తలచుకుంటుంటేనే రోత పుట్టే ఆ హేయమైన దుర్ఘటన ఎప్పుడో మే 4 వ తారీకున జరిగితే రెండు నెలల తరువాత ఇప్పుడెందుకు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది?
ఇన్నాళ్లూ మణిపూర్ లో మతోన్మాదుల చేతిలో వందల మంది మైనారిటీలు హింసించబడి చంపాడుతున్నా స్పందించని ప్రధాని రెండు నెలల తరువాతే ఎందుకు స్పందించటం జరిగింది?
రెండు నెలలుగా మణిపూర్ తగలబడుతున్నా, అక్కడి మైనారిటీలైన కుకీజో తెగల పై 3.5 మిలియన్లకు పైగా ఉన్న అతివాద హిందుత్వ మెయిటీ గుంపు చేస్తున్న అనేక అత్యాచారాలు, దౌర్జన్యాలూ బయట ప్రపంచానికి తెలియపోటానికి కారణం ఈ రెండు నెలలు అక్కడ ఇంటర్నెట్ నిలిపివేయబడటం.
ఇన్నాళ్లకు ఎవడో ఒకడు తన జీవితంపై ఆశ, గ్యారంటీ లాంటివి వదులుకుని ధైర్యం చేసి రెండు నెలల క్రితం నగ్నంగా ఊరేగించబడి సామూహిక అత్యాచారం చెయ్యబడిన ఆ కుకీజో తెగకు చెందిన స్త్రీల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యటంతో.. ఎవరికీ తెలియకుండా ఇన్నాళ్లుగా మణిపూర్ లో మరుగు చెయ్యబడ్డ ఆ హేయమైన అమానవీయమైన సంఘటన తాలూకు సమాచారం ప్రపంచానికి తెలిసింది.
బలవంతంగా తప్పనిసరి పరిస్థితిలో ఇన్నాళ్లుగా పాటించిన మౌన వ్రతాన్ని ప్రధాని వీడాల్సి వచ్చింది. ఇదొక అమానవీయ సంఘటన అని దీనికి కారణమైన వారిని వదలబోమని స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది.
బహుశా అక్కడ ఇంటర్నెట్ మరో రెండు నెలలు నిలిపివేయబడి ఉంటే ఈ స్టేట్మెంట్ ఆయన పెదాల నుండి మరో రెండు నెలల తరువాత వచ్చి ఉండేదేమో?
ఎప్పుడో మే 4 న జరిగిన ఆ హేయమైన సంఘటన గురించి రెండు నెలల తరువాత సోషల్ మీడియాలో ఎవడో పోస్టు చేసేవరకు ఓ దేశాన్ని పాలించే ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తికి తెలిసిరాలేదా?
రోడ్డు మీద పదిహేనేళ్ల యువకుల నుండి యాభై ఏళ్ల పురుషులు దాకా స్త్రీలను నగ్నంగా ఊరేగిస్తూ హింసిస్తూ సామూహిక అత్యాచారాలు చేసిన రోత పుట్టించే హేయమైన ఘటనను చూపకుండా దేశంలో ఉన్న ఇంతపెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియా నిద్రపోతుందా?
ఇన్నాళ్లుగా మణిపూర్ తగలబడుతున్నా అక్కడ అనేక దౌర్జన్యాలు, అత్యాచారాలూ జరుగుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్ నిలిపివేయటానికి కారణం ఏమిటి?
స్వయంగా తమ ప్రభుత్వం ద్వారా పాలించబడే రాష్ట్రం తగలబడుతూ అనేక దౌర్జన్యాలు జరుగుతుంటే వాటిని ఆపటానికి కేవలం ఒక్క ఫోన్ కాల్ చాలు. కానీ ఆపలేకపోటానికి కారణం ఏమిటి?
దేశాన్ని పాలించే వ్యక్తి మౌనం వహించటానికి కారణం ఏమిటి?
ఇన్నేసి ఘోరాలు, హేయమైన ఘటనలు, అత్యాచారాలూ జరుగుతున్నప్పటికీ.. ఎవరో సోషల్ మీడియాలో మణిపూర్ లో జరిగిన హేయమైన ఘటనను పోస్ట్ చేస్తే గానీ తెలుసుకుని స్పందించలేనంత పరిస్థితిలో దేశాన్ని పాలించే వ్యక్తి ఉన్నాడా?
“ఆయన తప్ప ఆ హోదాకు మరొక ఆల్టర్నేటివ్ లేరు కదా?” అన్న పనికిమాలిన మైండ్ సెట్ ను అర్జెంటుగా మార్చుకుని, ఇలాంటి ప్రమాదకరమైన ప్రభుత్వాల నుండి, రాజకీయ నాయకుల నుండి ప్రజలు ఏకమై దేశాన్ని కాపాడుకోలేకపోతే భారతదేశం మొత్తం మణిపూర్ లా మారి తగలబడుతున్నా అనేక మంది స్త్రీలు నగ్నంగా నడిబజారుల్లో అత్యాచారాలకు గురవుతున్నా.. ఆ పెద్దాయన మటుకు కోట్ల రూపాయల కోటులు ధరించి దేశాలు తిరిగితుంటాడు హాయిగా ఏమీ పట్టనట్టు.
నిర్ణయం ఆలోచనాపరులైన ప్రజల చేతిలోనే ఉంది.
