ప్రశ్న: మరణానంతర జీవితం ఉందని మీరెలా చెప్పగలరు?
సమా: ఉండదు అని మీరెలా చెప్పగలరు?
ప్రశ్న: సైంటిఫిగ్గా డెవలప్ అవుతున్న ఈ రోజుల్లో ఇలాంటి విశ్వాసాలు దేనికి?
సమా: సైంటిఫిగ్గా డెవలప్ అవుతున్న ఈ రోజుల్లో సైన్స్ మనుషులందరినీ నైతిక ప్రవర్తన గలవారిగా ఎందుకు మార్చలేకపోతుంది?
ప్రశ్న: అది వేరు! సైన్స్ పర్సనాలిటీ డెవలప్ చెయ్యదు. కానీ మనిషిని సైంటిఫిక్ గా డెవలప్ చేస్తుంది కదా?
సమా: అందుకనే కదా సమాజంలో అధికశాతం మంది అత్యంత నైపుణ్యం కల దుర్మార్గులు తయారవుతున్నది.
ప్రశ్న: కాబట్టి మరణానంతరం మరొక జీవితం ఉందని భయపెట్టి మనుషులను మంచివారుగా మార్చటం కరెక్ట్ అంటారా?
సమా: అంటే మరణానంతరం మరొక జీవితం లేదు కాబట్టి మీరు ఎంత విచ్చలవిడిగా నిర్భయంగా బ్రతికేసినా పర్లేదనీ చెప్పటం కరక్టే అంటారా?
ప్రశ్న: మరణానంతరం మరొక జీవితం ఉంటేనే మంచిగా బ్రతకాలని రులేమీ లేదు. మరణానతరం మరొక జీవితం లేదని నమ్ముతూ కూడా మంచిగా బ్రతకలేమా?
సమా: మరణానంతరం మరొక జీవితం లేదు ఈ జీవితమే ఆఖరి అనుకున్నప్పుడు కోరికలు అణగద్రొక్కుకుని, చెడు ఆలోచనలపై అదుపు సాధించి మంచిగా బ్రతకాల్సిన అవసరం ఏముంది?
ప్రశ్న: మరి ఆస్తికుల్లో కూడా చెడు, పనులు నేరాలు చేసేవారు లేరా? వారిని మరణానంతర జీవిత దృక్పథం ఎందుకు మార్చలేకపోతుంది?
సమా: అలాంటి వారిని నామమాత్ర నాస్తికులు అనాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్ని పటిష్ట చట్టాలున్నప్పటికీ వ్యక్తులు చట్టాలను అతిక్రమిస్తున్నారు కాబట్టి చట్టాలను తప్పుపట్టలేము కదా?
ప్రశ్న: అంటే మరణానంతరం మరొక జీవితం ఉంది అనుకుంటే ఆటోమేటిగ్గా మనిషి చెడు ఆలోచనలపై అదుపుసాధించి మనిషి మంచివాడైపోతాడా?
సమా: ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకపోతేనే నిర్భయంగా రూల్స్ బ్రేక్ చేసే తత్వమున్న మనిషి, తాను రహస్యంగా/బహిరంగంగా చేసే చెడు పనులకు ఎవరి ముందూ జవాబుదారీ కాదు వాటిని ఎవడూ పట్టుకోలేడు, ఎటువంటి శిక్షా ఉండదు అంటే అతనిలో విచ్చలవిడి తనం ఉవ్విళ్లూరదా? మనిషికి మరణానంతరం ఒక జీవితం ఉందీ.. అక్కడ మనిషి రహస్యంగా/బహిరంగంగా చేసిన సకల చెడు/మంచీ పనులు ముందుంచబడతాయి, అతను చేసిన చేసిన అన్యాయాలకు, అక్రమాలకూ ఒంటరిగా నిలబడి జవాబు చెప్పుకోవలసి ఉంటుంది, అక్కడ సృష్టికర్త అయిన దేవుని న్యాయస్థానంలో మనిషి చేసిన అక్రమాలకూ, నేరాలకూ శాశ్వత శిక్ష ఉంటుంది అలాగే మనిషి చేసిన మంచి పనులకు శాశ్వత బహుమానం ఉంటుంది అన్న “ప్రభావవంతమైన దృక్పథమే” మనిషిని ఒంటరిగా ఉన్నప్పుడు కూడా చెడు చెయ్యటం నుండి ఆపగలదు, మంచి వైపు నడపగలదు. ఈ చెడు నుండి “ఆపటం”.. మంచివైపు “నడపటం” అన్న పనే ధార్మిక గ్రంథాలు చేస్తున్నాయి. దీనికి విరుద్ధంగా మత పండితులు సృష్టించిన మూఢత్వ మత వ్యవస్థ మూఢనమ్మకాలపై ప్రజలను నడుపుతుంది.
ప్రశ్న: దైవగ్రంథాల ప్రస్తావన ప్రక్కనపెడితే… అసలు పరలోక జీవితం పరలోక న్యాయస్థానం, ఈ శిక్షా-బహుమానాలు అవసరం ఏమిటి? ఇక్కడే పటిష్ట చట్టాలు తయారు చేసుకుని వ్యక్తి సంస్కరణ చెయ్యలేమా?
సమా: ఓ గొప్ప వ్యక్తి జీవితాంతం ప్రజా సేవ/దేశ సేవ చేసి చనిపోతే అతనికి తగిన బహుమానం లేదా గౌరవం లభించనే లేదు కదా అని అనిపించినప్పుడు…
ఎందరో స్త్రీలను అత్యాచారాలు చేసి చంపేసి, వారి శవాలను సైతం ఛిద్రం చేసిన దుర్మార్గులు సమాజంలో బహిరంగంగా తిరుగుతుంటే వారికి తగ్గ శిక్ష లభించటం లేదు కదా అని అనిపించినప్పుడు..
పదులు, వందల, వేల కొద్దీ అమాయక ప్రజలను చంపేసిన దుర్మార్గులు తిరిగి ప్రజలపై అధికారం చెలాయిస్తూ ఉంటే వారు చేసిన నేరానికి తగిన శిక్ష వారికి దొరకనే లేదు కదా అని అనిపించినప్పుడు…
అన్యాయానికి న్యాయం అనే ముసుగు తొడిగి, తప్పుడు తీర్పులిచ్చి న్యాయాన్ని చంపేసినప్పుడు తగిన న్యాయం ఎందుకు దొరకటం లేదు అని అనిపించినప్పుడు…
మీ మనస్సాక్షిని అడగండి. ఓ గొప్ప వ్యక్తి జీవితాంతం చేసిన మంచిపనులకు, ప్రజాసేవకు తగ్గ శాశ్వత ప్రతిఫలం, బహుమానం లభించాలా? వద్దా? అని.
అనేక మందిని చంపి, ఎందరో స్త్రీల మానమర్యాదలు మంట కలిపేసి చట్టాన్ని తమకు అనువుగా మార్చుకుని సాక్ష్యాలు తారుమారు చేసి, జీవితాంతం బయట జాలిగా నేరాలు చేస్తూ తిరుగుతున్న ఎందరో దుర్మార్గుల పాపాలకు తగ్గట్టు శాశ్వత శిక్ష లభించాలా? వద్దా? అని.
ఒకవేళ ఆ సమయంలో మీ మనస్సాక్షి అవుననే సమాధానం చెబితే కచ్చితంగా నమ్మండి. దీనికి ఎవరి నిరుపణలూ, లాజిక్కులూ అవసరం లేదు.
ప్రశ్న: సరే, చాలా మంది నేరస్తులు చట్టం ద్వారా శిక్షించబడుతున్నారు కదా?
సమా: ఇక్కడున్న చట్టలతో ఒక హత్య చేస్తే జీవిత ఖైదు, లేదా ఉరి వెయ్యగలరు. వందమందిని చంపిన వ్యక్తికి ఏమిచెయ్యగలరు? నేరానికి తగ్గ శిక్ష విధించటం సాధ్యమవుతుందా? కానీ, పరలోక న్యాయస్థానంలో చేసిన నేరానికి తగ్గట్టు తీవ్ర వేదనతో కూడిన శాశ్వత శిక్ష ఉంటుంది. దుర్మార్గుల దుర్మార్గానికి అలాంటి న్యాయస్థానం ఉండటం తప్పనిసరా? కదా? అలాగే మంచి చేసిన వారి మంచికి తగ్గట్టు శాశ్వత బహుమానమూ ఉంటుంది. అలాంటి న్యాయస్థానం ఉండటం తప్పనిసరా? కదా?
చివరి ప్రశ్న: మరణానంతరం జీవితం ఉంది అని నమ్ముతూ జీవించి చనిపోయాక అది లేదనుకోండి అప్పుడు ఏంటి పరిస్థితి?
సమా: ఒకవేళ లేకపోయినా మరణానంతరం జీవితం ఉంది అని నమ్ముతూ మంచి పనులు చేసి వెళ్లిపోయాక మంచివాడిగానే ఇంటివారి, ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉండిపోవచ్చు. అలాగైనా లాభమే! ఒకవేళ నిజంగా ఉందనుకోండి- అటు ప్రజల దృష్టిలో మంచివాడనే పేరుతో పాటు దేవుని దగ్గర శాశ్వత బహుమానం కూడా దొరుకుతుంది అది రెండవలాభం! కాబట్టి మరణానంతరం జీవితం ఉంటే అప్పుడు నా పరిస్థితి లేదని నమ్మేవారి కంటే చాలా బెటర్ గానే ఉంటుంది. ఎలా చూసినా నమ్మటంలో లాభమే ఉంది తప్ప నష్టమైతే లేదు. కాదంటారా?
****
అనేక సందర్భాలలో మరణాంతర జీవితం ఉందా? లేదా? అన్న చర్చలు జరిగినప్పుడు నాకొచ్చిన ప్రశ్నలు, వాటికి నేనిచ్చిన సమాధానాల సమాహారమే ఈ ఆర్టికల్.
పరలోక న్యాయ స్థానం నిజంగా ఉంటుందంటారా?
