ఈ వ్యాసం గతంలో మూడు భాగాలుగా రాయటం జరిగింది. “దర్గా సందర్శన “షిర్క్”గా పరిగణించబడుతుందా? లేదా? అన్న అంశం పట్ల ఆశక్తి ఉన్నవారు ఆ మూడు భాగాలను కలిపి ఈ క్రింది చదవవచ్చు. వ్యాసం కొద్దిగా పెద్దదైనప్పటికీ విషయం లోతుగా అర్థం చేసుకోవాలంటే చదవాల్సిందే.
***
ధార్మిక వ్యవస్థలో కొన్ని విశ్వాసాలు, ఆచారాలు ఎంతగా వేళ్లూనుకు పోతాయంటే వాటిని పాటించేవారు కనీసం అవి ధర్మ శాస్త్రాల ప్రకారం ప్రామాణికమైనవా? కావా? అన్నది కనీసం ఆగి ఆలోచించలేనంతగా వాటిని పాటిస్తూ పోతుంటారు. హిందుత్వంలో విగ్రహారాధన, క్రైస్తవ్యంలో యేసు దైవత్వపు భావన, ముస్లిం సమాజంలో దర్గా సందర్శన ఈ మూడు ఆ విధంగా పాతుకుపోయిన విశ్వాసాలే. ఆజ్మీర్ దర్గాను దర్శిస్తే హజ్ చేసినంత పుణ్యమని నమ్మే కొందరు ముస్లిములు సైతం ఉన్నారంటే ముస్లిం సమాజంలో “దర్గా సందర్శన” చెయ్యటం అన్న ఆచారం ఎంతగా పాతుకుపోయిందో అంచనా వెయ్యవచ్చు. ఈ నేపథ్యంలో…
1. “దర్గా సందర్శన” ఖురాన్ ప్రకారం “షిర్క్” అవుతుందా? అవ్వదా?
2. నేడు హిందూ-ముస్లిములు ఒక చోట కలవటానికి వేదికలుగా మారిపోయిన “దర్గా”ల విషయంలో నేటి ముస్లిం సమాజం చెయ్యాల్సిందేమిటి? అన్న రెండు సున్నితమైన అంశాలనూ మనం పరిశీలించాల్సి ఉంది.
ముందుగా తెలుసుకోవలసింది- ఆధ్యాత్మిక రంగంలో రెండే రెండు దృక్పథాలు (Concepts) ఉన్నాయి. అవేమిటంటే:
1. ఏకదైవారాధనా దృక్పథము
2. బహుదైవాల ఆరాధనా దృక్పథము
“ఏకదైవారాధనా దృక్పథం” ప్రకారం: ఒక్క సృష్టికర్త అయిన దేవునికి తప్ప సమస్త సృష్టిలో ఎవరికీ/దేనికీ ఎటువంటి దైవత్వపు శక్తి గానీ, లాభ-నష్టాలను చేకూర్చే శక్తి గానీ, అధికారం గానీ లేదు కనుక ఆయన ఒక్కడు మాత్రమే ఆరాధనకు అర్హుడు అన్నది.
“బహుదైవాల ఆరాధనా దృక్పథము” ప్రకారం: ఈ ప్రకృతిలో కొందరికి/కొన్నిటికి దైవత్వపు శక్తి ఉంది. ఆ సృష్టికర్త సాన్నిహిత్యాన్ని పొందాలంటే వారిని/వాటిని ఆశ్రయించటం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అన్నది.
అసలు “షిర్క్” అన్న పదానికి అర్థం ఏమిటి?
ఈ ప్రకృతిలో ఫలానా వ్యక్తికో, చెట్టుకో, పుట్టకో, జంతువుకో లేదా విగ్రహానికో లేక మరొకదానికో లాభ-నష్టాలను చేకూర్చే దైవత్వపు శక్తి ఉంటుంది కాబట్టి వారిని/వాటిని పూజించటం ద్వారా దేవుని సాన్నిహిత్వాన్ని/సిఫారసును పొందవచ్చు అని భావించి వాటిని/వారిని ప్రార్ధించటమే దైవానికి భాగస్వామ్యం కల్పించటం అంటే. దీనినే అరబ్బీలో ‘షిర్క్’ చెయ్యటమని అంటారు.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నేటి ముస్లిం సమాజంలో అధికశాతం మంది చేసే “దర్గా సందర్శన” “షిర్క్ (దైవానికి భాగస్వాములుగా చెయ్యటం)” అవుతుందా? లేదా? అన్నది పరిశీలించాల్సి ఉంది.
“దర్గా సందర్శన” చెయ్యటంలో ముఖ్య ఉద్దేశం ఏమిటి?
ఈ ప్రశ్నకు దర్గాలకు వెళ్లి వలియల్లాల సమాధులను వేడుకునే ముస్లిములను ప్రశ్నించినప్పుడు వారు చెప్పే సమాధానం ఒక్కటే- “మేము దర్గాలకు వెళ్లేది అక్కడ వలియల్లాలనో వారి సమాధులనో ఆరాధించే ఉద్దేశంతో కాదు! వారికి మా ప్రార్ధనలు విని అల్లాహ్ దగ్గర సిఫారసు చేసే శక్తి ఉంటుంది, కాబట్టి వారి ముందు మా బాధలు చెప్పుకుని వారిని వేడుకుంటే వారు మా ప్రార్ధనలను అల్లాహ్ వద్దకు చేరవేసి, మా కోసం అల్లాహ్ వద్ద ‘సిఫారసు (వసీల)’ చేసి మాకు లాభం చేకూర్చుతారు. అందుకోసం మాత్రమే మేము దర్గాలకు వెళుతుంటాము” అన్నది.
దర్గా సందర్శకులైన ముస్లిముల అతిపెద్ద అపార్థం..?
దర్గా ప్రేమికులైన ముస్లిముల అతి పెద్ద అపార్థం ఏమిటంటే- సమాధుల్లో ఉన్న వలియల్లాలను ఆశ్రయించి వారి సిఫారసు పొందితేనే తప్ప ప్రత్యక్షంగా అల్లాహ్ తమ ప్రార్ధనలను ఆలకించలేనంత బలహీనుడు అన్నది మొదటిదైతే, వలియల్లాలకు సైతం లాభ-నష్టాలను కలిగజేసే దైవిక శక్తి, అధికారం ఉంటుందన్న నమ్మకాన్ని కలిగి ఉండటం రెండవ అతి పెద్ద అపార్థం!
అలాంటి అపార్థాలు కలిగున్నోల్లకు ఖురాన్ చేస్తున్న హెచ్చరిక!
“అల్లాహ్ ను వదలి నీకు నష్టాన్ని గానీ, లాభాన్ని గానీ కలిగించలేని ఏ శక్తినీ వేడుకోకు” – ఖురాన్ 10:106
పై ఖురాన్ వాక్యంలో స్వయంగా అల్లాహ్ “ఈ సమస్త విశ్వవ్యవస్థలో ఏ ఒక్కరికీ/దేనికీ లాభ-నష్టాలను కలగజేసే శక్తి లేదు ఒక్క నాకు తప్ప” అన్న విషయాన్ని తేల్చి చెబుతున్నాడు. వలియల్లాల విషయం ప్రక్కన పెడితే స్వయంగా ప్రవక్త ముహమ్మద్ (స) వారినే “నాకు నాకోసం ఎటువంటి లాభ-నష్టాలను కలగజేసుకునే అధికారం లేదు” అని ఖురాన్ 7:188 వాక్యంలో ప్రకటించమంటున్నాడు.
దర్గా సందర్శన “షిర్క్” ఎందుకవుతుందంటే…
అల్లాహ్ సాన్నిహిత్యాన్ని పొందటం కోసం కొందరిని సంరక్షకులుగా చేసుకోవటాన్ని స్వయంగా అల్లాహ్ ఈ క్రింది ఖురాన్ వాక్యంలో “షిర్క్”గా పరిగణిస్తున్నాడు కాబట్టి.
“ఇక అల్లాహ్ ను వదిలేసి ఇతరులను సంరక్షకులుగా
చేసుకున్నవారు, “వారు మమ్మల్ని అల్లాహ్ వద్దకు చేరుస్తారని మాత్రమే మేము వారిని ఆరాధిస్తున్నాము” అని అంటారు” – 39:3
పై ఖురాన్ వాక్యంలో స్వయంగా అల్లాహ్ బహుదైవారాధకులు తాము చేసే షిర్క్ ను సమర్ధించుకోటానికి చూపే సాకును తెలియజేస్తున్నాడు. అటు బహుదైవారాధకుల్లోనూ, ఇటు దర్గా సందర్శకుల్లోనూ కామన్ గా ఉన్న విషయం- “వారు అల్లాహ్ వద్దకు చేరుస్తారనే” నమ్మకాన్ని ఒకని పట్ల కలిగి ఉండటం అని అర్థమవుతుంది. అయితే అలాంటి నమ్మకం కలిగి ఉండటం అల్లాహ్ “షిర్క్“ గా ఎందుకు పరిగణిస్తున్నడంటే.. ఒకనికి అల్లాహ్ వద్ద తమ కోసం సిఫారసు చేసేంత అధికారం ఉంటుందని భావించి, అతనికి లాభ-నష్టాలకు గురిచేసే శక్తిని అంటగట్టేయటం జరుగుతుంది కాబట్టి.
దర్గా సందర్శనను ఖండిస్తున్న ప్రవక్త ముహమ్మద్ (స)!
“మీ కంటే ముందు తరాలవారు తమ ప్రవక్తల, పుణ్యపురుషుల సమాధులను ఆరాధనాలయాలుగా మార్చుకున్నారు. సమాధులను ప్రార్ధనా స్థలాలుగా మార్చుకోకండి. అలా చెయ్యటాన్ని నేను నిషేధిస్తున్నాను” – ప్రవక్త ముహమ్మద్(స) [సహీహ్ ముస్లిం 532]
పై హదీసు నేటి దర్గా సందర్శకులైన ముస్లిములకు వర్తించదా? నేడు వలియల్లాల సమాధులపై దర్గాలను నిర్మించి అక్కడ ప్రార్ధనలు నిర్వహిస్తున్న ముస్లిములు ప్రవక్త ముహమ్మద్(స) నిషేధిస్తున్న పనులను చెయ్యటం లేదా? ఆలోచించండి.
****
“సిఫారసు దారులు” లేకుండా అల్లాహ్ ప్రార్థనలు వినలేడా?
అల్లాహ్, మనిషి చేసుకునే ప్రార్థనలు లేదా వేడుకోళ్లు వినలేనంత బలహీనుడా? దర్గా సందర్శకులైన ముస్లిములు చెప్పే ఉదాహరణ ఏమిటంటే- “ఓ కలెక్టరు దగ్గరకు సామాన్య వ్యక్తి డైరెక్ట్ గా వెళ్లిపోలేడు కదా! ఆయన పీ.ఏ సిఫారసు ద్వారానే కలెక్టరు దగ్గరకు పోగలము. అలాగే మనం వలియల్లాల సమాధులను వేడుకుంటే వారు అల్లాహ్ కు సన్నిహితులు కాబట్టి వారు మా ప్రార్ధనలను విని అల్లాహ్ వద్దకు చేర్చి, మా కోసం సిఫారసు (వసీల) చేస్తారు అప్పుడు అల్లాహ్ మా ప్రార్ధనలు ఆలకిస్తాడు” అన్నది. ఇలా ఊహించుకోటానికి కారణం దర్గా సందర్శకులైన ముస్లిములకు ఈ క్రింది ఖురాన్ వాక్యం యొక్క అవగాహన లేకపోవటమే.
“అల్లాహ్ మనిషి కంఠ రక్తనాళం కంటే కూడా చాలా దగ్గరగా ఉన్నాడు” – ఖురాన్ 50:16
పై వాక్యంలో అల్లాహ్ ఇస్తున్న సమాచారం: “నేను మీకు అందనంత దూరంలో లేను. నన్ను వేడుకోటానికి మీరు ఎక్కడికో వెళ్లి, ఎవరి సహాయాన్నో పొందనవసరం లేదు నేను మీకు మీ కంఠ రక్తనాళం కంటే కూడా దగ్గరలో ఉన్నాను. నన్ను మీరు మధ్యవర్తుల సహాయం లేకుండానే ప్రత్యక్షంగానే వేడుకోవచ్చు” అన్నది.
మనిషికి అంత దగ్గరగా ఉంటూ అల్లాహ్ చేస్తున్నదేమిటి?
“అల్లాహ్ మీ మాటలన్నిటినీ వింటున్నాడు” – ఖురాన్ 2:224
సిఫారసు దారులు లేకపోతే తప్ప అల్లాహ్ తన దాసుల ప్రార్ధనలు వినలేడా?
“నా దాసులు నన్ను గురించి నిన్ను అడిగితే, నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును వింటాను, సమాధానం పలుకుతాను అనీ ఓ ప్రవక్తా వారికి తెలుపు” – ఖురాన్ 2:186
పై ఖురాన్ వాక్యాలను బట్టి.. స్వయంగా అల్లాహ్ యే “పిలిచేవాడి పిలుపును వినలేనంత బలహీనుణ్ణి కాను నేను కానీ… పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును ప్రత్యక్షంగా వింటాను, సమాధానం పలుకుతాను! అంతేకాదు నేను మీ కంఠ రక్తనాళం కంటే కూడా దగ్గరగా ఉంటూ ‘మీ మాటలన్నిటినీ వింటున్నాను’ అన్న విషయాన్ని ప్రకటించమని ప్రవక్త ముహమ్మద్(స) వారికి ఆజ్ఞాపిస్తున్నాడు.
అయినప్పటికీ.. “అబ్బే! లేదండీ, సమాధుల్లో ఉన్న పరిశుద్ధులైన వలియల్లాల సిఫారసు (వసీలా) కంపల్సరీగా ఉంటేనే తప్ప మా వేడుకోళ్లు అల్లాహ్ వద్దకు చేరవు” అని వాదించేవారు ఒకటి- అల్లాహ్ స్వయంగా తమ ప్రార్ధనలు వినలేనంత బలహీనుడని నిర్ధారించటం అవుతుంది. రెండు- అల్లాహ్ తన దాసుల ప్రార్ధనలు ప్రత్యక్షంగా వింటాడని ప్రకటిస్తున్న ప్రవక్త ముహమ్మద్(స) వారి ప్రకటన అబద్ధం అని తేల్చటం అవుతుంది (దేవుడు క్షమించు గాక). సరే ఇంతకూ… ఏ వలియల్లా అయినా అల్లాహ్ వద్ద “సిఫారసు” చేసే శక్తీ, అధికారాలు కలిగి ఉంటారా?
***
“దర్గాలకు వెళ్లే ఏ ముస్లిమూ దర్గాలో వలియల్లాలను అల్లాహ్ అనో, అల్లాహ్ కు సమానమనో, అల్లాహ్ కంటే ఎక్కువనో భావించరు కదా! కాబట్టి దర్గాలకు వెళ్లటం ‘షిర్క్’గా పరిగణించబడదు” అన్నది అభినవ దర్గా ప్రేమికుల వాదన.
దర్గాలకు వెళ్లటంలో ఉద్దేశమే తమ కోరికలు నెరవేరతాయన్న నమ్మకంతో సమాధులను ప్రార్ధన చేయటానికి! తప్పితే నేడు ఏ ఒక్కరూ దర్గాలను ఏదో తాజ్ మహల్ ను చూడ్డానికన్నట్టు సందర్శించి రావటం లేదు కదా?
ఇక “షిర్క్” అంటే దర్గాలో వలియల్లాలను అల్లా అనో, అల్లాహ్ కు సమానమనో, అల్లాహ్ కంటే ఎక్కువనో భావించటం మాత్రమే కాదు.. వారి సమాధులను వేడుకుంటే సిఫారసు లభిస్తుందని ఆశించటం, వారి సమాధుల ముందు ప్రార్ధించుకుంటే వారి ద్వారా లాభం కలుగుతుందని భావించటం సైతం “షిర్క్” గానే పరిగణించబడుతుంది.
“షిర్క్” అంటే ముస్లిమేతరుల పుణ్యపురుషుల విగ్రహాలను పూజించటం అని మాత్రమే కాదు, ముస్లిములైన పుణ్య పురుషుల సమాధులను ప్రార్ధించటం కూడా “షిర్క్”గానే పరిగణించబడుతుంది.
“వారు మమ్మల్ని అల్లాహ్ వద్దకు చేరుస్తారని మాత్రమే మేము వారిని ఆరాధిస్తున్నాము” (ఖురాన్ 39:3) అన్న కుంటిసాకునే అటు బహుదైవారాధకులైనా, దర్గా సందర్శకులైనా తాము చేసే ‘షిర్క్’ను సమర్ధించుకోటానికి చూపేదని స్వయంగా అల్లాయ్ యే చెబుతున్నాడు.
ఈ నేపథ్యంలో మనం గమనించాల్సింది- ఏ వలియల్లా అయినా అల్లాహ్ వద్ద “సిఫారసు” చేసే శక్తీ, అధికారాలు ఉంటారా? అన్నది. అంతకంటే ముందు “వలీయల్లాహ్ ల వద్ద సిఫారసు కోసం ప్రయత్నించటం “వసీల” అవుతుందన్న దర్గా ప్రేమికుల నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగా అసలు ‘వసీల’ అంటే ఏమిటో గమనిద్దాం.
వసీల అంటే ఏమిటి?
వలియల్లాలకు దేవుడు దగ్గర సిఫారసు చేసే అధికారం ఉంటుంది కనుక మా బాధలు చెప్పుకుని, వారి ద్వారా సిఫారసు పొందటానికి వారిపై శాంతి (దరూద్) పంపటానికి వెళుతుంటాం అంతే!. ఆ విధంగా దర్గాల్లో వలీయల్లాహ్ ల సిఫారసు పొందటం కోసం ప్రయత్నించటం “వసీల” అవుతుందన్నది దర్గా ప్రేమికుల విశ్వాసం.
“వసీల” అన్న పదం ఖురాన్ లో 5:35, 17:57 వాక్యాల్లో చూడగలం. ఈ పదానికి అర్థం “దేవుని కారుణ్యాన్ని పొందే మార్గం అన్వేషించటం (Seeking a means of nearness)”. అది ఎలా అన్వేషించాలి? ఖురాన్, హదీసుల ప్రకారం “సదాచారణ” “ఉపవాసం” “నమాజ్” “జకాత్”ల ద్వారా అన్వేషించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రవక్త ముహమ్మద్ (స) ఆచరణను యదాతధంగా ఆచరించటం ద్వారా ‘దేవుని ప్రసన్నతను పొందటం’ (వసీలా) సాధ్యమవుతుంది. తప్పితే చనిపోయిన వ్యక్తుల దగ్గర పోయి ‘వసీల’ (అల్లాహ్ ప్రసన్నత పొందే మార్గం) కోసం వెంపర్లాడటం వసీలా అవ్వదు. అలాంటి విధానాలను ఖురాన్ నిషేధిస్తుంది.
“సమాధులలో ఖననమైన వారికి నీవు వినిపించలేవు” – 35:22
“నీవు మృతులకు వినిపించలేవు” – 30:52
కానీ, పై ఖురాన్ వాక్యాలకు వ్యతిరేకంగా “వలీయల్లాహ్ ల వద్ద సిఫారసు కోసం ప్రయత్నించటం “వసీల” అవుతుంది అన్నది దర్గా ప్రేమికుల విశ్వాసం. పైగా వారి నమ్మకాన్ని సమర్ధించుకోవటానికి ఈ క్రింది వాక్యం చూపుతూ ఉంటారు.
“… వారు నీ వద్దకు వచ్చి ఉండవలసింది, క్షమించు అని అల్లహ్ ను అర్థించి ఉండవలసింది, ఇంకా ప్రవక్త కూడా వారి మన్నింపుకై విజ్ఞాపన చేసి ఉండేవాడు” – 4:64
ఈ వాక్యం వాస్తవానికి ప్రవక్త ముహమ్మద్(స) బ్రతికి ఉన్నప్పుడు విశ్వాసుల తరఫున ప్రార్ధన చెయ్యటం గురించి చెప్పబడింది. తప్పితే ఆయన (స) చనిపోయిన తరువాత చెప్పబడుతుంది కాదు. ఈ వాక్యాన్ని దర్గాల్లో సమాధుల వద్ద తాము చేసుకునే వేడుకోళ్లకు లింకు పెట్టటం మరీ విచిత్రం! ఈ సందర్భంలో అనస్ (రజి) వారు చెబుతున్న అత్యంత ముఖ్యమైన ఈ క్రింది హదీసును గమనించాల్సి ఉంది.
“కరువు సమయాల్లో ఉమర్ ఇబ్నె ఖత్తాబ్(రజి) వారు, అబ్బాస్ ఇబ్నె ముతల్లిబ్(రజి) వారిని తమ తరఫున వర్షం కోసం అల్లాహ్ ను ప్రార్ధించమని అడిగేవారు. ఇంకా ఆయన స్వయంగా చెబుతున్నదేమిటంటే- ఓ అల్లాహ్, ప్రవక్త ముహమ్మద్ (స) ఉన్నప్పటి కాలంలో మేము మా తరఫున నిన్ను ఆయన్ని వర్షం కోసం ప్రార్ధించాల్సిందిగా అడిగేవారం” – (సహీహ్ బుఖారి, Vol 2, అల్-ఇస్తిస్కా, హదీస్ 1010)
ఇక్కడ గమనించాల్సింది ఉమర్(రజి) వారు ప్రవక్త ముహమద్ (స) వారు బ్రతికి ఉన్నప్పుడు ఆయనను అల్లాహ్ ను ప్రార్ధించాల్సిందిగా కోరుకునేవారు. ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ (స) వారు చనిపోయారో అప్పుడు అబ్బాస్ (రజి) వారిని వర్షం కోసం ప్రార్ధించాల్సిందిగా కోరుకున్నారు. కారణం? అబ్బాస్ (రజి) వారు ప్రవక్త ముహమద్ (స) వారి కంటే గొప్పవారైతే కాదుకదా!? దీనికి సమాధానం చనిపోయిన తరువాత అది ప్రవక్త ముహమద్ (స) అయినా సరే ఎవరైనా సరే వారి “వసీల” లేక సిఫారసులు అనేవి చెల్లవు కాబట్టి! ఇంకా అప్పటికి అబ్బాస్ (రజి) బ్రతికి ఉన్నారు. ఒకవేళ పుణ్య పురుషుల సమాధులను వేడుకోవటం ద్వారా ప్రార్ధనలు అల్లాకు చేరతాయంటే ఉమర్(రజి) వారు ప్రవక్త ముహమద్ (స) సమాధి దగ్గర నిలబడి ఆయన్నే వేడుకునే వారు కదా!? అబ్బాస్ (రజి) వారిని ఎందుకు ప్రార్ధించమంటారు?
వలియల్లాలను ఖురాన్ “సజీవులు” అని చెబుతుంది కదా?
వలియల్లాలకు “సిఫారసు” చేసేంత శక్తిని వారు కలిగి ఉంటారని వాదించే చాలా మంది దర్గా ప్రేమికులు చూపే ఖురాన్ వాక్యం- “అల్లాహ్ మార్గంలో చంపబడినవారిని మృతులు అనకండి వారు సజీవులు” – 2:154 అన్నది.
ఈ వాక్యం అల్లాహ్ మార్గంలో “చంపబడినవారిని (Martyrs)” లేదా “ప్రాణ త్యాగం” చేసిన వారి గురించి చెప్పబడుతుంది. అది కూడా వారు అల్లాహ్ మార్గంలో చేసే ప్రాణత్యాగం దృష్ట్యా వారి ఉన్నత స్థితిని బట్టి “వారిని మృతులు అనకండి వారు సజీవులు” అంటున్నాడు. తప్పితే వలియల్లాలందరూ సమాధి లోపల బ్రతికి ఉంటూ తమ వద్ద వేడుకునేవారి వేడుకోళ్లు వినే శక్తి కలిగి ఉంటారనో, తమను వేడుకునే వారి కోసం అల్లాహ్ వద్ద సిఫారసు చేస్తారనో కాదు! ఆమాటకొస్తే… “సమాధులలో ఖననమైన వారికి నీవు వినిపించలేవు” – 35:22 అని కూడా అల్లాహ్ యే చెబుతున్నాడు కదా!
****
‘సమాధి ఆరాధన’ అజ్ఞాన కాలపు ఆచారం!
ముహమద్(స) ప్రవక్తగా నియమితులవ్వక ముందే సమాధి ఆరాధన అన్నది ఆజ్ఞాన కాలంలో మక్కా విగ్రహారాధకుల్లో ఉండేది. దానికి ఆధారమే ఈ క్రింది హదీస్.
“యూదులు, క్రైస్తవులు తమ ప్రవక్తల సమాధుల్ని ప్రార్థనా స్థలాలుగా చేసుకున్నారు. దేవుడు వారిని శపించుగాక” [ సహీహ్ బుఖారీ 436]
అందుకే ఖురాన్ సైతం ఈ అజ్ఞాన కాలపు ఆచారాన్ని ఖండించటం జరిగింది.
“ఇస్రాయేలు వంశీయులారా… ఎవరూ ఎవరికీ ఏ మాత్రం తోడ్పడలేని, ఎవరి సిఫారసు అంగీకరించబడని, పరిహారం తీసుకుని ఎవరినీ విడుదల చెయ్యని, అపరాధులకు సహాయం ఎక్కడనుండీ లభించని ఆ దినానికి మీరు భయపడండి” – 2:47,48
ఒకనాటి ఈ సమాధి ఆరాధనే క్రమంగా ముస్లిం సమాజంలోనూ ప్రవేశపెట్టబడింది. అయినప్పటికీ, నేటి అభినవ దర్గా ప్రేమికులు అల్లాహ్ దగ్గర ఆ సిఫారసు చేసేది ఎవరో కాదు దర్గాలకు మేము పోయివచ్చే వలియాల్లలే అని నమ్మేస్తుంటారు! అలాంటి వారికి అల్లాహ్ ఇచ్చే సమాధానం:
“ఆ రోజున సిఫారసు ఏ మాత్రం పనిచెయ్యదు. అల్లాహ్ ఎవరికైనా దానికి అనుమతి ఇచ్చి అతని మాటను ఆలకించటానికి ఇష్టపడితే తప్ప” – 20:109
ఈ వాక్యంలో ఆనాటి అజ్ఞానకాలపు విగ్రహారాధకుల్లో “మా దేవతలు అల్లాహ్ సమక్షంలో మా కోసం మా తరఫున సిఫారసు చేసి మమ్మల్ని కాపాడుకుంటారు” అన్న వారి మూఢ విశ్వాసాన్ని ఖండించటం జరుగుతుంది. అల్లాహ్ ఎవరి సంజాయిషీ వినాలన్నా తాను ఇష్టపడితేనే తప్ప ఆయన కోర్టులో నిలబడి ఎవరికైనా స్వతహాగా నోరు విప్పే అధికారం, అవకాశం కించిత్తు కూడా ఉండదని చెప్పటమే ఈ వాక్యాల ఉద్దేశం. తప్పితే కొందరు తమకు తాముగా దేవుని ముందు నిలబడి సిఫారసు చేసే అధికారం కలిగి ఉంటారని కాదు. చివరకు ప్రవక్త ముహమద్ (స) ఈ క్రింది విధంగా తెలియజేస్తున్నారు.
“ఓ ఖురైష్ ప్రజలారా మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి కాపాడుకోండి నేనైతే మిమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడలేను, ఓ మనాఫ్ సంతానామా మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి కాపాడుకోండి నేనైతే మిమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడలేను, ఓ ప్రవక్త మేనత్త అయిన సఫియా నిన్ను నువ్వు నరకాగ్ని నుండి కాపాడుకో నేనైతే నిన్ను నరకాగ్ని నుండి కాపాడలేను, ఓ ప్రవక్త కూతురైన ఫాతిమా నిన్ను నువ్వు నరకాగ్ని నుండి కాపాడుకో నేనైతే నిన్ను నరకాగ్ని నుండి కాపాడలేను” (సహీహ్ బుఖారి, Vol 4, Book 51, No. 16)
వాస్తవం ఇదైనప్పుడు పుణ్య పురుషులు (వలియల్లాలు) మా కోసం సిఫారసు చేస్తారని, మమ్మల్ని రక్షించుకుంటారని నమ్మకం కలిగి ఉండటం అర్థరహితం అవుతుంది.
***
ఈ సందర్భంలో దర్గా సందర్శనను సమర్ధించే కొందరు ముస్లిములు లేవనెత్తుతున్న ప్రశ్న ఏమిటంటే- నేడు దర్గాలన్నవి హిందూ-ముస్లిముల ఐకమత్యానికి వేదికలుగా ఉన్నాయి కదా! అలాంటప్పుడు దర్గా సంస్కృతిని కాపాడుకోవటంలో తప్పేంటి? అన్నది
ఈ ప్రశ్న కొంత వరకు న్యాయమైన ప్రశ్నే! నిజానికి నేడు గమనిస్తే దర్గాలు అన్నవి ఒక రకంగా హిందూ-ముస్లిములు ఐకమత్యంగా ఒక చోట గుమిగూడటానికి వేదికలుగా మారిపోయాయి. కాకపోతే దర్గా సంస్కృతిని కాపాడుకోవటంలో తప్పు లేదని వాదించేవారు గమనించాల్సిన అతి ముఖ్యమైన రెండు విషయాలున్నాయి.
1. చనిపోయిన పుణ్యపురుషుల సమాధులపై దర్గాలను నిర్మించటం, వాటిని అలంకరించటం, అక్కడ ప్రార్ధనలు నిర్వహించటం అజ్ఞాన కాలపు ఆచారాలు అన్నది. అంతేకాదు, ఈనాడు ముస్లిం సమాజంలో అధికశాతం మందిలో దర్గాలను సందర్శించటం, అక్కడ సమాధులను వేడుకోవటం, చాదర్లు, తబ్రూక్ లు సమర్పించటం వగైరా పనులన్నీ సర్వసామాన్యం అయిపోయాయి. ఇవన్నీ చెయ్యటం ఖురాన్, హదీసుల వెలుగులో ‘బిద్దత్’ మాత్రమే కాదు ‘షిర్క్’ కూడా.
2. ముహమ్మద్(స) ప్రవక్తగా నియమించబడక ముందు నుండే అజ్ఞాన కాలంలో సమాధి ఆరాధనలు అన్నవి అరబ్ ముష్రిక్కుల ద్వారా, యూదులు, క్రైస్తవుల ద్వారా నిర్వహించబడుతూ వస్తున్న ముఢాచారాలు. వాటిని ప్రవక్త ముహమ్మద్(స) కొనసాగించలేదు. కానీ, నిషేధించారు. సమాధులను పూజించటాన్నే కాదు, వాటిపై దర్గాలను నిర్మించటాన్ని సైతం ఈ క్రింది హదీసుల్లో నిషేధించారు.
“వారిలో పుణ్యపురుషుడెవరైనా చనిపోతే వారు అతని సమాధిపై ఆరాధనాలయాన్ని నిర్మిస్తారు. ఇంకా దానిపై అతని స్వరూపాన్ని చెక్కుతారు. అలాంటి వారే అల్లాహ్ దృష్టిలో అత్యంత నీచమైన కోవకు చెందిన వ్యక్తులు” [సహిహ్ అల్-బుఖారీ 427]
“మీ కంటే ముందు తరాలవారు తమ ప్రవక్తల, పుణ్యపురుషుల సమాధులను ఆరాధనాలయాలుగా మార్చుకున్నారు. సమాధులను ప్రార్ధనా స్థలాలుగా మార్చుకోకండి. అలా చెయ్యటాన్ని నేను నిషేధిస్తున్నాను” – ప్రవక్త ముహమ్మద్(స) [సహీహ్ ముస్లిం 532]
“దర్గా”ల విషయంలో నేటి ముస్లిం సమాజం చెయ్యాల్సిందేమిటి?
హిందూ-ముస్లిం ‘ఐక్యత (Unity)’ తప్పనిసరే! కానీ దానికి మూఢత్వ విధానాలు, అజ్ఞాన కాలపు ఆచారాలు, దైవాగ్రహానికి గురిచేసే బహుదైవారాధనా పద్ధతులు కేంద్రకాలుగా చేసుకోకూడదు. నేడు హిందూ-ముస్లిం ‘ఐక్యత’కు దర్గాలు వేదికలుగా ఉన్నాయి కాబట్టి దర్గా కల్చర్ సరైనదే అన్నట్టు చాలామంది సమర్ధిస్తున్నారు. అలాంటి వారు ముందుగా- ప్రస్తుతం దర్గా సందర్శన చేస్తున్నవారు కొన్ని ఎమోషన్లను ప్రక్కనపెట్టి దర్గాలలో సమాధి ఆరాధన అన్నది ఖురాన్, హదీసుల్లో లేని కల్పిత ఆచారం (బిద్దత్) మాత్రమే కాదు, అది పక్కాగా “షిర్క్ (బహుదైవారాధన)” అవుతుందన్న విషయాన్ని ముందు అంగీకరించాలి. అలా షిర్క్ చేసేవారు సోకాల్డ్ ముస్లిములవుతారు తప్ప నిజ ముస్లిములవ్వరు. “దర్గా”ల విషయంలో నేటి ముస్లిం సమాజం చెయ్యాల్సిందేమిటి? అంటే…
1. ప్రస్తుతం నిర్మితమైన ఉన్న దర్గాలను పగలగొట్టేయటం సాధ్యం కాదు కాబట్టి, కొత్త దర్గాలను కట్టకుండా ప్రస్తుతం దర్గాలలో ‘సమాధి పూజలు’ నిర్వహించబడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
2. సమాధులపై చాదర్లు, తబ్రూక్లు సమర్పించే ఆచారాలు నిషేధించి, బీదలకు బట్టలు, అన్నదానాలు వగైరా సేవలను అక్కడ అందించాలి. ప్రస్తుత దర్గాలను మొక్కుబడి కేంద్రాలుగా కాకుండా, సేవా కేంద్రాలుగా మార్చాలి.
3. ఖవ్వాలీలను వినిపించే బదులు అక్కడికొచ్చే హిందూ, ముస్లిములను ఆయా దర్గాలలో సమాధి చెయ్యబడిన వలియల్లాలు అంటే దేవునికి స్నేహితులుగా మారిపోయిన వారని వారి జీవిత చరిత్రను స్థానిక భాషల్లో ప్రసంగాల రూపంలో తెలియజేస్తూ.. ప్రతి ఒక్కరూ ఆ వలియల్లాల మాదిగా అల్లాహ్ కు ఇష్టులుగా మారిపోవటానికి చెయ్యాల్సిన పనులేమిటో తెలియజేయాలి.
4. దర్గాల సందర్శనకు వచ్చే ముస్లిములను సమాధుల్లో వలియల్లాలను ప్రార్ధించేవారిగా కాకుండా.. ప్రతీ ముస్లిమూ వలియల్లాగా (అంటే అల్లాహ్ కు స్నేహితునిగా) ఎలా మారిపోవాలో నేర్పించాలి.
5. ముఖ్యంగా దర్గాలకు చాలా స్థలం (Land) కేటాయించబడి ఉంటుంది కాబట్టి వాటిలో మసీదులను, విద్యాలయాలను, లైబ్రరీలను, ఆన్నదాన కేంద్రాలను నిర్మించాలి. దర్గాలకు వచ్చే హిందూ మిత్రులకు మసీదుల సందర్శన వైపునకు వారిని మళ్లించాలి. మసీదుల్లోకి వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి. ముస్లిమేతరులకు మసీదులలో ఏ విగ్రహమూ పెట్టకుండా చేసే ‘ప్రత్యక్ష దైవారాధన’ అంటే ఎలా ఉంటుందో చూపించి, పరిచయం చెయ్యాలి.
6. వారిని మసీదులకు ఆహ్వానించటమే కాక, ఒకనాటి ‘నిరాకారోపాసన (ఏ విగ్రహమూ లేకుండా ఆరాధించే విధానం)’ అయిన ‘వైదిక ఆరాధన’ వంటిదే ముస్లిములు ఏ విగ్రహం లేకుండా అల్లాహ్ ను ఆరాధించే ‘నమాజ్’ విధానం అన్న విషయాన్ని తెలియజేయాలి.
7. ఆల్రెడీ విగ్రహారాధన చేసే ముస్లిమేతరులు సమాధి ఆరాధనలకు ఆకర్షితులవ్వటం పెద్ద వింతేమీ కాదు. కాబట్టి వారితో దర్గాలో ‘సమాధి ఆరాధన’ చేయించటం అన్నది వారు చేసే విగ్రహారాధనకు ప్రత్యామ్నాయమే (Alternative) అవుతుంది. కాబట్టి దర్గాలను సందర్శించే ముస్లిమేతరులకు ఇస్లాం దృక్పథాలను పరిచయం చెయ్యాలి. తెలుగు ఖురాన్ లను, ఇస్లాం గురించి తెలియజేసే కరపత్రాలు, పుస్తకాలు స్థానిక భాషల్లో పంచాలి. వారికేమైనా కోరికలు మసీదులో నిలబడి ఏ విగ్రహం లేకుండా వేడుకోవటాన్ని నేర్పాలి.
దీనికి ఒక గొప్ప ఉదాహరణ కూడా ఉంది. ప్రవక్త ముహమ్మద్ (స) కాలంలో నజ్రాన్ నుండి కొందరు క్రైస్తవులు మదీనాను సందర్శించి మస్జిదే నబవీలో బస చెయ్యటానికి, ప్రార్ధనలు చేసుకోటానికి ఆయన వద్ద అనుమతి కోరతారు. దానికి ప్రవక్త ముహమ్మద్(స) వారికి అనుమతినిస్తారు కూడా. దానికి కారణం ముస్లిమేతరులను మసీదులకు ఆహ్వానిస్తేనే కదా వారికి ‘ఏకదైవారాధన’ను ఏ విగ్రహం లేకుండా ఎలా ప్రార్ధన చెయ్యవచ్చో తెలిసేది.
సెలబ్రిటీలు దర్గా సందర్శన చేస్తున్నారు కదా?
సినిమా స్టార్లూ, సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు ధార్మిక జ్ఞానం కించిత్తు కూడా ఉండదు అన్న విషయాన్ని గమనించాలి. వీరంతా తమ సినిమాలు బాగా ఆడాలని, పదవుల్లో కొనసాగాలని గుళ్లూ గోపురాలు తిరుగుతూనే ఏ పుట్టలో ఏ పాముందో అన్న చందంగా ఓ రాయి దర్గాపై కూడా విసిరేస్తేపోలా అన్నట్టు దర్గా సందర్శన కూడా చేసేసి అక్కడ తబ్రూక్ లు, చాదర్లు సమర్పించేసి ప్రార్ధనలు, పూజలు నిర్వహిస్తుంటారు.
అంత పెద్ద సెలబ్రిటీలు, సినిమా స్టార్లు, దర్గాలు సందర్శన చేస్తున్నారు కాబట్టి మనం చెయ్యటంలో తప్పేముందని అనుకోవటానికి మించిన అజ్ఞానం మరొకటి ఉండదు.
ఇలాంటి మొక్కుబడులను నిషేధించాలి!
ఒక ముస్లింకు అల్లాహ్ ఇచ్చిన బాధ్యత “దేవుని ఏకత్వాన్ని (తౌహీద్)” పరిచయం చెయ్యటం తప్పితే బహుదైవారాధన (షిర్క్) దగ్గరుండి నేర్పటం కాదు. కానీ, నేడు దర్గాలలో జరుగుతున్న తంతు ఇదే. సెలబ్రిటీలు, సినిమా స్టార్లు తమ స్వలాభం కోసం దర్గాల సందర్శన చేస్తున్నారు. వారితో అక్కడి దర్గా నిర్వాహకులు చేస్తున్నదేమిటి? వారు సమాధి పూజలు చేస్తుంటే దగ్గరుండి జరిపించటమే కదా!
అంతటితో ఆగక వారిని చూసి మురిసిపోయి వారితో సెల్ఫీలు దిగటం, వారితో పాటు సమాధులను పూజలను నిర్వహించటం, సాష్టాంగ నమస్కారాలు చెయ్యటం వగైరా ఇవే కదా చేస్తుంది? ఈ పనులకు ఇస్లాంకు కించిత్తు సంబంధం లేదు.
వీలైతే దర్గాలకు చాలా స్థలం (Land) ఉంటుంది. కాబట్టి దర్గా ప్రాంగణంలోనే పైన మనం చెప్పుకున్నట్టు మసీదును నిర్మించి, వారికి మసీదు సందర్శన చేయించాలి. వారికేదైనా కోరికలు ఉంటే సమాధుల ముందు ప్రార్ధన చెయ్యటం మాన్పించి మసీదులో నిలబడి ‘ప్రత్యక్ష దైవారాధన’ పద్ధతిని నేర్పాలి.
చివరిగా దర్గాలను కాక, మసీదులను హిందూ-ముస్లిముల సమావేశాలకు, ఐక్యతకు కేంద్రాలుగా మార్చాలి. హిందూ-ముస్లిం ఐక్యతకు దర్గా కల్చర్ ను కాదు మస్జిద్ కల్చర్ ను అభివృద్ధి చెయ్యాలి. ప్రతీ మస్జిద్ లో శుక్రవారాలు జరిగే ప్రసంగాలలో పై విషయాలను ముస్లిములకు అర్థమయ్యేలా చెప్పాలి.
ఇదంతా చదివి కూడా “లేదండీ! దర్గాలకు వెళ్లటం కంపల్సరీ. ఎవరెన్ని చెప్పినా మేము వెళ్లి తీరతాము అంతే” అని మంకు పట్టుపడితే అల్లాహ్ సమక్షంలో నిలబడి సమాధానం చెప్పుకోటానికి రెడీ అయిపోవాలి, ఆ తరువాత ఎదురయ్యే భయంకరమైన శిక్షకు సిద్ధ పడిపోవాలి.
దర్గాలకు వెళ్లటం “షిర్క్” అవ్వదా?
