నిరుపేదలకు దానం చెయ్యాలి

నిరుపేదలకు, అవసరార్థులకు దానం చెయ్యటం సైతం ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలలో ఒకానొక ప్రధాన అంశం! పైగా ఇస్లాం నిరుపేదలకు దానం ఇవ్వటాన్ని విశ్వాసులపై విధి చేస్తుంది. పైగా ప్రవక్త ముహమ్మద్ “దానం వలన మీ సంపద ఏ మాత్రం తగ్గిపోదు” [సహీహ్ ముస్లిం 2588] అని చెప్పటం జరిగింది.

అసలు బీదసాదల హక్కును పటిష్టంగా నెరవేర్చటానికి, దానం విధిగా చెయ్యాలన్న ప్రక్రియను ఆచరణాత్మకం (Practical) గా ముస్లిం సమాజానికి నేర్పటానికి నిర్దేశించబడిన నెలే రంజాన్. వాస్తవానికి ‘రంజాన్ పండుగ’ అసలు పేరు “ఈదుల్ ఫిత్ర్” అంటే దానాల పండుగ అని అర్థం. మనిషిలో దాన గుణాన్ని పెంపొందించటమే ఈ పండుగ లక్ష్యం.

రంజాన్ నెలలో ఉపవాసం ఉండే ప్రతీ ఒక్కరినీ బీదలు, అగత్యపరులను ఆదుకోవటం కోసం ‘ఫిత్రా’ అంటే గోధుమలు లేదా కొంత ధనాన్ని దానం చెయ్యటంతో పాటు, ఆస్తిపాస్తులు కలిగి ఉన్న ముస్లిములకు వారి సంపదపై కొంత శాతాన్ని తీసి బీదలు, అనాధలు, అవసరార్థులను ఆదుకోటానికి దానం చెయ్యమని ఇస్లాం ఆదేశిస్తుంది.

అంతేకాదు, “రహస్యంగా నిరుపేదలకు దానం ఇవ్వటం మీకు ఎంతో మేలు చేకూరుస్తుంది (2:271)” అంటుంది ఖురాన్. మరోకచోట “మంచి మార్గంలో మీరు ఖర్చు చేసే ధనం మీకే మేలు చేకూర్చుతుంది (2:272)” అని చెప్పటం జరిగింది.

ఈ విధంగా ఖురాన్ నిరుపేదలకు, అనాధాలకు, మంచిపనులలో దానం చెయ్యటాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంది.  అయితే దానం చెయ్యమని చెబుతున్న ఖురానే ఎలా ఎంత ఖర్చుపెట్టాలో కూడా ఆదేశిస్తుంది: “మీ నిత్యావసరాలకు పోగా మిగిలినది (2:219)”. అంటే దానం చెయ్యటం విషయంలో పిసినారి తనమూ వ్యవహరించకూడదు, అలాగని దానం చేసే విషయంలో మితిమీరిపోకూడదు కూడా. ఆ విధంగా ఎవరితే నిత్యావసరాలకు పోగా మిగిలినది నిరుపేదలకు దానం చేస్తూ ఉంటారో వారి సంపద ఎప్పటికీ తగ్గిపోదు, పైగా వారి సంపదలో శుభం కలుగుతుంది అని ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పటం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *