ఉగ్రవాదం ఎవరిలో ఉంది!?

దైవ గ్రంథల్లో చెప్పబడిన ధర్మాన్ని అనుసరించే ఏ మత వర్గానికి చెందిన ప్రజలలోనైనా ఉగ్రవాదం లేక టెర్రరిజం అనేది ఉండదు! అసలు ఉగ్రవాదం లేక టెర్రరిజం అన్న పదానికి సరైన అర్థం- “ప్రజలను భయభ్రాంతులకు గురిచేయ్యటం! ఇతరుల ధన, మాన, ప్రాణాలకు అన్యాయంగా నష్టం కలిగించటం! ప్రజల మనోభావాలను దెబ్బతీయటం, సమాజంలో ప్రజల భావోద్రేకాలను రెచ్చగొట్టి అశాంతిని, అసహనాన్ని రేకెత్తించటం!”.

ఈ ప్రక్రియ దైవ ధర్మానికే వ్యతిరేకం! దైవధర్మం అన్నది భగవద్గీతలో అయినా, బైబిల్లో అయినా, ఖురాన్లో అయినా చెబుతున్నదేమిటంటే- నిజదైవాన్ని గుర్తించి ఆయనకు మాత్రమే లోబడి ఉండటం, ప్రజల ధన, మాన, ప్రాణాలకు ఎటువంటీ నష్టం కలగకుండా వారికి రక్షణ కల్పించటం, ఇతరుల హక్కులను కాలరాయకుండా వాటిని కాపాడటం, ఇతరుల మనోభావాలను గౌరవించటం, సమాజంలో అశాంతికి బదులు శాంతిని, అసహనానికి బదులు సహనాన్ని స్థాపించటమే! ఇలాంటి నిజ దైవ ధర్మాన్ని అవలంబించేవారిలో ప్రేమా, నిస్వార్థత, త్యాగనిరతి, ఉత్తమోత్తమ నైతిక, మానవీయ విలువలు మెండుగా ఉంటాయి. ఈ విలువలు కలిగిలేనోల్లే టెర్రరిస్టులని పిలువబడేది!

ఇక ఏ గ్రంథమైనా అది భగవద్గీత అయినా కావొచ్చు, బైబిల్ అయినా కావొచ్చు లేదా ఖురాన్ అయినా కావొచ్చు ప్రజలను అన్యాయంగా చంపమని గానీ, సమాజంలో అల్లర్లు, అశాంతిని సృష్టించమని గాని ఎంతమాత్రం బోధంచటంలేదు. ఈ వాస్తవాన్ని ప్రశాంత హృదయం, హుందాతనం ఉట్టిపడే వ్యక్తిత్వం, గౌరవప్రదమైన మాటతీరు, సంస్కారం కలిగిన నడవడిక వంటి కొన్ని ఉత్తమ గుణాలు కలిగిన కొందరు సంస్కారవంతులకు మాత్రమే అర్థమయ్యే విషయాలు.

ఈ ఉన్నత గుణాలకు వ్యతిరేకంగా కొందరు ఉంటారు. వారి మాట తీరులో చావకబారు తనం, సంస్కారరహితమైన మాటతీరు, ఆవేశపూరితమైన ప్రవృత్తి, ప్రతీకార ధోరణితో కూడిన నడవడిక తమ స్వభావంలో స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనపడే కొందరు చాలా దిగజారుడుతనంగా మాట్లాడుతుంటారు. ఎలా అంటే: “ముస్లిములందరూ ఉగ్రవాదులు కారు, కానీ ఉగ్రవాదులందరూ ముస్లిములే! ఖురాన్ ముస్లిమేతరులను చంపేయమంటుంది! ఉగ్రవాదం చేసి ప్రజలను చంపేస్తే అల్లాహ్ ఖురాన్లో స్వర్గం ఇస్తాడని చెప్పాడంటకదా! మీ ముస్లిములేకదా ఈనాడు బాంబులు వేసి ప్రజల ప్రాణాలు తీస్తుంది!” వగైరా వగైరా డైలాగులు విసురుతూ అతి చవకబారుతనంగా కొందరు మాట్లాడుతుంటే చాలా చిత్రంగా అనిపిస్తుంది.

ఇలా మాట్లాడేవాళ్ళ ఉద్దేశం కావాలని ఇస్లాంపై అక్కసుతో, ఇస్లాంపై ఉగ్రవాదాన్ని పనికట్టుకుని ఎదోలా రుద్దిపడేయాలన్నదా? లేక వారి అర్థం చేసుకోలేని తనమా? అమాయకత్వమా? అన్నది చాలాసార్లు అర్థం కాదు. పదిసార్లు గుర్రాన్ని పట్టుకుని గాడిద అని ప్రచారం చేసినంత మాత్రానా గుర్రం గాడిద అయిపోదు కదా! అలాగే బలవంతంగా ఇస్లాంను ఉగ్రవాద భావజాలం కలిగిన మతం అని ఎంత ప్రచారం చేసినా ఇస్లాంకు కించిత్తు నష్టం కలిగించటం కూడా అసాధ్యం.
మాలెగావ్ బాంబుదాడులు, మదీనా షరీఫ్, మక్కా మసీదు బాంబుదాడులు నుండి గుజరాత్ దాడుల వరకు జరిగిన అనేక “హిందుత్వ ఉగ్రవాద ఘటనల”ను బట్టి మొత్తం హిందువులదర్నీ టెర్రరిస్టులు అని, జలియన్ వాగా బాగ్ సంఘటన నుండి అమెరికా టన్నుల కొద్ది బాంబులు వేసి ఇరాక్ ను శ్మశాన దిబ్బగా మార్చేసిన కారణంగా మొత్తం క్రైస్తవులందర్నీ తీవ్రవాదులని తీర్మానించటం ఎంత అవివేకమో ఎవరో కొందరు ఉన్మాదులు ముస్లిం పేర్లు తగిలించుకుని ఉగ్రవాదం చేసినంత మాత్రానా ముస్లిములందరూ ఉగ్రవాదులని, ఖురాన్ ఉగ్రవాదం ప్రేరేపిస్తుందని చిలకపలుకులు పలకటం కూడా అంతే తప్పవుతుంది.

కాబట్టి ఎక్కడో జరిగే ఉగ్రవాద దాడులను తీసుకువచ్చి దానిని సామాన్య ముస్లిం ప్రజలకు అంటకట్టటం ఎంతో అవివేకం. నిజానికి ఈనాడు 99 శాతం మంది ముస్లిం ప్రజానీకం గమనిస్తే వారు ఏవో చిన్న చిన్న వ్యాపారాలు, ఉధ్యోగాలు చేసుకుంటూ, హిందూ సమాజం మధ్య ఎంతో స్నేహ భావంతో బ్రతుకుతూ తమ పండగలు వచ్చినప్పుడు వీధిలో తోటి హిందూ సోదరులకు తమ వంటకాలు పంచుతూ, వారు పంచే పిండి వంటలు వీరు తింటూ ఎంతో అన్యోన్యంగా కలిసి మెలసి ఉన్నారు. ఈ విషయం మీ మీ వీధుల్లో ఉండే ముస్లిముల్లో, మీ ముస్లిం స్నేహితుల్లో గమనించవచ్చు.

ధర్మయుద్ధాలు ఉగ్రవాదామా?

వాస్తవం ఏమిటంటే- మతయుద్ధాలు లేక ధర్మయుద్ధాలు ఒకప్పుడు జరిగినట్లు అటు భగవద్గీత, బైబిల్, ఖుర్ఆన్ గ్రంథాలన్నిటిలో చూడగలం. కాబట్టి ఈ మూడు గ్రంథాల్లో టెర్రరిజం ఉందని అనగలమా? అసలు మతయుద్ధాలు లేక ధర్మయుద్ధాలు ఒకప్పుడు ఎందుకు జరిగాయి? అంటే దైవ ధర్మాన్ని బోధించటానికి వచ్చిన ప్రవక్తలను, వారి అనుచరులైన విశ్వాసుల వర్గాన్ని అంతమొందించటానికి అవిశ్వాసుల వర్గం ఒకటి కంకణం కట్టుకుని, శాంతి ఒప్పందాలను అతిక్రమించి విశ్వాసులకు వ్యతిరేకంగా యుద్ధం చేయటానికి కాలు దువ్వినప్పుడు దైవ ధర్మాన్ని కాపాడటానికి, విశ్వాసులను ప్రాణ రక్షణార్థం అవిశ్వాసులతో యుద్ధం చెయ్యమని ఆదేశించటం జరిగింది. ఆవిధంగా ప్రాణ రక్షణార్థం తమపై యుద్ధానికి కాలుదువ్విన వారితో ప్రతి యుద్ధం చెయ్యటం హింస లేక ఉగ్రవాదం అవ్వదు !?

