భౌతిక చట్టాలకు, ఆధ్యాత్మిక కొలమానాలకు మధ్య ఉన్న మౌలిక వ్యత్యాసం తెలియని ఆస్తికులే సమాజంలో అధిక శాతం ఉన్నారని చెప్పటం అతిశయోక్తి కాదు! భౌతిక చట్టాలు రాము, రాజు వగైరా పేర్లను బట్టి హిందువు అని, డేవిడ్, జాకబ్ వగైరా పేర్లను బట్టి క్రైస్తవుడని, అబ్దుల్లా, అబ్దుర్రహ్మాన్ వగైరా పేర్లను బట్టి ముస్లిం అని వర్గీకరిస్తాయి.
ఈ టైపు వర్గీకరణను బట్టే మసూద్ అజ్ హర్, దావూద్ ఇబ్రాహీం, అబూ బాకర్ అల్ బాగ్దాదీ, అబూ ముహమ్మద్ అల్ జులైనీ వగైరా ముస్లిం పేర్లు పెట్టుకుని ఉగ్రవాదం చెయ్యటాన్ని బట్టి ఇస్లాం విమర్శకులు “టెర్రరిస్టులందరూ ముస్లిములే” అని ఎద్దేవా చేస్తుంటారు. మీడియా అయితే ఇంకో అడుగు ముందుకు వేసి వారి పేర్లను బట్టి “ఇస్లామిక్ టెర్రరిజం” అనే ఓ వింతైన కొత్త పదాన్ని కనిపెట్టి పరిచయం చేస్తూ ఉంటుంది.
కానీ ఆధ్యాత్మిక కొలమానాల వెలుగులో వ్యక్తుల వర్గీకరణ ఎలా ఉంటుంది అన్నది గమనిస్తే- శాస్త్రాలలో చెప్పబడిన వాస్తవ దైవ దృక్పథం యొక్క అనుసరణను బట్టే నిజమైన వైదికుడా లేక నిజ క్రైస్తవుడా లేక నిజ ముస్లిమా అన్న వర్గీకరణ జరుగుతుంది. ఇక ఇస్లాం ప్రబోధించే దృక్పథాన్ని బట్టే ఒక వ్యక్తి “నిజ ముస్లిం” గా పరిగణించబడతాడు తప్పితే అతని ఆధార్ కార్డులో ఉండే ఉర్దూ/అరబిక్ పేరును బట్టి ఇస్లాం అతన్ని ముస్లింగా పరిగణించదు.
ఈ సందర్భంలో అసలు ముస్లిం అంటే ఎవరు? అన్నది గమనిస్తే-
ముస్లిం అంటే చాలామందిలో ఉన్న అపోహ ఏమిటంటే- తలపై టోపీ పెట్టుకుని, గెడ్డం పెంచేసి అబ్దుల్లా అనో అబ్దుర్రహ్మాన్ అనో పేరు పెట్టుకుని మసీదుకు వెళ్లి నమాజులు చదివేసి, ఉర్దూనో అరబ్బీనో మాట్లాడేవారంతా ముస్లిములన్నది! ఇక్కడ ఉన్న భౌతిక చట్టాలు లేక భౌతిక సూత్రాలను బట్టి అలా లెక్క కట్టటం సర్వసాధారణం అయినప్పటికీ ఇస్లాం వెలుగులో ఆ రకమైన వర్గీకరణ చెల్లనే చెల్లదు!
ఇస్లాం చెప్పేది ఏమిటంటే- ముస్లిముల ఇంట పుట్టటాన్ని బట్టో, కళ్లలో సుర్మా, తలపై టోపీ పెట్టుకుని, గెడ్డం పెంచేసి అబ్దుల్లా అనో అబ్దుర్రహ్మాన్ అనో పేరు పెట్టుకుని మసీదుకు వెళ్లి నమాజులు చదివేసి, ఉర్దూనో అరబ్బీనో మాట్లాడుతూ సమాజంలో ప్రభూత్వ పత్రాల్లో ముస్లిం అని పేర్కొనబడినప్పటికీ అతని ఆలోచన-ఆచరణ ఇస్లాం మౌలిక దృక్పథానికి వ్యతిరేకంగా ఉంటే అతను “నామమాత్ర ముస్లిమే” తప్ప యథార్థమైన సంపూర్ణ ముస్లిం అయితే కాదు. డూప్లికేట్ వస్తువుకి ఎంత పెద్ద బ్రాండెడ్ పేరు పెట్టినా దానికి పెట్టబడిన పేరును బట్టి దానిని ఒరిజినల్ వస్తువుగా పరిగణించలేము కదా!
ఇస్లాం చెప్పే ఏ దృక్పథాన్ని బట్టి ఒక వ్యక్తి ముస్లిం కాగలడు?
అసలు “ముస్లిం” అన్న పదానికి నిఘంటు అర్థం- “విశ్వాసి” లేక “దైవ విధేయుడు” అని అర్థం అంతే! తప్పితే చాలామంది అనుకున్నట్టు అది ఓ మతానికో, వర్గానికో చెందిన వ్యక్తుల గుర్తింపు పేరు వంటిది కాదు!
సంక్షిప్తంగా ఒక వ్యక్తి ముస్లింగా గుర్తించబడటం అన్నది ఆ వ్యక్తి ఇస్లాం ప్రస్తావిస్తున్న కొన్ని మౌలిక షరతులను (Basic Conditions) నిర్వర్తించటం ద్వారానే జరుగుతుంది. తప్ప ఆ వ్యక్తి అబ్దుల్ల అనో, అహ్మద్ అనో పేరు తగిలించుకున్నంత మాత్రాన ఆ వ్యక్తి ముస్లిం అయిపోడు.
ఇక ఇస్లాం ప్రస్తావిస్తున్న ఆ మౌలిక షరతులు ఏమిటంటే- 1. ఆ వ్యక్తి ఈ సర్వసృష్టికీ ఒక్కడే దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడని బలంగా నమ్మి ఆయనను మాత్రమే ఆరాధించాలి, ప్రార్ధించాలి. 2. సమాజంలో ప్రజలను మంచి వైపునకు పిలవాలి, చెడు వైపు నుండి వారిని నిరోధించాలి. ఈ పనికొరకు అహోరాతులు శ్రమించాలి. 3. సర్వసృష్టికర్త అయిన దేవుని “శక్తి-సామర్థ్యాలు”, “విధి-నిషేధాలు” ఏమిటో తెలుసుకుని వాటిని బట్టి ఆచరణ చెయ్యాలి. 4. తన సంపాదనలో కొంత భాగాన్ని బీదసాదలకు దానం చెయ్యాలి. 5. తోటి వ్యక్తుల ధన, మాన, ప్రాణాలకు ఎటువంటి హానీ కలగ కుండా నడుచుకుంటూ తలిదండ్రుల, తోటి వ్యక్తుల హక్కులను కాపాడాలి. 6. అన్యాయంగా ఏ జీవికీ ప్రాణహాని కలగజెయ్యకూడదు. సమస్త జీవాల పట్ల దయ కలిగి ఉండాలి. 7. స్త్రీలను గౌరవించాలి, వారి పట్ల వినమ్రత, దయా భావంతో మెలగాలి ఇంకా వారికి చెందాల్సిన హక్కులు వారికి చెల్లించాలి. వీటిలో ఏ ఒక్కటి లోపించినా పేరుకి అతను ముస్లిం అన్న ట్యాగ్ తగిలించుకున్నా సరే అసంపూర్ణ ముస్లిమే తప్ప ఇస్లాం ప్రకారం అతను యథార్థమైన సంపూర్ణ ముస్లింగా పరిగణించబడడు.
అసలు పొరుగువాడు ఆకలిగా ఉండి తాను మాత్రమే కడుపు నిండా భుజించేవాడు విశ్వాసి (ముస్లిం) కాదన్నారు ప్రవక్త ముహమ్మద్ (స). అంటే ఒక వ్యక్తి సంపూర్ణ ముస్లిం అవ్వటం అవ్వకపోవటం అన్నది ఎంత సున్నితమైన విషయాల పై ఆధారపడి ఉందో తెలుసుకోగలం.
