కాస్త వినటానికి చిత్రంగా అనిపించినా సామాజిక అవసరాల్లో తలాక్ (అంటే- విడాకుల) ప్రక్రియ అన్నది కూడా ఒకటి! అది సామాజిక అవసరం ఎలా అవుతుంది అన్నది గమనిస్తే స్త్రీ, పురుషులు ఒకరికొకరు తోడుగా ఉంటూ జీవనం సాగిస్తున్న సమూహాన్నే సమాజం అంటారు! వ్యక్తుల సమూహంతో కూడుకున్న సమాజంలో తమ మధ్య సఖ్యత కుదరనప్పుడో, పొసగనప్పుడో ఇష్టపూర్వకంగా విడిపోవాలి అనుకునేవారూ కొందరు ఉంటారన్నది కాదనలేని నిజం. అలా విడిపోవటం మంచి విషయం కాకపోయినప్పటికీ కొన్ని సందర్భాల్లో అనివార్యం అవుతుంది. దానికోసం చట్టం కల్పించిన వెసులుబాటే విడాకుల (తలాక్) ప్రక్రియ అన్నది.
కాబట్టి కొన్ని సందర్భాల్లో విడాకులు పొందటం అన్నది స్త్రీ, పురుషుల వ్యక్తిగత మరియు చట్టబద్దమైన హక్కు అని చెప్పొచ్చు. అది ఇరువైపుల నుండీ జరగవచ్చు. ఒకటి భార్యతో భర్తకు పొసగకపోతే భర్త భార్యకు విడాకులు ఇవ్వటమే కాదు, భర్తతో పొసగనప్పుడు భార్య సైతం భర్తకు విడాకులు ఇవ్వటం జరుగుతుంది. వాస్తవానికి విడాకులు అన్నది ఏ విధంగానూ అభిలషణీయమైన విషయం కాదు, కానీ సేమ్ టైమ్, అది క్రైమ్ (నేరం) కూడా కాదు! కానీ, కొన్ని అనివార్య సందర్భాల్లో ఏర్పడే అవసరం మాత్రమే! కానీ సరైన కారణం లేకుండానో, అన్యాయంగానో విడాకులు ఇస్తే మటుకు అది తప్పనిసరిగా క్రైమ్ అవుతుంది. పోనీ గంటకో రేప్ చొప్పున సంవత్సరానికి వేల మంది ఆడపిల్లలు రేప్ చెయ్యబడి చంపబడుతున్నప్పటికీ వారందరికీ న్యాయం చెయ్యటానికంటే కంటే సంవత్సరానికి అరోకొరో జరిగే ట్రిపుల్ తలాక్ లాంటి ఘటనలకు కలత చెంది ముస్లిం మహిళలను ఉద్ధరించటానికి బయలుదేరి ట్రిపుల్ తలాక్ చట్టాన్ని ప్రవేశ పెట్టారే అనుకుందాం. ఇలాంటి అత్యంత తెలివితక్కువ చట్టాన్ని వెలుగులోకి తెచ్చిన నేపథ్యంలో ఆలోచించాల్సిన అంశాలు:
# అసలు మూడుసార్లు తలాక్ చెప్పటం నేరమా?
లేక మొత్తానికి ముస్లిముల్లో ఎవరైనా తలాక్ (విడాకులు) ఇవ్వటమే నేరమా?
# తలాక్ (విడాకులు) అన్న ప్రక్రియ ఒక్క ముస్లిం సమాజంలో మాత్రమే జరుగుతుందా?
# హైందవ సమాజం తలాక్ (విడాకులు) అన్న ప్రక్రియకు అతీతంగా ఏమైనా ఉందా?
అన్న అంశాలను పరిగణలోకి తీసుకుంటే- “అబ్బే! విడాకులు ఇవ్వటం నేరం కాదు ఒకేసారి మూడు సార్లు నోటితో తలాక్ అని చెప్పి వదిలేస్తే మాత్రమే నేరం” అని ఎవరైనా అంటే అలా చెయ్యటం నేరం అని ఇస్లాం ఎప్పుడో చెప్పింది. అలా అన్యాయంగా భార్యను వదిలేయటం ఒక్క ముస్లిం సమాజంలోనే కాదు, ఏక కాలంలో నీకు విడాకులిస్తున్నానని చెప్పి కట్టుకున్న భార్యను వదిలేయటం ముస్లిమేతర సమాజాల్లోనూ చట్టబద్దంగా నేరమే! కానీ ట్రిపుల్ తలాక్ అనే వింతైన చట్టం ఎలా ఉందంటే- తలాక్ (విడాకులు) అన్న ప్రక్రియ ఒక్క ముస్లిం సమాజంలోనే జరుగుతూ ఉంటుంది! మొత్తం ముస్లిం సమాజంలో స్త్రీలందరూ అన్యాయమైపోతున్నారు! దానికి ఇస్లామిక్ చట్టంలో ఎటువంటి సోల్యూషన్ లేదు కాబట్టి ముస్లిం మహిళలను ఎదోలా ఉద్ధరించాలన్నట్టుగా ఉంది!
పోనీ, హైందవ సమాజంలో ఒక్కరు కూడా విడాకులు ఇవ్వరు అలాంటి వింత విన్యాసాన్ని ముస్లిములే ప్రదర్శిస్తుంటారు అనటానికి అవకాశం ఉందా? అంటే మొత్తం దేశంలో ఈనాడు ముస్లిమేతర జంటల విడాకుల కేసులు కోర్టుల్లో లక్షల్లో పడి ఉంటే, వాటిలో కేవలం వేలల్లో ముస్లిం జంటల విడాకుల కేసులు పడి ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా తక్షణ విడాకుల నేరానికి ఒక్క ముస్లిములను మాత్రమే మూడేళ్లు జైళ్లో పెట్టే చట్టం వెనుక ఉన్నది కుట్ర పూరిత ఆలోచన అనటం అతిశయోక్తి కాదు! ఈనాడు దాదాపు డబ్భై శాతం విడాకుల కేసులు హైందవ సమాజానికి లేక ముస్లిమేతర సమాజానికి చెందినవే కావటం గమనార్హం అంతేకాక హిందూ సమాజంలో వరకట్న చావులు రోజుకు ఒకటి చొప్పున సంవత్సరానికి వేల కొద్ది జరుగుతున్నాయన్నది రోజూ కనపడుతున్న యదార్థం.
నిజంగా మహిళా సాధికారత సాధించటానికి వరకట్నంపై, వరకట్న చావులపై, అన్యాయంగా గంటకో రేప్ చేసి చంపుతున్న వారిపై ప్రత్యేక కఠిన చట్టాలు రూపొందించటానికి బదులు ముస్లిం సమాజానికి ఎందుకూ పనికి రాని చట్టం తయారు చెయ్యటం ముస్లిం సమాజంపై చేస్తున్న పరోక్ష కుట్ర అన్నది సామాజిక విశ్లేషకులకు బాగా తెలిసిన విషయమే!
వాస్తవానికి ఏ మతవర్గంలో అయినా ఆయా మతావర్గాల ధార్మిక గ్రంథాలా జ్ఞానం, అవగాహన ఉన్నోల్లు ఉంటారు, లేనోల్లూ ఉంటారు. ముస్లిం సమాజంలో ఉర్దూ/అరబిక్ పేర్లు తగిలించుకున్నంత వారంతా ఇస్లాం బ్రాండ్ అంబాసిడర్లైతే కాదు! ఉర్దూ/అరబిక్ పేర్లు తగిలించుకున్నప్పటికీ ఇస్లాం అవగాహన ఇసుమంతైనా లేనోల్లు కోకొల్లలుగా ఉన్నారు. అలాంటి ధార్మిక గ్రంధాల అవగాహన లేనోల్లు ప్రతీ మతవర్గంలోనూ ఉండటం కామనే! అలాంటి ఇస్లాం అవగాహన లేనోల్లు ఎక్కడో చేసే అరోకొరో సంఘటనలను పట్టుకుని వాటిని ఇస్లాంకు ఆపాదించటం ఎంత అజ్ఞానం అంటే ఏదైనా ఓ దేశంలో ఎవడో ఒకడు మారణహోమం సృష్టిస్తే ఆ దేశ ప్రజలంతా ఉగ్రవాదులే అని ముద్రవేయటం లాంటిదే! ఏ కాస్త జ్ఞానం ఉన్నోడైనా ఎవడో చేసిన తప్పుకు మొత్తం దేశాన్నే నిందించటం అజ్ఞానం కాదా? అని అంటాడు. అచ్చం అలాగే, ఎక్కడో ఇస్లాం అవగాహన ఇసుమంతైనా లేనోల్లు ఏకకాలంలో “తలాక్, తలాక్, తలాక్” అని చెప్పి భార్యను వదిలేస్తే ఇస్లాం అలాంటి హేయమైన చర్యకు పర్మిషన్ ఇస్తుందా? అన్నది ముందుగా ఆలోచించాల్సిన అంశం.
కానీ, ట్రిపుల్ తలాక్ చట్టం చేశాక ఇస్లాం పట్ల ధ్వేషకులైన కొందరు హిందూ మతతత్వ వాదులు అలాంటి పర్మిషన్ ఇస్లాంలో ఉంది కనుకనే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆ అవసరాన్ని గుర్తించి పాపం మహానుభావుడు ట్రిపుల్ తలాక్ చట్టం తెచ్చి ముస్లిం మహిళలకు మేలు చేశాడన్న భావనలో మునిగి ఉన్నారు. కనీసం 1400 వందలు సంవత్సరాలుగా ఇస్లాం ప్రపంచవ్యాప్తంగా పైగా ప్రపంచ జనాభాలో అన్ని దేశాల్లో మూడోంతుల్లో ఒక వంతు భాగం (1/3) అంటే దాదాపు 250 కోట్ల మంది మాన్యుల నుండి సామాన్యుల వరకూ అనుసరించబడుతూ ఉన్న ఓ గొప్ప ధర్మం కేవలం “తలాక్, తలాక్, తలాక్” అని చెప్పి భార్యను వదిలేసే ఓ దిగజారుడు చట్టాన్ని కలిగి ఉంటుందా? అన్న ఆలోచన అటు ఈ దిక్కుమాలిన చట్టం చేసినోల్లకూ తెలియదు! ఇస్లాంను విమర్శించే గుడ్డోల్లకు అసలు తెలియదు!
తక్షణ తలాక్ విధానాన్ని ఇస్లాం ఎప్పుడో నిషేధించింది!
ఏక కాలంలో విడాకులు ఇవ్వటాన్ని 1400 సం. కు పూర్వమే ఇస్లాం నిషేధించింది. అంతేకాదు విడాకులు ఇచ్చే ప్రక్రియ సైతం ఎంతో స్పష్టంగా ఇస్లాం ఎప్పుడో నిర్దేశించటం జరిగింది. అది ఏదో నోటితో మూడు సెకండ్ల కాలంలో తలాక్ అని మూడు సార్లు కాదు ముప్ఫై సార్లు పలికినా జరిగిపోయేది కాదు! భార్యతో విడిపోవాలన్న నిర్ణయానికి వచ్చినప్పుడు మొదలుకుని భర్త ఆమె మూడు బహిష్టు కాలాల సుదీర్గ కాలం తీసుకుని అప్పటికీ సఖ్యత కుదరనప్పుడు, పరస్పరం ఒకరికొకరు మనసు మారనప్పుడు విడిపోయే గొప్ప ప్రక్రియను ఇస్లాం నిర్దేశిస్తుంది. తప్ప భార్యను వదిలేసి పారిపోవటానికో, తక్షణం మాటా మాటా వచ్చి విడిపోవటానికో, తలాక్ అని మూడుసార్లు చెప్పి విడిపోవటానికో ఇస్లాం అనుమతి ఇవ్వదు. కారణం సాధారణంగా భార్యా, భర్తల మధ్య ఏవో చిన్న చిన్న గొడవలే విడాకులకు దారితీస్తుంటాయి. ఇస్లాం మటుకు తమ భార్యల నుండి విడిపోయే నిర్ణయం తీసుకుంటే తమ భార్యల మూడు బహిష్టు మాసాల వరకు ఆగమని చెబుతుంది. కారణం ఈ దాదాపు మూడు నెలల మధ్య కాలంలో వారి మధ్య తలెత్తిన గొడవ సద్దుమణగవచ్చు. లేదా భార్యా, భర్తలు తమ మనస్సు మార్చుకోవచ్చు. లేదా ఏదైనా అపార్థం తలెత్తితే తరువాత నిజానిజాలు తెలుసుకుని తిరిగి కలుసుకోవచ్చు. మూడు నెలల గరిష్ట సమయం (Maximum time) లో కూడా తమ మనసులు కలవకపోతే, ఇక కలిసి ఉండటం జరగదన్నప్పుడు వారు చట్టబద్దంగా విడిపోయి ఎవరి జీవితాలు వారు తమ ఇష్టానుసారంగా బ్రతకవచ్చు. ఇది నేరమా? అవసరమా? అంటే కచ్చితంగా ఓ సామాజిక అవసరం మాత్రమే కాదు భార్యతో పొసగనప్పుడు భర్త, భర్తతో వేగలేనప్పుడు భార్యా కలిగి ఉన్న వ్యక్తిగత హక్కు కూడా!
ట్రిపుల్ తలాక్ చట్టం చేసిన పాలకులకు ఏ కాస్త బుర్రా, బుద్ధీ ఉన్నా ప్రపంచవ్యాప్తంగా ఇన్ని వందల సంవత్సరాలుగా అనేక కోట్లమంది ద్వారా మాన్యుల నుండి సామాన్యుల వరకూ అనుసరించబడుతూ వస్తున్న ఇస్లాం అసలు తలాక్ (విడాకుల) కు సంబంధించి ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది. అది ఎటువంటి చట్టాన్ని చేసింది అన్నది ఏ కాస్తైనా గమనించి ఉండేవారు. అది గమనించిన తరువాత నిజంగా ఇస్లాం అదేదో సతీసహగమనం లాంటి ఆటవిక చట్టాన్నో లేక నిజంగానే ఏక కాలంలో తలాక్ అని మూడు సార్లు చెప్పి విడిపోమన్న అజ్ఞానపు ఆదేశాన్నో ఇస్తుంటే గనుక, అరరే! ఇస్లాం తలాక్ (విడాకుల) విషయంలో మరీ ఇంత దారుణమైన ఆదేశాలు ఇస్తుందా అని ట్రిపుల్ తలాక్ చట్టం తెచ్చినా అది అందంగా ఉండేదేమో! కానీ, అసలు ఏక కాలంలో విడాకులు ఇవ్వటాన్ని 1400 సం. కు పూర్వమే ఇస్లాం నిషేధించింది, పైగా ఇస్లాం ప్రకారం మొత్తం మూడునెలల సుదీర్గ గడువు అనంతరమే తలాక్ అవుతుందన్నది తెలియని కొందరు ఏక కాలంలో తలాక్ అని మూడుసార్లు చెప్పి విడాకులు ఇచ్చే బుర్ర తక్కువ వెధవలకు తెలియదంటే అలా విడాకులిచ్చే దిక్కుమాలిన ప్రక్రియ అసలు ఇస్లాంలోనే లేదు అన్నది ట్రిపుల్ తలాక్ చట్టబద్ధం చేసిన కాషాయ మతతత్వ వాదులకు అస్సలు తెలీదు!
ట్రిపుల్ తలాక్ విషయంలో స్వీట్లు పంచుకునే దగుల్బాజీ ఫీట్!
అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే- అసలు ట్రిపుల్ తలాక్ అన్నదే ఓ బుద్ధితక్కువ చట్టం అయితే ఆ బిల్లు పాస్ కాగానే దాని విషయంలో బురఖా వేసుకుని కొందరు కాషాయ డ్రామా ఆర్టిస్టులు స్వీట్లు పంచుకునే దగుల్బాజీ ఫీట్ ప్రదర్శించినట్లు కొన్ని న్యూస్ పేపర్లలో రావటం! ఎందుకంటే తలాక్ కి సంబంధించి ఇస్లాంలో ఏ సోల్యూషన్ లేదు, ఉన్నా అదేదో ఆచరణసాధ్యం కాని చట్టం ఉందీ అంటే ఒక్క బురఖా వేసుకుని స్వీట్లు పంచుకున్న కాషాయ డ్రామా ఆర్టిస్టులేకాదు ఇండియాలో ఉన్న ముస్లిములందరూ స్వీట్లు పంచుకుని ఉండేవారు. గమనార్హమైన విషయం ఏమిటంటే ట్రిపుల్ తలాక్ ను తీవ్రంగా దేశవ్యాప్తంగా ఖండించింది ముస్లిం పురుషులే కాదు దేశవ్యాప్తంగా లక్షల మంది ముస్లిం మహిళలు ముస్లిం సమాజంపై బలవంతంగా రుద్దబడుతున్న ట్రిపుల్ తలాక్ బిల్లు పట్ల తీవ్రమైన నిరసనలు తెలియజేశారు, లక్షల మంది ముస్లిం మహిళలు రోడ్లపై ఈ బిల్లుకు వ్యతిరేకంగా ధర్నాలు చేశారు. కానీ మీడియా లక్షల్లో ముస్లిం మహిళలు త్రిపుల తలాక్ కు వ్యతిరేకంగా చేసిన నిరసన చూపటానికి బదులు అక్కడెక్కడో వారణాసిలో కాషాయ మతతత్వ వాదులు బురఖాలు తొడిగించి ఎరెంజ్ చేసిన డ్రామా ఆర్టిస్టులు స్వీట్లు పంచుకునట్టు మటుకు ప్రింట్ చేస్తుంది.
ఒక పురుషుడు మూడు సార్లు తలాక్ చెప్పినా చెప్పకపోయినా అన్యాయంగా తక్షణం విడాకులు ఇచ్చి తన భార్యను వదిలేయటం చట్టబద్ధంగా అది ఎప్పుడూ నేరమే అది ముస్లిములకైనా, ముస్లిమేతరులకైనా కామన్! ఇక ఇస్లాం అవగాహన ఉన్నోల్లు విడిపోవాలనుకుంటే ఎలాగూ ఖురాన్ ఆదేశం ప్రకారం మూడు మాసాల టైమ్ తీసుకుని కుదిరితే కలిసి ఉంటారు, కుదరకపోతే పెద్దల సమక్షంలో ఇరుపక్షాల సమక్షంలో విడిపోతారు. దానికంటూ ముస్లిం పర్సనల్ లా అంటూ ఒకటి ఉంది. మధ్యలో ట్రిపుల్ తలాక్ చట్టం సింపుల్గా చెప్పాలంటే ముస్లిం సమాజానికి నాలుక గీసుకోవటానికి కూడా పనికిరాని విషయం మాత్రమే!
“తలాక్” నేరమా? సామాజిక అవసరమా?
