నేటి భరతం…

కేవలం హత్రాస్ ఘటనను కవర్ చెయ్యటానికి వెళ్లిన సిద్ధిక్ కప్పన్ అనే జర్నలిస్టు అరెస్టు చెయ్యబడి నేరం తేలేవరకు రెండేళ్లు జైల్లో మగ్గి ఈ మధ్యే బయటకొచ్చాడు. లైంగిక వేధింపుల కేసులో నేరారోపణల రుజువుకాని కారణంగా బ్రిజ్ భూషణ్ బయట చక్కగా తిరుగుతున్నాడు.

సిఎఎ కు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ ప్రొటెస్ట్ లో పాల్గొన్నందున సఫురా జర్గర్ అనే విద్యార్థినిని గర్భవతి అని కూడా చూడకుండా అరెస్టు చేసి తిహార్ జైల్లో పెట్టటం జరిగింది. గుజారాత్ అల్లర్లలో బిల్కిస్ బానో అనే మహిళను గర్భవతి అని కూడా చూడకుండా సామూహిక అత్యాచారం చేసిన నేరస్తుల్ని విడుదల చెయ్యటం జరిగింది.

ఇవి మచ్చుకు రెండు ఉదాహరణలు మాత్రమే ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి.

ఏ దేశంలోనైనా కుల, మత, వర్గాలకు అతీతంగా “శిక్షాస్మృతి” అంటే ప్రజలందరికీ కామన్ గా వర్తించే “క్రిమినల్ కోడ్” పటిష్టంగా అమలుపరచబడుతుందా? లేదా? అన్నదే ముఖ్యం. అదే సరిగ్గా అమలుపరచబడనప్పుడు “పౌర స్మృతి (సివిల్ కోడ్)” ను అందరికీ వర్తింపజేయటంలో అర్థమే ఉండదు.

కాస్త వివరంగా చెప్పాలంటే… భారతదేశంలో అందరికీ “కామన్ లా” అన్నది లేదా? ఎందుక్కాదు.. “క్రిమినల్ లా” అన్నది ఆల్రెడీ భారతదేశంలో అన్ని కులాల, మతాల ప్రజలందరికీ వర్తించేలా “యూనిఫాం లా (ఒకే చట్టం)” గా చెయ్యబడి ఉంది.

కానీ, అది కుల, మతాలకు అతీతంగా పటిష్టంగా అమలు పరచబడుతుందా? లేదా కులాలను, మతాలను బట్టి లేదా రాజకీయ పార్టీలను బట్టి కొందరికి ఒకలాగా ఇంకొందరికి ఒకలాగా అమలుపరచబడుతుందా? అన్నదే అసలు ప్రశ్న.

ముందు “క్రిమినల్ లా” అన్నది కుల, మతాలకు, పోలిటికల్ పార్టీల వ్యక్తులకు అతీతంగా అందరికీ ఒకేలా పటిష్టంగా అమలు పరచబడాలి. అదే సరిగ్గా అమలుపరచబడనప్పుడు, దాన్నొదిలేసి ‘సివిల్ లా’ ను అందరికీ ‘కామన్ లా’గా చేసినంత మాత్రానా లాభం ఏంటి? అన్నది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో ఈ క్రింది కామెంట్స్ లో తెలియజేయగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *