కార్పొరేట్ ఆఫీసుల్లో, బ్యాంకుల్లో, షాపింగ్ మాల్స్ మరియు హాస్పిటల్స్ ఇంకా చాలా వ్యాపార సంస్థలకు మనం వెళ్లినప్పుడు అక్కడ గోడల మీద జాగ్రత్తగా గమనిస్తే మనం మీరు “C.C. కెమెరా పర్యవేక్షణలో ఉన్నారు జాగ్రత్త!” అని రాసి ఉండటాన్ని గమనించగలం. దీని అంతరార్థం- “మీరు ఏ తప్పుడు పని చెయ్యాలనుకున్నా, ఇతరుల పట్ల గానీ, మా స్వంత సంస్థ వ్యక్తులతో చెడుగా ప్రవర్తించినా గానీ లేదా మా సంస్థలో ఏ వస్తువును మీరు రహస్యంగా దొంగతనం చేసినా గానీ మేము మిమ్మల్ని ఓ కంట కనిపెడుతునే ఉన్నాం మీరు చేసే ఏ తప్పుకైనా మీరు శిక్షించబడతారు తస్మాత్ జాగ్రత్త!” అని ఇండైరెక్టుగా చెప్పటం అన్నమాట!
ఇది చదివిన వెంటనే నిజంగా ఏదైనా తప్పు చెయ్యాలన్న కోరిక కలిగినా, అక్కడున్న ఏ స్త్రీ వంకైనా వెకిలి చూపులు చూడాలన్న కోరిక కలిగినా లేదా ఏదైనా సీక్రెట్ గా ఏదైనా వస్తువు నొక్కేయ్యాలన్న భావన మనసులో వచ్చినా తనను తాను నియంత్రించుకోవాలన్న ఓ రకమైన ‘భయం’ మనస్సులో నుండి అంతర్గతంగా అప్రయత్నంగా ప్రారంభం అయిపోతుంది.
తరువాత ఆ భయం ప్రవర్తన పై ప్రభావం చూపుతుంది. ఆ భయం తాలూకు ప్రభావం కారణంగా తనను తాను కంట్రోల్ చేసుకుంటూ తనను రహస్యంగా ఎవరో కెమెరాలో నుండి ఓ కంట కనిపెడుతున్నారన్న భావనతో తప్పనిసరిగా మంచి నడవడికతోనే వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ రకమైన చర్యా ప్రతి చర్యలు వెనువెంటనే లోలోపలే జరిగిపోతూ ఉంటాయి.
ఓ ఏడెనిమిది సంవత్సరాల క్రితం అనుకుంటా నేను హైదారాబాద్ ఓ ఇంటర్యూ కి వెళ్లినప్పుడు జరిగిన సంఘటన. ఇంటర్యూ హాల్లో ఇంటర్యూ కోసం వచ్చి కూర్చున్నవారు ఓ పదిహేను మంది వరకూ ఉంటారు. ఓ సీనియర్ మేనేజర్ వచ్చి మీ ఇంటర్యూకి ఇంకా రెండు గంటల టైమ్ పడుతుందని చెప్పి వెళ్లిపోయాడు. ఇక చూడండి, ఆ హాల్లో ఓ అరగంట తరువాత వచ్చిన వారిలో సహనం చచ్చిపోయి మెల్లాగా కబుర్లు మొదలయ్యాయి. అవి పెరిగి పెరిగి వెటకారాలు, జోకులు పేల్చుకునే వరకూ వెళ్లింది. కొందరు ఫోన్లు బయటకు తీసి ఏవేవో చూసుకుంటూ కాలక్షేపం చెయ్యటం మొదలెట్టారు. బహుశా అలా కూర్చోబెట్టటం కూడా ఇంటర్యూలో ఒక పార్టేనేమో అనిపించింది నాకు ఎంత మంది ఎంత సహనంగా కూర్చుంటారో చూడాలని! కాస్సేపటికీ ఓ మూల ఇలా రాసి ఉంది “you are observed by CC Camera” అని. ఎవరికీ కనపడనట్టు ఓ మూల చిన్న cc tv కెమెరా ఉంది. జోకులు, నవ్వులు, సొల్లు కబుర్లలో ముగిపోయిన మిగతావారిని ఓ సారి అక్కడ ఏమిరాసుందో చూడమని నేను సైగ చేశాను. ఇక చూడండి, ఆ హాల్లో ఒక్కసారిగా నిశబ్దం ఆవహించింది. అప్పటి వరకూ ఎంతో కాజువల్ కాలు మీద కాలేసుకుని వెటకారాలు, జోకులు పేల్చుకుంటున్నవారి ముఖంపై ఓ రకమైన భయం ఆవహించింది. బాడీ లాంగ్వేజ్ లో ఎంత మార్పు వచ్చేసిందంటే చూడగానే “రాముడు మంచి బాలుడు” అని వెంటనే చెప్పేయాలనిపించేంతగా ప్రవర్తించటం ప్రారంభించారు. ఫోన్లు జేబుల్లో దూర్చేసి బుద్ధిమంతుల మాదిరిగా ఫైళ్లు, పుస్తకాలు చదవటం మొదలెట్టేశారు. అందరిలోనూ ఈ మార్పాంతా జరగటానికి సరిగ్గా ఐదు సెకండ్ల కాలం కంటే తక్కువ కాలం పట్టి ఉంటుందేమో!
మనిషిని తప్పు చేయటం నుండి నిరోధించే ప్రేరకం “మీరు ఫలానా తప్పు చేస్తే మీరు శిక్షించబడతారు” అన్న ప్రేరకం లేదా భయమే. ఇది దేవుడు, మతం అన్నవి కేవలం మనిషిని భయపెట్టటానికే తప్ప వాటికి మనిషి జీవితంతో ఏ ప్రయోజనమూ లేదు అదంతా ట్రాష్ అని చెప్పే కొందరు భౌతిక వాదులకు అవగాహన లేని విషయం అనటం అతిశయోక్తి కాదు.
ఏ భయమూ లేని మనిషి మనస్సు కట్టిన తాడు వదిలేసిన గుర్రం లాంటిది! అది ఎటు పరిగెడుతుందో దానికే తెలియదు. దాని కోరికలు గుర్రాలానే పరిగెత్తుతూ ఉంటాయి. దానికి అడ్డూ అదుపూ ఉండదు. రోడ్డు మీద ఒన్ వే ట్రాఫిక్ రూల్ పాటించాలి అన్న నియమం దగ్గర నుండి, ఇంట్లో, ఆఫీసులో ప్రతీ చోటా అతని ప్రవర్తనను అదుపులో ఉంచగలిగేది ఒకటి తనకంటే పై అధికారుల భయం, రెండు ‘చట్టం తాలూకు భయం’ మనిషిపై నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. ఇలా ప్రతీ చోటా ఏదో ఒక భయమే మనిషిని తప్పు చేయటం నుండి అతనిని నిరోధిస్తూ ఉంటుంది.
అలాగే ధర్మం అన్నది ఏదో మనిషిని భయపెట్టటానికి మాత్రమే ఉద్దేశించబడిన కల్పిత విషయం కాదు. సృష్టికర్త అయిన దేవునిచే ఉనికిలోకి తీసుకురాబడిన ఈ అనంత సృష్టిలో ఓ రేణువంత భాగమైన ఈ భూమిపై సృష్టించబడిన మానవుడు కేవలం అనేక కోట్ల జీవరాసుల్లో ఒక జీవి మాత్రమే.
కాకపోతే మనిషిని పరీక్షించటానికి మాత్రమే పుట్టించటం జరిగిందని సృష్టికర్త అయిన దేవుడు ధార్మిక గ్రంథాలన్నిటిలో తెలియజేస్తున్నాడు. అంతేకాదు మీకివ్వబడిన మంచీ-చెడుల జ్ఞానంతో మీరు మంచిని ఎన్నుకుని, నా ఆజ్ఞలను అనుసరిస్తూ, మేము చేసుకునే మంచీ-చెడు పనులకు ఓ రోజు లెక్క చెప్పాల్సి ఉంటుందని భయపడుతూ నైతికంగా జీవిస్తే మీకు మరణానంతర జీవితంలో నిత్య స్వర్గం లభిస్తుంది. అలా కాదని పెద్ద తోపుల్లా ఫీలై దేవుడూ లేడూ ధర్మం లేదూ జీవితం కేవలం ఎంజాయ్ చెయ్యటానికే అన్నట్టు మీ ఇష్టం వచ్చినట్టు బ్రతికి చనిపోవాలనుకుంటే అలా చనిపోవచ్చు ధర్మంలో ఏ బలవంతమూ లేదు కానీ మరణానంతర జీవితంలో శాశ్వత నరకాగ్నికి బలైపోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాడు.
అయితే మనిషి స్వేచ్చాజీవి కాదు ఎలా పడితే అలా బ్రతికేయ్యటానికి. అతను నిత్యం దేవుని నిఘాలో ఉన్నాడు. ఇదే విషయాన్ని ఆద్యాత్మిక గ్రంథాలు ఏనాడో చెప్పాయి.
మనిషి నిత్యం CC కెమెరా పర్యవేక్షణలోనే ఉన్నాడు!
ఆశ్చర్యంగా ఉంది కదూ! మనిషి ఈ భౌతిక జీవనంలో ఒక్క CC కెమెరాల పర్యవేక్షణలో మాత్రమే కాదు అతని పై దేవుని నిఘా అనే ఓ CC కెమెరాలా నిత్యం పని చేస్తూనే ఉంటుంది. ఈ విషయాన్నే మన వద్ద ఉన్న ఆధ్యాత్మిక గ్రంథాలు హెచ్చరిస్తున్నాయి. ఇది తెలియకపోవటం కారణంగానే నేటి అధికశాతం ధార్మీకులే నైతిక ప్రవర్తనలో దిగజారిపోవటానికి ఓ ప్రధాన కారణం అవుతుంది. మనిషి నిత్యం దేవుని నిఘా అనబడే అభౌతిక CC కెమెరా పర్యవేక్షణలో ఎలా ఉన్నాడో తెలుసుకోవాలంటే కాస్త ఈ క్రింది ఆధ్యాత్మిక గ్రంధాల వాక్యాలు చదవాల్సిందే!
గీత:
****
“తత్ సర్వతోక్షి” (13:4) = “దేవుడు సర్వం చూస్తున్నాడు”
“సర్వ శ్రుతిమల్లోకే” (13:14) = “దేవుడు మీ ప్రతీ మాటా వింటున్నాడు”
“హృది సర్వస్య విష్ఠితం” (13:18) = “ప్రతీ మనిషి హృదయంలో మంచీ-చెడు ఆలోచనలను గమనిస్తున్నాడు”
బైబిల్:
******
“జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడు. బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులగుదురు? చెవులను కలుగజేసినవాడు వినకుండునా? కంటిని నిర్మించిన వాడు కానాకుండునా?” – కీర్తనలు 94:8-9
“యెహోవా అను నేను హృదయములను పరిశీలించువాడను, అంతరేంద్రీయములను పరీక్షించువాడను” – యీర్మియా 17:10
ఖురాన్:
********
“అస్సమీ” (42:1) = “ఆయన ప్రతీ మాటా వింటున్నాడు”
“అల్ బసీర్” (42:24) = “ఆయన ప్రతీ దృశ్యాన్ని చూస్తున్నాడు”
“ఆ సృష్టికర్త ప్రతీ మానవుని హృదయ రహాస్యములను ఎరిగి ఉన్నాడు” – 10:46
ఆఫీసుల్లో, షాపింగ్ మాల్స్, వ్యాపార సంస్థల్లో ఎలక్ట్రానిక్ cc కెమెరాలు మనుషులు చేసే పై పై తప్పులను పర్యవేక్షిస్తుంటే, పై వాక్యాలను బట్టి దేవుని నిఘా ప్రత్యేకత ఏమిటంటే మనిషి ఈ పూర్తి విశ్వంలో ఎక్కడ ఉన్నా సరే, అతను ఎంత కారు చీకట్లలో ఉన్నా చివరకు మనసులో చెడుగా ఆలోచించినా సరే అతని ప్రతీ పనీ రికార్డు కాబడుతుంది. ఈ ప్రేరకమే మనిషి ఒంటరిగా ఉన్నప్పటికీ అతన్ని చెడు చెయ్యటం నుండి, చెడు ఆలోచించటం నుండి దూరంగా ఉంచేది.
నేడు అధికశాతం మంది ఆధునిక విద్యావంతుల్లో నేరాలు, ఘోరాలు పెరిగిపోటానికి, వారు ఆస్తికులైనప్పటికీ నైతిక ప్రవర్తనలో దిగజారిపోవటానికి అసలు కారణం “తాము నిత్యం దేవుని పర్యవేక్షణలో ఉన్నామన్న” విషయాన్ని విస్మరించటమే! ఇంకా తమను పర్యవేక్షిస్తున్న ఆ సృష్టికర్త అయిన దేవుని ముందు నిలబడి ఓ రోజు తమ ప్రతీ మంచీ-చెడు పనికీ సమాధానం చెప్పుకోవలసి ఉంటుందన్న విషయాన్ని గాలికి వదిలేసి, తమను పరిశీలిస్తున్న సృష్టికర్త అయిన దేవుడు అత్యంత శక్తిమంతుడు తాము చేసుకునే పనులను బట్టే శిక్షా-బహుమానాలు ఆయన ఇవ్వనున్నాడన్న విషయాన్ని తెలుసుకోకపోవటం. ఈ విషయాన్ని నేడు అనేకమంది తెలుసుకోకపోవటం వల్ల, ఇంకా తమ పిల్లలకు ఈ విషయాన్ని నేర్పించకపోవటం కారణంగా నేటి ఆధునిక యువతలో నేరాలు, ఘోరాలు సర్వసాధారణమైపోయాయి! కానీ ఎవరైతే ఆ సృష్టికర్త అయిన దేవుని ముందు నిలబడి సమాధానం చెప్పుకోవలసి ఉంది, నా చుట్టూ దేవుని నిఘా వ్యవస్థ నిత్యం CC కెమెరాలా పని చేస్తూనే ఉంటుందన్న విషయాన్ని అర్థం చేసుకుని, తమ మనసులో మెదిలే చెడు ఆలోచనలను దూరంగా ఉంచుతూ మంచి పనులు చేస్తూ ఎవరైతే నిజ దేవుని పట్ల భయం-భక్తి కలిగి జీవిస్తారో వారి చివరి శాశ్వత నివాసం స్వర్గం అవుతుంది. ఇదే విషయం ఖురాన్ లో ఈ క్రింది విధంగా చెప్పటం జరిగింది.
“సృష్టికర్త అయిన దేవుని ముందు నిలబడవలసి ఉందని భయపడి, తన మనస్సును దుష్టవాంచలకు దూరంగా ఉంచిన వ్యక్తి యొక్క నివాసం స్వర్గం అవుతుంది” – 79:41