అయితే సృష్టిలో దైవ విధేయత కలిగి ఉన్నవన్నీ ముస్లిములేనా?
ఇది వినటానికి కాస్త చిత్రంగా అనిపించవచ్చు. కానీ ఇది వాస్తవం. “ముస్లిం” అన్న పదానికి అర్థం “దైవ విధేయుడు” అని మనం ముందే చెప్పుకున్నాం. దీనిని దృష్టిలో పెట్టుకుంటే సృష్టిలో అణువు నుండి బ్రహ్మాండం వరకు దేవుని ఆజ్ఞలకు కట్టుబడి ఉన్న సృష్టితాలన్నీ ముస్లిములే అనబడతాయి! శరీరంలో దేవుని విధేయతకు కట్టుబడి పనిచేస్తున్న భాగాలన్నీ ముస్లిములే అతను ఏ కులానికి చెందినవాడైనప్పటికినీ! అదే విధంగా ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞలకు ఎంత వరకు కట్టుబడి నడుచుకుంటున్నాడు అన్న మౌలిక అంశం ఆధారంగానే ఒక వ్యక్తి నిజ ముస్లిమా? నామ మాత్రా ముస్లిమా? అన్నది ఇస్లాం ప్రకారం పరిగణించబడుతుంది.
మరికాస్త వివరంగా చెప్పాలంటే- ఒక వ్యక్తి రాము అనో, కృష్ణ అనో, మోసేస్ అనో, డేవిడ్ అనో, మేరీ అనో లేక ఏ పేరు తగిలించుకున్నా, ఏ మతానికి, ఏ కులానికి, ఏ జాతికి, ఏ వర్గానికి చెందినవాడైనా అతను నిజ దేవుని ఎరిగి ఆయన ఒక్కడే అని తెలుసుకుని, ఆయనను మాత్రమే ఆరాధిస్తూ ఆయన ఆజ్ఞలకు లోబడి జీవిస్తూ ఉంటే అలాంటి వ్యక్తి అతని స్వభావాన్ని బట్టి ముస్లింగానే అంటే విశ్వాసిగానే పరిగణించబడతాడు. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే “ముస్లిం” అంటే అది ఓ మతం తాలూకు లేక కులం తాలూకు పేరు కాదు, అది ఒక దృక్పథం తాలూకు, దైవాజ్ఞలకు కట్టుబడి జీవించే వ్యక్తుల స్వభావం తాలూకు పిలుపు అని చెప్పాల్సి ఉంటుంది.
ఖురాన్ ప్రకారం ముస్లిం సమాజం నియామక అసలు లక్ష్యం ఏమిటి?
“ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికీ, వారి సంస్కరణకూ రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే (ముస్లిములే). మీరు మంచి చేయండి అని ఆజ్ఞాపిస్తారు. చెడు నుండి ఆపుతారు. ఆల్లాహ్ ను విశ్వసిస్తారు” – 3:110
దీనిని బట్టి ప్రపంచ ప్రజలను సంస్కరించే బృహత్తర బాధ్యత నిర్వహణ ఆధారంగా ఫలానా వ్యక్తులు నిజ ముస్లిములా? కాదా? అన్నది నిర్థారణ అవుతుంది తప్ప వారి వేష, భాషను బట్టో, వారి వంశావళిని బట్టో కాదని తెలుస్తుంది.
ముస్లిములు దేవుని సేవకొరకై ఎన్నుకోబడినవారు! తప్ప ఉగ్రవాద చర్యలకు ఎన్నుకోబడిన వారు కాదు!!
“అల్లాహ్ మార్గంలో పరిశ్రమించండి. పరిశ్రమించవలసిన విధంగా. ఆయన మిమ్మల్ని తన సేవకై ఎన్నుకున్నాడు. ధర్మంలో మీకు ఏ ఇబ్బందినీ ఉంచలేదు” – 22:78
ఎవరి సేవకొరకు? ముస్లిముల సేవకోరకా? “ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికీ, వారి సంస్కరణకూ రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే” అని చెప్పటాన్ని బట్టి ముస్లిములకు దేవుడు ఖురాన్లో ఇచ్చిన ఏకైక డ్యూటీ ఏదైనా ఉందంటే అది కేవలం “ప్రజలను మంచి వైపు పిలవటం, చెడు నుండి ఆపటం” అన్న మానవాళిని సంస్కరించే బాధ్యత ఒక్కటి తప్ప రెండవది లేనేలేదు. కాబట్టి ముస్లిములు ఎవరు? అంటే- దేవుని ఆజ్ఞల ప్రకారం జీవితం గడుపుతూ ప్రపంచ ప్రజల సేవకొరకు ఎన్నుకోబడిన వారు. ఈ బాధ్యతా నిర్వహణ విషయంలో అలక్ష్యం చూపుతూ ఎంత తలమీద టోపీలు పెట్టుకుని, గుబురు గెడ్డం పెంచేసి, ఉర్దూ మాట్లాడుతూ పైకి ముస్లిములుగా కనపడుతున్నా, ఎంత సలాం అలైకుమ్, వాలైకుమ్ అస్సలాం అని పలకరించుకుంటున్నా వారంతా ముస్లిం అన్న ట్యాగ్ మెడలో తగిలించుకున్న నామ మాత్ర ముస్లిం బ్యాచ్ గానే పరిగణించబడతారన్న మాట!
పై వివరణ వెలుగులో గమనించాల్సిన ముఖ్య విషయాలు సంక్షిప్తంగా:
1.ముస్లిం అని పేర్కొనబడినంత మాత్రానా అతని ఆలోచన-ఆచరణ ఇస్లాం మౌలిక దృక్పథానికి వ్యతిరేకంగా ఉంటే అతను పేరుకు మాత్రమే ముస్లిం లేక నామమాత్ర ముస్లిమే తప్ప స్వాభావికంగా యథార్థ ముస్లిం అయితే కాదు.
2.ప్రపంచ ప్రజలను సంస్కరించే బృహత్తర బాధ్యత నిర్వహణను బట్టి ఫలానా వ్యక్తులు నిజ ముస్లిములా? కాదా? అన్నది ఇస్లాం ప్రకారం నిర్థారణ అవుతుంది తప్ప వారి వేష, భాషను బట్టో, వారి వంశావళిని బట్టో కాదు.
3.ముస్లిం సమాజానికి అల్లాహ్ ఇచ్చిన “మంచి చేయండి అని ఆజ్ఞాపించటం, చెడు నుండి ఆపటం” అన్న మానవాళిని సంస్కరించే గొప్ప బాధ్యత ఆధారంగా అది “ఉత్తమ ముస్లిం సమాజం”గా గుర్తించ బడుతుంది.
4.ముస్లిములు ఎవరు? అంటే- ప్రపంచ ప్రజల సేవకొరకు ఎన్నుకోబడిన వారు. ఈ బాధ్యతను ప్రక్కనపెట్టేసినోల్లంతా ముస్లిం అన్న ట్యాగ్ మెడలో తగిలించుకున్న నామ మాత్ర ముస్లిం బ్యాచ్ గానే పరిగణించబడతారు.
మరి ముస్లిం పేర్లు తగిలించుకున్న ఉగ్రవాదులు ముస్లిములుగా పరిగణించబడతారా!?
ఇప్పటివరకూ మనం చూసిన వివరణను కాస్త పరిశీలనగా చదివిన ఎవరికైనా అసలు ముస్లిం అంటే ఎవరో? దేని ప్రాతిపదికన ఒక వ్యక్తి ముస్లింగా పరిగణించబడతాడో అవగాహన వచ్చేసి ఉంటుంది.
పై వివరణకు దృష్టిలో పెట్టుకుంటే, నేడు ముస్లిం పేర్లు తగిలించుకున్న కొందరు ఉన్మాదులు చేస్తున్నదేమిటో గమనిస్తే- ఇస్లామిక్ తౌహీద్ అని, ISIS అని కొన్ని పేర్లు పెట్టుకున్న ఉన్మాదులు “జీహాద్” పేరిట దాని అసలు ఉద్దేశానికి వ్యతిరేకంగా సమాజంలో లక్షల మంది అమాయకులను పొట్టన పెట్టుకోవటం, ప్రజలను భయభ్రాంతులను చెయ్యటం, అశాంతిని రేకెత్తించటం తప్ప మరొకటి ఏదీ చెయ్యటం లేదు!
ఖురాన్ చెబుతున్నదేమిటంటే-
“న్యాయ బద్ధంగా తప్ప అల్లాహ్ పవిత్రంగా నిర్ణయించిన ఏ ప్రాణినీ హతమార్చకండి” – ఖురాన్ 6:151
అంటే దేవుడు మనుషులు తినటానికి ఏ ప్రాణులనైతే పవిత్రమైనవిగా నిర్దేశించాడో వాటిని ఆ ఉద్దేశంతో తప్ప అన్యాయంగా ఏ ఒక్క ప్రాణినీ హతమార్చే అవకాశం మనిషికి లేదు! అలాగే మరణ దండనకు తగిన నేరం చేస్తే చట్టబద్ధంగా తప్ప అకారణంగా ఒక మనిషిని చంపితే అది ఖురాన్ ప్రకారం ఎంతపెద్ద ఘోరమైన పాపంగా ఖురాన్ పరిగణిస్తుందో ఈ క్రింది గమనించగలరు.
“హత్యకు బదులు హత్యగానీ లేదా కల్లోలాన్ని వ్యాపింపజేసినందుకు గానీ కాక, మరే కారణం వల్లనైనా ఒక మానవుణ్ణి చంపినవాడు సమస్త మానవులను చంపినట్లే. ఒక మానవుడి ప్రాణాన్ని కాపాడిన వాడు మొత్తం మానవుల ప్రాణాలను కాపాడినట్లే” – ఖురాన్ 5:32
కానీ నేడు ముస్లిం పేర్లు తగిలించుకున్న ఉగ్రవాదులు చేస్తున్నదేమిటంటే-
జీహాద్ పేరుతో దాని ఉద్దేశానికి వ్యతిరేకంగా అన్యాయంగా ప్రజల ప్రాణాలు పొట్టన పెట్టుకోవటం. ఉదాహరణకు ISIS సంస్థను తీసుకుంటే అది వందల మంది సిరియన్ల ప్రాణాలను బలితీసుకుని, సిరియాలో లక్షల కొద్దీ జనాలు చనిపోవటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం అవుతుంది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఎందరినో పొట్టనపెట్టుకుంది. ఈ పనికోసం ఇశ్రాయేల్ మరియు అగ్రరాజ్యాలు ISIS కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాయి. అన్యాయంగా అనేకమంది స్త్రీలను బంధించి వారిపై అత్యాచారాలు చేస్తున్నారు. అలాంటి వారు ముందు అసలు మనుషులు అని పిలవబడటానికే అనర్హులు! అమెరికా, యూరప్ దేశాలకు తొత్తుగా పనిచేస్తున్న మీడియా ఈ దిక్కుమాలిన తతంగాన్ని “ఇస్లామిక్ టెర్రరిజం” అనే పేరుతో పరిచయం చేస్తుంది.
గాడిదను పట్టుకుని ఎంత గుర్రం లాగా మేకప్ వేసి దానిని గుర్రం, గుర్రం అని పదిసార్లు పిలిచినంత మాత్రానా గాడిద గుర్రం అయిపోదు కదా!? అచ్చం అలాగే అల్-ఖైదా అనో, ISIS వగైరా కొన్ని దిక్కుమాలిన సంస్థలు పెట్టుకుని, అందులో పనిచేసే వారు ఎంత ఇబ్రాహీం, రహ్మాన్, అహ్మద్, అబ్దుల్లా వగైరా పేర్లు తగిలించుకుని, టోపీ, గెడ్డాలు పెట్టేసుకున్నంత మాత్రానా వారు ఇస్లాం పేర్కొంటున్న నిజమైన ముస్లిములైతే కాలేరు. కేవలం భౌతిక లెక్కల ప్రకారం వారు ప్రభూత్వ పత్రాల్లో ముస్లిములుగా పరిగణించబడటం తప్ప.
ఉగ్రవాదుల పేర్లను బట్టి ఆయా మత వర్గాలను విమర్శించటం ఘోరమైన ఉగ్రవాదం!
ఉదాహరణకు: మక్కా మసీదు, ఆజ్మీర్ దర్గా బాంబుపేలుళ్లకు పాల్పడింది, ప్రజ్ఞ్యా ఠాకూర్, స్వామీ ఆశీమానంద వారి అనుచరులు. గుజరాత్ మారణహోమం సృష్టించింది కొంతమంది హైందవ తిరిగుబాటు దారుల బ్యాచ్. ఈ పరిణామాలను బట్టి మొత్తం హైందవ సమాజాన్ని పట్టుకుని ఉగ్రవాదులని చెప్పటం అవివేకం.
జలియన్ వాలా బాగ్ లో కాల్పులు జరిపి వేల మందిని పొట్టన పెట్టుకుంది క్రైస్తవులైన బ్రీటీష్ వారే కాబట్టి, ఇరాన్ పై టన్నుల కొద్దీ బాంబులు వేసి లక్షల మందిని పొట్టన పెట్టుకుంది క్రైస్తవ దేశమైన అమెరికాయే కాబట్టి క్రైస్తవులందరూ టెర్రరిస్టులని చెప్పటమూ మూర్ఖత్వం అవుతుంది. అలాగే కొందరు ఉన్మాదులు ముస్లిం పేర్లు తగిలించుకు ఉగ్రవాదం చెయ్యటం కారణంగా ముస్లిములందరూ ఉగ్రవాదులని బలవంతంగా ముద్రవేయాలని చూడటం ఘోరమైన అజ్ఞానం మాత్రమే కాదు, ఉగ్రవాదుల పేర్లను బట్టి ఆయా మత వర్గాలను విమర్శించటం ఘోరమైన ఉగ్రవాదం అవుతుందనటం అతిశయోక్తి కాదు.
ఇస్లాం తోటి వ్యక్తుల కొరకు ఎన్నో త్యాగాలు చెయ్యమంటుంది.
నేడు కొందరు ఏ ఖురాన్ అయితే ఉగ్రవాదం ప్రేరేపిస్తుందని విమర్శిస్తున్నారో ఆ ఖురాన్ చదివిన ముస్లిములే స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని వేలల్లో తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారు. దానికి కారణం ఇస్లాం తోటి వ్యక్తుల సంక్షేమం కొరకు ఎన్నో త్యాగాలను చెయ్యమనటమే! ఇస్లాం ఇచ్చిన ఆ స్పూర్తితోనే ఆనాడు ఎందరో ముస్లిములు దేశ స్వతంత్రం కోసం తమ ప్రాణాలను బలిచ్చేశారు. ఇప్పుడు ఈ 20వ శతాబ్దం చివర్లో కొందరు ఉన్మాదులు ముస్లిం పేర్లను తగిలించుకుని ఉగ్రవాదం చేసినంత మాత్రానా గతంలో ఈ దేశం కోసం వెలకొద్దీ ముస్లిములు చేసిన ప్రాణ త్యాగాలను మరచిపోయి, ముస్లిముల లక్ష్యం ముస్లిమేతరులను చంపటమే, ఉగ్రవాదులందరూ మీవారే కదా! ఖురాన్ ఉగ్రవాదం ప్రేరేపిస్తుంది! వగైరా సంస్కార హీనమైన, హేళనా పూరితమైన మాటలతో మనసులు నొప్పించటం ఓ రకంగా బహిరంగంగా ఉగ్రవాదం చెయ్యాటమే అవుతుందనటంలో సందేహం లేదు.
