ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువల్లో మరోక ప్రధానమైన విషయం ఏమిటంటే- మనిషి కష్టకాలంలోనూ, సంతోష సమయాల్లోనూ ఎలాంటి సందర్భాల్లోనూ మత్తు పదార్థాల జోలికి పోకూడదు అన్నది.
అంతేకాదు అతను కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించాలి తప్ప, జూదం జోలికి పోకూడదు.
మనిషిని వ్యక్తిగతంగానూ, సామాజికంగానూ వినాశనం పాలు చేసే రెండు అంశాలలో ఒకటి మద్యం అయితే, రెండవది జూదం. కేవలం జూదం ఆడి రాజ్యాలు కోల్పోయిన చరిత్రను మనం చదవటమే కాదు, మనం గమనిస్తే పేకాట, మూడుముక్కలాటల్లో ఆస్తులు పోగొట్టుకున్న వారి నుండి క్లబ్బులు, క్యాసినోల్లో కోట్లు పోగొట్టుకున్న వారిని సైతం చూడగలం.
కాబట్టి ఆర్థికంగా మనిషిని దివాళా తీసే జూదం నుండి, మనిషి వ్యక్తిత్వాన్ని దిగజార్చే మత్తు పదార్థాల నుండి దూరంగా ఉండమని ఇస్లాం ఆదేశిస్తుంది. మనిషికి మత్తు కలగజేసే డ్రగ్స్, గంజాయి, సిగరెట్లు, ఖైనీ, జర్దా పాన్ మసాలా వగైరా మత్తు కలిగించే పదార్థాలకు కూడా ఈ ఖురాన్ ఆదేశం వర్తిస్తుంది. మద్యానికి దూరంగా ఉండమనటంలో ఉద్దేశం మనిషి మత్తుకు అలవాటు పడకూడదన్నది.
మనిషి వ్యక్తిగతంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా చెడిపోవటమే కాక, సమాజంలో అనేక చెడులకు పాల్పడటానికి మూలం అతను మత్తుకు అలవాటు పడటమే. మనిషిని మత్తు మృగంలా మార్చుతుంది, అతన్ని అత్యాచారాలకు పాల్పడేలా చేస్తుంది చివరకు అతను మత్తులో తల్లిని, చెల్లిని, కూతుళ్ల మధ్య సైతం తేడా గమనించలేడు. అంతేకాదు ఈనాడు కొందరు లిక్కర్, లిక్కర్ స్కాములతో కొన్ని వేలకోట్ల రూపాయలు వెనకేసుకురావటానికి కారణం మనిషి కేవలం “మత్తు” అన్న బలహీనతకు గురవ్వటమే. అదే లేని నాడు సమాజం ఆర్థికంగానూ ఎదుగుతుంది సమాజంలో క్రైమ్ శాతం కూడా తగ్గుతుంది. సమాజంలో కుటుంబ వ్యవస్థ కూడా బాగుపడుతుంది
