముఖ్యంగా ముస్లిములు బాధ పడవద్దు.

నిజానికి “ది డౌరీ ప్రొహిబిషన్ ఆక్ట్ 1961”, వరకట్న నిషేధ చట్టము ప్రకారం కట్నకానుకలను ఇవ్వడం, తీసుకోవడం రెండు నేరమే! వరకట్న దురాచారాన్ని నిరోధించేందుకు మాత్రమే ఈ చట్టం రూపొందించబడింది. అంతేకాదు ఈ ఆక్ట్ ప్రకారం కట్నం డబ్బు రూపంలో ఇచ్చినా, కానుకల రూపంలో ఇచ్చినా కూడా నేరమే. కానీ దీని గురించి చాలామంది చదువుకున్నోల్లకే తెలియదు! తెలిసినా ఇలాంటి చట్టాలను చూపించి మేము వరకట్నం ఇవ్వమని చెప్పే ధైర్యమూ ఆడపిల్లల తండ్రులకు ఉండదు. ఎందుకంటే తమ ఆడపిల్లలు ఎంత అందంగా ఉన్నా, ఎంత మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నా సమాజంలో వరకట్నం ఇచ్చే తీరాలి అన్న దగుల్బాజీ సెంటిమెంటు ఎప్పటి నుండో ముస్లిమేతర సమాజాల్లో నాటుకుపోయి ఉంది కాబట్టి. పైగా ఆ జాఢ్యాన్ని ముస్లిములుగా పుట్టినోల్లు వారి దగ్గర నుండి పుణికి పుచ్చుకున్నారు.

దీనికి భిన్నంగా ఇస్లాం చెప్పేదేమిటంటే- అమ్మాయికి మహార్ రూపంలో ఎంతో కొంత నగదును బహుమతిగా ఇచ్చి మాత్రమే పెళ్లి చేసుకోవాలని చెబుతున్నప్పటికీ అధికశాతం ముస్లింలు పైన నేను పేర్కొన్న చట్టంలానే అల్లాహ్ ఆజ్ఞను సైతం ఉత్సవ విగ్రహంలా మార్చేసి, ఈ గ్లోబలైజేషన్ రోజుల్లో ఇవన్నీ కామనే, అయినా అబ్బాయిని ఇంతకాలం చదివించాం, ఇంత ఖర్చుపెట్టాం దానికి కాంపెన్సేషన్ గా వరకట్నం తీసుకోకపోతే ఎలా? అన్న దారుణమైన స్థితికి వచ్చేశారు.

వాస్తవానికి ఖురాన్ ప్రకారం “వరకట్నం” తీసుకోవటాన్ని బట్టి ఒక వ్యక్తి ముస్లిం నుండి నామమాత్ర ముస్లిం అన్న ప్రమాదకర జాబితాలోకి నెట్టివేయబడతాడన్న విషయం అధిక శాతం ముస్లిములకే అవగాహన లేదంటే అతిశయోక్తి కాదు! ఇది నిజం. “ముస్లిములుగా తప్ప మరణించకండి” అని స్వయంగా అల్లాహ్ ముస్లిములకే చేస్తున్న హెచ్చరికను బట్టి ముస్లిములుగా పుట్టే ప్రతీ ఒక్కనికీ ముస్లిములుగా మరణించటం సైతం ఎంత ప్రాముఖ్యత కలిగిన విషయమో తెలుస్తుంది. ఇక్కడ ముస్లిములుగా మరణించటం అంటే చనిపోయేటప్పుడు కేవలం ఉర్దూ/అరబిక్ పేర్లు తగిలించుకుని, జనాజా నమాజ్ తరువాత ఖబ్రస్తాన్ లో పూడ్చబడటం అని కాదు! ఖురాన్ ఇచ్చే దృక్పథాన్ని, దాని ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్న స్థితిలో ఉండగా చనిపోవటం అని అర్థం. దీనిని దృష్టిలో పెట్టుకుంటే అసలు వరకట్నం తీసుకునేవాడు ఖురాన్ ప్రకారం ముస్లిమే కాడన్నది వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఖురాన్ వాక్యాల ప్రకారం ఆ చేదు నిజాన్ని ఒప్పుకోక తప్పదు.

“మహార్ (కట్నం)” ఇవ్వటానికి బదులు తీసుకునేవారు ఖురాన్ ప్రకారం ముస్లిములే కారా?

“స్త్రీలను మీరు “ధనం చెల్లించి” వివాహమాడటం మీకు హలాల్ (ధర్మసమ్మతం) చెయ్యబడింది” – 4:24

ముస్లిములు ఏదైనా బిర్యానీ హోటల్ కి వెళితే ఒకటికి పదిసార్లు మాంసం “హలాల్ చెయ్యబడిందా?” అని అడగటం చూస్తుంటాం. మరి అదే పెళ్లి దగ్గరకు వచ్చేసరికి అల్లాహ్ హలాల్ చేసిన “మహార్ ఇచ్చి పెళ్లి చేసుకోవటం” అన్న దానిని ఎందుకు పాటించరో అర్థం కాదు! “మహార్ ఇచ్చి పెళ్లి చేసుకోవటం” “హలాల్” అయినప్పుడు “మహార్ తీసుకుని పెళ్లి చేసుకోవటం” “హరామ్” కాదా? హరామ్ పని చేసేవాడెవడైనా అల్లాహ్ దృష్టిలో ముస్లిం అనబడతాడా?

ముస్లిములు “మహార్ (కట్నం)” తీసుకోవాలా? ఇవ్వాలా?

“స్త్రీలకు వారి మహార్ (కట్నం) సంతోషంగా భావిస్తూ చెల్లించండి” – 4:4

అని ఖురాన్ చెబుతుందే తప్ప పురుషులకు సంతోషంగా స్త్రీల దగ్గర నుండి మహార్ (కట్నం) తీసుకోమనటం లేదు! తీసుకుంటే అది అల్లాహ్ ఆజ్ఞకు వ్యతిరేకం. అల్లాహ్ ఆజ్ఞకు వ్యతిరేకంగా నడుచుకుంటూ మేము జన్నత్ కు వెళ్లిపోతామ్ అని కలలు కనటం సింగపూర్ వెళ్ళటానికి సిటీ బస్సు ఎక్కటం లాంటిదే!

సుగుణవతి, ధార్మిక జ్ఞానం ఉన్న అమ్మాయి అయి ఉంటే చాలనుకునే తలిదండ్రులు, ఇవ్వాలనుకుంటే నాకు అల్లాహ్ యే సంపదను ఇస్తాడు దానికి అల్లాహ్ ఆజ్ఞకు వ్యతిరేకంగా నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి దగ్గర కట్నం రూపంలో డబ్బుతీసుకోవటం ఇస్లాంకు వ్యతిరేకం ముస్లిం సమాజంలో యువకులు ఆలోచించనంతవరకూ ఈ వరకట్నం అన్న జాఢ్యం ముస్లిం సమాజం నుండి తొలగిపోదు. దానికి ధార్మిక జ్ఞానం పెంపొందించుకోవటం తప్పనిసరి.

అసలు వరకట్నం తీసుకోవటం ఇస్లాం ఎందుకు అనుమతించటం లేదు?

ఈ విషయాన్ని గమనిస్తే- ముఖ్యంగా ఆర్థిక స్థితిగతులు పెంచటం తగ్గించటం అల్లాహ్ చేతిలోనే ఉంది. కాబట్టి ఉద్యోగ, వ్యాపారాలు చెయ్యటం వరకే తప్ప అడ్డదారుల్లో తమ ఆర్థిక స్థితి పెంచుకోవటం తప్పవుతుంది. రెండవది- పెళ్లి విషయంలో ధార్మిక కోణమే తప్ప ఆర్థిక కోణం ఉన్న పెళ్లిళ్లు పెటాకులే అవుతాయి. ఓ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి విలువలే పునాదిగా ఉండాలి తప్ప ఆర్థిక లావాదేవీలు పునాదిగా ఉన్న సమాజం విచ్ఛిన్నం అవుతుంది. అందుకే నేడు జరుతున్న పెళ్లిళ్లలో అధికశాతం కొన్నాళ్లకే విడాకులైపోవటం, కట్నం సరిపోవటం లేదని అత్తామామలే కొడళ్లను ఇళ్ల నుండి తరిమేయటం లేదా చంపేయటం జరుగుతుంది. డబ్బున్నోల్లు తమ అమ్మాయిలను లక్షలు ఖర్చుపెట్టి భోజనాలు, పెళ్లి మండపాలు, నగదూ, ఖరీదైన బట్టలు పెట్టి పెళ్లి చెయ్యగలుగుతున్నారు, పెళ్ళంటే అలాగే జరగాలన్న సెంటిమెంటు స్థిరపడిపోవటంతో అంతంత మాత్రంగా ఆర్ధిక స్థితి ఉన్న ఆడపిల్లల తండ్రులు అప్పులు చేసి పెళ్లిళ్లు చేసి జీవితాంతం ఆ అప్పులు తీర్చటంలోనే సరిపోతుంది. అడిగినంత కట్నం ఇవ్వటం సాధ్యంకానీ తలిదండ్రుల ఇళ్ళల్లో మిగిలిపోతున్న ఆడపిల్లలు వయసు మీదపడి తమ బాధను దిగమ్రింగుకోలేక, కోరికలను చంపుకోలేక అన్నట్టు బలవంతంగా జీవనం వెళ్లదీస్తున్నారు. వెరసి ఆడపిల్ల పుట్టటమే సమాజంలో ఓ శాపంగా మారిందన్నట్టు పరిస్థితి తయారైంది.

అసలు ఈ వరకట్నం తీసుకోవటం అన్న ప్రక్రియ దగ్గరే రెండు రకాలా మైండ్ సెట్స్ లేదా ఆలోచనా విధానాలు ఏర్పడుతున్నాయి. మొదటి రకం ఆలోచనా విధానం ఎలా ఉంటుందంటే- లైఫ్ లో సెటిల్ అవ్వాలి అంటే కట్నం తీసుకోవటంలో తప్పేముంది? అయినా కట్నం తీసుకుంటున్నది తిరిగి వ్యాపారం చేసి భార్యా, బిడ్డల్ని చూసుకోవటానికే కదా? స్వంతానికేమీ వాడేసుకోము కదా? అయినా కట్నం ఇవ్వటం కూడా కామన్ గానే మారిపోయింది కదా ఈరోజుల్లో! ఇది కట్నం తీసుకునే యువకుల్లో 99% మంది చూపే సాకు! అయినా కట్నం తీసుకోవటం అలవాటు చెయ్యబట్టేగా వారికి ఇవ్వటం అలవాటైంది!

రెండవరకం ఆలోచనా విధానం ఉన్న అబ్బాయిలు కొందరు ఉంటారు. వారేలా ఆలోచిస్తారంటే- అసలు నా విషయంలో సంపద పెంచటం, తగ్గించటం అల్లాహ్ నిర్ణయం పై ఆధార పడి ఉంది. అల్లాహ్ మహార్ ఇవ్వటాన్ని హలాల్ చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా తీసుకుని హరామ్ నికాహ్ చేసుకుని నా సంపద పెంచుకోవటం ఘోర పాపం కదా! కాబట్టి నేను చేసుకోబోయే అమ్మాయి నుండి ధార్మిక జ్ఞానం, సౌశీల్యత లాంటి సుగుణాలు తప్ప ఆమె నుండి డబ్బు నేను తీసుకునేదేంటి? నాకు మంచి స్థితి ఇవ్వాలనుకుంటే అల్లాహ్ యే ఇస్తాడు. ఇదో అరుదైన రకం మైండ్ సెట్ అని చెప్పాల్సి ఉంటుంది.

పెళ్లి చేసుకునే విషయంలో రెండవరకం ఆలోచనా విధానం లేదా అభ్యుదయ ఆలోచనలు లాంటివి కలిగి, అల్లాహ్ పై భరోసా ఉంచి కట్నం తీసుకోకుండా ధైర్యంగా పెళ్లి చేసుకునే విషయంలో అధిక శాతం మంది యువకులు, వారి తలిదండ్రులకు అంత ధైర్యం ఉండదు. ఎందుకంటే తమకున్న చాలీచాలని ఆర్థిక పరిస్థితులు, వస్తున్న కట్నాన్ని ఎందుకు వదులుకోవాలన్న ఆశ, కట్నం తీసుకోకపోతే తమ ఇంటి అమ్మాయిని ఎలా పెళ్లి చెయ్యగలమనే బెంగ ఇలాంటి ఎమోషన్స్ తో “ఆ అల్లాహ్ పై భరోసా పెట్టుకుంటే ఎలా కుదురుతుందీ! అబ్బాయిని చదివించటానికి, ఇంతవాణ్ణి చేయటానికి ఎంతో ఖర్చుపెట్టాం! వాణ్ని లఫ్ లో సెటిల్ చెయ్యటానికేగా కట్నం తీసుకుంటుంది! అయినా కట్నం ఇవ్వటానికి వాళ్ళు ఇబ్బంది పడనప్పుడు మేము తీసుకోవటంలో ఇబ్బంది దేనికి?” అంటూ తాము చేసే తప్పును తామే సమర్థించుకుంటూ చాలా మంది తలిదండ్రులు చెప్పే మాటల్నే వారి సంతానం కూడా నేర్చుకుని కట్నం తీసుకోవటం పెద్దేమీ తప్పుకాదని వాడిస్తుంటారు. వీరంతా పైన నేను చెప్పిన మొదటి రకం ఆలోచనా విధానం ఉన్న నామమాత్ర ముస్లిములు అని చెప్పాల్సి ఉంటుంది.

పైన నేను ఉదహరించిన రెండు రకాల ఆలోచనా విధానాలలో రెండవ దానిని కలిగి ఉండటానికి అల్లాహ్ పై అచంచలమైన బలమైన విశ్వాసం, అల్లాహ్ శక్తి-సామర్ధ్యాల పట్ల ధృఢమైన నమ్మకం, అల్లాహ్ విధించిన విధి-నిషేధాలు పాటించే విషయంలో భక్తి-శ్రద్ధలు ఉన్న ముస్లిములకే సాధ్యమౌతుంది. అలాంటి ధృఢ విశ్వాసం కలిగిన ముస్లిములకు అల్లాహ్ వారు ఊహించని మార్గాల ద్వారా ఆర్ధిక బలాన్ని చేకూర్చే శక్తి గలవాడు. కానీ చాలా మంది అల్లాహ్ పట్ల ధృఢ విశ్వాసం కలిగి ఉండటానికి బదులు తమకు ఉన్న ఆర్థిక స్థితిగతులకు భయపడి, ప్రతీదీ అల్లాహ్ పై భారం వేస్తే ఎక్కడ అవుతుంది? అని అనుకుంటూ వరకట్న పిశాచాన్ని అందంగా అలంకరించి ఆహ్వానిస్తున్నారు. ఇదేలాంటిదంటే మహార్ ఇచ్చి పెళ్లి చేసుకోమంటున్న అల్లాహ్ కు ఆర్థిక స్థితిగతులు అంతంత మాత్రంగా ఉన్నప్పుడు తీసుకోవటంలో తప్పులేదని చెప్పేంత జ్ఞానం లేనోడని, తమ ఆర్థిక స్థితిని పెంచటం చేతకానివాడని పరోక్షంగా నిందించటమే అవుతుంది (అల్లాహ్ క్షమించుగాక!).

అల్లాహ్ పై అచంచలమైన విశ్వాసం కలిగి ఉండటం, ఉండలేకపోవటం ఇలాంటి అతి సున్నిత విషయాలపైనే ఆధార పడి ఉంటుంది. తనకు ఉన్న ఆర్థిక స్థితికి భయపడి, సమాజానికి భయపడి ముస్లిములుగా పుట్టినప్పటికీ అల్లాహ్ ఆజ్ఞకు వ్యతిరేకంగా మహార్ (కట్నం) ఇవ్వటానికి బదులు తీసుకుని పెళ్లిళ్లు చేసుకోవటం అన్నది అల్లాహ్ పై విశ్వాసం లేదనటానికి ప్రబల గుర్తు అవుతుంది. ఇలాంటి వారంతా నేను పైన చెప్పిన మొదటి రకం ఆలోచనా విధానంలో ఉంటూ నామ మాత్రా ముస్లిములుగా మిగిలిపోతారు. లేదు, ప్రాణం పోయినా అల్లాహ్ ఆజ్ఞనే పాటించాలి ఆర్థిక స్థితి పెరగటం పెరగకపోవటం నాచేతిలో లేదు అల్లాహ్ చేతిలోనే ఉందని ప్రవక్త ముహమ్మద్ (స) సున్నత్ ప్రకారం పెళ్లి చేసుకునేవారు నేను పైన చెప్పిన రెండవ రకం ఆలోచనా విధానం కలిగి ఉన్న ధృఢమైన విశ్వాసులన్న మాట. ఈ రెండు రకాల ఆలోచనా విధానాల్లో దేనిపై నిలబడగలరన్నదే ముఖ్యంగా ముస్లిం సమాజంలో యువకులకు, వారి తలిదండ్రులకు అల్లాహ్ తరఫు నుండి అతి పెద్ద పరీక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *