ఇస్లాం క్రొత్త ధర్మమా?

ఇస్లాం గురించి మాట్లాడాలంటే దానికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ముస్లిం అయి ఉండటం కాదు ఇస్లాం తాలుగు కనీస అవగాహన ఉండటం. అది లేకుండా కేవలం ముస్లిం పేర్లు పెట్టుకుని పోలిటికల్ గా కెరీర్ ను నిర్మించుకోవాలని తెగ తుత్తర పడే కొందరు అన్ని వర్గాల ప్రజల మన్ననలు గుంపగుత్తగా కొట్టేయటానికి మీడియాలో ఇస్లాం గురించి నోటికొచ్చింది ఏదేదో వాగేసి పనికిమాలిన ఫిలాసఫీలు చెబుతూ తెగ కామెడీ చేస్తుంటారు.

అచ్చం అలాంటి కామెడినే ఈ మధ్య మీడియాలో గులాం నబీ ఆజాద్ కూడా చెయ్యటం గమనార్హం. ఆయన “ఇస్లాం కంటే హిందుత్వం పురాతనమైంది భారత దేశంలో మెజారిటీ హిందువులు ముస్లిములుగా కన్వర్ట్ అయ్యారని చెప్పటం జరిగింది”. ముందుగా అసలు ఇస్లాం నూతన ధర్మమా? సనాతన ధర్మమా? అన్నది గమనిస్తే ఎవరు ఎందులో నుండి ఎందులోకి కన్వర్ట్ అయ్యారో తెలుసుకోవచ్చు.
****

ఇస్లాం నూతనమా? సనాతనమా?

1400 సం.ల క్రితం అరేబియాలో ప్రవక్త ముహమ్మద్(స) ఇస్లాం బోధించటం వల్ల ఆయనే “ఇస్లాం వ్యవస్థాపకుడు” అన్న అపార్థం అటు ముస్లిమేతరుల్లోనేకాదు చాలా మంది ముస్లిముల్లోనూ ఉందనటం అతిశయోక్తి కాదు.

వాస్తవానికి ప్రవక్త ముహమ్మద్ (స) ఇస్లాం ధర్మ పునః స్థాపకుడే తప్ప వ్యవస్థాపకుడు కాదన్నది గమనించాలి. కేవలం గతం నుండీ అనేకమంది ప్రవక్తల ద్వారా పరంపరగా బోధించబడుతూ వస్తున్న సనాతన ధర్మమైన ఇస్లాం ఆయన ద్వారా పునః స్థాపించబడింది అంతే. ఒక్క మాటలో ప్రవక్త ముహమ్మద్ (స) ఎవరని ఖురాన్ ను ప్రశ్నిస్తే.. “ఇది వరకు వచ్చిన ప్రవక్తల పరంపరలోనివాడే ఈ ప్రవక్త కూడా” – 53:56 అన్న సమాధానం ఖురాన్ ఇస్తుంది.

ప్రవక్త ముహమ్మద్ (స) ఇస్లాం వ్యవస్థాపకుడు అన్న అపార్థానికి లోనై ఉన్న వారు గమనించాల్సింది- స్వయంగా ప్రవక్త ముహమ్మద్ (స) పై అవతరించిన ఖురాన్ గ్రంథమే స్వయంగా ఇస్లాం గురించి “ఇదే సనాతన ధర్మం (98:5)” అన్న విషయాన్ని ప్రకటిస్తుంది.
ఈ వాక్యం అరబ్బీ మూలం గమనిస్తే.. “వ జాలిక దీనుల్ ఖయ్యిమ” అని చూడగలం. “ఖయ్యిమ” అన్న పదానికి.. “సనాతన, పురాతన, అనాదిగా వస్తున్న” వగైరా అర్థాలున్నాయి. “సనాతన ధర్మం” అంటే.. “Evergreen” లేదా “Everlasting” అంటే “ఎప్పటికీ ఉండే ధర్మం” అని అర్థం.

కాబట్టి ప్రవక్త ముహమ్మద్ (స) కు ఇవ్వబడిన ఇస్లాం ధర్మం ఏదైతే ఉందో అది గత ప్రవక్తలందరి ద్వారా పరంపరగా ఇవ్వబడుతూ వస్తున్న ప్రాచీన మరియు సనాతన ధర్మం మాత్రమే! ఇదే ఖురాన్ ప్రకటిస్తుంది.

ప్రవక్తా! నీకు పూర్వం గతించిన ప్రవక్తలకు దేనినతే బోధించామో దానినే నీకూ బోధిస్తున్నాము” – 41:43

ఇస్లాం – “ఏక దేవుని విధేయతా ధర్మం”

ఇస్లాం అన్న పదానికి సంక్షిప్త నిర్వచనం – “ఏక దేవుని విధేయతా ధర్మం”. “శాంతి” అన్నది దాని నిఘంటు అర్థం. ఒకే ఒక్క సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే లోబడిపోవటమే ఇస్లాం. తప్పితే అది ముస్లిముల ప్రత్యేక మతం కాదు.

“ఏక దేవుని విధేయతా ధర్మం” బోధించిన వారు ఎవరెవరు?

ఏక దేవుని విధేయతా ధర్మానికి వ్యతిరేకంగా డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని కొందరు వంచకులైన పండితులూ, బోధకుల ద్వారా కనిపెట్టబడిందే “బహుదైవాల ఆరాధనా విధానం”. దానిని ఖండించటానికి, ప్రజలను ఏక దేవుని విధేయతా ధర్మం వైపుకు ఆహ్వానించి వారిని సంస్కరించటానికే అనేక మంది దైవప్రవక్తలు ఎన్నుకోబడ్డారు. ఇదే విషయం ఖురాన్ – “మేము ప్రతీ జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము అతని ద్వారా ప్రజలకు ఇలా హెచ్చరిక చేశాము- ‘ఒక్క సృష్టికర్త అయిన దైవాన్ని మాత్రమే ఆరాధించండి బహుదైవాల ఆరాధనకు దూరంగా ఉండండి (16:36)” అని చెబుతుంది.

గతంలో వచ్చిన ప్రవక్తలందరికీ ఒకే ధర్మం పరంపరగా ఇవ్వబడుతూ వచ్చిందన్న విషయాన్ని ఖురాన్ ఇలా వివరిస్తుంది.

“ఆయన నూహ్ (నోవహు) ప్రవక్తకు ఆజ్ఞాపించిన ధర్మాన్నే నీకు కూడా నిర్ణయించాడు. దానినే (ఓ ముహమ్మద్) ఇప్పుడు నీ వైపుకు మేము వహీ (శృతి) ద్వారా పంపాము. దానినే మేము ఇబ్రాహీంకు, మూసా (మోషే) కూ, ఈసా (యేసు) కూ బోధించాము ఈ ధర్మాన్ని స్థాపించండీ అని” – 42:13

ధార్మిక గ్రంథాలన్నిటిలో ఉన్నది ఇస్లామేనా?

ఒక్క మాటలో చెప్పాలంటే ఇస్లాం అంటే “ఏక దేవుని విధేయతా ధర్మం” అని అర్థం. ఏ ధార్మిక గ్రంథమూ ఏక దేవుని ఆరాధన విడిచిపెట్టి మీ సెంటిమెంట్ల ప్రకారం ఎవరిష్టమొచ్చినట్టువారు మీ మీ ఇష్ట దైవాలను ఆరాధించుకోమని చెప్పటం లేదు. ఉదాహరణకు బైబిల్లో యేసు సైతం- “నన్ను పంపిన దేవుని చిత్త ప్రకారమే చేయుదును గానీ నా ఇష్ట ప్రకారం కాదు” – యోహాను 5:30 అని చెబుతున్నారు. ఒక్క దేవుని “చిత్త ప్రకారం చెయ్యటం” లేక దేవునికి సరండర్ అయిపోవటమే ఇస్లాం. వేదాల్లో ఉన్న సనాతన వైదిక ధర్మం చెబుతుంది కూడా ఇదే.
*****

మరి ఈ అనేక దేవుళ్లూ, భిన్న మతాల పరిస్థితి ఏంటి?

సమాజంలో ఉండే భిన్న మతాలు వేరు ధార్మిక గ్రంథాల్లో చెప్పబడుతున్న ధర్మం వేరు. మతాలు ఎన్నయినా పుట్టుకురావొచ్చు. ధర్మం మటుకు ఒక్కటే ఉంటుంది.
అలాగే సమాజంలో ఎన్ని మిద్యా దేవుళ్లు ఉన్నప్పటికీ వాటికీ ధార్మిక గ్రంథాలు పరిచయం చేస్తున్న సృష్టికర్త అయిన దేవునికీ సంబంధం లేదు. ఆయన్నే ధార్మిక గ్రంథాలన్నీ “సర్వేశ్వరుడు” “పరమేశ్వరుడు” “ఈల్” “ఎలోహ్” “యెహోవా” “అల్లాహ్” వగైరా అనేక పేర్లతో పరిచయం చేస్తున్నట్లు చూడగలం.

ఈ విధంగా సకల ప్రవక్తలూ, రుషుల ద్వారా అన్ని ధార్మిక గ్రంథాల్లోనూ బోధించబడుతూ వచ్చిన సనాతన ధర్మాన్నే చివర్లో ముహమ్మద్(స) ఇస్లాం పేరుతో బోధించారు. కాబట్టి ఇస్లాం సనాతన ధర్మమే తప్పితే ప్రవక్త ముహమ్మద్ (స) ద్వారా స్థాపించబడిన నూతన ధర్మం కాదు.

అలాంటప్పుడు ఇస్లాం కంటే క్రైస్తవ్యం పాతది, హిందూత్వం పాతది అని చెప్పటం ధర్మ అవగాహనరాహిత్యమే అవుతుంది.

ఇస్లాం కంటే హిందూత్వం పురాతనమైంది అని చెప్పటానికి “హిందూ” అన్నది మతానికి చెందిన పదం కాదు, అది భౌగోళిక పదం (Geographical term) మాత్రమే అని చెప్పవచ్చు. నిజానికి వేదాల్లో సనాతన ధర్మం బోధించబడినట్లు చూడగలం తప్ప హిందూ ధర్మం బోధించబడినట్లు చూడలేము. సింధూ పదం నుండి పుట్టిన హిందూ అన్న భౌగోళిక పదానికి మత రంగు తరువాతి కాలాల్లో అద్దబడి “హిందూ ధర్మం” అన్న కొత్త పదం పుట్టుకొచ్చింది. ఆ తరువాత గోల్వార్కర్, సావర్కర్ల ద్వారా అసలు వైదిక ధర్మానికి పూర్తి వ్యతిరేకమైన “హిందుత్వ వాదం” అనే ఓ అతివాద మతతత్వ విధానం కొత్తగా కనిపెట్టబడింది.

ఇక భారతదేశంలో ఇస్లాం ఎలా ప్రవేశించింది అంటే అరేబియా నుండి భారతదేశానికి వర్తకం కోసం వచ్చిన అరబ్ ముస్లిం వర్తకుల ఉత్తమ ప్రవర్తన, నీతి నిజాయితీలను బట్టి, అప్పటికే అంటరానితనం వేళ్లూనుకుపోయిన వాతావరణంలో ఇస్లాం బోధిస్తున్న సర్వమానవ సమానత్వానికి ఆకర్షితులై చాలా మంది ఇస్లాం స్వీకరిస్తూ రావటం జరిగింది. ఒక్క భారతదేశంలోనే కాదు, ఇస్లాం దృక్పథాలకు ఆకర్షితులై యూరప్, అమెరికా, బ్రిటన్ వగైరా దేశాల్లో అనేక మంది ఇస్లాం స్వీకరిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే నేటికీ ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా స్వీకరించబడుతున్న ధర్మం ఇస్లామే. దానికి కారణం ఇస్లాం బోధిస్తున్న శాస్త్రీయమైన విశాల దృక్పథాలు మాత్రమే.
కాబట్టి ఇస్లాం కంటే హిందూత్వం పురాతనమైంది అని చెప్పటంలో అర్థం లేదు. చివరిగా ఒక్కమాట…

ఇస్లాం స్థాయిని దిగజార్చటానికి శత్రువులు ఎక్కడో పుట్టాల్సిన పనిలేదు ఇస్లాం అవగాహన లేని కొందరు ముస్లిములు చాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *