ప్రవక్త ముహమ్మద్ (స) జీవిత చరిత్రను గమనిస్తే ఆయన చేసిన ఏ బోధ అయినా అది కేవలం మాటల వరకో లేక రాతల వరకో ఆగిపోయినట్టు కనపడదు. అవును, ప్రపంచంలో ఎందరో వ్యక్తులు ఎన్నో నీతి బోధలు చేసినట్టు చూడగలం. కానీ, ప్రవక్త ముహమ్మద్ (స) చేసిన బోధల ప్రత్యేకత ఏమిటంటే- ఆయన చేసిన ప్రతీ బోధనూ ఆయనే సంపూర్ణంగా ఆచరించి చూపటం జరిగింది. ఉదాహరణకు జాత్యాహంకారం (Rationalism) అన్న జాఢ్యాన్ని రూపుమాపటానికి కేవలం జాత్యాహంకారం తప్పు, పాపం అంటూ కేవలం నీతి సూక్తులు వల్లించలేదు! కానీ, అప్పటికి నల్ల వారిని ఎంతో హీనంగా చూస్తున్న నేపథ్యంలో హజ్రత్ బిలాల్ (రజి) అనే ఓ నీగ్రో బానిసను ఆనాటి కాబా కప్పు పై నిలబడి అజాన్ (నమాజ్ కై పిలుపు) ఇచ్చే గొప్ప బాధ్యతను అప్పగించేశారు!
వాస్తవానికి ఆ బాధ్యత అప్పటి వరకూ అరబ్బులలో ఉన్నత స్థాయి వ్యక్తులే నిర్వర్తిస్తూ ఉండేవారు. ఆ సంఘటన అప్పట్లో ఓ రకంగా దుమారం రేపింది. ఖురాన్ లో ఈ క్రింది వాక్యం ఎందరో నోళ్లను మూయించింది.
“మానవులారా! మేము మిమ్మల్ని ఒకే స్త్రీ, పురుష జంట నుండి సృష్టించాము. తరువాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగానూ, తెగలుగానూ చేశాము. వాస్తవానికి మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవ పాత్రుడు” – 49:13
పై ఖురాన్ వాక్యం ప్రకారం సృష్టికర్త అయిన దేవుడు మానవులను జాతులుగా, తెగలుగా సృష్టించింది కేవలం ఒకరికొకరు పరిచయం చేసుకోవటానికే తప్ప దేవుని దృష్టిలో ఎవరైనా ఉన్నతమైన వ్యక్తిగా ఎంచబడేది అతని జాతి (Race)ని బట్టో, వంశాన్ని బట్టో, కులాన్ని బట్టో, వర్గాన్ని బట్టో కాదు, అతని చేసే పనులు, ప్రవర్తనను బట్టే అన్నది ఖురాన్ తేల్చిపడేసింది.
అలాగే ప్రవక్త ముహమ్మద్ (స) అయితే “అరబ్బుకి అరబ్బేతరునిపై గానీ, అరబ్బేతరునికి అరబ్బుపై గానీ, తెల్లవానికి నల్లవానిపై గానీ, నల్లవానికి తెల్లవానిపై గానీ ఏ అధిక్యతా లేదు కేవలం సత్ప్రవర్తన, భయభక్తుల ద్వారా తప్ప” అని చెప్పి “జాత్యాహంకారాన్ని (Racism)” 1400 సం. క్రితమే కొట్టిపారేశారు! ఈ ఒక్క జాఢ్యాన్నే కాదు ఎన్నో రకాల సామాజిక రుగ్మతలను ప్రవక్త ముహమ్మద్ (స) ఆచరణాత్మకంగా రూపుమాపటం జరిగింది. నిజంగా సమాజంలో “జాత్యాహంకారం (Racism)” అన్న జాఢ్యాన్ని తొలగించి, సుందర ఐక్య సమాజం నిర్మించాలనుకునేవారికి ప్రవక్త ముహమ్మద్ (స) వ్యక్తిత్వం కంటే ఆచరణాత్మక ఉన్నత ఆదర్శం ఎక్కడ దొరుకుతుంది.
ఈ సందర్భంలో కొందరు ప్రశ్నించవచ్చు మరి ఇస్లాం జాత్యాహంకారాన్ని ఖండించినప్పుడు ఈనాడు ముస్లిముల్లో సున్నీలు అనీ, షియాలు అనీ, దూదేకులు అనీ, అహ్లెహదీస్, తబ్లీగ్ జామాత్ వగైరా అని ఎన్నో శాఖలు, వర్గాలు ఎందుకు ఉన్నాయి? వాటి మధ్య అనైక్యత ఎందుకుంది? అని. దీనికి నా సంక్షిప్త సమాధానం- సున్నీ, షియా లేక అహ్లెహదీస్, తబ్లీగ్ జామాత్, జామతే ఇస్లాం వగైరా శాఖాపరమైన విభజనలకు ఇస్లాంకు సంబంధం లేదు! ప్రవక్త ముహమ్మద్ (స) పరమపదించిన తరువాత ఎన్నో సంవత్సరాల తరువాతే సిద్ధాంత పరమైన విభజనల ఆధారంగా ఈ శాఖలు ఉనికిలోకి వచ్చాయి. సంఘాలు, వర్గాలు, శాఖలు ఎన్ని ఉన్నప్పటికీ అందరూ పాటించే ఖురాన్ ఒక్కటే! అందరూ ఆరాధించే దైవం ఒక్కడే! కాబట్టి వాస్తవ ఇస్లాం చూడాలంటే నేటి ముస్లిం సమాజాన్ని చూడకూడదు! కానీ, ఖురాన్, ప్రవక్త ముహమ్మద్ (స) జీవిత చరిత్రను అవగాహన చేసుకోవాలి
జాత్యాహంకారాన్ని తీవ్రంగా ఖండించింది ఇస్లామే!
