ఇస్లాం నేర్పే నైతిక విలువలలో అతి ప్రధానమైన విషయాలు ఏమిటంటే- మనిషి మృదుత్వం, ఎదుటివారి తప్పుల్ని క్షమించగలిగే వైఖరిని అవలంబించాలి. అంతేకాదు, మంచి విషయాలనే చెబుతూ ఉండాలి. అంతేకాదు, మూర్ఖులు ఎదురైనప్పుడు మన మాటే నేగ్గాలన్న పంతానికి పోయి వారితో వాదానికి దిగకూడదు అన్నవి.
ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రజలతో మృదుత్వంతో మాట్లాడుతూ ఉంటాడో సమాజం మొత్తం అతన్ని ఇష్టపడటం మొదలెడుతుంది. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తుల తప్పుల్ని క్షమించే గుణాన్ని ఒకవ్యక్తి కలిగి ఉంటాడో అలాంటి వ్యక్తికి సమాజంలో శత్రువులంటూ మిగలరు. పైగా సమాజంలో అలాంటి వ్యక్తి పట్ల శతృత్వం కలవారు కూడా మిత్రులుగా మారిపోయే అవకాశం ఉంటుంది.
తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ మూర్ఖులతో వాదానికి దిగకూడదు. మూర్ఖుల పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒకటి వారికి పూర్తి స్థాయిలో జ్ఞానం ఉండదు, రెండు అవతలివారు చెప్పేది వీరు అర్థం చేసుకోరు. పైగా తమకు తెలిసిందే వేదం అన్నట్టు మాట్లాడుతుంటారు. అలాంటివారి విషయంలో చెయ్యాల్సింది ఏది మంచి, ఏది చెడు అన్నది చెప్పి వదిలిపెట్టాలి తప్పితే వారితో వాదనకు దిగటం వల్ల సమాజంలో మన వ్యక్తిత్వం దిగజారిపోతుంది.
అయితే ఎదుటి వ్యక్తిలో చెడు కనపడినప్పుడు ఇస్లాం ఆ చెడును తొలగించటానికి అవలంబించమంటున్న విధానం “శ్రేష్ఠమైన మంచి ద్వారా తొలగించాలి (41:34)” అన్నది.
సమాజంలో మనల్ని హేళన చేసే వ్యక్తులు, వెటకారం చేసి మన మనోభావాల్ని రెచ్చగొట్టాలని చూసే వ్యక్తులు చాలా మంది తారసపడుతుంటారు. అలాంటి మూర్ఖులు ఎదురైనప్పుడు సైతం వారి పట్ల సైతం మృదువుగానే వ్యవహరించాలి తప్ప వారితో పాటు సమానంగా దూషణలకు దిగి, వారితో అనవసర వాదనలకు దిగకూడదు. ఇస్లాం మృదుత్వం మన్నిపుల వైఖరిని అవలంబిస్తూ, మంచిని బోధించే ఉన్నత వ్యక్తిత్వ విలువలు కలిగినవారిని నిర్మించాలనుకుంటుంది.