తనను తాను రక్షించుకునే క్రమంలో ఓ వ్యక్తి ఆయుధం పట్టుకుంటే, అది ‘హింస’ అవ్వదు! బుద్ధి ఉపయోగించటం అవుతుంది. అలాగే…

తనను చంపటానికి శత్రువు కాలు దువ్వినప్పుడు అతనిని చంపితే అది ‘ఉగ్రవాదం’ అవ్వదు! తనను తాను రక్షించుకోవటం అవుతుంది. అలాగే…

ధర్మాన్ని అణచాలన్న ఉద్దేశంతో విశ్వాసులను చంపటానికి కొందరు దుర్మార్గులు యుద్ధానికి తెగబడినప్పుడు వారితో యుద్ధం చెయ్యటం, వారిని చంపటం ‘హింస’ అవ్వదు! అది ధర్మ రక్షణ అవుతుంది. అన్యాయంగా విచక్షణారాహిత్యంతో చంపితే అది హింస! తనను చంపటానికి వచ్చిన శత్రువును ఎదురోడి చంపటం ధర్మం మరియు అనివార్యం కూడా! ఇది ప్రపంచంలో ఏ న్యాయ శాస్త్రమూ, ఏ కనీస విచక్షణా జ్ఞానమున్న వ్యక్తి అయినా కాదనలేని యదార్థం.

గమనార్హమైన విషయం ఏమిటంటే- పైన ఉదహరించబడిన ప్రత్యేక సందర్భాల్లో తప్ప ఏ దైవ గ్రంథంలోనూ అన్యాయంగా ఏ మనిషినీ చంపమని చెప్పబడలేదు. ఇదే విషయం ఖురాన్లో ఈ క్రింది విధంగా చెప్పబడింది.

“న్యాయ బద్ధంగా తప్ప అల్లాహ్ పవిత్రంగా నిర్ణయించిన ఏ ప్రాణినీ హతమార్చకండి” – ఖురాన్ 6:151

అంటే దేవుడు మనుషులు తినటానికి ఏ ప్రాణులనైతే పవిత్రమైనవిగా నిర్దేశించాడో వాటిని ఆ ఉద్దేశంతో తప్ప అన్యాయంగా ఏ ఒక్క ప్రాణినీ హతమార్చే అవకాశం మనిషికి లేదు! అలాగే అకారణంగా ఒక మనిషిని చంపితే అది ఖురాన్ ప్రకారం ఎంతపెద్ద ఘోరమైన పాపంగా ఖురాన్ పరిగణిస్తుందో ఈ క్రింది గమనించగలరు.

“హత్యకు బదులు హత్యగానీ లేదా కల్లోలాన్ని వ్యాపింపజేసినందుకు గానీ కాక, మరే కారణం వల్లనైనా ఒక మానవుణ్ణి చంపినవాడు సమస్త మానవులను చంపినట్లే. ఒక మానవుడి ప్రాణాన్ని కాపాడిన వాడు మొత్తం మానవుల ప్రాణాలను కాపాడినట్లే” – ఖురాన్ 5:32

ఎగ్జాట్ గా ఇలాంటి యుద్ధం చెయ్యమన్నట్లు, చంపమన్నట్లు ఆజ్ఞాపించబడిన వాక్యాలు అటు భాగవద్గీతలోనూ ఎన్నో చూడగలం, ఇటు బైబిల్లోనూ చూడగలం. అవన్నీ కొన్ని సందర్భాల్లో విచక్షణారాహిత్యంతో తమపై యుద్ధానికి తెగబడిన అవిశ్వాసులతో ఎదుర్కోవటానికి ఇవ్వబడిన యుద్ధానికి సంబంధించిన ఆజ్ఞలు తప్ప అన్యాయంగా సమాజంలో పనికట్టుకుని కల్లోలం సృష్టించటానికో, అన్యాయంగా అమాయకులను చంపమనో ఇచ్చిన ఆజ్ఞలు కావు.

ఇక ఖురాన్‌లో అల్లాహ్‌ కేవలం ధర్మ పరిరక్షణ నిమిత్తం మాత్రమే అవిశ్వాసులతో యుద్ధం చెయ్యమన్నాడు తప్ప దౌర్జన్యం నిమిత్తం కాదు! కానీ ఈ మధ్యకాలంలో తాము జ్ఞానంలో మహా తోపులమన్నట్టు “అబ్బే! ఖురాన్లో కాఫీర్లను చంపేయమని ఉంది అందుకే ఉగ్రవాదం పెట్రేగిపోతుంది” అని తీర్మానాలు చేస్తుంటారు. వీళ్ళను సింపుల్గా ఒన్ సైడ్ అనాలసిస్ గాళ్లని చెప్పొచ్చు. వీరు అటు చరిత్ర చదివినా, ఏదైనా దైవ గ్రంథం చదివినా, ఏదైనా సంఘటన అంచనాకట్టినా తమ ముందస్తు ఆలోచనలను సమర్థించుకునే దిశగా ఒన్ సైడ్ అనాలసిస్ మాత్రమే చేసి తమ ముందస్తు ఆలోచనల (Preconceived thoughts) ను సంతృప్తి పరచుకునే దిశగానే తీర్మానాలు చేస్తుంటారు. వారే ఖురాన్ పై, ఇస్లాం పై ఉగ్రవాదపు మచ్చను బలవంతంగా వేయటానికి చూసేది. ఇక ఇస్లాం ఉగ్రవాద భావజాలం ఆధారంగా తయారైందని అపార్థం చేసుకునే మహానుభావులు గమనించాల్సింది:-

1. ప్రాచీన చరిత్రను సరిగ్గా పరిశీలిస్తే ముస్లిములు దాదాపు 1000 సంవత్సరాలు ఈ భారత దేశాన్ని పాలించినట్లు కనుగొనగలం. ఒక్క మొగలులే 300 సం.లు భారత దేశాన్ని పాలించారు. నిజంగా ముస్లిమేతరులను సమూలంగా నాశనం చేసేసి బలవంతంగా ఇస్లాం స్థాపించేయ్యలన్న లక్ష్యమే వారికి ఉండి ఉంటే ఒకప్పుడు హిందూ తెగ అనేది ఒకటి ఉండి ఉండేదని ఈనాడు మన పాఠ్య పుస్తకాల్లో వ్రాయబడి ఉండేదేమో! ఈనాటికీ భారతదేశంలో ముస్లిముల వర్గం 14 శాతం మాత్రమే! ప్రాచీన హిందూ సంస్కృతి, పండుగలు, ఆచారాలు ఏవీ చెక్కుచెదరకుండా ఈ నాటికీ అవి కొనసాగుతూ హిందూ వర్గమే మెజారిటీలో (80%) ఉంది.

2.పైగా భారత దేశాన్ని బ్రీటిషు కబంధ హస్తాల్లో నుండి కాపాడే క్రమంలో దేశ స్వతంత్రం కోసం పొరాడి ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన ముస్లిములు వేలల్లో ఉన్నారన్నది! ఈనాడు భారత దేశంలో ప్రజలందరూ అనుభవిస్తున్న స్వతంత్రం ఎందరో ముస్లిముల ప్రాణ త్యాగాల ఫలితం అన్నది. నిజంగా ముస్లిమేతరులను చంపేసి రాక్షసానందం పొండటమే ముస్లిముల ప్రవృత్తి అయితే ఇక్కడ ఉన్న ముస్లిమేతరుల సుఖం, స్వతంత్రం కోసం తమ ప్రాణాలను ఎందుకు బలిస్తారు? బ్రిటీషు వారికి వ్యతిరేకంగా భారత దేశం కొరకు పొరాడి తమ ప్రాణాలను ఎందుకు త్యాగం చేస్తారు? అదీ వేలల్లో ముస్లిముల ప్రాణత్యాగాలు జరిగాయి!!

3. ఇస్లాం ప్రభంజనం మొదలై 1400 వందల సంవత్సరాలైంది. ఉగ్రవాదం పురుడుపోసుకుని 100 సంవత్సరాలైంది. గత పద్నాలుగు వందల సంవత్సరాలుగా తర తరాలుగా ఇస్లాం ప్రజల్లో వ్యాపిస్తూపోతుంది. ఈనాడు ఇస్లాం అవలంబికులు మొత్తం ప్రపంచ జనాభాలో 1/3 శాతం ఉన్నారు. నిజంగా కొందరు ఊహిస్తున్నట్టు ఇస్లాం ఉగ్రవాద భావజాలం ఆధారంగా నిర్మితమైతే ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల మంది కాదు కదా ప్రపంచంలో ఏదో మూల ఎవరో కొందరు ఏ అడవుల్లోనో ఇస్లాం అవలంబీకులు ఉండేవారేమో!

4. ISIS, అల్ ఖైదా లేక కొన్ని ఉగ్రవాద సంస్థలకు ఇస్లాం పేరు జోడించి కొందరు దరిద్రులు ఉగ్రవాదం చెయ్యటం కారణంగా పుస్తకాలు చదివేంత ఖాళీ లేని సామాన్య అమాయక జనం “ఓహో! ఇస్లాం ఈ విధంగా ఉగ్రవాదం చెయ్యమంటుందన్నమాట!” అన్న స్థాయి ఆలోచనకు వచ్చేస్తుంటారు. వాస్తవానికి ఇస్లాం అంటేనే శాంతి. “ఇస్లామిక్ టెర్రరిజం” అన్నపదాన్ని ట్రాన్స్ లేట్ చేస్తే “శాంతి ఉగ్రవాదం” అన్న వింత అర్థాన్ని అనువదించాల్సి ఉంటుంది. “చల్లటి నిప్పు” ఉనికిలో ఉండటం ఎంత అసాధ్యమో “ఇస్లామిక్ టెర్రరిజం” అన్నది ఉండటమూ అంటే అసాధ్యం. చాల మందికి తెలియని ఒక నిజం ప్రపంచవ్యాప్తంగా ISIS ఉగ్రవాద సంస్థ ద్వారా చనిపోయింది అత్యధికశాతం మంది ముస్లిములే! ప్రపంచవ్యాప్త ముస్లిం పండిత వర్గం ఎప్పుడో ISIS ఇస్లాం వ్యతిరేక సంస్థగా తీర్మానం చేసేశారన్నది. వీటికి సంబంధించిన వివరాలు నా తరువాతి ఆర్టికల్ లో చదువగలరు.

కాబట్టి చివరిగా చెప్పేదేమిటంటే- నిజ హిందూ ధర్మాన్ని తెలుసుకోవాలంటే హిందూ సమాజాన్ని కాదు హైందవ శాస్త్రాలు చదవాలి! నిజ క్రైస్తవాన్ని తెలుసుకోవాలంటే క్రైస్తవ సమాజాన్ని కాదు బైబిల్ చదవాలి! అచ్చం అలాగే నిజ ఇస్లాం ధర్మాన్ని తెలుసుకోవాలంటే ముస్లిం సమాజాన్నో, మీడియానో, ఇంటర్నెట్ నో ఆశ్రయించటం కాదు ఖురాన్, ప్రవక్త ముహమ్మద్ (స) జీవిత చరిత్ర చదవాలి!

కాబట్టి ఉగ్రవాదం హిందూత్వంలోనో, క్రైస్తవంలోనో, ఇస్లాంలోనో ఉండదు ఆయా మతాలలో ఉన్న కొందరు ఉన్మాదుల్లో ఉంటుంది. అయితే టెర్రరిజం చేసే ఆ ఉన్మాదులు హిందూ వేషాలు ధరించవచ్చు! క్రైస్తవ పేర్లు తగిలించుకోవచ్చు! ముస్లిం వేషధారణ కలిగి ఉండవచ్చు! కాబట్టి ఆయా వేష, భాషలను, పేర్లను బట్టి మొత్తం హిందూ వర్గం, మొత్తం క్రైస్తవ వర్గం, మొత్తం ముస్లిం వర్గం ఉగ్రవాదులే అని తీర్మానించటానికి మించిన అజ్ఞానం, అమాయకత్వం, మరొకటి ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *