వారిని ఆయుధం పట్టేలా చేసింది ఎవరు?

ఒకానొక ఊళ్లో మాకు నిలువ నీడ లేదు మాకు కాస్త ఉండటానికి కొంత చోటు ఇప్పించి ఆదుకొమ్మని, ఎక్కడి నుండో కాళ్లీడ్చుకుంటూ వచ్చిన ఓ అనాధ గుంపు ఆ ఊళ్లో పెద్దల్ని ప్రాధేయపడుతుంది.

మానవత్వంతో పోన్లే పాపమని ఆ దేశ దిమ్మరులకు ఆ ఊళ్లో ఆశ్రయమిస్తారు. కాలం గడుస్తూ వస్తుంది. ఆ అనాధల గుంపు క్రమంగా బయట నుండి బలాన్ని పెంచుకుంటుంది. తిన్నింటి వాసాలు లెక్క పెట్టటం మొదలెడుతుంది. తమకు నీడ నిచ్చిన ఆ ఊరు అసలు మా తాత ముత్తాతలున్న పవిత్ర స్థలమని దానిని ఖాళీ చేసి మాకిచ్చేయాలని, ఆ ఉరోళ్ల ఇళ్లను సైతం కబ్జా చేసుకోవటం మొదలెట్టి, ఒకానొకప్పుడు తమకు ఆశ్రయం కల్పించిన ఊరోళ్ల భూభాగాలను ఆక్రమించి, వారికి నిలువ నీడ లేకుండా చేసి, ఆ ఉరినే స్వంతం చేసుకుంటుంది.

అలా తమ నుండి అన్యాయంగా లాక్కోబడ్డ ఊరిని తిరిగి ఎలాగైనా సాధించుకోవాలని కొందరు యువకులు ఆయుధాలు చేపట్టి యుద్ధం చెయ్యటం మొదలెడతారు. చిత్రం ఏమిటంటే- అన్యాయంగా ఉరినే కబ్జా చేసేసిన ఆ దుర్మార్గుల గుంపు తమపై అన్యాయంగా తీవ్రవాదం చేస్తున్నారని, ఆ ఊరోల్లంతా టెర్రరిస్టులని ముద్ర వెయ్యటం మొదలెడుతుంది. వారి నుండి తమ ఊరిని కాపాడుకుంటున్నామన్న నెపంతో ఒకప్పుడు తమకు ఆశ్రయం కల్పించినవారి ఇళ్లపైనే బాంబుల దాడి చేసి ఎంతో మందిని పొట్టన పెట్టుకోవటం మొదలెడుతూ వస్తుంది.

ఇదీ సింపుల్ గా పాలస్తీన్, ఇశ్రాయీల్ దేశాల చరిత్ర. ఈ మొత్తం కథలో ఎక్కడ నుండో కాళ్లీడ్చుకుంటూ వచ్చినవారు యూదులైతే.. వారికి ఆశ్రయం కల్పించిన ఆ ఉరోళ్లు పాలస్తీనియన్లు. అన్యాయంగా ఆక్రమించేసిన ఆ ఉరే ఇప్పుడున్న ఇశ్రాయీల్ అన్నమాట. తమ దేశాన్ని, భూముల్ని, ఇళ్లను అన్యాయంగా కబ్జా చేసినందుకు గాను కడుపు మండి ఎదురు తిరిగిన వారే “హమాస్” వర్గం వారన్న మాట.

****

అసలు యూదులు పాలస్తీనాలో ఎలా చొరబడ్డారు? అన్నది గమనిస్తే… లక్షల కొద్దీ యూదులు హిట్లర్ చేతిలో నరకయాతనలు అనుభవించి చంపబడిన తరువాత మిగిలిన వారు ప్రపంచదేశాల్లో చెల్లా చెదురైపోయారు. అలా కొందరు పాలస్తీనా చేరుకున్నారు. వారి దీన స్థితికి జాలిపడి పాలస్తీనా భూభాగంలో ఉన్న అరబ్బు ముస్లిములే వారికి ఆశ్రయం కల్పించారు. 1947 కు ముందు ప్రపంచ పటంలో “ఇశ్రాయేల్” అనే దేశమే లేదు. తిన్నింటివాసాలు లెక్కపెట్టే అలవాటున్న యూదులు తమకు ఆశ్రయం కల్పించిన పాలస్తీనా భూభాగం మా పవిత్ర స్థలమని దాన్ని అన్యాయంగా ఆక్రమించుకోవటం కోసం అక్కడి ముస్లిములను అనేక హింసలకు గురి చెయ్యటానికైనా, తమకు అడ్డొచ్చిన పాలస్తీనియన్లను చంపటానికైనా వెనుకాడలేదు. ఆ విధంగా పాలస్తీనియన్ల రక్తంతో తడిచిన నేలపైనే “ఇశ్రాయీల్” అనే దేశం నిర్మించబడింది.

ఇప్పుడు పాలస్తీనా ప్రపంచ పటంలో అక్కడక్కడా చిన్న చిన్న ముక్కలుగా మిగిలి ఉంది. దుర్మార్గులైన యూదులు, పాలస్తీనాను అన్యాయంగా లాక్కోవటం మొదలెట్టినప్పటి నుండే పాలస్తీనా పౌరుల్లో ఒక వర్గం యూదులపై తిరగబడటం మొదలెట్టారు. ఆ “హమాస్” గ్రూప్ కడుపు మండి చేస్తున్న దాడిని ఇశ్రాయేల్ ఉగ్రవాద దాడిగా అభివర్ణించటం మొదలెట్టింది. ఇస్లామోఫోబియాను పెంచిపోషించే మీడియా దానికి తోడయ్యింది. తమ భూభాగాన్ని అన్యాయంగా కబ్జా చేసిన ఆక్రోశంలో కడుపు మండి ఇప్పటికీ పాలస్తీనా ఇశ్రాయేల్ తో పోరాడుతూనే ఉంది. ఆ పోరాటాన్ని మీడియా టెర్రరిజంగా చూపుతూనే ఉంది.

ఆయుధ సామాగ్రి విషయంలో ఇశ్రాయేలుతో పోల్చుకుంటే తమ వద్ద ఉన్నది అసలు ఏమీకాదన్న విషయం తెలిసీ పాలస్తీనియన్లు తమ దేశ స్వతంత్రం కోసం పోరాడుతూనే ఉన్నారు. అదే అదనుగా తీసుకుని ఇశ్రాయేలు పాలస్తీనాపై వందల కొద్దీ బాంబులు విసిరి పాలస్తీనియన్లను చంపుతూ వస్తుంది. చిత్రమేమిటంటే మీడియాలో పాలస్తీనియన్లు చేసే దాడినే తీవ్రవాద దాడిగా ఫోకస్ చేస్తూ…

ఇశ్రాయీల్ పాలస్తీనా పై చేసే దారుణమైన ఎదురు దాడిని మీడియాలో చూపాల్సినంతగా చూపకపోవటం.

నిజానికి చెప్పాలంటే ఇస్రాయీల్ దగ్గర ఉన్న ఆయుధ సామాగ్రి, సైనిక బలగాలతో పోల్చితే హమాస్ దగ్గర ఉన్న సైనిక బలగం, ఆయుధ సామాగ్రి చాలా తక్కువ. పైగా హమాస్ చేసే దాడుల నుండి ప్రొటెక్ట్ చేసుకోటానికి ఇశ్రాయీల్ తమ దేశంపై రక్షణ కవచాన్ని కూడా ఏర్పాటు చేసుకోగలిగింది.

ఇప్పుడు మీడియాలో ప్రస్తుతం హమాస్ గ్రూపు చేస్తున్న దాడులను మాత్రమే ఉగ్రవాదుల దాడులన్నట్టు చూపుతుంది. దీనికి ప్రతిగా ఇశ్రాయీల్ పాలస్తీనాపై యుధాన్ని ప్రకటించి, అది చేసే రక్తపాతాన్ని, జానహననాలను మటుకు ఎంతో న్యాయపరమైన ప్రతి దాడి అన్నట్టు ప్రాజెక్ట్ చేస్తుందనటంలో సందేహం లేదు.

మణిపూర్ లో స్త్రీలను బహిరంగంగా వివస్త్రను చేసి నగ్న ఊరేగింపులు చేసినా స్పందించని విశ్వగురువుల వారు మటుకు ఎక్కడో ఉన్న ఇశ్రాయీల్ కు అండగా నిలబడతామని వాగ్దానం చెయ్యటం గమనార్హం.

ఒకవేళ హమాస్ గ్రూపు చేస్తున్నది ఉగ్రవాదం అయితే మరి ఇశ్రాయీల్ ఎన్నో ఏళ్లుగా పాలస్తీనాపై చేస్తూ వచ్చింది ఏమిటి? ఒకప్పుడు తమకు ఆశ్రయం కల్పించిన పాలస్తీనియన్ల భూభాగాన్ని ఆక్రమించి, వారిని ఆయుధం పట్టేలా చేసింది ఇశ్రాయీల్ కాదా? ఇది ఇశ్రాయీల్ చేస్తూ వస్తున్న ఘోరమైన తీవ్రవాదం కాదా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *