కాబట్టి మరణాంతర జీవితం ఉన్నట్టేనా..?

ఈ మధ్య సోషల్ మీడియాలో యూ.ఎస్ లోని జెఫ్రీ లాంగ్ అనే ఓ డాక్టర్ చావు దరిదాపుల్లోకి వెళ్లి వచ్చిన 5000 మందిపై చేసిన పరిశోధనను బట్టి మరణానంతర జీవితం ఉందని చెప్పిన న్యూస్ తెగ చక్కర్లు కొడుతుంది.

పైగా ఈ విధమైన పరిశోధనపై Near-Death Experience Research Foundation అనే ఓ సంస్థే పనిచేస్తుంది. దాని కోసం ఒక వెబ్సైట్ కూడా నడపటం జరుగుతుంది. అంటే ఎవరైతే దాదాపుగా చావు చివరి ఘడియాల వరకు వెళ్లి తిరిగి బ్రతుకుతారో వారు ఆ చివరి క్షణాల్లో ఏ విధమైన అనుభూతికి లోనయ్యారు అన్న దానిపై పరిశోధన చేసే సంస్థ అన్న మాట ఇది. ఇలాంటి సబ్జెక్ట్ పై కూడా రీసెర్చ్ చేసే సంస్థ ఒకటి ఉందని చదివి నేనే ఆశ్చర్యపోయాను.

ఏంటి ఇంతకూ వీరు సేకరించిన సమాచారం అన్నది గమనిస్తే… చావు చివరి క్షణాల్లోకి వెళ్లి కోమాలోకి పోయిన వ్యక్తులు ఏదో ఒక సొరంగం గుండా వెళ్లిపోతున్నట్లు ఒక్కసారిగా వేరే ఏదో అభౌతిక లోకానికి వెళ్ళిపోయి తమ స్వంత వారిని కలుసుకున్నట్లు పొందిన వింత అనుభూతిని దాదాపు ఐదు వేల మంది చెప్పటాన్ని బట్టి ఈ రీసెర్చ్ ఫౌండేషన్ తేల్చిన విషయం మరణానంతర జీవితం ఉందన్నది.

ఆ రీసెర్చ్ ఫౌండేషన్ చేసే పరిశోధనల విషయం ప్రక్కన పెడితే… నిజానికి మరణాంతర జీవితం ఉందా? లేదా? అన్న ప్రశ్నకు ఇలాంటి అనుభూతులు, అనుమానాల సమాచారం ఏ మాత్రం అవసరం లేదు.

నేను చేసిన పరిశోధన వరకు ఇస్లాం ముందుగా ఊహా, అనుమానాల ఆధారంగా ఏదైనా ఒక విషయంపై గుడ్డిగా నిర్ణయం తీసుకోటాన్ని తీవ్రంగా నిషేధిస్తుంది (51:10). మనిషి తన జ్ఞానం ఆధారంగా, తన బుద్ధిని ఉపయోగించి కేవలం శాస్త్రీయ పరిశీలన, పరిశోధన, ప్రయోగాల ద్వారా తేలే హేతుబద్ధమైన విషయాలను అంగీకరించటాన్ని మాత్రమే అనుమతిస్తుంది.

విశ్వ వ్యవస్థ పట్ల గుడ్డి నమ్మకాలు రాజ్యమేలుతున్న అజ్ఞానపు యుగంలోనే.. “సూర్య చంద్రాదులను పూజించటం కేవలం మూఢత్వం మాత్రమే (41:37)” అని చెబుతూ, “భూమ్యాకాశాల పనితీరు గురించి ఎప్పుడూ యోచన చేయలేదా?” – 7:18 అని, “భూమిలోనూ, ఆకాశాలలోనూ ఉన్నటువంటి దానిని కళ్లు తెరచి చూడండి” – 10:101 అని మనిషిని శాస్త్రీయ ఆలోచనా విధానం వైపుకు ఆహ్వానించటం మొదలుపెట్టింది.

“అయినా మీరు బుద్ధిని బొత్తిగా ఉపయోగించరేమిటి” – 2: 44 అని ఖురాన్ పదే పదే ప్రశ్నిస్తూ మనిషి తన బుద్ధిని ఉపయోగిస్తూ హేతుబద్ధమైన ఆలోచనా విధానాన్ని మాత్రమే కలిగి ఉండాలని గట్టిగా తాకీదు చెయ్యటం జరిగింది.

ఇక మరణానంతర జీవితం ఉందా లేదా? అన్న ప్రశ్నకు లాజిక్ గా ఆలోచించే వారికి కచ్చితంగా ఉంది. ఉండి తీరాలి. అన్న సమాధానమే వస్తుంది. కారణం ఈ లోకం, ఇక్కడి మనిషి జీవితం కొన్ని పరిమితుల (Limits) కు లోబడిన లోకం కావటమే.

ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుత భౌతిక లోకం ఏదైతే ఉందో అది ఉన్నత స్థాయి మానవత్వంతో ఓ మనిషి చేసే గొప్ప త్యాగానికి, సేవకు తగిన బహుమానం ఇవ్వగలిగే లోకమూ కాదు, ఓ కరుడు గట్టిన దుర్మార్గుడు చేసే ఘోర నేరాలకు తగిన శిక్ష ఇవ్వగలిగే లోకమూ కాదు.

ఉదాహరణకు అన్యాయంగా ఓ స్త్రీని అత్యాచారం చేసి హత్య చేసిన ఓ నేరస్తుడికి ఇక్కడ ఉన్న న్యాయస్థానాలు బహుశా ఉరి శిక్ష వరకు మాత్రమే విధించగలవు. అది ఆ నేరస్తుడు చేసిన నేరానికి తగిన శిక్షేనా? అని మనస్సాక్షిని ప్రశ్నించుకుంటే “లేదు అలాంటి దుర్మార్గుడికి ఇంకా పెద్ద శిక్ష పడాలని ఆ శిక్షలో ఆ దుర్మార్గుడు కలకాలం ఉండాలని” చెబుతుంది. పైగా ఆ ఉరి శిక్ష పడ్డ ఆ నేరస్తుడు ఆ ఒక్క అత్యాచారమే కాదు గతంలో కూడా మరో పది మంది స్త్రీలను కూడా ఇలాగే అత్యాచారం చేసి హత్యలు చేశాడని బయటపడితే… ఇక్కడి న్యాయస్థానాలు అదనంగా ఆ నేరస్తుడు పాల్పడిన మిగతా హత్యలకు తగ్గట్టు అతనికి విధించిన ఉరి శిక్షకు మించి ఏదైనా తీవ్రమైన శిక్షను విధించనూ లేవు కూడా. ఈ లోకంలో న్యాయస్థానాలు ఒక హత్య చేసిన వాడికైనా, లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడికైనా వీలైతే యావర్జీవ కారాగారం లేదా ఉరి శిక్ష మాత్రమే విధించగలవు. పైగా ఆ నేరస్తుడు రాజకీయంగా పలుకుబడి ఉంటే సాక్ష్యాలు తారుమారు చేసి బయట దర్జాగా తిరగవచ్చు లేదా దేశ రాజకీయాలనే శాసించే స్థాయికి కూడా వెళ్లిపోవచ్చు. అలా బయట దర్జాగా తిరుగుతున్న నేరస్తులు ఎంతో మంది ఉన్నారు.

దీనిని బట్టి ఈ లోకం కేవలం కొన్ని పరిమితుల (Limits) కు లోబడి ఉన్న లోకం. ఉన్నత స్థాయి మానవతా విలువలతో ఓ వ్యక్తి చేసే గొప్ప సేవకు తగిన బహుమానం ఇవ్వగలిగే ఓ శాశ్వత లోకం, ఓ కరుడు గట్టిన దుర్మార్గుడు చేసే ఘోర నేరాలకు తగిన శిక్ష విధించే ఓ శాశ్వత లోకం ఉండటం తప్పనిసరి లేదంటే అసలు ఈ భౌతిక లోకానికి అర్థమే లేదు అన్నదే ఏ కాస్త బుద్ధి ఉపయోగించేవారికి లభించే సమాధానం.

ఆ విధంగా మనిషి తన బుద్ధిని ఉపయోగిస్తే లభించే సమాధానాన్నే ధార్మిక గ్రంథాలు కూడా ఇస్తున్నాయి. మనిషికి ఈ లోకంలో ఇవ్వబడింది కేవలం ఆశాశ్వత జీవితం అని, అతని మరణానతరం మరో శాశ్వత జీవితం ఉందనే శుభవార్తను ధార్మిక గ్రంథాలు ఇస్తున్నాయి. మనుషులు చేసుకునే ప్రతీ మంచీ-చెడులను లెక్క కట్టి వారికి శాశ్వత శిక్షా-బహుమానాలు ఇచ్చే సమయం ఒకటి రాబోతుందని, అప్పటివరకూ మనిషికి ఇవ్వబడిన జీవితం ఒక పరీక్షా సమయం లాంటిదని, ఆ పరీక్షా సమయంలో అతను మంచి పనులు చేస్తే మరణానంతర జీవితంలో శాశ్వత బహుమానం ఉంటుందన్న శుభవార్తలతో పాటు, అతను ఒకవేళ దుర్మార్గాలు, చెడు పనులకు పాల్పడితే వాటికి తగ్గట్టు శాశ్వత శిక్ష కూడా ఉంటుందని ఈ గ్రంథాలు హెచ్చరిస్తున్నాయి.

చివరిగా… మరణం తరువాత మరో జీవితం ఉందో లేదో ఎవడు చూసొచ్చాడు? దాన్ని నమ్మటం వల్ల ఏంటి లాభం? నమ్మకపోతే ఏంటి నష్టం? అని కొందరు నాస్తికులు ప్రశ్నిస్తుంటారు.

మరణానంతర జీవితం ఉందని నమ్మేవారికి రెండు లాభాలు, నమ్మని వారికి రెండు నష్టాలు ఉన్నాయి. అదెలాగంటే…

ఉదాహరణకు రేపన్నరోజున మరణించినవారంతా సమాధులలో నుండి ఒక్కసారిగా తిరిగి బ్రతికించబడి లేపబడ్డారే అనుకుందాం. అప్పటికే మరణానంతర జీవితం ఉందని నమ్ముతూ మంచి పనులు చేస్తూ జీవించేవారికి శాశ్వత సుఖాలతో కూడిన జీవితం బహుమానంగా ఎలాగూ లభిస్తుంది.

ఒకవేళ మరణానంతర జీవితం ఉందని నమ్ముతూ వారు మంచి పనులు చేసి చనిపోయాక మరణానంతర జీవితం లేదనుకుందాం. అయినప్పటికీ భయభక్తులతో వారు చేసిన మంచి పనులకు వారు చరిత్రలో గొప్ప ఆదర్శవంతులుగా నిలిచిపోతారు. ఈ రకంగా మరణానంతర జీవితం ఉందని నమ్మేవారికి రెండు విధాలుగానూ లాభమే జరుగుతుంది.

మరణం తరువాత మరో జీవితం ఉందో లేదో ఎవడు చూసొచ్చాడు? ఏదైనా ఈలోకంలోనే అనుభవించేయాలని అన్ని సుఖాలను ఇక్కడే జుర్రేయ్యాలని దుర్మార్గాలకు, చెడులకు పాల్పడే వారికి ఒకవేళ మరణానంతర జీవితం ఉందని తేలిపోతే వారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది. ఇది మొదటి నష్టమైతే… వారి భౌతిక జీవనంలో కూడా చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ఇది రెండవ నష్టం. కాబట్టి ఏ విధంగా ఆలోచన చేసినా… ఈ స్వల్పమైన భౌతిక లోకానికి జంటగా శాశ్వత లోకం కూడా మరొకటి కచ్చితంగా ఉండి తీరాలన్నదే మనిషి బుద్ధి, వివేకాలు ఒప్పుకునే సమాధానం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *