మతోన్మాదానికి వేదికగా మారుతున్న “సినిమా”

తన అధికారాన్ని నిలబెట్టుకోటానికి, మెజారిటీ ప్రజలైన జర్మన్లను తనను అభిమానించే “గుడ్డి భక్తులు”గా మార్చుకోటానికి హిట్లర్ వాడిన తెలివైన ‘స్ట్రాటజీ’- మైనార్టీలుగా తమ మానాన తాము బ్రతుకుతున్న యూదుల వల్ల “జర్మన్లు ప్రమాదంలో ఉన్నారు” అన్న భయాన్ని సృష్టించటం. ఆ విధంగా యూదులను జర్మన్లకు వ్యతిరేకంగా ఓ ‘కల్పిత శత్రువు’గా నిలబెట్టి వారి పట్ల జర్మన్ ప్రజలలో విద్వేషాన్ని రెచ్చగొట్టటం, వారి నుండి మిమ్మల్ని, మీ దేశాన్ని రక్షించుకోవాలంటే నన్నూ, నా పార్టీని గెలిపించుకోవటం తప్ప మీకు వేరే గత్యంతరం లేదన్న భావజాలాన్ని ప్రజల్లో విపరీతంగా తీసుకెళ్లటం.

నాజీ పార్టీ యొక్క ఈ ఉన్మాద భావజాలాన్ని ప్రజల్లో సర్వసామాన్యం చెయ్యటానికి హిట్లర్ వాడిన ప్రధానమైన సాధనాలు మీడియా మొదటిదైతే, రెండవది సినిమా. దాని కోసం తనకు కుడి భుజంగా ఉన్న ‘జోసెఫ్ గోబెల్స్’ ఆధ్వర్యంలో ఒక మంత్రిత్వ శాఖను సైతం రూపొందించాడు.

జర్మన్లు, యూదుల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ, జర్మన్లను బ్రెయిన్ వాష్ చెయ్యటం కోసం యూదులను క్రూరులుగా, దౌర్జన్యపరుగా చిత్రీకరిస్తూ “ద ఎటర్నల్ జ్యూ, జ్యూడ్ సుస్” వగైరా ప్రోపగాండా సినిమాలను హిట్లర్ రూపొందించటం మొదలెట్టాడు. ఈ సినిమాల ద్వారా వారిని కనీసం మనుషులన్నట్టు చూపకుండా వారి పట్ల విపరీతమైన విద్వేషాన్ని జర్మన్ ప్రజల మెదళ్లలో నింపేవాడు.

జర్మనీలో యూదులను సామూహిక జనహననం చెయ్యటానికి ముందు వరకు ఈ సినిమాలను జర్మన్ ప్రజలలో విపరీతమైన ద్వేషాన్ని రగిలించటానికి సాధనాలుగా వాడుకున్నాడు.

ఇదే నాజీ ఐడియాలజీతో తరువాతి కాలాల్లో రూపొందించబడిందే సావర్కర్ ‘హిందుత్వ ఐడియాలజీ’ అనటం అతిశయోక్తి కాదు. ఈ భావజాలంతో నడుపడుతున్న మతతత్వ పార్టీలు తమ అధికారం నిలబెట్టుకోవటం కోసం మెజారిటీ హిందువులును “హిందూ ఖత్రెమే హై” అన్న స్లోగన్లతో నేడు రెచ్చగొట్టటమే కాక, ముస్లిం సమాజం పట్ల విద్వేషాన్ని నూరిపోయ్యటానికి, మెజారిటీ హిందువుల బ్రేయిన్ వాష్ చెయ్యటంలో భాగంగా “కాశ్మీరీ ఫైల్స్” “ద కేరళ స్టోరీ” లాంటి సినిమాలను ప్రజల్లోకి తీసుకొచ్చే క్రమంలో ఇప్పుడు కొత్తగా 72 హూరైన్” అనే మతోన్మాద సినిమా రూపొందించటం జరుగుతుంది.

…….

ఈ సినిమా ద్వారా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు?

ఒక ముస్లిం టెర్రరిస్టుగా మారిపోయి జిహాద్ చేస్తే అతనికి స్వర్గంలో 72 కన్యలు ప్రసాదించబడతారని ఇస్లాం చెబుతుంది కాబట్టే అల్ ఖైదా, ఐసిస్ వగైరా ఉగ్రవాద గ్రూపుల్లో ముస్లిములు టెర్రరిస్టులుగా మారిపోతున్నారన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ముస్లిం సమాజం పట్ల ఒకరకమైన భయాన్ని, విద్వేషాన్ని ముస్లిమేతరుల మెదళ్లలో నింపటం.

పైగా ఇలాంటి సినిమాలకు డిస్క్లైమర్ లో “ఈ సినిమాలో చూపబడిన పాత్రలు, సన్నివేశాలు కల్పితం మాత్రమే” అని రాసేసుకుని చక్కగా అన్ని భాషల్లో విడుదల చేసేసుకోవచ్చు ఎవరు కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవదీయకూడదని సుప్రీం కోర్టు ఎంతో కన్వీనెంట్ గా తీర్పు ఇచ్చేస్తుంది కూడా.

ఒకరకంగా చెప్పాలంటే “కాశ్మీరీ ఫైల్స్” “ద కేరళ స్టోరీ” సినిమాల క్రమంలో వస్తున్న ఈ సినిమా ప్రారంభం మాత్రమే! ఇంకా అనేక కోణాల్లో హిందూ-ముస్లిం విద్వేషాలను రగిలించే సినిమాలు ఇక నుండి నెలకొకటి రిలీజ్ అవుతున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

…….

ఫ్యాక్ట్ చెక్

ఒక ముస్లింను టెర్రరిస్టుగా మారిపోయి జిహాద్ చెయ్యమని గానీ, అలా చేస్తే స్వర్గంలో 72 కన్యలు ప్రసాదించబడతారని గానీ ఇస్లాం చెబుతుంది అని ఎవరైనా అంటే అది ఘోరమైన అబద్ధాన్ని ఇస్లాంకు అంటగడుతున్నారని అర్థం. అలాంటి దిగజారుడు సమాచారాన్ని ఖురాన్ ఎక్కడా చెప్పటం లేదు.

పూర్తి ఖురాన్ చదివితే ప్రపంచంలో మంచి పనులు చేసే విశ్వాసులకు పరలోకంలో అనేక బహుమానాలు ఇవ్వబడతాయని, అణకువ కలిగిన పరిశుద్ధ సహచరులు కూడా ఇవ్వబడతారని ప్రస్తావించబడి ఉంది. దాదాపుగా ఇలాంటి వాగ్దానాలు అన్ని ధార్మిక గ్రంథాల్లోనూ చూడగలం.

తప్పితే ఎక్కడా పూర్తి ఖురాన్లో “72 కన్యలు ఇవ్వబడతారు” అన్న పదబంధకం లేనే లేదు. అది కొన్ని హదీసుల్లో మాత్రమే చూడగలం.

ఖురాన్ చెప్పని ఇలాంటి సమాచారం ప్రస్తావిస్తున్న ఆ హదీసులు సైతం ప్రామాణిక హదీసులు కానే కావు. అన్నిటికంటే ముఖ్యంగా అన్యాయంగా ఒక వ్యక్తిని చంపటాన్ని ఖురాన్ సకల మానవాళిని హత్యచేసినంత నేరంగా పరిగణిస్తుంది. అలాగే ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడితే సకల మానవుల ప్రాణాలు రక్షించినట్లే అని చెబుతుంది.

వాస్తవం ఇదైనప్పుడు ఒక వ్యక్తిని టెర్రరిస్టుగా మారిపోయి జిహాద్ చెయ్యమని గానీ, సూసైడ్ బాంబర్లుగా మారిపోయి ఆత్మహత్యలు చేసుకోమని గానీ, ఇలాంటి చిల్లర పనులు చెయ్యటం వల్ల అలాంటి వారికి స్వర్గంలో 72 కన్యలు ప్రసాదించబడతారని గానీ ఇస్లాం చెబుతుంది అంటే అది ఎంత ఘోరమైన అబద్ధాన్ని ఇస్లాంకు అంటగట్టటం అవుతుందో అంచనా వెయ్యవచ్చు. అలాంటి చవకబారు స్టోరీ లైన్లతో సినిమాలు తీస్తే దానికి ఇస్లాంతో, ముస్లిం సమాజంతో సంబంధం లేదని చెప్పాలి.

అయినప్పటికీ సంఘ్ పరివార్ శక్తులు, ఆర్ ఎస్ ఎస్ భావజాలంతో పనిచేసే యూట్యూబ్ ఛానళ్లు, సినిమా రివ్యూవర్స్ అంతా కలిసి ఈ సినిమాలు వాస్తవాల ఆధారంగా తీశారని గొంతు చించుకునే పనిలో పడ్డారు.

మరి ఉగ్రవాదులెందుకు జిహాద్ చేస్తున్నారు?

నేడు మతోన్మాద భావజాలంతో నిండిన రాజకీయ వాతావరణంలో అతి ఘోరంగా అపార్థం చెయ్యబడిన పదం “జిహాద్”. నిజానికి ప్రవక్త ముహమ్మద్(స) “తనలో ఉన్న చెడు ఆలోచనలతో తన మనస్సుతో పోరాడటమే మనిషి చేసే అత్యుత్తమ జిహాద్” అని చెప్పారు.

పూర్తి ఖురాన్ లో “జిహాద్” అనే పదం నాలుగు సార్లు కనపడుతుంది. ఆ నాలుగు సందర్భాల్లోనూ “తీవ్రమైన కృషి” “ప్రయత్నం” అణచివేతకు, అన్యాయానికి వ్యతిరేకంగా చేసే “ధర్మపోరాటం” అన్న అర్థాల్లోనే తప్పా ఎక్కడా కూడా ఈ పదం “ఉగ్రవాదం” లేదా “తీవ్రవాదం” అన్న అర్థాలలో వాడబడలేదన్నది గమనార్హం.

పూర్తి ప్రపంచంలో 50కి పైగా ఇస్లామిక్ దేశాలు, 200 కోట్లకు పైగా ముస్లిం జనాభా ఉండగా సిరియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాంటి కొన్ని దేశాల్లో అమెరికా, యూరప్, ఇశ్రాయిల్ దేశాలు తమ రాజకీయ అవసరాల కోసం తయారు చేసిన కొన్ని పెంపుడు కుక్కలు స్థాపించిన స్థావరాలే అల్ ఖైదా, ఐసిస్ వగైరా ఉగ్రవాద సంస్థలు. వీరికి ఇస్లాంతో సంబంధం లేదని ప్రపంచ ముస్లిం ఉలేమా పండిత వర్గం ఎప్పుడో తీర్మానించటం జరిగింది.

అయినప్పటికీ ఇలాంటి కొన్ని సంస్థల్లో ముస్లిం వేషాల్లో ఉండే ఉన్మాదులను చూపి ముస్లిములంతా ఉగ్రవాద భావజాలం కలిగి ఉంటారని, ఉగ్రవాదం చేసేవారంతా ముస్లిములేనని కొందరు పనికిమాలిన కొటేషన్లు ఇస్తుంటారు.

నోటితో జిహాద్ అని పలుకుతూ దౌర్జన్యం చేసినంత మాత్రాన అది జిహాద్ అవ్వదు. నోటితో జై శ్రీరామ్ అని పలుకుతూ దౌర్జన్యం చేసినంత మాత్రాన అది సనాతన ధర్మం అవ్వదు. నేడు కొందరు ఉన్మాదుల ద్వారా “జిహాద్” అన్న పదం “మిస్ యూజ్” చెయ్యబడుతున్న వాస్తవమైతే ఇస్లాంను వాట్స్ యాప్పుల్లో, గాసిప్పుల్లో కాక ఇస్లాంను ఖురాన్, ప్రవక్త ముహమ్మద్(స) బోధనలను స్టడీ చేసిన వారికే అర్థమవుతుంది.

కాబట్టి ఉగ్రవాదులు చేసేది జిహాద్ ఎంతమాత్రం కాదు, జిహాద్ పేరుతో ఉగ్రవాదం చేసేవారు ముస్లిములు కారు. ఖురాన్ ఎక్కడా జిహాద్ పేరుతో ఉగ్రవాదం చెయ్యమనటం లేదు. ఉగ్రవాదం చేస్తే 72 హూర్లు ఇవ్వబడతారన్న చవకబారు వాగ్దానాలు సైతం ఎక్కడా చెప్పటం లేదు.

ఇప్పటివరకు ఎంటర్టైన్మెంట్, సెక్స్, కామెడీ, యాక్షన్ కథాంశాలతో రూపుదిద్దుకుంటున్న భారతీయ సినిమా ఇక నుండి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే వేదికగా మారబోతుంది. కాబట్టి ఇలాంటి చవకబారు స్టోరీ లైన్లతో కొందరు హిందూ-ముస్లిముల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే ఉద్దేశంతో తీస్తున్న సినిమాలను చూసి, నిజనిజాలు తెలుసుకోకుండా సామాన్య హిందూ ప్రజానీకం అనవసర విద్వేషాలు పెంచుకుని మతోన్మాద పార్టీ అబద్ధ ప్రచారాల ట్రాప్ లో పడకుండా జాగ్రత్త పడాలి.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *