స్త్రీలకు ధనం చెల్లించి పెళ్లి చేసుకోవాలి

ఇస్లాం ప్రకారం “స్త్రీలకు ధనం (మహార్) చెల్లించి వివాహం చేసుకోవటం ధర్మసమ్మతం (హలాల్) చెయ్యబడింది (4:24)”. దీనికి వ్యతిరేకంగా స్త్రీల వద్ద నుండి ధనం (కట్నం) తీసుకుని వివాహం చేసుకోవటం “హరామ్” అన్న విషయం వేరేగా చెప్పాల్సిన పని లేదు.

ఇస్లాం స్త్రీలకు ఎలాంటి ఉన్నత స్థానం కల్పించింది? అన్న ప్రశ్నకు పై ఖురాన్ వాక్యమే ఆధారం. అమ్మాయిల తరఫునుండి నుండి లక్షల రూపాయల కట్నాలు తీసుకుని పెళ్లిళ్లు చేసుకుంటున్న నేపథ్యంలో ఇస్లాం స్త్రీలకు ధనం (కట్నం) చెల్లించి వివాహం చేసుకొమంటుంది అన్న విషయం చదివి చాలా మందికి ఆశ్చర్యం కలుగవచ్చు.

పైగా ఖురాన్ మరొక చోట “స్త్రీలకు ధనాన్ని సంతోషంగా, విధిగా భావిస్తూ చెల్లించండి (4:4)” అని చెప్పటం జరిగింది.  కానీ నేడు ముస్లిం సమాజం ముస్లిమేతర సమాజాలను అనుసరిస్తూ స్త్రీలకు ధనం (కట్నం) లేదా మహార్ చెల్లించి వివాహం చేసుకోవటానికి బదులు, స్త్రీల నుండి లక్షల కొద్దీ ధనం (కట్నం) ఎదురు తీసుకుని మరీ వివాహాలు చేసుకుంటున్నారు అలా చేసుకోవటం ఖురాన్ ప్రకారం హరామ్ అయినప్పటికీ కూడా.

బయట ఎక్కడైనా బిర్యానిలో మాంసం హలాలా? కాదా? అన్నది ఒకటికి పది సార్లు అడిగి మరీ తినే ముస్లిం పురుషులే… తాము కట్నం తీసుకుని నికాహ్ (పెళ్లి) చేసుకోవటం హలాల్ కాదన్న విషయాన్ని ఎందుకు గమనించరు?

అలాగే ప్రవక్త ముహమ్మద్  “తక్కువ ఖర్చుతో ఏ నికాహ్ అయితే చెయ్యబడుతుందో అదే ఉత్తమమైనది (అబూ దావూద్ 2117)”  అని సైతం చెప్పటం జరిగింది. దీనికి భిన్నంగా ఖరీదైన రిసెప్షన్లు పెట్టి ఊళ్లో సగం మంది జనాభాను పిలిచి బిర్యానీలు వండి భారీ స్థాయిలో దుబారా ఖర్చుతో వివాహం చేసుకుంటూ ఉంటారు. అది కూడా ఇస్లాం నిషేధిస్తున్న అంశమే.    ఈ విధంగా ఇస్లాం వివాహ వ్యవస్థను ఎంతో సులభతరం చేసి, సమాజంలో వ్యభిచారాన్ని కష్టతరం చెయ్యటం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *