ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలలో ఒకటి మనిషి ఎలాంటి పరిస్థితుల్లోనూ పలికితే న్యాయమే పలకాలి అన్నది. చివరకు వ్యవహారం మన దగ్గర బంధువులకు సంబంధించి నదైనా సరే.

పైగా దైవాన్ని నమ్ముకునే విశ్వాసులకైతే ఈ విషయాన్ని ఖురాన్ మరొక చోట ఇంకా గట్టిగా చెబుతుంది.

“విశ్వసించిన ప్రజలారా! న్యాయ ధ్వజవాహకులుగా నిలబడండి. దేవుని కొరకు సాక్షులుగా ఉండండి. మీ న్యాయం, మీ సాక్ష్యం మీకూ, మీ తలిదండ్రులకూ, మీ బంధువులకూ ఎంత హాని కలిగించినా సరే. కక్షిదారుడు భాగ్యవంతుడైనా, నిరుపేద అయినా సర్వేశ్వరుడు వారి శ్రేయస్సును  మీ కంటే ఎక్కువ కాంక్షిస్తాడు. కనుక మీ మనోవాంఛలను అనుసరిస్తూ న్యాయం నుండి వైదొలగకండి. మీరు సాక్ష్యాన్ని వక్రీకరిస్తే, న్యాయాన్ని దాటవేస్తే తెలుసుకోండి మీరు చేసేదంతా దైవానికి తెలుసు అని” – 4:135    

న్యాయంగా వ్యవహరించే విషయంలో ఎంత పటిష్టంగా ఉండాలంటే, మన న్యాయం, మనమిచ్చే సాక్ష్యం దగ్గర బంధువులకే కాదు చివరకు స్వంత తలిదండ్రులకు హాని కలిగించినా సరే న్యాయం వైపే నిలబడాలి. మనం ఎవరి విషయంలో అయితే సాక్ష్యామిస్తున్నామో అతను ధనవంతుడైనా, పేదవాడినా సరే సాక్ష్యాన్ని వక్రీకరించకూడదు, న్యాయాన్ని దాచిపెట్టకూడదు.

సాధారణంగా వ్యక్తులు ఇతరుల విషయంలో న్యాయంగా వ్యవహరించినప్పటికీ, కొన్నిసార్లు తప్పు స్వంత బంధువుల ద్వారానో లేక స్వంత పిల్లలు లేదా తలిదండ్రుల ద్వారా జరిగినప్పుడు న్యాయం తప్పిపోతుంటారు. అలాగే ఒక వ్యక్తి మీదనో, వర్గం మీదనో ఉన్న ద్వేషం కారణంగా సైతం న్యాయం తప్పిపోతుంటారు. ఇది పూర్తిగా తప్పు అన్నది ఇస్లాం ఆదేశం. ఈ విషయంలో ఖురాన్ ఏమంటుందంటే…  “న్యాయానికి సాక్షులుగా ఉండండి. ఏదైనా వర్గంతో ఉన్న వైరం కారణంగా మీరు ఆవేశానికి లోనై న్యాయాన్ని త్యజించకండి. న్యాయం చెయ్యండి (5:8)”    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *