మనిషి పరిశ్రమించి విజయం సాధించాలి

ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువల్లో ఒకానొక ప్రాధానమైన విషయం ఏమిటంటే- మనిషి గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నట్టు కాక, అతను భౌతిక జీవనంలో ఏ రంగంలోనైనా విజయం సాధించటానికి కచ్చితంగా పరిశ్రమించాలి అన్నది.

నాస్తికులు భావించేదేమిటంటే.. ధర్మం ఆస్తికులకు కేవలం దేవుణ్ణి నమ్ముకుని, తమ కోరికల పరిపూర్తికై కష్టపడటం మానేసి కేవలం ప్రార్ధించుకుంటూ కూర్చోమని చెప్పి వారిని బద్దకస్తులుగా తయారు చేస్తుంది. అదే నాస్తికత్వమైతే మనిషిని కష్టపడి ప్రయత్నించమని చెబుతుంది అన్నది.

కానీ వారి భావాలకు భిన్నంగా ఖురాన్ “మానవుడు కఠోరమైన శ్రమకోసం పుట్టించబడ్డాడు (53:39)” అని చెప్పటమే కాక,  “మనిషి శ్రమించిన దానికి మించి అతనికి ఏదీ లభించదు (90:4)” అని ఖురాన్ చెబుతుంది. అంటే ఎంతగా దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ, అతను ఎంత మేరకు శ్రమిస్తాడో అంతమేరకే అతనికి ఫలితం లభిస్తుంది తప్ప, బద్దకంగా తయారై కష్టపడి పని చేయకుండా కూర్చున్నంత మాత్రానా అతను విజయం సాధించలేడు.

మరి శ్రమను నమ్ముకున్నప్పుడు దైవాన్ని నమ్ముకోవటం, ప్రార్ధించుకోవటం దేనికి? అన్న ప్రశ్న ఒకటి మిగిలి ఉంది. అదెందుకంటే.. మనిషి తాను చెయ్యాల్సిన పరిశ్రమ, ప్రయత్నం అంతా చేశాక దాని నుండి తనకు అనుకూలమైన ఫలితం రావటం కోసమని దైవాన్ని ప్రార్ధించాలి. తప్పితే అసలు ప్రయత్నమే చెయ్యకుండా ఫలితం కోసం దేవుణ్ణి ప్రార్ధించటం మూర్ఖత్వమే అవుతుంది.

నిజమైన ఆధ్యాత్మికుడనబడేవారు రాళ్లూ, రప్పల్నీ, జంతువుల్నీ, బాబాల్నీ, సమాధుల్నీ వగైరా దేన్ని పడితే దాన్ని దైవాలని గుడ్డిగా  నమ్మక… భౌతిక ప్రపంచంలో తాను చెయ్యాల్సిన ప్రయత్నం, పరిశ్రమ అంతా చేశాక అనుకూల ఫలితం కోసం మాత్రమే ఆ సృష్టికర్త అయిన దైవాన్ని ప్రార్ధిస్తాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *