ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలలో ఒకటి వ్యాపారంలో మోసం చెయ్యకూడదు అన్నది. ప్రజలకు ఏదైనా వస్తువు అమ్మే సందర్భంలో కొలిచి గానీ లేదా తూచి గానీ ఇచ్చేటప్పుడు కచ్చితంగా ఉండాలి. ఈ విషయంలో ఖురాన్ మరొక వాక్యంలో చెబుతున్నది ఏమిటంటే-
“తూనికలో, కొలతలో తగ్గించి ఇచ్చేవారికి వినాశనం ఉన్నది. వారు ప్రజల నుండి తీసుకునేటప్పుడు పూర్తిగా తీసుకుంటారు; వారికి కొలిచిగాని, తూచిగాని ఇచ్చేటప్పుడు తగ్గించి ఇస్తారు” – 83:1-3
పై వాక్యం అరబ్బీ మూలంలో “తత్ఫీఫ్” అన్న పదం అన్యాయపు ఆలోచనను సూచిస్తుంది. వ్యాపారంలో మోసం చెయాలన్న అన్యాయపు ఆలోచన కలిగిన వ్యక్తులు వారు ప్రజల నుండి ఏదైనా వస్తువు కొన్నప్పుడు లేదా తీసుకునేటప్పుడు కొలత, తూనిక సరిగ్గా ఉందా లేదా? అన్నది ఒకటికి పదిసార్లు చూసుకుని, పరీక్షించి తీసుకుంటారు.
కానీ, వీరు ప్రజలకు ఏదైనా వస్తువు అమ్మే సందర్భంలో మాత్రం కొలిచి లేదా తూచి ఇవ్వాలన్నప్పుడు తగ్గించి ఇస్తారు. అలా వ్యాపారంలో మోసం చేసేవారు వినాశనం అవుతారన్నది ఖురాన్ హెచ్చరిక.
ఇంకా ఈ హెచ్చరిక నిత్యావసర వస్తువులను సాధారణ మార్కెట్ రేటు కంటే అన్యాయంగా అత్యధిక ధరకు అమ్మే వారి విషయంలోనూ వర్తిస్తుంది. అంతేకాదు వస్తువుల్లో కల్తీ చేసి ప్రజలకు అమ్మే వారికీ వర్తిస్తుంది. అలాగే నిత్యావసర వస్తువులను కావాలని దాచిపెట్టి, మార్కెట్ లో వాటి అవసరాన్ని పెంచేసి తరువాత ప్రజలకు ఎక్కువ ధరకు అమ్మటానికి కూడా ఈ హెచ్చరిక వర్తిస్తుంది. ఇవన్నీ వ్యాపారంలో చేసే మోసాలే. ఇస్లాం ఉన్నత వ్యక్తిత్వ నిర్మాణానికి, అలాగే ఉత్తమ సమాజ నిర్మాణానికి ఎన్నో ఆదేశాలు ఇస్తుంది. కాబట్టి వ్యాపారా లావాదేవీలు నిర్వహించేటప్పుడు సైతం న్యాయబద్ధంగా ఉండాలి, తప్పితే ప్రజల్ని ఏ విధంగానూ మోసం చెయ్యకూడదు అన్నది ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువల్లో ఒక ప్రధాన అంశం.
