ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలలో అత్యంత ప్రధానమైన విషయం ఇతరుల విషయంలో అతిగా అనుమానించకూడదు, కొందరి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలలో గూఢచారులుగా వ్యవహరించకూడదు. వారి రహాస్యాలను తెలుసుకుని వారి గురించి ఇతరుల ముందు లేనిపోనివి తగిలించి చాడీలు అస్సలు చెప్పకూడదు.
ఇస్లాం ఉన్నత వ్యక్తిత్వ నిర్మాణాన్ని అభిలషిస్తుంది. ఒక సుందర సమాజాన్ని నిర్మించాలని కోరుకుంటుంది. ఇతరులపై అతిగా అనుమానపడటం, గూఢచారుగా వ్యవహరించటం లేదా చాడీలు చెప్పటం అన్నవి అత్యంత అసహ్యకరమైన విషయాలు. ఇలాంటి పనులు చెయ్యటం చనిపోయిన స్వంత సోదరుని మాంసం తినటమంత అసహ్యకరమైన విషయమని ఖురాన్ చెబుతుంది.
కలిసి ఉండే ఇద్దరు సోదరుల మద్య, భార్యా భర్తల మధ్య, అక్క చెల్లెళ్ల మధ్య, బంధువుల మధ్య గొడవలు మొదలవటానికి ప్రధాన కారణాల్లో కొన్ని- ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోవటం, అతిగా అనుమానించటం, ఇతరుల ముందు లేనిపోని విషయాలు మాట్లాడటం, వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాల్లో తలదూర్చి కూపీలు లాగటం వగైరా. పైగా కొందరు ఇలాంటి పనులు చేస్తూ మానసిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు.
ఇలాంటి పనులు చెయ్యటం వల్ల అవతలి వ్యక్తి తీవ్రమైన నష్టానికి గురవ్వవచ్చు, లేదా అతను సమాజంలో పరువును కోల్పోయి మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రావొచ్చు. అతిగా అనుమానపడటం, గూఢచారుగా వ్యవహరించటం లేదా చాడీలు చెప్పటం అన్నవి అత్యంత ప్రమాదకర విషయాలే కాదు అత్యంత అసహ్యకరమైన విషయాలు కూడా. ఇలాంటి పనుల వల్ల వ్యక్తుల మధ్య సంబంధాలు తెగిపోతాయి. కాబట్టే ఇస్లాం ఇలాంటి విషయాలను తీవ్రంగా ఖండిస్తుంది.
