ఎదుటివారి లోపాలను ఎంచకూడదు

ఇస్లాం వ్యక్తుల మధ్య సత్సంబంధాలతో కూడిన శాంతియుతమైన మరియు సుందర సమాజం నిర్మించబడాలని అభిలషిస్తుంది. అలాంటి ఉన్నత సమాజం నిర్మించబడాలంటే వ్యక్తులలో ఉత్తమోత్తమ నైతిక విలువలు ఉండటం అత్యంత ఆవశ్యకం.

అందుకే ఖురాన్ అపరిచితులైన పొరుగువారితో, బంధువులతో, ప్రక్కనున్న మిత్రులతో, దాసదాసీ జనంతో ఉదారబుద్ధితో మెలగాలని, భార్య, తలిదండ్రులతో సద్భావంతో మెలగాలని ఆదేశించటమే కాక..

“స్త్రీ, పురుషులు ఒకరికొకరు ఎగతాళి చేసుకోకూడదు. ఒకరినొకరు ఎత్తి పొడుచుకోకూడదు, ఒకరినొకరు చెడ్డ పేర్లతో పిలుచుకోకూడదు” (49:11) అని హెచ్చరిస్తుంది.

మరీ ముఖ్యంగా కొందరు కలిగి ఉండే అతిచెడ్డ గుణం ఏమిటంటే…  ఏదో విషయంలో బంధువులనో, పొరుగువారినో, ఇతరులనో దెప్పిపొడుస్తూ ఉంటారు. ఇంకొందరైతే ఎదుటి వారిలో శారీరకంగానో, మానసికంగానో కలిగి ఉండే లోపాలను ఎత్తిచూపుతూ వెక్కిరిస్తూ హేళనగా మాట్లాడటంలో తెగ ఆశక్తి కలిగి చూపుతుంటారు. ఖురాన్ అలాంటి దుర్గుణాలు కలిగి ఉండేవారు సర్వనాశనమవుతారని హెచ్చరిస్తుంది.

ఇవన్నీ నిజానికి అత్యంత అసహ్యకరమైన పనులు. ఇలాంటి పనులు చెయ్యటం వల్ల ఎలాంటి లాభామూ ఉండకపోగా, అవతలి వ్యక్తి మనస్సు ఎంతో గాయపడుతుంది. అతను మానసికంగా ఎంతో క్రుంగిపోతాడు. ఒకరికొకరు ఎగతాళి చేసుకోవటం, వెటకారపు మాటలతో విమర్శించు కోవటం, అవతలి వారిని దెప్పిపొడవటం, ఎదుటి వారిలో ఉండే లోపాలను ఎత్తిచూపుతూ హేళన చెయ్యటం వంటి దిగజారుడు పనులు చెయ్యటం వల్ల సామాజిక జీవనంలో చెడ్డ పేరు రావటమే కాక, వ్యక్తుల మధ్య సంబంధాలు తెగిపోతాయి. కాబట్టే ఇస్లాం అలాంటిపనులను తీవ్రంగా ఖండిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *