ఒకరి ఆస్తిని అన్యాయంగా కబళించకండి

ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలలో మరొక ప్రధానమైన అంశం ఒకరి ఆస్తిని మరొకరు అన్యాయంగా కబళించకూడదు (2:188)” అన్నది.

సాధారణంగా అన్నదమ్ముల మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, కుటుంబాల మధ్య వచ్చే తగాదాలలో ముఖ్యంగా ఆస్తి తగాదాలే ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఆస్తి తగాదాల్లోనే ఒకరికొకరు ఘర్షణపడి విడిపోవటం, దెబ్బలాడుకోవటం, కొన్నిసార్లు చంపుకోవటం వరకు సైతం వెళుతుంది.

అవతలి వ్యక్తి ఎంత బలహీనుడైనప్పటికీ అతని స్థలాన్ని, అతని ఆస్తిని అన్యాయంగా ఆక్రమించటం అన్నది ఎంతో అన్యాయమవుతుంది. ఇలాంటి అక్రమాలు సమాజంలో చాలా జరుగుతూ ఉంటాయి.   

అందుకే సమాజంలో సానుకూలమైన బంధుత్వ, మానవ సంబంధాలను కలిగి ఉండాలని అభిలషించే ఇస్లాం ఒకరి ఆస్తిని అన్యాయంగా కబళించకండి అని ఆదేశిస్తుంది. ఒక్క ఆస్తి విషయంలోనే కాదు ఒకరి సొమ్మును మరొకరు అన్యాయంగా తినకండి (4:29) అని సైతం ఆదేశిస్తుంది.

అంటే అప్పుగా తీసుకున్న డబ్బులైనా గానీ లేదా ఒకరు మనకు అప్పజెప్పిన డబ్బుగానీ అన్యాయంగా తినకూడదన్నది ఖురాన్ ఆదేశం. ఈ ఆదేశం నిత్యావసర వస్తువుల ధరల్ని మార్కెట్ రేటుకంటే అధికంగా పెంచి ప్రజలకు అమ్మి ఆస్తులు పెచ్చుకునే వారికి కూడా వర్తిస్తుంది. అంతేకాదు, అన్యాయంగా అనాథుల సొమ్ముజోలికి అసలు పోవద్దని (17:34) సైతం ఖురాన్ ఆదేశించటం జరుగుతుంది. అనాథులే కదా! వారి ఆస్తిపాస్తుల్ని అక్రమంగా కబళించినా పట్టించుకునే వారు ఎవరని భావించి వారికి అన్యాయం చెయ్యవద్దని ఖురాన్ ఆదేశిస్తుంది. ఈ విధంగా ఖురాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అవతలి వారికి ఎలాంటి అన్యాయం గానీ, ఎలాంటి హానీ గానీ తలపెట్టకుండా అందరి విషయంలోనూ  న్యాయంగా వ్యవహరిస్తూ, దైవానికి భయపడి నైతిక విలువలతో కూడిన జీవితాన్ని గడపమంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *