అధికశాతం ప్రపంచ దేశాలలో ఉన్న సార్వత్రిక ప్రభుత్వ పాలనా వ్యవస్థలలో ఏకగ్రీవంగా విఫలమైపోయిన “చట్టం” ఏదైనా ఉందంటే అది ఒక్క ‘మద్య నిషేధ చట్టమే’ అనటం అతిశయోక్తి కాదేమో! నిజమే గత ప్రభుత్వ వ్యవస్థల చరిత్ర కాస్త గమనిస్తే సమాజంలో ఎన్నో చెడులకు మూల కారణమైన మద్యం నుండి తమ దేశాల్లో ఉన్న ప్రజలను కాపాడాలన్న ధృడ సకల్పంతో ఎన్నో దేశాలు ప్రయోగాత్మకంగా మద్యపానం నిషేధించాలన్న సాహసం చేసినప్పటికీ అది చివరకు ఓ విఫల ప్రయత్నంగానే ట్రాజెడీ స్టోరీగానే మిగిలిపోయింది.
దానికి గొప్ప ఉదాహరణ: అగ్రరాజ్యంగా ప్రసిద్ధి చెందిన అమెరికాను చరిత్రలో కుదిపేసిన ఘోరమైన వైఫల్యాల్లో ముఖ్యంగా 1920 నుండి 1933 మధ్య సాగిన మద్య నిషేధం! దాదాపు 13 యేళ్లు అమెరికాలో శ్రామికులు, శ్వేతజాతీయులకు మద్య నిషేధంపై జరిగిన ఘోరమైన యుద్ధం అనంతరం 1933 లో దానిని ఎత్తివెయ్యటం జరిగింది. దానికి ప్రధాన కారణం- అందరికీ సమానంగా వర్తించాల్సిన ఆ మద్య నిషేధ చట్టానికి అవినీతి చెదలు పట్టి పదమూడేళ్లూ దొంగ వ్యాపారం ద్వారా మద్యం ఎరులైపారింది. పేదలకు, నల్ల జాతీయులకు అదో దొరకని అరుదైన వస్తువుగా మారింది. ఆ విధంగా మద్య నిషేధం అన్నది పైకి పేరుకే తప్ప దొడ్డిదారిన రాజకీయ నాయకులు, పోలీసులు, ధనవంతులు ఎంతో దర్జాగా సేవించేవారు. పేద, శ్రామిక వర్గాలు మటుకు అది తమపై జరుగుతున్న దౌర్జన్యంగా భావించేవారు. చివరకు ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయి తీవ్రమైన పరిణామాలు, యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఎంతో ఉన్నతాశయంతో మొదలైన మద్య నిషేధం చివరకు ఓ కామిక్ ట్రాజెడీగా ముగిసిపోయింది.
ఈ పరిణామం ఒక్క అమెరికాలో ఎనిమిది దశాబ్దాల క్రితం ఫేలైపోయిన మద్య నిషేధ చట్టం విషయంలోనే కాదు, దాదాపు అనేక దేశాల్లో తీసుకొచ్చిన మద్య నిషేధ చట్టం విషయంలోనూ అదే జరుగుతూ వచ్చింది. కారణం ఏమిటంటే ఎక్కడైనా సమస్య అన్నది ఒక్కటే అయినప్పుడు దాని పరిణామాలు కూడా ఒకేలా ఉంటాయి అది అమెరికాలో అయినా అండమాన్లో అయినా సరే! అందుకే ప్రపంచంలో ఎక్కడ మద్య నిషేధ చట్టం తీసుకొచ్చినా చివరకు దాని ముగింపు అమెరికా మద్య నిషేధం విషయంలో జరిగిన క్లైమాక్స్ సీన్ తోనే శుభం కార్డు పడిపోతూ ఉంటుంది, అమెరికా అనుభవం వెక్కిస్తూనే ఉంటుంది. ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్ లో 1995 లో ఎన్టీ రామారావు మధ్య నిషేధ చట్టం అమల్లోకి తీసుకువస్తే దానిని 1997 లో చంద్రబాబు ప్రభూత్వమే ఎత్తివేస్తూ చట్టం చెయ్యటం జరిగింది. దానికి కారణం బడ్జెట్ లోటు అన్నది చూపటం జరిగింది. ఇప్పుడు ఉన్న ప్రభూత్వాలకు కూడా బడ్జెట్ లో లిక్కర్ ద్వారా ఆదాయమే ప్రధాన వనరు అనుకోండి అది వేరే విషయం. ఏదేమైనా మద్య నిషేధం అన్న అడ్వాంటేజ్ ని మటుకు మధ్యలో లిక్కర్ స్మగ్లర్లు మటుకు చక్కగా వాడుకుని వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. హర్యానాలో కూడా సేమ్ ఇదే సీన్ రిపీట్ అయింది. ఇక గుజరాత్ లో మద్య నిషధం పైకి అమలులో ఉన్నట్టు కనిపించినా అక్కడ లోలోపల జరిగే లిక్కర్ స్మగ్లింగ్ లో వేల కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉంటాయి. ఈ తంతును మోన్నామధ్యలో వచ్చిన “రయీస్” అనే బాలీవుడ్ సినిమాలో ఎంతో చక్కగా చూపటం జరిగింది.
మొత్తానికి ప్రపంచంలో ఎక్కడ మద్య నిషేధ చట్టం అమలు చేసినా లిక్కర్ స్మగ్లర్లకు వేల కోట్ల రూపాయలు వెనకేసుకోటానికి తలుపులు బార్లా తెరవటం అన్న చందంగా తయారవుతుంటుంది. పైకి మాత్రమే మద్య నిషేధం తెర చాటున వేలకోట్ల రూపాయల లిక్కర్ దందా జరిగిపోతుంటుంది. ఆ విధంగా మద్య నిషేధం అన్న చట్టం ఉన్నతాశయంతో ఎక్కడ మొదలైనా చివరకు అది ఓ కామిక్ ట్రాజెడీ లానే ముగిసిన సంఘటనలే తప్ప, ప్రజల ఆలోచనా రీతిని ప్రభావితం చేసి వారిచే మందు త్రాగటం మాన్పించి విజయవంతం అయిన సంఘటన దాదాపుగా ఎక్కడా చూడలేము. చూడబోము కూడా!
కానీ… ఈ సంఘటన ఎప్పుడైనా విన్నారా!?
*****************************************
ఇప్పుడు నేనో ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి చెబుతాను జాగ్రత్తగా గమనించండి. కేవలం మద్యం మత్తులో నిత్యం తూగుతూ ఉండే సభ్యత, సంస్కారాలు సైతం ఎలా ఉంటాయో కూడా తెలియని ఓ అనాగరిక జాతి వద్దకు ఓ వ్యక్తి సంస్కర్తగా వచ్చాడు. వారిని నైతికంగా ఎంతగా తీర్చి దిద్దాదంటే వారిని తన ఉన్నత వ్యక్తిత్వం ద్వారా తన మాటల ద్వారా వారి ఆలోచనలను ఎంతగా ప్రభావితం చేశాడంటే కేవలం మద్యంతోనే రోజు ప్రారంభమై, మద్యంతోనే రోజు ముగిసే ఓ మద్యం మత్తులో తూగుతూ ఉండే అనాగరిక జాతిని నైతికంగా తీర్చిదిద్ది, ఒకానొక సందర్భంలో మీరు ఈ రోజు నుండి మద్యం జోలికి పోకూడదు అని ఆజ్ఞాపించినప్పుడు ఆ జాతి పుర వీధుల్లో మద్యం ఎరులై పారింది. ఇది నిజం. ఆ జాతి ఒకప్పటి అనాగరిక అరేబియా జాతి అయితే, ఆ జాతి వద్దకు వచ్చిన ఆ మహా వ్యక్తి ఎవరో కాదు ప్రవక్త ముహమ్మద్ (స)! విశేషం ఏమిటంటే 1400 సం. క్రితం ఆయన తీసుకొచ్చిన మద్య నిషేధ చట్టం ఇప్పటికీ ఇస్లామియా చట్టాలు అమలులో ఉన్న దేశాల్లో అమలులో ఉండటమే! అయితే బెహ్రెయిన్, బంగ్లాదేశ్, ఇరాన్, అరబ్ ఎమిరేట్స్, యెమెన్ వంటి కొన్ని దేశాల్లో మద్య నిషేధం ఉన్నప్పటికీ ఆయా దేశాల్లో ఇతర దేశాల నుండి పనులు చేసుకోవటానికి వచ్చే ముస్లిమేతరుల విషయంలో బలవంతంగా ఈ చట్టాన్ని వారిపై రుద్దక వారి విషయంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి వారికి మాత్రం అనుమతి ఇచ్చింది.
సంపూర్ణ మద్య నిషేధం ఒక్క ఇస్లాంకే ఎలా సాధ్యపడింది?
****************************************************
భౌతిక చట్టాలకు, ఇస్లామియా చట్టాలకూ మధ్య బేధం ఎలా ఉంటుందంటే- ఇక్కడ ఏ ప్రభూత్వం అయితే కుడి చేత్తో మద్య నిషేధ చట్టం చేస్తుందో అదే ప్రభుత్వం ఎడమ చేత్తో టెండర్లు వేసి మందు షాపులకు లైసెన్సులు జారీ చేస్తుంది. మద్య నిషేధం చేస్తుంది, కానీ అది పేద ప్రజలకు అందని ద్రాక్షలా ధనవంతుల నోట్లోకి వచ్చిపడే ద్రాక్షరసంలా తయారౌతుంది. ఇంకా చెప్పాలంటే ఎయిడ్స్ నిర్మూలన ప్రాజెక్టులో “కండోమ్ ధరించ కుండా శృంగారంలో పాల్గొనవద్దు” అని మాత్రమే చెప్పగలిగుతుంది. అంటే మీరు వ్యభిచారం చేసుకున్నా పర్లేదు కానీ మేము సప్లై చేసే కండోములు వాడి ఎలాగోలా తగలడండి అని ఇండైరెక్టుగా చెప్పటం అన్న మాట! సిగరెట్లు వాడొద్దని సినిమా హాళ్లలో గోల పెడుతూనే ఆ సిగరెట్ కంపెనీలకు లైసెన్స్ మంజూరు చేసేది కూడా అదే ప్రభూత్వం! ప్రజల బాగోగులపై అంత గౌరవం ఉంటే లిక్కర్, సిగరెట్ ఫ్యాక్టరీలనే బ్యాన్ చేసి పారేయొచ్చుగా!
దీనికి పూర్తి భిన్నంగా ఇస్లాం ఏ చెడునైనా ప్రజలచే బలవంతంగా మాన్పించదు. ముందు ప్రజల ఆలోచనల్లో, వారి ప్రవర్తనలో మార్పు తెస్తుంది. ఆ చెడును ఏదో పై పూతగా కాకుండా మూలాల్లో నుండి త్రుంచి వేస్తుంది. ఉదాహరణకు వ్యభిచారం చెయ్యవద్దని మాత్రమే ఇస్లాం చెప్పదు కానీ, దాని దరిదాపులకు అంటే కామోద్రేకాలు రెచ్చగొట్టే ఏ విషయం జోలికి కూడా పోవద్దని చెబుతుంది. ముఖ్యంగా పరాయి స్త్రీల విషయంలో పురుషులు తమ చూపును అదుపులో ఉంచుకోవాలనీ, అలాగే స్త్రీలు పురుషుల విషయంలో తమ చూపును అదుపులో ఉంచుకోవాలనీ చెబుతుంది. స్త్రీలకు తమ శరీర భాగాలు కనపడేలా కాక నిండైన వస్త్రాధారణ నిర్దేశిస్తుంది. చివరకు ఎవరెవరి ముందు తమ అలంకరణ ప్రదర్శించవచ్చో, ప్రదర్శించకూడదో కూడా తెలుపుతుంది. ఈ విధంగా ఇస్లాం ఏదైనా చెడును తొలగించటానీ పై పూత చికిత్స చేయదు కానీ దాని మొదళ్ల నుండి పీకి పారేస్తుంది.
ఆవిధంగా ఇస్లాం ఏదైనా చెడు వల్ల కలిగే ఇహలోక నష్టాన్ని, పరలోక నష్టాన్ని వివరిస్తుంది. ముఖ్యంగా నైతికంగా ప్రజలను ఎంతగా తీర్చి దిద్దుతుందంటే- ఆ చెడు పట్ల ప్రజలకే అంతర్గతంగా ఏహ్యా భావం కలిగేలా చేస్తుంది. అందుకే ఇస్లాంలో చేయబడిన ఎన్నో చట్టాల్లో ఒక్కటి కూడా ఫేలైపోయిన ఒక్క సంఘటన మనం ఎక్కడా వినలేము. ఒకవేళ ఏ ఒక్క చట్టం ఫేలైపోయినా ఇస్లాం 1400 సం.కు పూర్వమే కనుమరుగైపోయి ఉండేదేమో!
ఉదాహరణకు ప్రవక్త ముహమ్మద్ (స) ఆవిర్భవించాక 13 ఏళ్ల తరువాత గానీ మద్యాన్ని మీరు త్రాగటం మానేయ్యాలనే ఆజ్ఞ పూర్తి స్థాయిలో అవతరించలేదు. మరి ఆ పదమూడేళ్ళ కాలం దేనికంటే- ప్రజల ఆలోచన ధోరణిలో నైతికంగా మార్పును తీసుకురావటం. ఒకవేళ ముహమ్మద్ (స) ప్రవక్తగా ఎన్నికైన ప్రారంభ దినాల్లోనే మద్య నిషేధ చట్టం తీసుకొస్తే అప్పుడు కూడా అమెరికాలో జరిగిన పరిణామాల్లాంటివే సంభవించి ప్రజల తీవ్ర వ్యతిరేకతతో ఆ చట్టం ప్రారంభంలోనే ముగిసిపోయి ఉండేదేమో! అందుకే ఆ పదమూడేళ్ళ కాలంలో నిషా స్థితిలో ఉండగా నమాజ్ దరిదాపులకు వెళ్లొద్దు (4:43) అని, మద్యపానం వల్ల లాభం కంటే కీడే ఎక్కువగా ఉంది (2:219) అని పూర్తి స్థాయిలో ఖండిచకపోయినా అది దేవునికి అయిష్టమైన విషయంగా తెలియజేస్తూ ప్రజల ఆలోచనలో మార్పు అన్నది వచ్చాక, పూర్తి స్థాయిలో మద్య నిషేధ చట్టం తేవటం జరిగింది (5:90). అది త్రాగటానికి, అమ్మకానికి వీలులేదన్నప్పుడు ప్రజలు మనస్ఫూర్తిగా ఆ చట్టాన్ని గౌరవించించారు. ఆ తరువాత జరిగింది ఏమిటంటే నిత్యం మద్యం మత్తులో తూగుతూ ఉండే ఆ జాతి పుర వీధుల్లో సారాయి ప్రవహించింది. ఆ విధంగా చరిత్రలో మద్య నిషేధం అన్న చట్టం తీసుకొచ్చి విజయవంతంగా అయిన మరియు దానిని కొనసాగిస్తున్న వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఒక్క ఇస్లాం మాత్రమే! ఏదైనప్పటికీ మధ్య నిషేధమైనా లేక మరే చెడును తొలగించే చట్టమైనా తెచ్చి, దానిని విజయవంతం చేయటం ఎలా అన్న దానికి ఇస్లాం ఒక గొప్ప ఆదర్శం అన్న విషయం పుస్తకాల్లో కాదు ఆచరణాత్మకంగా (Practical గా) 1400 సం. క్రితమే నిరూపించబడిన ఒక వాస్తవం
మద్య నిషేధం & ఇస్లాం
