కేరళలో ఎర్నాకులం జిల్లా కలమస్సేరిలో ఉన్న ‘యెహోవా విట్నెస్ ప్రేయర్ మీటింగ్ హాల్లో’ ప్రతీ ఆదివారం జరుగుతున్నట్టే క్రైస్తవులు ఈ రోజు కూడా ప్రార్ధనలు జరుపుకుంటున్నారు. సరిగ్గా 9.30 గంటల ప్రాంతం వరుసగా బాంబు పేలుళ్లు ప్రారంభమయ్యాయి. ఇద్దరు చనిపోయారు. 50 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ సంఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఈ దుర్ఘటన వెనుక కారకులు ఎవరు? అన్నది ఇంకా పోలీసులు తేల్చే లోపే వాట్స్ యాప్ యూనివర్సిటీ గ్యాంగ్ ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా దీని వెనుక హమాస్ ఉగ్రవాదుల హస్తం ఉందని, కేరళలో ఏదో పెద్ద తీవ్రవాద కుట్ర జరిగిపోతుందని వారికున్న అపారమైన మేధాశక్తితో తేల్చిపరేశారు.
అంతేకాదు, ఈ రకమైన స్వంత స్టోరీలు అల్లేయటమే కాక, క్షణాల్లో వీడియోలు సైతం తయారు చేసేసి, గబగబా ఎడిటింగులు గట్రా చేసేసి వాట్స్ యాపుల్లో వైరల్ కూడా చెసెయ్యటం జరిగింది.
కానీ, పాపం వారి దురదృష్టం కొద్దీ… ఈ బ్లాస్ట్ జరిగిన కొన్ని గంటల్లోనే ఆ బాంబులు పెట్టిన వ్యక్తి కొడకార పోలీస్ స్టేషన్ కు వెళ్లి తానే ఆ బాంబులు పెట్టినట్టు ఒప్పేసుకుని లొంగిపోయాడు. అతని పేరు ‘డోమ్నిక్ మార్టిన్’ అట. ఆ చర్చ్ కు సంబంధించిన సభ్యుల్లో ఒకడే ఇతను.
చర్చ్ లో బాంబు అమర్ఛటానికి కారణం ఆ చర్చ్ లో జరిగే బోధలు తనకు నచ్చకపోవటంతో, ఆ చర్చ్ సభ్యులు తన మాట వినకపోవటంతో సహనం కోల్పోయి చర్చీలో సరిగ్గా ప్రార్ధనలు జరుగుతున్నప్పుడు బాంబులు పెట్టేసేయటమే కరెక్ట్ అని భావించాడట ఇంతకూ!
పైగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా ఒప్పేసుకుని గోదీ మీడియా యాంకర్ల కథనాల మీద, వాట్స్ యాప్ యూనివర్సిటీ బ్యాచ్ ఆశల మీద నీళ్లు చల్లేశాడు.
కనీసం ‘డోమ్నిక్ మార్టిన్’ బదులు ఏ ఉర్దూ పేరో ఉండి ఉంటే ఈ పాటికే సోషల్ మీడియా దద్దరిల్లిపోయేది, మేయిన్ స్ట్రీమ్ మీడియా యాంకర్ల కేకలకు టీవీలు అల్మారాల్లోంచి కదిలిపోయి కిందడిపోయి ఉండేవి. కానీ బ్యాడ్ లక్!
ఇక్కడ కాస్త గమనించాల్సింది…
సామాన్య క్రైస్తవులు, ముస్లిముల మధ్య ద్వేషాన్ని రగిలించటానికి ఒక వర్గం ఎంత వేగంగా ఈ దుర్గటనను తనకు అనువుగా మలచుకోటానికి ప్రయత్నించిందో గమనిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.
ప్రతీ మత వర్గంలో ఆ మత వర్గం పరువు తీసెయ్యటానికి ఇలాంటి వారు కొందరుంటారు. కాబట్టి ఎవరో చేసిన తప్పుకు ఆ మొత్తం మత వర్గాన్ని బాధ్యులుగా చేసేసి దాన్ని తప్పు పట్టటం, హేళన చెయ్యటం అతి పెద్ద తప్పు. కానీ ఇప్పుడు అదే ఫార్ములాతో దేశ రాజకీయాలు నడుస్తున్నాయి.
కాబట్టి మతాల మధ్య ద్వేషాన్ని రగిలిస్తూ, ఓ వర్గాన్ని బూచిగా చూపి తమ అధికారాన్ని నిలబెట్టుకోవటం కోసం ఎంత దిగజారుడు రాజకీయాల్నైనా నడపటానికి కొందరు అన్ని విధాలా మాటు వేసుకుని కూర్చున్న ప్రస్తుత తరుణంలో సామాన్య ప్రజలు వాట్స్ యాపుల్లో వచ్చే వీడియో క్లిప్పులకు, కల్పిత కథనాలకు వెంటనే రియాక్ట్ అయిపోయి, ఫార్వర్డ్ చేసేసే ముందు ఎంతో కొంత “ఫ్యాక్ట్ చెక్” చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
చర్చీ పేలుళ్లు – ఫ్యాక్ట్ చెక్
