ఇస్లాం నేర్పే నైతిక విలువలలో మరొక గొప్ప అంశం మంచికీ, దైవభక్తికీ సంబంధించిన పనులలో అందరితోనూ సహకరించాలి. అంటే మంచి పనులు చేసేవారు ఏ మతానికి, ఏ కులానికి, ఏ వర్గానికి చెందిన వారైనప్పటికీ వారు చేసే మంచి పనులలో వారితో భుజం కలిపి మనమూ నడవాలి. లేదా వారికి వీలైనంత సహాయం చెయ్యాలి.
ఉత్తమ సమాజ నిర్మాణం అన్నది ఉత్తమ వ్యక్తుల నిర్మాణంతో మరియు బాధ్యతాయుత దృక్పథాల ద్వారానే సాధ్యపడుతుంది. ఇదే ఇస్లాం కోరుకుంటుంది. కనుక ఉత్తమ సమాజ నిర్మాణం చెయ్యాలని కోరుకునేవారు ఉన్నత వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవటంతో పాటు, ఉత్తమ వ్యక్తులతో భుజం కలిపి సమాజంలో ముందుకు నడవాలి.
సమాజంలో ఎల్లప్పుడూ రెండే రెండు రకాల వ్యక్తులు ఉంటారు : ఒకరు మంచి పనులు చేసేవారు, మరొకరు పాపకార్యాలూ, అత్యాచారాలు చేసేవారు. కాబట్టి తమ బాగు కోసం, తమ కోరికల పరిపూర్తి కోసం, తమ ఎదుగుదల కోసం మంచీ-చెడుల్ని ప్రక్కకు పెట్టేసి ఎలాంటి పాపపు పనులకైనా తెగించేవారికి, ప్రజలపై అత్యాచారాలు చేసే దుర్మార్గులకు ఎప్పుడూ సహకరించకూడదు.
కనుక నిత్యం మనం ఒక వ్యక్తితో స్నేహం చేసినా, కొందరితో కలిసి పని చెయ్యాలనుకున్నా అవతలివారు ఉత్తములు, సమాజంలో మంచి చేసేవారు, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడేవారు ఉండాలి. అలాంటి మంచి వ్యక్తులందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఒక్కటైపోవాలి. వారంతా మతాలకతీతంగా మానవత దృక్పథం ఆధారంగా ఏకమైపోయి ఒకరికొకరు సహకరించుకోవాలన్నది ఖురాన్ అభిలాష. అలాంటి ఉత్తమ వ్యక్తులతో కూడిన సమూహం పాపకార్యాలు, అత్యాచారాలు చేసేవారిని సంస్కరించాలి, తప్పితే వారికి ఎప్పుడూ ఏ విషయంలోనూ సహకరించకూడదు.
