షరియత్ పట్ల నాస్తికుల అజ్ఞానం..

“షరియత్” పట్ల చాలామంది ముస్లిమేతర వర్గాల ప్రజల్లో ఉన్నది అపార్థం అయితే ఈ క్రింది పోస్టులు పెట్టే కొందరి నాస్తికులకు ఉన్నది షరియత్ పట్ల అజ్ఞానం అని చెప్పవచ్చు. షరియత్ అంటే ముస్లిం దేశాల్లో నేరస్తులకు విధించే కఠిన శిక్షలు, చట్టాలు మాత్రమే అని, షరియత్ అంటే మత ఛాందసవాదమని ఇలా అనేక అపార్థాలు నేడు ఉన్నాయి. కాబట్టి కొందరి అపార్థాలు, ఆజ్ఞానమూ దూరమవ్వాలంటే ముందుగా షరియత్ అంటే ఏమిటో తెలుసుకోవాలి.

షరియత్ అంటే – ఇస్లామిక్ లా!

“ఇస్లామిక్ షరియత్” అన్నది కేవలం చట్టపరమైనటువంటి అంశాలు మాత్రమే కాదు, అది మనిషి యొక్క వ్యక్తిగత, సామాజిక జీవన రంగాలకు సంబంధించినటువంటి అనేక అంశాలను నిర్దేశిస్తుంది.
షరియత్- తోటి వ్యక్తుల పట్ల న్యాయంగా వ్యహరించమని, ప్రేమ, దయాభావంతో మెలగమని ఆదేశిస్తుంది.

షరియత్- నేరం చేసినవ్యక్తి స్వంత బంధువు అయినా సరే, బాధితుడు శత్రువు అయినా సరే బాధితునివైపే న్యాయంగా వ్యవహరించాలని చెబుతుంది.

షరియత్- పర్యావరణాన్ని సంరక్షించాలని దాని సమతూల్యాన్ని దెబ్బతీయవద్దని, జీవుల పట్ల దయాభావం కలిగి ఉండాలని చెబుతుంది.

షరియత్- నిరుపేదలు, అగత్యపరులు అవసరార్థుల పట్ల దయ భావం కలిగి ఉండాలని, తమ సంపాదనలోని కొంత భాగాన్ని తీసి పేదలకు అగత్యపురులను ఆదుకోవటాన్ని విధి చేస్తుంది.
షరియత్- పొరుగువాడు ఆకలిగా ఉండగా తాను మాత్రమే కడుపునిండా భుజించే వ్యక్తిని అవిశ్వాసిగా పరిగణిస్తుంది.

షరియత్- సృష్టి, సృష్టితాల పట్ల శాస్త్రీయపరమైన దృష్టికోణాన్ని కలిగి ఉండమని చెబుతూ, ముఢాచారాలను, గుడ్డి నమ్మకాలను కలిగి ఉండకూడదని హెచ్చరిస్తుంది.

షరియత్- సర్వమానవాళి ఒకే జంట సంతానమని చెబుతూ మనుషుల పట్ల మతం, కులం, వర్గం, వర్ణం, జాతి, రంగులను బట్టి ఉచ్చనీచ నిమ్నోన్నతా భావాలను ప్రదర్శించటాన్ని తీవ్రంగా ఖండిస్తుంది.

షరియత్- తలిదండ్రులతో విసుగ్గా మాట్లాడవద్దని చెబుతుంది. తలిదండ్రుల, భార్యా, పిల్లలు, బంధువుల హక్కులను కాపాడమని చెబుతుంది.

షరియత్- స్త్రీ, పురుషులను తమ చూపులను కాపాడుకోమని, వ్యభిచారం దరిదాపులకు కూడా వెళ్లవద్దని ఆదేశిస్తుంది.
షరియత్- మత్తు పదార్థాలు సేవించటాన్ని వ్యభిచారాన్ని దొంగతనాన్ని చాడీలు చెప్పటాన్ని నిషేధిస్తుంది.

షరియత్- స్త్రీలకు సర్వహక్కులను కలుగజేస్తుంది విద్యా హక్కును, ఆస్తి హక్కును, విడాకుల హక్కును తమ ఇష్టానుసారంగా వివాహం చేసుకున్న హక్కును కలగజేస్తుంది. ఇంకా షరియత్ స్త్రీలను గౌరవించమని వారి హక్కులను కాపాడమని పురుషులకు ఆదేశిస్తుంది.

షరియత్- అన్యాయంగా ఒక వ్యక్తిని చంపటాన్ని సర్వ మానవాళిని చంపడంతో సమానం అని, ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడటాన్ని సర్వమానవుల ప్రాణాలను కాపాడటంతో సమానమని చెబుతుంది.
………….

తోటి మానవులు పట్ల ప్రేమ దయ జాలి కలిగి ఉండాలన్నది షరియత్ ఆదేశం.

సర్వ మానవులకు సమాన న్యాయం, సమాన హక్కులు అందజేయటం మాత్రమే కాక, వ్యక్తులలో మానవతా విలువలు పెంపొందింపజేసి సుందర సమాజాన్ని నిర్మించటమే షరియత్ యొక్క మౌలిక లక్ష్యం.
అయితే మరి షరియత్ నేరాలకు తగిన కఠినమైన శిక్షలను అమలుపరుస్తుంది కదా? అన్న ప్రశ్న ఒకటి ముందుకు వస్తుంది.

ఫలానా క్రైమ్ చేస్తే ఫలానా తీవ్రమైన శిక్షకు నేను గురుకావలసి ఉంటుంది” అన్న ఒక్క “భయం” అన్న ప్రేరకం మాత్రమే ఎటువంటి క్రిమినల్ మైండ్ సెట్ నైనా ఆ క్రైమ్ చేయకుండా నియంత్రించగలిగే ఏకైక సాధనం కాగలదు అన్నది నిర్వివాదం. కాబట్టి నేరానికి శిక్ష అన్నది ఘోరమైన నేరాలకు పాల్పడకుండా ఉండేందుకు కఠినంగానే ఉండాలి తప్ప అందులో మరలా కొంత వెసులుబాటు కల్పించటం అన్నది నేరస్తుల్ని తిరిగి మరలా నేరాలకు పాల్పడేలా చేస్తుందనటంలో సందేహం లేదు. నిర్భయ, ఆసిఫాల్లాంటి దారుణమైన రేప్ ఘటనలు జరిగినప్పుడల్లా ఇక్కడ కూడా ఇస్లామియా షరియత్ లాంటి కఠిన చట్టాలు ఉంటేగానీ ఇలాంటి నేరాలు ఆగవని చాలా మంది కోరుకోవటమే నేరానికి తగిన కఠిన శిక్ష ఉండటమన్నది న్యాయమే అని రుజువవుతుంది.

మరి రాజ్యాంగాన్ని అనుసరించాల్సిన పనిలేదా?

ఏదైనా ఒక దేశంలో ముస్లిం సమాజం షరియత్ లోని ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ ఉంటే గనుక వారు తమ స్వదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని, చట్టాలను అనుసరించాలా? అవసరం లేదా? దీనికి సమాధానం వారు కచ్చితంగా అనుసరించాల్సిందే.

ముస్లింలు ఏ దేశంలో అయితే నివసిస్తారో వారు వారి యొక్క ధార్మికపరమైన బాధ్యతలకు విశ్వాసాలకు భంగం వాటిల్లంతవరకు ఆ దేశం యొక్క రాజ్యాంగాన్ని కచ్చితంగా అనుసరించాలని షరియత్ ఆదేశిస్తుంది.

షరియత్ కు మూలం ఏమిటి?

ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్(స) యొక్క ఆదేశాలే షరియత్!
ఏదైనా ఒక దేశంలో అక్కడి రాజ్యాంగం, చట్టాలు మత స్వేచ్ఛను కాపాడుతున్నప్పుడు అక్కడ అదనంగా షరియత్ ను అప్లై చేయాల్సిన అవసరం ఉంటుందా? ఎంత మాత్రం అవసరం లేదు, కేవలం వారు షరియత్ ఆదేశిస్తున్నట్లు తోటి మానవుల పట్ల దయ ప్రేమ జాలి కలిగి ఉంటూ వారి హక్కుల్ని కాపాడుతూ షరియత్ ఆదేశాల ప్రకారం విధి-నిషేధాలను అనుసరిస్తూ ఇస్లాం చెబుతున్నట్లు నైతిక విలువల్ని కలిగి ఉంటూ దేశ చట్టాలను గౌరవిస్తూ జీవిస్తే సరిపోతుంది. షరియత్ చట్టాలన్నవి ఏదైనా ఒకదేశ ప్రజలంతా పూర్తిగా ఇస్లాంను అనుసరిస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఆమోదించబడుతుంది.

ఇక ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా ముస్లిం దేశాలున్నప్పటికీ పాకిస్తాన్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఓ నాలుగైదు దేశాల్లో అంతర్గత రాజకీయ రాజకీయ గొడవలు, యుద్దాలు, కొన్ని తీవ్రవాద గ్రూపులు సాగించే మారణ హోమాలకు ఇస్లాంతో గానీ, షరియత్ తో గానీ సంబంధం లేదు. పైగా ఇస్లాం తీవ్రవాదాన్ని ఖండిస్తుంది.

ఈ విధంగా షరియత్ అన్నది సత్సమాజ నిర్మాణానికి, అభివృద్ధికి దోహదపడుతున్నప్పుడు.. షరియత్ అంటే ఏమిటి? వాటి ఆదేశాలేమిటి? దాని వల్ల కలిగే లాభాలేమిటి? అన్నవి తెలుసుకోకుండా ఇలాంటి చిల్లర పోస్టులు పెట్టటం, చవకబారుతనంగా మాట్లాడటం అన్నది అజ్ఞానం అనిపించుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *