జాత్యాహంకారాన్ని ప్రదర్శించకూడదు

ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువల్లో ఒక ముఖ్యమైన విషయం మనిషి జాత్యాహంకారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదర్శించకూడదు అన్నది. ఇస్లాం ‘మంచివారు-చెడ్డవారు’, ‘విశ్వాసులు-అవిశ్వాసులు’ అంటూ వ్యక్తుల ప్రవర్తన ఆధారంగా మాత్రమే మనుషులను వర్గీకరిస్తుంది తప్ప వారి వాంశాన్ని బట్టో, జాతిని బట్టో, వర్గాన్ని బట్టో ఏ వ్యక్తికీ ఎలాంటి ప్రాధ్యాన్యతా ఇవ్వటం లేదు.

అగ్రకులాలు-వెనుకబడిన కులాలు, అగ్ర వర్ణాలు-అథమ వర్ణాలు, నల్ల జాతీయులు-తెల్ల జాతీయులు అంటూ మానవుల మధ్య వర్గీకరణ చేసి, కొందరిని నీచులుగా అంటరానివారుగా అథములుగా లెక్కకట్టి జాత్యాహంకార (Racism) భావాలు ప్రదర్శించే ఆటవిక విధానాన్ని ఖురాన్ ఈ క్రింది ఒక్క వాక్యంతో కొట్టి పరేసింది.

“మానవులారా! మేము మిమ్మల్ని ఒకే స్త్రీ, పురుష జంట నుండి సృష్టించాము. తరువాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగానూ, తెగలుగానూ చేశాము. వాస్తవానికి మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే సృష్టికర్త దృష్టిలో ఎక్కువ గౌరవ పాత్రుడు” – 49:13

ఈ విధంగా ఖురాన్ ఒకే జంట నుండి సకల మానవులూ పుట్టటం జరిగింది కాబట్టి పుట్టుక పరంగానో, కులపరంగా గానో, జాతిపరంగా గానో, వర్గపరంగానో, రంగు పరంగానో ఏ ఒక్కరూ గొప్పవారూ కాదు, ఏ ఒక్కరూ అథములూ కారని తేల్చి చెప్పటం జరిగింది.

మరి ఇస్లాం ఒక మనిషికి దేని ఆధారంగా ఆధిక్యత ఇస్తుంది?
అన్న ప్రశ్నకు ప్రవక్త ముహమ్మద్ చెబుతున్నదేమిటంటే- “అరబ్బుకి అరబ్బేతరునిపై గానీ, అరబ్బేతరునికి అరబ్బుపై గానీ, తెల్లవానికి నల్లవానిపై గానీ, నల్లవానికి తెల్లవానిపై గానీ ఎలాంటి అధిక్యతా లేదు కేవలం సత్ప్రవర్తన, భయభక్తుల ద్వారా తప్ప”. దీనిని బట్టి ఇస్లాం ఒక వ్యక్తిని గొప్పవాడని ఎంచుతుంది అతని సత్ప్రవర్తనను బట్టి మాత్రమే.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *