తోటివారిని ఎగతాళి చెయ్యకూడదు    

ఇతరుల విషయంలో చాలా మంది స్త్రీ, పురుషులు చేసే తప్పు ఏమిటంటే… తోటివారిని ఎగతాళి చేస్తూ వెటకారంగా, అగౌరవంగా మాట్లాడటం. అలా మాట్లాడటాన్ని ఇస్లాం నిషేధిస్తుంది. అంతేకాదు, తోటి వారు నచ్చకపోతే… వారికి కొన్ని చెడ్డ పేర్లు తగిలించి వెటకారం చెయ్యకూడదు.     

ఈ ఖురాన్ వ్యాక్యాన్ని పూర్తిగా గమనిస్తే… “పురుషులు ఇతర పురుషులను ఎగతాళి చెయ్యకూడదు. వీరికంటే వారే శ్రేష్టులై ఉండవచ్చు. అలాగే స్త్రీలు ఇతర స్త్రీలను ఎగతాళి చెయ్యకూడదు. వీరికంటే వారే శ్రేష్టురాండ్రై ఉండవచ్చు. ఒకరినొకరు ఎత్తి పొడుచుకోకండి, ఒకరినొకరు చెడ్డ పేర్లతో పిలుచుకోకండి” – 49:11 అని చెప్పటాన్ని చూడగలం.

ఇస్లాం సానుకూలమైన స్నేహపూర్వక మానవ సంబంధాలకు ఎంతో పెద్ద పీట వేస్తుంది. బంధువులతో, ఇరుగుపొరుగువారితో, స్నేహితులతో, దాసదాసీ జనంతో సైతం మృదువుగా మాట్లాడమని ఆదేశిస్తుంది.

ఇతరులతో మాట్లాడే విషయంలో ఖురాన్: “ప్రజలతో మర్యాదగా మాట్లాడండి (2:83)” “మీ నోట అత్యంత మంచి మాటలనే పలకాలి (17:53)” “నీ కంఠస్వరాన్ని కొంచెం తగ్గించి మాట్లాడాలి (31:19)” అంటూ ఆదేశించటాన్ని అనేక చోట్ల గమనించగలం.

సాధారణంగా ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎగతాళి చేస్తూ మాట్లాడటం, చెడ్డ పేర్లు తగిలించటం, ఎత్తి పొడవటం అన్నది మనకు నచ్చని వ్యక్తుల విషయంలోనే చేస్తుంటాం. కానీ మనకు నచ్చని వ్యక్తుల విషయంలో సైతం అలా చెయ్యటాన్ని ఇస్లాం నిషేధిస్తుంది. అవతలివ్యక్తి ఏదో అన్నాడని మనం నోరుమూసుకుని ఎందుకు కూర్చోవాలని అవతలి వ్యక్తి బూతులు మాట్లాడితే మనం కూడా బూతులు మాట్లాడే స్థాయికి దిగజారకూడదు. మనం మంచి మాటలనే పలికితే అతనూ మంచి మాటలనే పలుకుతాడు. ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలలో వ్యక్తిగత నైతిక విలువలే కాక, సామాజిక జీవనంలో సైతం ఉన్నతంగా వ్యవహరించే ఉత్తమోత్తమ నైతిక విలువలను నేర్పటం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *