సెక్సువల్ ఎమోషన్స్ అండ్ ఇస్లాం

సమాజంలో పెరిగిపోతున్న అశ్లీల్లత, మీడియాలో వెర్రితలలు వేస్తున్న నగ్నత్వం, ఎక్స్ పోజింగ్ ను ఎరగా వేసి, యువత భావోద్రేకాలను రెచ్చగొట్టి డబ్బు సంపాదించే సినిమా వ్యాపారాలు జోరుగా సాగుతున్న నేటి సామాజిక నేపథ్యంలో ఓ విశ్వాసి తన సెక్సువల్ ఎమోషన్స్ ను అంటే తనలో ఉండే లైంగిక వాంఛలను ఎలా నిగ్రహించుకోవాలి? ఎంత నిగ్రహించుకున్నా సాధ్యంకానంత విపరీతంగా సెక్సువల్ ఎమోషన్స్ ను రెచ్చగొడుతున్న నేటి మీడియా ఉన్న తరుణంలో సైకలాజికల్ గా ఈ సమస్యకు ఇస్లాం చూపే లాజికల్ మార్గం ఏదైనా ఉందా? ఇది నాకు ఓ మిత్రుడు అడిగిన ప్రశ్న.

నిజమే అశ్లీల్లతే మాధ్యమంగా పెట్టి, అందాలు ఆరబోస్తూ అంగాంగ ప్రదర్శనతో భావోద్రేకాలను ఎంత రెచ్చగొట్టాలో అంత రెచ్చగొడుతూ, డబ్బు సంపాదించటమే ధ్యేయంగా పెట్టుకున్న నేటి మీడియా ఉన్న నేపథ్యంలో, ఎటు చూసినా సమాజంలో నగ్నత్వం పెరిగిపోతున్న విపరీత పోకడల మధ్య ఎంత విశ్వాసి అయినా సరే తనలో సహజంగానే ఉండే సెక్సువల్ ఎమోషన్స్ ను ఎలా కంట్రోల్ చేసుకోగలగాలన్నది ముఖ్యంగా అంతర్గతంగా చాలామంది పైకి చెప్పుకోలేని సమస్యల్లో ఒకటని చెప్పొచ్చెమో!

ఆకలి, నిద్ర, సెక్స్ అన్న ఈ మూడు ఈ మూడు జంతువులతో పాటు ప్రతీ మనిషికి దేవుడు అంతర్గతంగా పెట్టిన అత్యంత ప్రధానమైన శారీరక మానసిక అవసరాలని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ సెక్సువల్ ఎమోషన్స్ గురించి మాట్లాడుకునే విషయంలో ఛీ ఛీ అనుకోవటానికి ఏమీలేదు. అయితే ఆకలి, నిద్ర అన్నవి శారీరక అవసరాలైనప్పటికీ వాటికి కంట్రోల్ చెయ్యటం అన్నది అసాధ్యం. కానీ, సెక్సువల్ ఎమోషన్స్ (లైంగిక కోరికలు) అన్నవి మనిషి స్వభావంలో ఉన్నప్పటికీ వాటిని రెచ్చగొట్టే విషయాల వైపుకు తీసుకెళ్లకుండా మనస్సును అదుపు (Control) లో పెట్టుకోవటం నిగ్రహించుకోవటం అన్నది సాధ్యపడుతుంది.

ఎటువంటి సైకలాజికల్ ఎమోషన్స్ (మానసికమైన ఉద్రేకాలు) అయినా మనిషి కంట్రోల్ చేసుకోవటం ఎలా? అన్న విషయంలో ఇస్లాం మనిషికి ఇచ్చే తర్ఫీదు, సూచనలు చాలా ప్రత్యేకంగా ఉంటాయని చెప్పొచ్చు. అందులో ప్రధానంగా మనిషి స్వభావంలో సహజంగా ఉండే సెక్సువల్ ఎమోషన్స్ ను కంట్రోల్ చేసే విషయంలో ఇస్లాం అత్యంత లాజికల్ మార్గాన్నే చూబెడుతుంది. ప్రాపంచిక లాభాపేక్ష, ఆశ, కోపం, ఉద్రేకం, లైంగిక వాంఛలు ఇలా ఎన్నో మానసిక ఉద్రేకాలను మనిషి ఎలా అదుపులో ఉంచుకోవాలో అతి సమంజసమైన మార్గాలను చూబెడుతుంది ఖురాన్.

అసలు పూర్తి ఖురాన్ ను జాగ్రత్తగా చదివితే ఖురాన్ లో మౌలికంగా రెండు విషయాలు గమనించవచ్చు- 1. హెచ్చరికలు 2. శుభవార్తలు. అసలు ఖురాన్ అవతరణ లక్ష్యం కూడా అదే అన్న విషయం ఖురానే తెలియజేస్తుంది. మనిషిలో ఉండే అనేక రకాలైన ఉద్రేకాలను అదుపులో ఉంచే విషయంలో ఈ రెండు అంశాలే ప్రధాన ప్రేరకంగా పని చేస్తాయి అంటే అతిశయోక్తి కాదు. ఖురాన్ అవలంబించే అద్వితీయ విధానం అదే! జాగ్రత్తగా గమనిస్తే “హెచ్చరికలు” అన్నవి మనిషి తనకు నిషేధించిన విషయాల జోలికి పోతే “పరలోకంలో నిత్య నరకం” అనే “శాశ్వత నష్టం” పొంచి ఉందన్నది. అదేవిధంగా తన కోరికలను ధర్మసమ్మతంగా తీర్చుకుని, ధర్మసమ్మతం చేసిన వాటిని అనుసరిస్తే- “నిత్య స్వర్గం” అనే “శాశ్వత లాభం” సిద్ధంగా ఉంది అన్న విషయాన్ని ఖురాన్ తెలియజేస్తుంది. “శాశ్వత నష్టం” “శాశ్వత లాభం” అన్న ఈ రెండూ కూడా ఎటువంటివంటే- మనిషి యొక్క ఎటువంటి భావోద్రేకాన్నైనా అదుపు చేయగలిగే “అద్వితీయ బలమైన ప్రేరకాలు” (Unique mightiest Inspirations) అని చెప్పొచ్చు. ఈ రెండు ప్రేరకాలు మించిన బలమైన ప్రేరకాలు లేవు ఉండవు, మరే ప్రేరకమూ మనిషి ఎమోషన్స్ ని అదుపు చెయ్యలేవు కూడా. అందుకే ఈ రెండు అంశాలనే ఖురాన్ మనిషిలో ఉండే భావోద్రేకాలను, కోరికలను’ కంట్రోల్ చేసే విషయంలో ప్రధాన ప్రేరకాలుగా పెడుతుంది. అలాగని ఏదేదో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కాదు. ప్రతీ మనిషి చనిపోవటం ఎంతవాస్తవమో పరలోకంలో శాశ్వత జీవితంలో నిత్యస్వర్గం-నిత్యనరకం ఉందన్నది కూడా అంతేవాస్తవం అన్న విషయాన్ని ఖురాన్ గుర్తించమంటుంది.

ఇక మనిషిలో అంతర్లీనంగా ఉండే లైంగిక కోరికలను అదుపుచేసే విషయంలో ఖురాన్ మీ కోరికలను బలవంతంగా అణగత్రొక్కమని చెప్పటం లేదు వాటిని ధర్మ సమ్మతమైన రీతిలో వివాహం చేసుకుని తీర్చుకోమని చెబుతూనే మీరు మీ లైంగిక కోరికలను అదుపుచేసుకోలేక తప్పుడు మార్గాల్లో మీ కోరికలు తీర్చుకోవటానికి సిద్ధపడితే గుర్తుంచుకోండి ఒక రోజు రానున్నది అప్పుడు మీరు దేవుని ముందు నిలబడి సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. మీరు మీ కోరికలను నిషిద్ధ మార్గాల్లో తీర్చుకుంటే ఇక్కడ మీరు పొందే తాత్కాలిక సుఖానికి బదులు శాశ్వత నష్టానికి గురైపోతారు అని హెచ్చరిస్తుంది. ఒకవేళ మీరు మీ కోరికలను అదుపు చేసుకుంటే, పరిశుద్ధ జీవితం గడిపితే గనుక ఇక్కడ మీరు చూపిన సహనానికి బహుమానంగా ఎన్నో రేట్లు సుఖ-సంతోషాలను రానున్న శాశ్వత స్వర్గంలో మీరు పొందగలరు అని శుభవార్తను కూడా ఇస్తుంది. ఈ విధంగా మనిషి తనలో ఉన్న కోరికలను అదుపులో పెట్టుకునే విషయంలో ఖురాన్ “శాశ్వత లాభం” “శాశ్వత నష్టం” అన్న రెండు ప్రధాన ప్రేరకాలకు ముడిపెట్టి మనిషిలో రేకెత్తే విపరీత కోరికలను అదుపు చేస్తుంది. ఈ తాత్కాలిక జీవనంలో మీరు కొద్ది కాలం మీ కోరికలను అదుపుచేసుకుని ఓర్చుకుంటే శాశ్వత స్వర్గంలో ఇంతకంటే ఎన్నో రెట్లు ఆనందాన్ని మీరు పొందనున్నారని చెబుతూ ఖురాన్, ఇక్కడి తాత్కాలిక కోరికలను అదుపులో పెట్టుకున్నందుకుగానూ శాశ్వత జీవితంలో “శాశ్వత సుఖ సంతోషాలు” పొందనున్నారన్న ఒక ఆల్టర్ నేటివ్ (Alternative) అంటే- ఒక ప్రత్యామ్నాయం చూపుతుంది.

ఇది ఖురాన్ మనిషికి ఇచ్చే ఒక విధమైన సైకలాజికల్ ట్రీట్మెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనిషిలో విపరీతమైన కోరికలు అసలు దేవుడు ఎందుకు పెట్టాడు? అన్నది గమనిస్తే మనిషి వాటిని ధర్మసమ్మతంగా తీర్చుకుంటాడా? లేక ధర్మ విరుద్ధంగా తీర్చుకుంటాడా? పరలోకంపై ఎంతవరకు విశ్వాసం కలిగి వాటిని అదుపులో పెట్టుకుంటాడు? అదుపులో పెట్టుకోలేడు? అన్నది సృష్టికర్త అయిన దేవుని తరఫు నుండి మనిషికి అత్యంత పెద్ద పరీక్ష.

ముఖ్యంగా సెక్సువల్ ఎమోషన్స్ (లైంగిక కోరికల) ను అదుపుచేసే చేసుకునే విషయంలో ఖురాన్ చెబుతున్నదేమిటంటే-

“వ్యభిచారం దరిదాపులకు కూడా పోకండి” – 17:32 అన్నది.

ఇక్కడ ఖురాన్ వ్యభిచారం చేయొద్దు అని సింపుల్గా చెప్పి ఊరుకోవటం లేదు దాని దరిదాపులకు కూడా వెళ్లొద్దు అంటుంది. “దరిదాపులు” అంటే 1. చూడటం 2. వినటం 3. ఆలోచించటం అన్న మూడు అంశాలు.

సహజంగా వేశ్యల వద్దకు వెల్లటమే వ్యభిచారము అవుతుంది అన్న అపోహ చాలమందిలో ఉంటుంది కానీ ధార్మిక కోణంలో పెళ్లి కాకుండా స్త్రీ, పురుషుడు శారీరకంగా కలిసినా అది వ్యభిచారమే అవుతుంది. ఖురాన్ భావోద్రేకాలను రెచ్చగొట్టే అశ్లీల్ల విషయాల దరిదాపులకు వెళ్లొద్దని చెప్పటమే కాదు ముఖ్యంగా … “విశ్వసించిన స్త్రీ, పురుషులకు తమ చూపులను కాపాడుకోమని, మర్మాంగాలను రక్షించుకోమని (24:30,31)” చెబుతుంది.

అసలు సెక్సువల్ ఎమోషన్స్ కంట్రోల్ తప్పే స్థాయి అన్నది ముందుగా కను చూపుతోనే మొదలవుతుంది. ఎందుకంటే కళ్ళు అన్నవి “గేట్ వే ఆఫ్ మైండ్” (Gate way of mind) లాంటివని చెప్పొచ్చు. అంటే మెదడుకు “సమాచారం అందించే ప్రధాన ద్వారం” అన్న మాట! ఖురాన్ ఆ ప్రధాన ద్వారానికే లాక్ పెడుతుంది. అంటే మైండ్ ని రెచ్చగొట్టే ఎటువంటి భావాన్నైనా ముందుగా కళ్ల ద్వారా మెదడు లోనికి తీసుకోవద్దని చెబుతుంది. అంటే పురుషులకైతే పరాయి స్త్రీ ఆఛాదనీయ అవయవాలను పనికట్టుకుని చూడటం! ఈ చూడటం అన్నది రోడ్డు మీద కనపడే పరాయి స్త్రీల నుండి మీడియాలో చూపబడుతున్న నగ్నత్వం ఇంటర్నెట్టులో పోర్న్ వరకు ఏదైనా సరే భావోద్రేకాలను రెచ్చగొట్టే అంశాలకు సంబంధించిన వాటి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడొద్దంటుంది ఖురాన్. ఈ విషయంలో మీడియా ఎంత రెచ్చగొతున్నా సరే, “మొదటి చూపు మీది రెండవ చూపు సాతానుది జాగ్రత్త వాడు మిమ్మల్ని అశ్లీల్లపు రొచ్చులో తీసుకెళ్లి నిలబెట్టే వరకు నిదురపోడు అని ప్రవక్త ముహమ్మద్ (స) హెచ్చరించటం కూడా జరిగింది. అలాగే స్త్రీలకు పరాయి పురుషుల వైపు చూడవద్దని ఆజ్ఞాపిస్తుంది ఖురాన్. ఇంకా ఇటు స్త్రీలకు పురుషులను రెచ్చగొట్టే విధంగా తయారవ్వక వారు స్వయంగా వేధించబడకుండా, ఇతరులు భావోద్రేకాలకు గురవ్వకుండా వారికి పరదా అంటే అదనంగా వస్త్రాన్ని కప్పుకోమంటుంది. ఇలాంటి సున్నితమైన అంశాలన్నీ సెక్సువల్ ఎమోషన్స్ ను కంట్రోల్ చేసే విషయంలో స్త్రీ/పురుషులకు ఖురాన్ చేస్తున్న సైకలాజికల్ ట్రీట్మెంట్ లో భాగమే! అందులో ముఖ్యంగా ఖురాన్- రెండు విషయాలు చెబుతుంది

1. మీలో ఏ చెడు తలంపులు కలిగినా అంటే ఇతర స్త్రీల వైపు చెడు చూపు చూడాలనిపించటం వ్యభిచార కోరికలు రేకెత్తించే విధంగా చెడు ఆలోచించనలు కలిగితే గనుక “తమ ప్రభువు ముందు నిలబడవలసి ఉంటుందని భయపడి, తన మనస్సును దుష్ట వాంఛలకు దూరంగా ఉంచిన వ్యక్తి నివాసం స్వర్గం అవుతుంది” – 79:40,41 అన్న ఒక హెచ్చరికను ఒక శుభవార్తను గుర్తుంచుకొమంటుంది. అంటే సెక్సువల్ ఎమోషన్స్ అన్నవి కంట్రోల్ లో పెట్టుకుంటే శాశ్వత లాభం ఉంది, నిగ్రహించుకోలేక తప్పుడు మార్గాల్లో తీర్చుకుంటే శాశ్వత నష్టానికి గురవ్వాల్సి ఉంటుందన్నది ముఖ్యంగా దృష్టిలో ఉంచుకొమంటుంది.

2. మీరు దేవుని ముందు నిలబడి మీ ప్రతీ పనికి సమాధానం చెప్పుకోవలసి ఉందని భయపడి “మీ మనస్సును దుష్ట వాంఛలకు దూరంగా ఉంచితే” దానికి ప్రత్యామ్నాయంగా సృష్టికర్త అయిన దేవుడు నిత్య ఆనందాలకు నిలయమైన స్వర్గాన్ని ప్రసాదించి అక్కడ ఇంతకంటే మీరు కళ్ళు తిప్పుకోలేనంత అందమైన స్త్రీలను మీకిచ్చి వివాహం చేస్తానంటున్నాడు. ప్రాపంచిక తాత్కాలిక జీవితం పరలోక జీవితానికి నమూనా మాత్రమే! ఈ తాత్కాలిక జీవితంకోసం మీరు చొంగ కార్చుకోవద్దు దీని కంటే వేల రేట్లు ఉత్తమమైనది, మీ ఊహలకు సైతం అందని మరో అందమైన అద్భుత మైన ప్రపంచం మీ కొరకు సిద్దమై ఉంది. పైగా ప్రాపంచిక జీవితం తాత్కాలికం, ఇక్కడ మీరు ఊహల్లో విహరిస్తూ ఉంటే పరలోక జీవితం నిజం అక్కడ మీరు తలచిందే తడవుగా అన్నీ అనుభవిస్తూ మిలియన్ బిలియన్ సంవత్సరాలైపోయినా అది పూర్తికాదు. ఎప్పటికీ శాశ్వతంగా మీరు ఆ సుఖభోగాల మధ్యే ఉంటారని శాశ్వత సుఖభోగాల శుభవార్తలు అందిస్తుంది. కాదని మీ భావోద్రేకాలను కొద్ది కాలం నిగ్రహించుకోలేకపోతే వాటిని తప్పుడు మార్గాల్లో తీర్చుకుంటే శాశ్వత కాలం నరకాగ్నిలో కాలుతూ శాశ్వత నష్టానికి గురైపోతారని హెచ్చరిస్తుంది. కాబట్టి మీరు చెయ్యాల్సిందల్లా జస్ట్ కొద్దికాలం మీ భావోద్రేకాలను అదుపులో పెట్టుకోవటం, పవిత్రమైన నైతిక జీవనం కొనసాగించటం మాత్రమే! మొత్తం ఖురాన్ చదివితే ఇవే విషయాలు ఎన్నోసార్లు పునరావృతమౌతుంటాయి.

పై విషయాలు చెప్పాక సైకలాజికల్ గా కంట్రోల్ చేసుకోవటానికి ఖురాన్ ఇచ్చే సూచనలు:- లైంగిక కోరికలు నిగ్రహించుకునే పరిస్థితి చేదాటిపోతున్నప్పుడు అయినంత త్వరగా పెళ్లి చేసుకుని, ధర్మసమ్మతంగా మీ కోరికలు తీర్చుకోమని చెబుతుంది. అది ఆలస్యమయ్యే పక్షంలో చెడు మార్గాల్లో కోరికలు తీర్చుకోకుండా ఖురాన్ అశ్లీల్లాలనుండి రక్షించబడటానికి చెబుతున్నదేమిటంటే-

1. ఐదు పూట్లా నమాజ్ ను వదలకుండా చదవటం. దీని వల్ల మనిషి ఆలోచనలు అటు ఇటూ తిరిగినా రోజులో ఐదు సార్లు నమాజ్ చదవటం వల్ల పరలోక భీతి అన్నది తాజా అవుతూ ఉంటుంది. నమాజ్ జీవితాంతం నెరవేర్చాల్సిన తప్పనిసరి నిత్య ప్రక్రియ

2. అప్పుడప్పుడూ ఉపవాసం పాటించటం దీని వల్ల విపరీత ఆలోచనలకు కళ్లెం పడుతుంది.

3. అత్యధికంగా ఖురాన్ చదువుతూ ఉండటం. దీనివల్ల పరలోక భీతి పెరుగుతుంది.

4. ప్రాపంచిక జీవితం “అతి తాత్కాలికం” మాత్రమే మీరు కష్టపడకుండా మీ మనస్సు కోరుకునే విధంగా జీవించే అసలు శాశ్వత ప్రపంచం మీ కళ్ల ముందు సాక్షాత్కరించబడే రోజు ఒకటి రానుంది దాని కోసం ఇక్కడ తాత్కాలిక జీవిత కాలంలో భావోద్రేకాలను నియంత్రించుకోవాలి / అదుపులో పెట్టుకోవాలి అన్న విషయాన్ని మర్చిపోకుండా గుర్తుంచుకోవటం.

5. ఈ ప్రపంచంలో తాత్కాలిక సుఖాల కోసం కకృత్తి పడితే శాశ్వత నరకాగ్నికి బలికావలసి ఉందన్న విషయాన్ని గుర్తించటం. ఈ విధంగా మనిషిలో సహజంగా ఉండే కోరికలను అదుపు చేసే (Psychological Control of Mind) విషయంలో ఖురాన్ అతి బలమైన ప్రేరకాల ఆధారంగా మనిషిని నియంత్రిస్తుంది.

స్వర్గంలో పురుషులు పొందబోయే సుఖ భోగాల గురించి మాత్రమే ఖురాన్ ఎందుకు ప్రస్తావన చేస్తుంది? స్త్రీల గురించి ఎందుకు లేదు?
——————————————————————————

ఇది టాపిక్ కి సంబంధం లేని విషయమైనా ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఖురాన్ పురుషునిలో ఉండే కోరికలను అదుపులో పెట్టుకుంటే దానికి బహుమానంగా నిత్య స్వర్గం ఉంటుంది అన్నప్పుడు మరి స్త్రీలు సైతం తమ కోరికలు అదుపులో పెట్టుకుంటే ఖురాన్ అదే విధమైన సమాన వాగ్దానాలు స్త్రీల విషయంలో ఎందుకు చెయ్యటం లేదు? అన్న ప్రశ్న కొందరు అడగవచ్చు. దీనికి సమాధానం- ఖురాన్ విశ్వసించిన స్త్రీ/పురుషులిద్దరికీ ఏ మాత్రం కొరత లేకుండా నిత్య స్వర్గాన్ని ఇరువురికీ ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఖురాన్ లో పురుషులకు మాత్రమే అందమైన భార్యలను ఇచ్చి వివాహం చేస్తానని చెప్పాడు తప్ప స్త్రీల విషయంలో అలాంటి వాగ్దానాలు ఉండవు. ఎందుకంటే- స్త్రీ-పురుషులు స్థాయి, హక్కుల పరంగా దేవుని దృష్టిలో ఇద్దరూ సమానమే అయినప్పటికీ ఇద్దరూ ఎగ్జాక్ట్ గా సమానంకారు! అంటే ఇస్లాం చెప్పేది స్త్రీ, పురుషులిద్దరూ సారూపాలే (Identical) కానీ అన్ని విధాలుగా, అన్ని విషయాల్లోనూ సమానం (Equal) కాదు. ఇది శాస్త్రీయంగా కూడా నిజమే! స్త్రీలకు సృష్టికర్త అయిన దేవుడు ఇచ్చిన స్వరూప స్వభావాలు శారీరక నిర్మాణం వేరు! అలాగని స్త్రీ బలహీనురాలని కాదు పురుషునిలో కష్టపడే తత్వం ఉంటే స్త్రీలో కోమలత్వం ఉంటుంది వారు ప్రత్యేకంగా బిడియం, సిగ్గు, లజ్జ అన్నవి పురుషుల కంటే అతి సున్నితమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. కాబట్టే స్వర్గలోక ప్రస్తావన చేసినప్పుడు ఇక్కడి సామాజిక భావనలను దృష్టిలో పెట్టుకోకుండా స్త్రీల విషయంలో పురుషులకు చేసిన వాగ్దానాల వంటివి చేస్తే అది వారి వ్యక్తిత్వాన్ని భంగపరచటమే అవుతుంది. స్త్రీకి అత్యంత గౌరవం ప్రసాదించిన సృష్టికర్తకు తెలియదా విశ్వాసులైన స్త్రీలకు ఎలాంటి గౌరవప్రదమైన సంతోషాలను స్వర్గంలో ప్రసాదించాలో!

కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు వాగ్దానం చేస్తున్న శాశ్వత జీవితంలో శాశ్వత లాభాలు పొందటమే ప్రధాన లక్ష్యంగా చేసుకుని, తాత్కాలిక జీవితంలో కలిగే తాత్కాలిక కోరికల పరిపూర్తికి తప్పుడు మార్గాలు త్రొక్కటం వల్ల పరలోక శాశ్వత జీవితంలో శాశ్వత నష్టానికి గురయ్యే భయంకమైన ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని గ్రహించి, భావోద్రేకాలను నిగ్రహించుకుంటూ ధర్మసమ్మత మార్గాల్లో తీర్చుకోమన్నదే ఇస్లాం ఇస్తున్న అత్యుత్తమ సందేశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *